రాష్ట్రీయం

గొంతెండుతోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఒకవైపు మండుతున్న ఎండలు, వడగాడ్పులు. మరోవైపు గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్న జనం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా పరివాహక ప్రాంతాల్లో మంచి నీటి కోసం వేలాది గ్రామాల ప్రజలు అలమటిస్తున్నారు. తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల నాగార్జునసాగర్ ఎడమకాల్వ ఆయకట్టు కింద ఉన్న గ్రామాలు తీవ్ర మంచి నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాయి. ఆంధ్రలో గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని అనేక పట్టణాలు, గ్రామాల్లోనూ ఇదే పరిస్ధితి కనిపిస్తోంది. ఆంధ్రలోని ఏడు జిల్లాల్లో 359 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించి, 400 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీళ్లు అందిస్తున్నట్లు పంచాయితీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. కృష్ణా బేసిన్ పరిధిలో మంచి నీటి ఎద్దడి తీవ్రంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మంచినీటి కొరత తీవ్రరూపం దాల్చింది. భూగర్భ జల మట్టాలు పడిపోవడం, నాగార్జునసాగర్ ఎడమకాల్వ ద్వారా తాగునీటి విడుదలకు నీటి లభ్యత లేకపోవడం శాపంగా మారింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 806.60 అడుగులుంది. ఇక్కడ రిజర్వాయర్ మొత్తం కెపాసిటీ 215.81 టిఎంసి అయతే, కేవలం 32.38 టిఎంసి నీటి లభ్యత ఉంది. నాగార్జునసాగర్‌లో 509.50 అడగుల నీటి మట్టం ఉంది. ఇక్కడ ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 312.05 టిఎంసికి గాను 130.02 టిఎంసి నీటి లభ్యత ఉంది. పులిచింతలలో కేవలం 0.25 టిఎంసి నీరు నిల్వ ఉంది. ఇక ఎగువ ప్రాంతాలను విశే్లషిస్తే కర్నాటకలో ఆల్మట్టి నీటి నిల్వ సామర్థ్యం 129.72 టిఎంసికి కేవలం 22.19 టిఎంసి, నారాయణ్‌పూర్‌లో 37.64 టిఎంసికి కేవలం 18.35 టిఎంసి, ఉజ్జనిలో 117.24 టిఎంసికి 48.25 టిఎంసి, తెలంగాణ జూరాలలో 11.94 టిఎంసికి 3.28 టిఎంసి, కర్నాటకలోని ఉమ్మడి డ్యాం తుంగభద్రలో 100.86 టిఎంసికి 6.75 టిఎంసి నీటి లభ్యత ఉందని ఇరు రాష్ట్రాల సాగునీటి శాఖ అధికారులు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కనీస నీటి మట్టం నుంచి నీటిని డ్రా చేయడం కష్టంగా మారింది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 509 అడుగుల నీటి మట్టం ఉంది. లోతులోవున్న నీటిని తోడాలంటే విద్యుత్ పంపులు ఉపయోగించాలి. దీనివల్ల లాజిస్టిక్ సమస్యలు తలెత్తుతాయని ఇరిగేషన్ శాఖాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్‌కు 4 టిఎంసిల నీటిని విడుదల చేయాలని కృష్ణా బోర్డు కార్యదర్శి ఆర్‌కె గుప్తా తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. గతంలో చర్చల సందర్భంగా కుదిరిన అవగాహన మేరకు ఈ నీటిని విడుదల చేయాలని కోరారు. శ్రీశైలం డ్యాం నుంచి 3.4 టిఎంసిని ఆంధ్ర ప్రభుత్వం విడుదల చేసి నాగార్జునసాగర్‌లో నిల్వ చేసింది. శ్రీశైలం డ్యాం ఏపీ ఆధీనంలో, నాగార్జునసాగర్ డ్యాం తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విషయం తెలిసిందే. కాగా బుధవారం నాగార్జునసాగర్ కుడికాల్వకు ఐదు వందల క్యూసెక్కుల నీటిని విడుదలచేశారు. మంచినీటి అవసరాలకు వచ్చే తొమ్మిది రోజులు 4 టిఎంసి నీటిని ఏపీకి విడుదల చేసే అవకాశముంది. హైదరాబాద్‌లోని కోటిమంది ప్రజలకు 11 టిఎంసి నీరు అవసరం. నాగార్జునసాగర్ నుంచి మంచినీటిని సరఫరా చేయడం కత్తిమీద సాములా మారింది.
తెలంగాణలోని కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో భూగర్భ జల నీటి మట్టాలు గణనీయంగా పడిపోయాయి. 6.83 అడుగుల నుంచి 24.57 అడుగుల వరకు నీటి మట్టాలు పడిపోయాయి. వర్షపాతం లోటు 27 నుంచి 50 శాతం వరకు నమోదు కావడం వల్ల ఈ పరిస్ధితి తలెత్తింది. సింగూర్, మంజీరా, నిజాంసాగర్, శ్రీరాంసాగర్ రిజర్వాయర్లలో నీరు అంతంతమాత్రమే ఉంది. మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ప్రజలకు గ్రామీణ తాగునీటి పథకం అధికారులు ట్యాంకర్ల ద్వారా మంచి నీటిని సరఫరా చేస్తున్నారు. 231 కరవు మండలాల్లో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ. 55 కోట్ల నిధులను ఇటీవలే విడుదలచేసింది. వచ్చే వేసవిలో తెలంగాణ జిల్లాలో మంచినీటి ఎద్దడి నివారించేందుకు గ్రామీణ తాగునీటి పథకం ఇంజనీర్ ఇన్ చీఫ్ శాఖ రూ.311 కోట్లతో ప్రణాళిక రూపొందించి అమలు చేయనుంది.

చిత్రం.... సాగర్ నుంచి కుడికాల్వకు నీళ్లు విడుదల చేస్తున్న దృశ్యం