ఆంధ్రప్రదేశ్‌

జనం ముందుకు జనసేనాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 13: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి జనం ముందుకు వస్తున్నారు. బుధవారం ఆ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న మైదానంలో నిర్వహించే సభలో ఆయన కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయి. సభ ఏర్పాట్లను పవన్ స్వయంగా పర్యవేక్షించి, నాయకులకు కొన్ని సూచనలు చేశారు. సుమారు నాలుగు లక్షల మంది ఈ సభకు వస్తారన్న అంచనా వ్యక్తమవుతున్నందున, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా గతంలో తన కాకినాడ, అనంతపురం పర్యటనలో జరిగిన తొక్కిసలాట వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన సూచించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, నిధులు, ప్రాజెక్టుల్లో నత్తనడక వంటి అంశాలతోపాటు, ప్రధానంగా ఆయన ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీయనున్నారు. దానిపై ఆయన ఇటీవల నలుగురితో నియమించిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ ఇచ్చిన నివేదిక అంశాలను ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. నిధుల పంపిణీ, రాష్ట్రాలకు సమన్యాయం చేయకపోతే ఉత్తర-దక్షణాది రాష్ట్రాల భావన వస్తుందని గతంలోనే పవన్ హెచ్చరించగా, ఇప్పుడు అదే మాటను అటు కేసీఆర్, ఇటు చంద్రబాబునాయుడూ ప్రస్తావిస్తున్నారు. దక్షిణాదిపై ఉత్తరాది పెత్తనమేమిటని, సొమ్ములు మావి సోకులు మీవా అంటూ ఇద్దరు చంద్రులు నిప్పులు కురిపిస్తున్నారు. పవన్ తన ప్రసంగంలో మరోసారి ఈ వివక్షపై నిప్పులు చెరిగే అవకాశం లేకపోలేదంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రావసరాల మేరకు రిజర్వేషన్లు పెంచుకునే అధికారంతోపాటు, రాష్ట్రాలపై కేంద్ర పెత్తనంపైనా విరుచుకుపడనున్నట్లు చెబుతున్నారు. ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లో వర్గీకరణ, ఏపీలో కాపులకు రిజర్వేషన్లు, వాల్మీకి, బోయలకు ఎస్టీ హోదా, తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్ల పెంపు అంశాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ప్రధానంగా రాష్ట్రానికి హోదాపై చాలాకాలం నుంచీ గళం విప్పుతున్న పవన్ బుధవారం నాటి సభలో మరోసారి దానిపైనే ప్రధానంగా స్పందించనున్నారు. హోదా కావాలంటున్న ఏపీ పార్టీలకు జాతీయ, ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీలు కూడా స్వరం కలుపుతున్న వైనాన్ని గుర్తు చేస్తూ, మరోసారి కేంద్రంపై నిప్పులు చెరగనున్నారు. ఇక ఇటీవలి కాలంలో తనను లక్ష్యంగా చేసుకుని ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ చేస్తున్న విమర్శనాస్త్రాలకు పవన్ సభలోనే సమాధానం చెప్పనున్నారు. ప్రధానిపై నమ్మకం ఉందని చెబుతున్న వైసీపీ, మరోవైపు కేంద్రంపై అవిశ్వాసం పెడుతున్న తీరుపై సర్వత్రా ఆక్షేపణ వ్యక్తమవుతున్న నేపథ్యంలో అదే అంశంపై ఆయన వైసీపీ ద్వంద్వ విధానాలను ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు. అందులో ఆయన ప్రసంగం ప్రధాని వేరు కేంద్రం వేరా? అన్న దారిలో ఉండనుందంటున్నారు. ఇక చంద్రబాబు పాలనాతీరుపైనా చురకలు వేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల వినియోగంతోపాటు, కేంద్రం నుంచి బయయటకు వచ్చిన టీడీపీ ఎన్డీఏ నుంచి ఇంకా ఎందుకురాలేదన్న ప్రశ్న సంధించే అవకాశం ఉందంటున్నారు. కాగా, జనసేన సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ సుమారు 4 లక్షల మంది రావచ్చన్న అంచనా వ్యక్తమవుతోంది. తెలంగాణ నుంచి పార్టీ నేత శంకర్‌గౌడ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. తన సభకు భద్రతా ఏర్పాట్లతోపాటు, తన భద్రత కొనసాగించాలని ఆయన తాజాగా డీజీపీ మాలకొండయ్యకు లేఖ రాశారు. దానితో పవన్ అభ్యర్థన మేరకు పోలీసులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ సమన్వయకర్త మాదాసు గంగాధరం, పార్టీ కోశాధికారి రాఘవతో పవన్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తున్నారు. వేదిక ప్రాంతాన్ని పవన్ పరిశీలించి, మహిళలకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని, ఎండ తీవ్రత దృష్ట్యా మంచినీరు, మజ్జిగ సౌకర్యం కల్పించాలని సూచించారు. బుధవారం 3 గంటలకు ప్రారంభమయ్యే సభ సుమారు ఐదుగంటల వరకూ కొనసాగవచ్చని, సభలో ఆయన ఒక్కరే ప్రసంగించే అవకాశం ఉందని చెప్పారు.
ఆవిర్భావ సభకు సర్వం సిద్ధం
మంగళగిరి: జాతీయ రహదారి పక్కన ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఎదుట బుధవారం సాయంత్రం 3 గంటలకు సినీ నటుడు పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ మహాసభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. సభా ప్రాంగణం మొత్తం జనసేన పతాకాలతో అలంకరించారు. విశాలమైన వేదిక, విఐపీలు, ప్రముఖులు, ఎన్నారైలు కూర్చునేందుకు కుర్చీలు, సోఫాలు ఏర్పాటు చేశారు. సుమారు 5 వేల మంది కూర్చునేందుకు వేదిక ముందు కుర్చీలు వేశారు. మహిళల కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సాయంత్రం 4 గంటలకు వేదికపైనుంచి ప్రసంగిస్తారని పార్టీ కోశాధికారి ఎం రాఘవయ్య మంగళవారం సభా ప్రాంగణంలో విలేఖర్లకు తెలిపారు.