ఆంధ్రప్రదేశ్‌

ఉగాది ఉషస్సులు.. ఎల్‌ఈడీ వెలుగులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 18: ఎల్‌ఈడీ వీధిలైట్ల ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 9.19 లక్షల ఎల్‌ఈడీ వీధి లైట్లను ఏర్పాటు చేసింది. రాష్టవ్య్రాప్తంగా దాదాపు 30లక్షల ఎల్‌ఈడీ వీధిలైట్ల ఏర్పాటును పూర్తిచేసి ప్రపంచ రికార్డు సృష్టించడంపై దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాల్లో 15లక్షల ఎల్‌ఈడీ వీధిదీపాలను ఏర్పాటు చేయనున్నట్లు ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తద్వారా ఏపీని ప్రపంచంలోనే ఉత్తమ ఇంధన సామర్ధ్య రాష్ట్రాల్లో ఒకటిగా నిలపాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఎల్‌ఈడీ వీధి లైట్లను ఏర్పాటు చేయడంతో గ్రామీణుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. రాబోయే పదేళ్లలో 333 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందని, ఫలితంగా రూ. 500 కోట్లు మిగులుతాయని తెలిపారు. జాతీయ వీధిదీపాల పథకం (ఎస్‌ఎన్‌ఎల్పీ) కింద ఇప్పటికే 9.19 లక్షల ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటుచేసి ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలవగా 8.9లక్షల లైట్లతో రాజస్థాన్, 8.2 లక్షలతో గుజరాత్, 7.78 లక్షలతో తెలంగాణ, 4.23 లక్షల వీధి దీపాలతో ఉత్తరప్రదేశ్ తర్వాత స్థానాల్లో నిలిచాయి. ‘ఈ రికార్డుతో నేను పూర్తిగా సంతృప్తి చెందట్లేదు. అంతర్జాతీయ రికార్డులే లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇంధన పొదుపు ఫలాలను ప్రజలకు అందించడంలో మనం ప్రపంచంతో పోటీపడాలి. గ్రామీణ ప్రాంత ప్రజలకు 15లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంధన, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఈ ఏడాది నవంబరు కల్లా ఎల్‌ఈడీ వీధిలైట్ల ఏర్పాటును పూర్తిచేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాలని ఈఈఎస్‌ఎల్, డిస్కంలు, ఏపీ సీడ్కో, నెడ్‌క్యాప్ సంస్థలకు సూచించారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లోని 13వేల గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న సంప్రదాయ వీధిదీపాలను తొలగించి వాటి స్థానంలో 30లక్షల ఎల్‌ఈడీ వీధి లైట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రామీణ ఎల్‌ఈడీ కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి, కడప, అనంతపురం, చిత్తూరు, విజయనగరం జిల్లాల్లోని గ్రామాల్లో 3.8 లక్షల ఎల్‌ఈడీ వీధిదీపాలతో సహా రాష్ట్రంలో ఇప్పటివరకు 9.19 లక్షల ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. ఇంధన సామర్ధ్య కార్యక్రమాల అమలులో ఏపీ ఇప్పటికే దేశంలో అగ్రస్థానంలో ఉంది. ‘పట్టణ ప్రాంతాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు కార్యక్రమానికి అత్యాధునిక సెంట్రలైజ్డ్ కంట్రోల్ మానిటరింగ్ సిస్టం (సీసీఎంఎస్) టెక్నాలజీని వినియోగించడం ద్వారా 110 మున్సిపాల్టీల్లో అద్భుత ఫలితాలు వచ్చాయి. ఏటా 133 మిలియన్ యూనిట్ల విద్యుత్ పొదుపుతో రూ.86 కోట్లు ఆదా అవుతున్నాయి. గ్రామ పంచాయతీల్లోనూ ఈ కార్యక్రమం ఇదే స్థాయిలో విజయవంతం కావాలి’ అని మంత్రి అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీల్లో ఇప్పటివరకు లక్ష ఎల్‌ఈడీ వీధి దీపాలను సీసీఎంఎస్‌కి అనుసంధానం చేశామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కెఎస్ జవహర్‌రెడ్డి మంత్రికి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని, పట్టణ ప్రాంతాలతో సమానంగా వారికి సకల సౌకర్యాలూ కల్పించాలని, ఉగాది సందర్భంగా వారి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు. టెలీకాన్ఫరెన్స్‌లో ఇంధన శాఖ మంత్రి కళా వెంకట్రావు, పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, సీఎం ప్రత్యేక కార్యదర్శి సతీష్‌చంద్ర, సీఎం ముఖ్య కార్యదర్శి జి సాయిప్రసాద్, సీఎం జాయింట్ సెక్రటరీ రాజవౌళి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ, జెన్‌కో ఎండీ కె విజయానంద్, డిస్కంల సీఎండీలు హెచ్‌వై దొర, ఎంఎం నాయక్, పీఆర్ అండ్ ఆర్డీ సెక్రటరీ రామాంజనేయులు, డైరెక్టర్ రంజిత్ బాషా, నెడ్ క్యాప్ ఎండీ కమలాకర్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.