ఆంధ్రప్రదేశ్‌

ఎపిలో రూ.వెయ్యి కోట్ల అప్పో పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూ 29: నవ్యాంధ్రలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చైనాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వివిధ సంస్థల ప్రతినిధులను కలుసుకుని ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. చైనాలో బుధవారం నాలుగోరోజు పర్యటనలో భాగంగా గిజో జో ప్రావిన్స్‌లోని గియాన్ నగరంలో చంద్రబాబు పర్యటించారు. గిజో ప్రావిన్స్ వైస్ గవర్నర్ క్విన్ రు పీతో భేటీ అయ్యారు. గియాన్‌లో హరితవనాలను చూసి పరవశించిన చంద్రబాబు ఇలాంటి పర్యావరణాన్ని తమ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయాలని, ఇందుకు మీ అనుభవాలు కావాలని క్విన్ రు పీని కోరారు. జలవనరుల పరిరక్షణలో, మొక్కలను పెంచి రాష్ట్రాన్ని హరితంగా తీర్చిదిద్దడంలో తమకు కఠిన నిబంధనలు ఉన్నాయని, అవి పౌర సమాజంలోని ప్రతిఒక్కరూ పాటించాల్సిందేనని క్విన్ రు పీ తెలిపారు. తరువాత వైస్ గవర్నర్ గిజో ప్రావిన్స్ ప్రభుత్వ నిర్మాణం, పాలనా విధానాన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు పడుతున్న తపన తమ దృష్టిని ఆకర్షించిందని, ఎపి అభివృద్ధిలో తమవంతు సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇదిలావుండగా ఏపిలో 1000 కోట్ల పెట్టుబడితో తమ శాఖను ఏర్పాటు చేయడానికి చైనా మొబైల్ ఫోన్ల ఉత్పత్తి కంపెనీ ‘అప్పో’ ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తమను కన్విన్స్ చేసిన తీరు నచ్చిందని, అందుకే తమ కంపెనీ అక్కడ ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నామని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఎరిక్, ఎండి జోన్, ప్లానింగ్ డైరెక్టర్ స్పెటర్ చెప్పారు. ఇందుకు ముఖ్యమంత్రి స్పందిస్తూ అప్పో నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. భారత్‌లో హార్డ్‌వేర్ రంగానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, పరిపాలనలో ఐటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో తాము దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని చంద్రబాబు చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఆంధ్రప్రదేశ్ అనుకూలమని ఆయన తెలిపారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేశామని చంద్రబాబు అప్పో కంపెనీ ప్రతినిధులకు చెప్పారు. అప్పో కంపెనీ ఏర్పాటుకు తగిన ప్రతిపాదనలతో ముందుకొస్తే పూర్తి సహకారాన్ని అందిస్తామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. జూలైలో ఎపిలో పర్యటించి అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటే తాము భూమిని కేటాయిస్తామని చెప్పారు.
గియాన్ సిటీలో బాబు పర్యటన
తరువాత చంద్రబాబు బృందం గియాన్ సిటీలో పర్యటించింది. ప్రభుత్వరంగ సంస్థ, చైనాలో అతిపెద్ద డేటాబేస్ సెంటర్ అయిన చైనా యూనికామ్‌ను ఆయన సందర్శించారు. చైనా యూనికామ్ ఎలా పనిచేస్తోందో గియాన్ నగర మేయర్ జాంగ్ వెన్ లఘుచిత్రం ద్వారా వివరించారు. మొబైల్ ఫోన్‌ల తయారీలో చైనాలోని అగ్రగామి సంస్థ ఫ్యాక్స్‌కాన్ ఫెసిలిటీని కూడా చంద్రబాబు సందర్శించారు. ఫ్యాక్స్‌కాన్ ఫెసిలిటీ ఏటా 5 కోట్ల మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఫ్యాక్స్‌కాన్ అంగీకరించింది. దీనిపై చంద్రబాబు నాయుడు, కంపెనీ ప్రతినిధులు పరస్పరం చర్చించుకున్నారు. తరువాత గియాన్ నగరంలో యూనివర్సిటీల ప్రాంగణాన్ని చంద్రబాబు సందర్శించారు. నగరంలో ఆరు యూనివర్సిటీలు ఉన్నాయి. ప్రపంచ స్థాయి వృత్తివిద్యా కేంద్రాలకు నిలయంగా ఉన్న ఈ విశ్వవిద్యాలయాల్లో ఎంపిక చేసిన గుయాన్ మెడికల్ విశ్వవిద్యాలయం, గిజో నార్మల్ విశ్వవిద్యాలయం ప్రాంగణాలను చంద్రబాబు సందర్శించారు. మెడకల్ వర్సిటీ విద్యార్థులతో చంద్రబాబు సంభాషించారు. ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ యూనివర్సిటీగా ప్రసిద్ధి చెందిన గుయాన్ నార్మల్ విశ్వవిద్యాలయంలో బెస్ట్ ప్రాక్టీసెస్‌పై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన జిఐఐసి ఇండస్ట్రియల్ పార్క్‌కు చేరుకున్నారు. అక్కడ వైద్య పరికరాల ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. విశాఖ సమీపంలో తాము నెలకొల్పనున్న మెడికల్ డివైసెస్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌లో భాగస్వాములు కావాలని ఉత్పత్తి కేంద్ర ప్రతినిధులను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ప్రస్తుతం తమ దేశం వైద్య పరికరాల కోసం విదేశాలపై ఆధారపడ ఉందని, ఈ పరిస్థితిని తొలగించి వైద్య పరికరాల తయారీకి విశాఖను కేంద్రంగా రూపొందిస్తే కార్పొరేట్ వైద్యాన్ని చవకగా ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందించేందుకు వీలవుతుందని అన్నారు. జిఐఐసి కంపెనీ సిఇఓ మాట్లాడుతూ తాము కూడా ఏపిలో కంపెనీ స్థాపించాలని భావిస్తున్నామని చెప్పారు. మన మధ్య సుహృద్భావ సంబంధాలు మరింత బలపడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... చైనాలోని గుయాన్‌లో బుధవారం చైనా కమ్యూనిస్ట్ పార్టీ గిజో ప్రావిన్స్ కార్యదర్శి చెన్ మినర్‌తో భేటీ సందర్భంగా గిజో ప్రావిన్స్‌తో ఆంధ్రప్రదేశ్ ‘సిస్టర్ స్టేట్’ అవగాహన ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, తదితరులు