ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర వ్యాప్తంగా హోదా హోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 22: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం రాష్టవ్య్రాప్తంగా గురువారం తలపెట్టిన జాతీయ రహదారుల దిగ్బంధం విజయవంతమైంది. విశాఖలోని హనుమంతవాక, మద్దిలపాలెం, సీతమ్మధార, ఎన్‌ఏడీ కొత్తరోడ్డు ప్రాంతాల్లో అఖిలపక్ష నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి హోదా కోసం నినదించారు. ఈ సందర్భంగా మద్దిలపాలెం జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమంలో ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా విభజన హామీలను సాధించుకునేందుకు తుది పోరాటంలో మొదటి అంకం రహదార్ల దిగ్బంధం ద్వారా మొదలైందన్నారు. విభజన సందర్భంగా అప్పటి ప్రధాని ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అంగీకరించి రాజ్యసభలో ప్రకటన చేస్తే, తదుపరి అధికారం చేపట్టిన ఎన్‌డీఏ ప్రభుత్వం హోదా హామీని తుంగలో తొక్కిందని మండిపడ్డారు. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ నాలుగేళ్ల పాటు ప్రత్యేక హోదా విషయాన్ని విస్మరించి, ఇప్పుడు హోదా కోసం ఉద్యమిస్తామంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, వైసీపీ విశాఖ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ తైనాల విజయకుమార్, పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జేవీ సత్యనారాయణ మూర్తి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ నర్శింగరావు, జనసేన, హమ్‌ఆద్మీ పార్టీ, లోక్‌సత్తా, పార్టీలు సహా పలు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
గోదావరి జిల్లాల్లో ...
కాకినాడ/ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్‌చేస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గురువారం అఖిలపక్షాలు చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బంధం ఆందోళన విజయవంతమైంది. ప్రత్యేక హోదా ఉద్యమానికి అన్ని వర్గాల నుండి మద్దతు లభించింది. రెండు జిల్లాల్లో దాదాపు అన్ని ప్రాంతాల్లో వైసీపీ, వామక్షాలు, జనసేన, కాంగ్రెస్ తదితర విపక్షాలన్నీ ఐక్యంగా ఆందోళన నిర్వహించగా, తెలుగుదేశం పార్టీ విడిగా ఆందోళనకు దిగింది. కాకినాడ నగరంలోని అచ్చంపేట జంక్షన్, ఏడీబీ రహదారి, తిమ్మాపురం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనకారులు జాతీయ రహదారులను దిగ్బంధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ సహా వామపక్షాలు, జనసేన తదితర రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు ఏడీబీ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు. వైఎస్సార్ కాంగ్రెస్ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌ఛార్జి కురసాల కన్నబాబు, పీసీసీ ప్రధాన కార్యదర్శి పంతం నానాజీ, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దువ్వా శేషుబాబ్జీ, జిల్లా కార్యదర్శి కెఎస్ శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి టి మధు, జనసేన నాయకుడు కె గోపాల్ తదితరులను పోలీసులు అరెస్టుచేసి తిమ్మాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తెలుగుదేశం ఆధ్వర్యంలో కాకినాడలోని బాలాజీ చెరువు జంక్షన్‌లో నిరసన దీక్ష చేపట్టారు. కాకినాడ మేయర్ సుంకర పావని, నగర ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, టీడీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో 16వ నెంబరు జాతీయ రహదారిని విపక్షాలు దిగ్బంధించాయి. జిల్లా అంతటా రహదారుల దిగ్బంధం కొనసాగింది. పశ్చిమ గోదావరి జిల్లా అంతటా రహదారుల దిగ్బంధం కొనసాగింది. ఏలూరు సమీపంలోని ఆశ్రం ఆసుపత్రి వద్ద జాతీయ రహదారిని విపక్ష పార్టీలన్నీ దిగ్బంధించాయి. సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, వైసీపీ, జనసేన, ప్రజాసంఘాలు, విద్యార్థిసంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కొంతమంది యువకులు అర్ధనగ్నంగా రోడ్డుపై పడుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి చింతకాయల బాబూరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఆళ్ల నాని, జనసేన జిల్లా నాయకులు పి సాగర్‌బాబు, జల్లా హరికృష్ణ, కాంగ్రెస్ నేతలు రాజనాల రామ్మోహనరావు, జిల్లా ఎన్‌జిఓ సంఘం నేతలు ఆర్‌ఎస్ హరినాథ్, చోడగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు వసంతమహల్ సెంటరులో టిడిపి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఏలూరు మేయర్ నూర్జహాన్, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పాలి ప్రసాద్ పాల్గొన్నారు.

