ఆంధ్రప్రదేశ్‌

వైసీపీది లాలూచీ రాజకీయం టీడీపీది ప్రజల అవిశ్వాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 21: వైసీపీది లాలూచీ రాజకీయమైతే తెలుగుదేశం పార్టీది 5 కోట్ల ప్రజల అవిశ్వాసమని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అవిశ్వాసం పెట్టిన వైసీపీ ఎంపీలకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో రోజూ ఏం పని అని ప్రశ్నించారు. దీనిద్వారా వైసీపీ లాలూచీ రాజకీయం ఏమిటో ప్రజలు గమనించాలన్నారు. మనవడి పుట్టినరోజు సందర్భంగా తిరుపతిలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడి నుండే ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకోసం, న్యాయంకోసం, మన హక్కుల కోసం పోరాడుతున్నామని, చివరి రోజు వరకు ఇదే స్ఫూర్తితో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. 1985 ఆగస్ట్ సంక్షోభంలో 161 మంది ఎమ్మెల్యేలు ఒకేతాటిపై చివరిదాకా నిలిచి ఘన విజయం సాధించామని, అదే స్ఫూర్తి ఇప్పుడు ఏంపీలందరిలో కనిపించాలన్నారు. కేంద్రం అన్యాయం చేసిందనే భావన ప్రజల్లో ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలు జాతీయ స్థాయి అంశంగా మారాయని, బీజేపీ మినహా అన్ని పార్టీలు ఏపీ పట్ల సానుభూతితో ఉన్నాయి, మద్దతునిస్తున్నాయన్నారు. ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. ‘వైసీపీది లాలూచీ అవిశ్వాసం, టీడీపీది 5 కోట్ల ప్రజల అవిశ్వాసం, ఈ రెండింటికీ చాలా తేడా ఉంది. కొంతకాలంగా టీడీపీపై బీజేపీ అనుమానం పెంచుకుంది. జాతీయ రాజకీయాల పట్ల నాకు ఆసక్తి లేదన్నా వాళ్లు నమ్మడం లేదు. అందుకే రాష్టప్రతి ఎన్నికల్లో బీజేపీ అవసరం లేకున్నా, వైసీపీ మద్దతు తీసుకుంది. నాలుగేళ్లు ఎదురుచూశాం. ఆఖరి బడ్జెట్‌లో కూడా మనకు న్యాయం జరగలేదు. దీనితో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వచ్చింది, ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకింది. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఉభయ సభల్లో ఎంపీలతో ఆందోళన బీజేపీకి చెప్పే చేశాం. ట్రిపుల్ తలాక్‌పై కూడా చెప్పే చేశాం. అరుణ్ జైట్లీ ప్రెస్‌మీట్ ప్రజల్లోకి బలంగా వెళ్లింది. దేశరక్షణ, సైన్యం నిధులు అడిగామనడం ప్రజల్లో ఆవేశం పెంచింది. అనేక అవకాశాలు ఇచ్చినా బీజేపీ వినియోగించుకోలేదు’ అని వివరించారు. అవిశ్వాసం పెట్టిన వాళ్లకు పీఎంవోలో పనేంటి.. అంటూ వైకాపాను ముఖ్యమంత్రి చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని ఫొటో తీస్తే పీఎంవో వాళ్లు మీడియాను గదమాయించడమేమిటి.. ఒక వైపు అవిశ్వాసం నోటీసు ఇస్తారు, మరోవైపు పీఎంవోలో ఉంటారు. అక్కడే వైసీపీ చిత్తశుద్ధి తెలిసిపోతోందని విరుచుకుపడ్డారు. విభజనతో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కిపోయిందని, మనం ఎంత చేసినా అది కొంతేననీ, 20 ఏళ్ల అంతరం పూడాలంటే కేంద్రం ఎంత తోడ్పాటు అందించాలని డిమాండ్ చేశారు. చేయాల్సిందానితో పోల్చుకుంటే చేసింది చాలా స్వల్పమని, వృద్ధి రేటులో తెలంగాణ కన్నా 2 శాతం ముందుంటే, తలసరి ఆదాయంలో రూ.33 వేలు వెనుక ఉన్నామన్నారు. దీనిని పూడ్చాల్సిన బాధ్యత మీపై లేదా.. అని కేంద్రాన్ని ముఖ్యమంత్రి సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ దేశంలో అంతర్భాగం కాదా.. ఏపీకి సాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై లేదా.. అంటూ ధ్వజమెత్తారు. ‘ సామరస్యంగా అడిగినప్పుడు చేయలేదు. మంత్రులు రాజీనామా చేసినా స్పందించలేదు. ఎన్డీఏ నుంచి వైదొలిగినా కదలిక లేదు. అవిశ్వాసం పెట్టినా చేయడం లేదు. కేంద్రం మొండిగా వ్యవహరించడం వెనుక వ్యూహం ఏమిటి.. ఏ భరోసాతో కేంద్రం ఏపీ పట్ల ఇంత కఠినంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. మనం న్యాయం అడుగుతున్నాం, మన వద్ద సత్యం ఉంది. ఏ ప్రాంతం వారైనా తెలుగు వారందరిదీ ఒకటే మాట. ఏపీకి జరిగిన అన్యాయంపై అన్ని ప్రాంతాల తెలుగువారంతా ఆవేశంతో రగిలిపోతున్నారు. దేశ విదేశాల్లోని తెలుగు వారిలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఇతర రాష్ట్రాలలోని తెలుగువారు కూడా ఈ అన్యాయాన్ని నిరసిస్తున్నారని’ వివరించారు. ఎంపీలు సంఘటితంగా ఒక స్ఫూర్తితో పనిచేసి 5 కోట్ల ప్రజల మనోభావాలను ప్రతిబంబించాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లో అవిశ్వాసం నోటీసును అనుమతించాల్సిందేనని, మరొక ప్రత్యామ్నాయం ప్రభుత్వానికి లేదన్నారు. వాయిదాలు వేసుకుంటూ పోతే మరింత ఆగ్రహానికి గురవుతారని చెప్పారు. పార్లమెంటు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారనే విషయాన్ని విస్తృత ప్రచారంతో ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పొరుగు రాష్ట్రాలతో సమాన స్థాయికి ఆంధ్రప్రదేశ్ చేరేదాకా కేంద్రం తోడ్పాటు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైఎస్ చౌదరి, ఎంపీ సీఎం రమేష్, టీజీ వెంకటేష్, ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు, శాసనసభ, శాసనమండలి చీఫ్ విప్‌లు పల్లె రఘునాథ రెడ్డి, పయ్యావుల కేశవ్, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, అసెంబ్లీ వ్యూహ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.