ఆంధ్రప్రదేశ్‌

పొంచిఉన్న ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 18: రాష్ట్రంలోని సముద్ర తీరప్రాంతాల్లో రానున్న రోజుల్లో మంచినీటికి తీవ్ర ఇబ్బందులు తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. భూగర్భ జలాల్లోకి సముద్ర జలాలు కలవడంతో నీరు తాగేందుకు పనికిరాకుండా పోయే పరిస్థితులు తలెత్తనున్నాయి. ఈ పరిణామాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తమిళనాడులోని చెన్నై సహా పలుప్రాంతాల్లో భూగర్భజలాలు ఉప్పుగా మారాయి. ఇదే పరిస్థితి రాష్ట్రంలో తలెత్తనుంది. రాష్ట్రంలో దాదాపు 970 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. గత కొద్ది సంవత్సరాలుగా అభివృద్ధి పేరుతో తీరప్రాంతాల్లో పలు ప్రాజెక్టులు చేపడుతున్నారు. థర్మల్ విద్యుత్ ప్లాంట్స్, ఓడరేవులు, రొయ్యలు, చేపల చెరువులు, రిస్టార్ట్స్, రహదారుల నిర్మాణం, వివిధ పరిశ్రమలు కోస్తా తీరంలో ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటవుతున్నాయి. మరికొన్ని ప్రతిపాదనల దశలో ఉన్నాయి. పరిశ్రమల ఏర్పాటుతో భూగర్భజలాల వినియోగం ఎక్కువవుతోంది. తగ్గిన భూగర్భజల వనరులను తిరిగి సాధారణ స్థాయికి తీసుకువచ్చేందుకు వర్షంపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. అయితే రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవకపోవడంతో సముద్రం నీరు భూగర్భజలాల్లోకి చొచ్చుకు వస్తోందని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. ఇప్పటికే తమిళనాడులోని చెన్నై నగరం, మింజూరు-పొనే్నరి బెల్ట్, కాంచీపురం, తిరువళ్లూరు తదితర ప్రాంతాల్లో సముద్రజలాలు చొచ్చుకు రావడంతో మంచినీటి సమస్య నెలకొంది. పొనే్నరి బెల్ట్ ప్రాంతంలో దాదాపు 14.7 కిలోమీటర్ల మేరకు సముద్రజలాలు చొచ్చుకువచ్చాయి. భూ ఉపరితలం నుంచి 15 మీటర్లలోతున భూగర్భజలాలు ఉన్నాయి. వాటిని వెలికితీసే సమయంలో అవి కూడా ఉప్పునీటితో కలుస్తున్నాయి. దీనికి తోడు సునామి, వాతావరణంలో మార్పుల కారణంగా సముద్రమట్టం పెరగడంతో జలాలు భూగర్భజలాల్లోకి చొచ్చుకువస్తున్నాయి. నీరు ఉప్పుగా మారడంతో పంటలు పండని పరిస్థితి నెలకొంటోంది. దీంతో తాగునీటి కొరత తీవ్రమైంది. చెన్నై తాగునీటి అవసరాలను కొంతమేరకు డిశాలినేషన్ ప్లాంట్ ద్వారా తీరుస్తున్నారు. ఇది ఖరీదైన వ్యవహారం. కేరళ వ్యవసాయ వర్సిటీ ఉప్పునీటిని తట్టుకునే వరి వంగడాన్ని అభివృద్ధి చేసింది. ఇది అక్కడి రైతులకు కొంతమేర ఉపయోగపడుతోందని చెప్పవచ్చు. విశాఖ జిల్లాలో 2008 నుంచి వివిధ విద్యాసంస్థలు, అధ్యాపకులు చేపట్టిన సర్వేలో కొన్ని ప్రాంతాల్లో భూగర్భజలాలు ఉప్పగా మారడాన్ని గుర్తించారు. విశాఖ నగరంలోని ఎంవిపి కాలనీ, నక్కపల్లి ప్రాంతం తదితర ప్రాంతాల్లో ఉప్పునీరు కొంతమేరకు భూగర్భజలాల్లోకి చేరినట్లు నిర్ధారించారు. గాజువాక తదితర ప్రాంతాల్లో ఇనుప ధాతువు భూగర్భ జలాల్లో ఉన్నట్లు గుర్తించారు. సరైన శాస్ర్తియ విధానం లేకపోవడంతో వాస్తవ పరిస్థితి అంచనా వేసే వీలు లేకుండాపోయింది.
సముద్ర తీరంలోని అవాసప్రాంతాల్లో భూగర్భజలాల్లోకి సముద్ర జలాలు చొచ్చుకురావడంపై నిరంతర అధ్యయనం చేసేందుకు వీలుగా ఒక నెట్‌వర్క్ అవసరం అని భూగర్భజల నిపుణులు అంటున్నారు. సముద్రతీరం నుంచి 5 లేదా 10 కిలోమీటర్ల దూరంలో తీరం వెంబడి పీజో మీటర్ల ఏర్పాటు చేసి, వాటితో నీటి నాణ్యతను నిరంతరం గమనించడం వల్ల ఉప్పు నీరు చొచ్చుకు రావడాన్ని తెలుసుకోవచ్చు. ప్రతి మూడు నెలలకు ఈ వివరాలు పరిశీలించడం ద్వారా పరిస్థితిని అంచనా వేయవచ్చు. అసవరమైన సందర్భాల్లో యంత్రాంగం అప్రమత్తమయ్యే వీలు ఉంటుంది. సాగునీరు, మంచినీటి సమస్యను కొంతమేరకు ముందుగానే గుర్తించే వీలు ఉంటుంది. దీర్ఘకాలిక రాష్ట్ర ప్రయోజనాలతో పోల్చుకుంటే ఈ నెట్‌వర్క్ ఏర్పాటు పెద్ద ఖరీదైన వ్యవహారం కాదని ఓ అధికారి వ్యాఖ్యానించారు.