నింగినంటిన నిరసనలు
తిరుపతి/ఒంగోలు/నెల్లూరు,: రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై టీడీపీ ఒక పక్క, వైకాపా, వామపక్షాల నేతలు మరో పక్క గురువారం ఆందోళనకు దిగాయి. తిరుపతిలో విపక్షాలన్నీ ఏకమై ప్రతి నియోజక వర్గంలోని మండల కేంద్రాల్లోని జాతీయ రహదారులపై గురువారం రాస్తారోకోలు నిర్వహించి తమ నిరసనలు తెలిపారు. తిరుపతిలో తనపల్లి జాతీయ రహదారిపై ఆందోళనాకారులు రోడ్డుపై సాష్టాంగ నమస్కారాలు చేస్తూ తమ కాంక్షను వెలిబుచ్చారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి మోసం చేశారంటూ విపక్షాలు జాతీయ రహదారిలో రాస్తారోకో నిర్వహించి మోదీ దిష్టిబొమ్మకు శవయాత్ర చేసి దగ్ధం చేశారు. టీడీపీ నాయకులు తిరుపతి నగరంలోని నాలుగుకాళ్ల మండపం వద్ద మానవహార నిర్వహించారు. ఎస్వీయూ వద్ద వైకాపా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి టైర్లను దగ్ధం చేసి నిరసన తెలిపారు. చిత్తూరు, మదనపల్లె, పుంగనూరు, బైరెడ్డిపల్లె, పాకాల, శ్రీకాళహస్తి తదితర ప్రాంతాల్లో కూడా ఆందోళన చేశారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా,విభజన హామీల అమలు తదితర డిమాండ్లతో ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపుమేరకు గురువారం ప్రకాశం జిల్లాలోని జాతీయ రహదారులను దిగ్బంధనం చేశారు. ఉదయం 11గంటల నుండి 12గంటల వరకు జాతీయ రహదారులను దిగ్బంధించటంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఒంగోలులోని సౌత్‌బైపాస్ దగ్గర జాతీయ రహదారిపై వైసీపీ,సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీలకు చెందిన నాయకులు,కార్యకర్తలు,ప్రజాసంఘాల నాయకులు బైఠాయించటంతో వాహనాలు నిలిచిపోయాయి. నెల్లూరు జిల్లా కేంద్రంలో బుజబుజనెల్లూరు వద్ద జాతీయ రహదారిపై ఆందోళన కారులు గంటసేపు బైఠాయించి ఆందోళన నిర్వహించారు.
జాతీయ రహదారిపై విపక్షాల రాస్తారోకో
అనంతపురం: ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చేంత వరకు ఆందోళన ఆగదని, దశల వారీగా ఉద్యమించడం కొనసాగిస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో రాష్టవ్య్రాప్తంగా చేపట్టిన రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లాలో ఆందోళనలు మిన్నంటాయి. రహదారుల దిగ్బంధం కార్యక్రమం అనంతపురం జిల్లాలో భారీ ఎత్తున జరిగింది. టీడీపీ సైతం అనంతపురం నగరంతో పాటు జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో వేర్వేరుగానూ, కొన్ని చోట్ల కలిసి రాస్తారోకో నిర్వహించింది. సీపీఎం, సీపీఐలతో కలిసి వైకాపా, కాంగ్రెస్, జనసేన పార్టీలు ఆందోళనలో పాల్గొన్నాయి. ఆర్టీసీ బస్సులు, పలు ప్రైవేటు రవాణా వాహనాలు, లారీలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. ఎస్‌కే యూనివర్సిటీ వద్ద జాతీయ రహదారిని ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యూఐ తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనంతపురం-మదనపల్లి జాతీయ రహదారిని విద్యార్థులు దిగ్బంధం చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి డీ.జగదీష్, నగర అధ్యక్షుడు పీ.నారాయణస్వామి, నాయకులు లింగమయ్య, జాఫర్, సీపీఎం రాష్ట్ర నాయకుడు ఓబులు, జిల్లా ఉత్తర ప్రాంత కార్యదర్శి రాంభూపాల్, వైకాపా రాష్ట్ర నాయకుడు అనంత వెంకట్రామిరెడ్డి, నగర సమన్వయకర్త నదీమ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగే పరశురామ్, జిల్లా సమన్వయకర్త రంగయ్య, కాంగ్రెస్ రాష్ట్ర స్పోక్స్‌మన్ కేవీ.రమణ, నగరాధ్యక్షుడు దాదాగాంధీ, జనసేన నాయకులు రామిరెడ్డి, బాబూరావు, టీడీపీ నాయకులు గంపన్న (డిప్యూటీ మేయర్) తదితరులు పాల్గొన్నారు.