ఆంధ్రప్రదేశ్‌

హోదా డిమాండ్‌ను ఏమార్చేందుకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఫిబ్రవరి 24: రాష్ట్ర విభజన నష్టాన్ని పూడ్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్న ఆగ్రహం ప్రజల్లో వ్యక్తం కావడంతో ప్రత్యేక హోదాను దారి తప్పించడం కోసం బీజేపీ నేతలు కొత్త వాదనకు తెరదీశారన్న విమర్శలు ఎదురవుతున్నాయి. బీజేపీ రాయలసీమ నేతలు కర్నూలులో శుక్రవారం సమావేశమై చేసిన డిమాండ్లు సమంజసమేనని అయితే కేంద్రంలో ఆ పార్టీ, రాష్ట్రంలో ఆ పార్టీ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ పాలనాపగ్గాలు చేపట్టి మూడున్నర సంవత్సరాలు పూర్తయ్యాక త్వరలో ఎన్నికలు వస్తున్న సమయంలో కర్నూలు డిక్లరేషన్ పేరుతో పాత డిమాండ్లను కొత్తగా చెప్పడం ఏంటని వామపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. రాయలసీమకే రాజధాని ఇవ్వాలని విభజన సమయం నుంచి డిమాండ్ ఉన్నా ఆనాడు నోరు మెదపకుండా ఉండటాన్ని వారు గుర్తుచేస్తున్నారు. విభజన ప్రక్రియ ప్రారంభమైన సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రంలో బీజేపీ నేతలతో కీలకచర్చలు జరిపిన సమయంలో ఆయన నుంచి రాయలసీమలో కొత్త రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు హామీ తీసుకోవాల్సి ఉండాల్సిందని వారంటున్నారు. విభజన చట్టంలో వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం జాప్యం చేసిన సమయంలో రాయలసీమ బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. రాష్ట్రంలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు ఐదేళ్లకు రూ.24 వేల కోట్లకు పైగా ప్రత్యేక నిధులిస్తామని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టంలో పొందుపర్చిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఈ నిధుల్లో గత నాలుగేళ్లలో 80 శాతం నిధులు సుమారు రూ.19 వేల కోట్లకు పైగా రావాల్సి ఉండగా ఇప్పటి వరకు కేంద్రం కేవలం రూ.550 కోట్లు మాత్రమే ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని, కాబట్టి మిగిలిన నిధులు తీసుకురావాలని వారు రాయలసీమ బీజేపీ నేతలకు సవాల్ విసురుతున్నారు. విభజనను వ్యతిరేకిస్తూ 2006-07లో రాయలసీమ అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేస్తే దాన్ని వ్యతిరేకించి ఇప్పుడు కొత్తగా మళ్లీ అదే బోర్డు కావాలని డిమాండ్ చేయడం బీజేపీ ద్వంద్వనీతికి నిదర్శనమని వారంటున్నారు. ఇక రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుపై న్యాయవాదుల సంఘాలు గత నెల రోజులుగా చేస్తున్న ఆందోళనా కార్యక్రమానికి మద్దతు తెలపని నేతలు ఇప్పుడు అదే డిమాండ్ చేయడంలో రాజకీయ కారణాలు తప్ప సీమ అభివృద్ధి నినాదం లేదని మండిపడుతున్నారు. రాయలసీమ హక్కుల సాధన కోసం తాను గత 15 సంవత్సరాలుగా పోరాడానని, రాయలసీమలో రాజధాని, హైకోర్టు, ప్రత్యేక నిధులు, నికరజలాల కోసం చేసిన ఆందోళనను రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ గుర్తుచేస్తున్నారు. అప్పట్లో తనకు ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకపోయినా ఒంటరిగా హక్కుల సాధన కోసం ప్రయత్నించానంటున్నారు. తన పాత డిమాండ్లు ఇప్పటికైనా బీజేపీ నేతలకు గుర్తుకు రావడం సంతోషమే కానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకువచ్చి అక్కడి నుంచి రాయలసీమకు రావాల్సిన నిధులు, సంస్థలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన సూచించారు. రాయలసీమ పరిరక్షణ సమితి పేరుతో తాను ప్రజల కోసం అహర్నిశలు ఉద్యమిస్తుంటే పట్టించుకోని బీజేపీ ఇప్పుడు కొత్తగా పాత డిమాండ్లను తెరపైకి తీసుకురావడాన్ని బైరెడ్డి రాజశేఖరరెడ్డి సైతం హర్షిస్తున్నారు. అయితే కేంద్రంలోని బీజేపీపై రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన సమయంలో వారు చేసిన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు పట్టించుకుని పరిష్కరిస్తుందో వారికి తెలియంది కాదని అన్నారు. రాష్ట్రంలో తమ ఎమ్మెల్యేలు మంత్రి పదవులు తీసుకున్నపుడే కొన్ని షరతులు విధించి రాయలసీమకు మేలుచేసే ప్రయత్నం చేయాల్సి ఉండిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు రాష్ట్రం మొత్తం కేంద్రం చేసిన నమ్మకద్రోహంపైనే మాట్లాడుతోందని, ఇలాంటి సమయంలో కర్నూలు డిక్లరేషన్ గురించి ఆలోచించే అవకాశం లేదన్నారు. కేంద్రం నుంచి రాయలసీమకు రావాల్సిన వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులతో పాటు ప్రత్యేకంగా కరవు పాలిత ప్రాంతాలకు ఇచ్చే ప్రత్యేక నిధిని తీసుకురావాలని బీజేపీ నేతలను ఆయన కోరారు. మొత్తం మీద బీజేపీ కర్నూలు డిక్లరేషన్‌ను రాయలసీమ అభివృద్ధి కోసం అన్ని రాజకీయ పక్షాలు స్వాగతిస్తున్నప్పటికీ, ప్రకటించిన సమయం సరైంది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎప్పటి నుంచో ప్రజలు కోరుతున్న రాజధాని అమరావతికి తరలిపోయిందని, కనీసం హైకోర్టు అయినా రాయలసీమలో ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.