ఆంధ్రప్రదేశ్‌

ప్రతి ఇంటికీ తాగునీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 21: ప్రతి ఇంటికి తాగునీరు, మురుగు నీటి నిర్వహణ ప్రభుత్వ ప్రాధాన్యత అని పురపాలకశాఖ మంత్రి నారాయణ చెప్పారు. అసెంబ్లీలో బుధవారం 344వ నియమం కింద పట్టణ ప్రాంతాల్లో వౌళిక సదుపాయాలు, అభివృద్ధి అంశంపై చర్చ జరిగింది. దీనికి మంత్రి సమాధానం ఇస్తూ గత నాలుగేళ్లలో 45 వేల 172 కోట్ల రూపాయల విలువైన పనులు చేపట్టి పూర్తి చేశామని ప్రస్తుతం ఒక లక్ష 02 వేల 726 కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో ఉన్నాయని అన్నారు. అర్హులందరికీ నాణ్యమైన గృహాలు నిర్మించి ఇస్తామన్నారు. అమరావతి రాజధానిలో 28 రోడ్లకు టెండర్లు పిలిచి పనులు చేపట్టామన్నారు. వచ్చే మేలో సచివాలయ హెచ్‌ఓడీలు హైకోర్టు రాజ్‌భవన్‌ల నిర్మాణంలో టెండర్లు పిలుస్తున్నామన్నారు. ప్రభుత్వ భూములు అందుబాటులో లేని ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి గృహ నిర్మాణంకు చర్యలు చేపడతామన్నారు. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ నిరుపేదలందరికీ సొంత ఇంటి కల తీర్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నో ఆశయాలతో పట్టణ గహ నిర్మాణ పథకం చేపట్టినప్పటికీ అత్యధిక పట్టణాలు, నగరాల్లో భూ సమస్య ఉన్నందున తక్షణమే భూసేకరణపై దృష్టి సారించని పక్షంలో ఈ పథకం అటకెక్కే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏదిఏమైనా ఈ గృహ నిర్మాణ పథకం నభూతో నభవిష్యత్ అన్నారు. ప్రధానంగా 1700 కిమీ మేర గ్యాస్ పైప్‌లైన్‌లు వేయడం చరిత్రలోనే ప్రప్రథమమన్నారు. ముఖ్యంగా మున్సిపల్ సేవలన్నీ ఆన్‌లైన్‌లో అందించటం అభినందనీయమన్నారు. అమరావతి రాజధాని చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రభుత్వం నిర్మిస్తున్నదంటూ బాబును ప్రశంసించారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో 65 శాతం ఆదాయం కేవలం పట్టణాల నుంచే వస్తుందన్నారు. అందుకే ఇక్కడ వౌలిక సదుపాయాల అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ హయాంలో పూర్తి నిర్లక్ష్యం జరిగిందన్నారు. తెలుగుదేవం అధికారంలోకి వచ్చిన తర్వాత సేవలన్నీ ఆన్‌లైన్‌లో చేర్చారని, దీంతో ప్రజలకు మెరుగైన సేవలందించగలుతున్నామన్నారు. అంగన్ వాడీ కేంద్రాలకు సొంత భవనాలు విస్తరించి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని లేనిపక్షంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు రాగలదన్నారు. ప్రధానంగా కాలం చెల్లిన మంచినీటి పైప్‌లైన్లను మార్చి కొత్త పైపులైన్లు వేయాలని, తొలిసారిగా నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ అమృత్ పథకం కింద పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికీ తాగునీటి సౌకర్యం లభిస్తోందన్నారు. ఫైబర్ నెట్ ద్వారా ఇంటింటికీ కేబుల్ టీవీ కనెక్షన్ ఇవ్వడం ఎంతైనా అభినందనీయమన్నారు. కేంద్ర సహకారం లేనప్పటికీ సీఎం బాబు చొరవతో అభివృద్ధి జరుగుతున్నదన్నారు. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి మాట్లాడుతూ మంత్రి నారాయణ రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినప్పటికీ బాగా కష్టపడుతున్నారని అన్నారు. పరిశుభ్రత, పారిశుద్ధ్యం నిర్వహణపై ఇంకా మరింత శ్రద్ధ చూపి కాలుష్యాన్ని తగ్గించాలన్నారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ పెన్మత్స విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఏదిఏమైనా హుద్‌హుద్ తుపాను నష్టాలను తుట్టుకుని విశాఖ రూపురేఖలు పారిపోయే విధంగా అభివృద్ధి జరిగిందన్నారు. అయితే అనేక ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉందని రోజుకు అరగంట సేపు సరఫరా చేస్తే ఎలాగని ప్రశ్నించారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను త్వరగా పూర్తి చేయాలంటూ తన నియోజకవర్గంలో 760 ఫ్లాట్ల నిర్మాణం జరిగిందని, ఈ అనుమతుల్లో చాలా తిరకాసు జరిగిందన్నారు. పాత డ్రైనేజీ కనెక్షన్ నేటికీ కొనసాగుతున్నదని, ఇక వందలాది వాహనాలు రోడ్డుపైన బారులు దీరుతున్నాయని అన్నారు. సీతమ్మ ధార ప్రాంతంలో స్తంభాలు వేశారు గానీ దీపాలు అమర్చలేదన్నారు.

4232 బాల్య వివాహాల నిలుపుదల

విజయవాడ, మార్చి 21: రాష్ట్రంలో గత మూడు సంవత్సరాల్లో 4232 బాల్య వివాహాలను నిలుపుదల చేసినట్లు రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. రాష్ట్ర శాసన మండలిలో సంక్షేమశాఖపై బుధవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాల నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మండల, పట్టణ స్థాయిలో బాలల రక్షణ కమిటీలను 9884 ఏర్పాటు చేశామన్నారు. లైంగిక వేధింపులకు సంబంధించి 3092 కేసులు నమోదు చేశామన్నారు. మహిళా, శిశు సంక్షేమానికి సంబంధించి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ బీసీలు టీడీపీకి వెన్నుదన్ను అని తెలిపారు. ఆదరణ పథకం మరోసారి అమలు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు మైనారిటీ, ఎస్సీ, గిరిజన సంక్షేమానికి చేపడుతున్న చర్యలు వివరించారు. అంతకుముందుకు సంక్షేమంపై జరిగిన చర్చలో సభ్యులు బి.అర్జునుడు, పోతుల సునీత, చిక్కాల రామచంద్రరావు, కత్తి నర్సింహారెడ్డి, ఆదిరెడ్డి అప్పారావు, గాదె శ్రీనివాసులు నాయుడు, జి.శ్రీనివాసులు, టి.రత్నాబాయి, రాము సూర్యారావు, మాధవ్ ప్రసంగించారు.