ఆంధ్రప్రదేశ్‌

ప్రకృతి సేద్యం ప్రోత్సాహానికి సాలీనా రూ.40కోట్లకు పైగా ఖర్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 20: రాష్ట్రంలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు గడచిన రెండేళ్లుగా సగటున రూ.40 కోట్లు చొప్పున ఖర్చు చేస్తున్నామని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు నిమ్మల రామానాయుడు ప్రకృతి సేద్యంపై అడిగిన ప్రశ్నకు మంత్రి పై విధంగా బదులిచ్చారు. మంత్రి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగుచేసిన రైతులకు నాలుగు ఏజెన్సీల ద్వారా సర్ట్ఫికెట్లు అందచేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 20వేల మంది రైతులకు ఇందుకు శిక్షణ ఇవ్వటం జరిగిందన్నారు. అవసరమైన ఎరువులను రైతులే స్వయంగా తయారుచేసేందుకై నాన్ ఫెస్టిసైడ్ మేనేజ్‌మెంట్ షాపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 2020 నాటికి ఐదు లక్షల మందికి రెండువేల గ్రామాల్లో కనీసం రెండు లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని సాగు చేయించాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. విజయవాడ తూర్పు శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ తాను గన్నవరంలో 12 ఎకరాల్లో దాదాపు 24 రకాల కూరగాయలు, పండ్లను ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు బల్లలు చరుస్తూ రామ్మోహన్‌ను అభినందనలతో ముంచెత్తారు. రామ్మోహన్ మాట్లాడుతూ ఈ సేద్యం కోసం 26 ఆవులను పోషిస్తూ వాటి మల మూత్రాలతోనే ఈ సేద్యం చేస్తున్నానని అన్నారు. ప్రస్తుతం తమ భూమిలో ఎక్కడ తవ్వినా వానపాములు పెద్దసంఖ్యలో కన్పిస్తాయని అన్నారు. ప్రధానంగా కలుపు నివారణ కోసం వినియోగించే మల్చింగ్ షీట్ వల్ల అధిక సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. ప్రస్తుతం వీటిపై 50 శాతం రాయితీ వస్తున్నప్పటికీ ఇంకా మరింత రాయితీ అవసరమన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసే వారికి ప్రభుత్వం సర్ట్ఫికెట్లు అందించి నకిలీ ఉత్పత్తిదారులను అరికట్టాలని సూచించారు. రామానాయుడు మాట్లాడుతూ వ్యవసాయంలో హరిత విప్లవం వచ్చిన తర్వాత రైతులు విచక్షణా రహితంగా వాడుతున్న రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వల్ల అనేక దుష్ఫలితాలు వస్తున్నాయని అన్నారు. గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే, ఆయన భార్య జడ్‌పీ చైర్‌పర్సన్ అయితే ఎంతో తీరిక చేసుకుని ఇతరులకు ఆదర్శమయ్యేలా ప్రకృతి వ్యవసాయంకు దిగటం ఎంతైనా అభినందనీయమన్నారు. చివరగా మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ మల్చింగ్ షీట్లకు అదనపు సబ్సిడీ ఇచ్చే అంశం పరిశీలిస్తామన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు యూనిసెఫ్ వంద కోట్లు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. సుభాష్ పాలేకర్ ద్వారా జీరో బడ్జెట్ సహజ సాగుపై శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు.