ఆంధ్రప్రదేశ్‌

పత్తికి విపత్తు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, జూలై 1: దేశంలో టెక్‌టైల్స్ పరిశ్రమ, జిన్నింగ్, ప్రెస్సింగ్ పరిశ్రమలకు అవసరమైన పత్తి ముడిసరుకు నిల్వలు నిండుకున్నట్లు తెలుస్తోంది. కేవలం 40 రోజులకు సరిపడ నిల్వలు మాత్రమే ఉన్నట్లు పత్తి వ్యాపారుల సంఘం అంచనా వేసింది. దీంతో పత్తి, దూది ధరలు అమాంతం పెరిగిపోయాయి. ధరల పెరుగుదల వ్యాపారవర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. నెల రోజుల క్రితం క్వింటాల్ పత్తి ధర రూ.4 వేల నుంచి రూ.4,500 వరకు ఉండేది. అయితే జూన్ 15 నుంచి పత్తి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. పత్తి మార్కెట్‌కు పేరొందిన కర్నూలు జిల్లా ఆదోనిలో మంచి పత్తి క్వింటాల్ ధర రూ.6 వేల నుంచి రూ.6,200 వరకు పలుకుతోంది. ధర పెరిగినప్పటికీ సరుకు చాలా తక్కువగా వస్తోంది. కనీసం వెయ్యి పత్తిచెక్కులు కూడా మార్కెట్‌కు రాని పరిస్థితి. అఖిల భారత పత్తి వ్యాపారుల సంఘం అంచనా మేరకు దేశంలో 28 లక్షల నుంచి 30 లక్షల క్వింటాళ్ల పత్తి మాత్రమే నిలువ ఉన్నట్లు సమాచారం. ఇది మరో 40 రోజులకు మాత్రమే వస్తుందని భావిస్తున్నారు. దీంతో టెక్స్‌టైల్స్ పరిశ్రమలు, జిన్నింగ్, ప్రెస్సింగ్ పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు కొరత వేధించే అవకాశాలు ఉన్నాయి. ఆదోనిలో సైతం పత్తి లేక చాలా జిన్నింగ్ పరిశ్రమలు ఉత్పత్తి చేయడం లేదు. ముడి పత్తి కొరత కారణంగా దూది ధర సైతం పెరిగింది. వారం రోజుల క్రితం 356 కిలోల దూదిబేళ్ల ధర రూ.32 వేలు ఉండేది. ఇప్పుడు ఒకేసారి రూ.12 వేలు పెరిగి రూ. 44 వేలకు చేరుకుంది. పత్తి, దూది ధర పెరగడంతో దారం ధరలు సైతం భారీగా పెరిగినట్లు వ్యాపారులు అంటున్నారు. పత్తి ధర పెరగడంతో గతంలో రూ. 32 వేలకు దూది బేళ్లను కోనుగోలు చేసిన వ్యాపారులు ప్రస్తుతం లాభాలు గడిస్తున్నారు.
ఈసారి సరైన సమయానికే వర్షాలు కురిసినా పత్తి సాగు ప్రారంభం కాలేదు. పత్తి పంట చేతికి రావాలంటే కనీసం మూడు నాలుగు నెలలు పడుతుంది. రాష్ట్రాల వారీగా తీసుకుంటే గుజరాత్‌లో 8 లక్షల క్వింటాళ్ల పత్తి, మహారాష్టల్రో 7 లక్షల క్వింటాళ్లు, రాజస్థాన్‌లో రెండు లక్షల క్వింటాళ్లు, మధ్యప్రదేశ్‌లో ఒకటిన్నర లక్షల క్వింటాళ్లు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో ఆరున్నర లక్షల క్వింటాళ్లు, సిసిఐ సంస్థ వద్ద లక్ష క్వింటాళ్లు, వ్యవసాయ రైతు సహకార సంఘాల వద్ద రెండు లక్షల క్వింటాళ్లు, కార్పొరేట్ సంస్థల వద్ద లక్ష క్వింటాళ్లు, ఎంసిఎక్స్, ఎన్‌సిడిఇఎక్స్ సంస్థల వద్ద లక్ష క్వింటాళ్ల పత్తి స్టాక్ ఉన్నట్లు అంచనా. ఈ పత్తి 40 రోజులకు మాత్రమే సరిపోతుందని అంటున్నారు. దీంతో దూది బేళ్లు, దారం ఎగుమతి, దిగుమతి చేసే వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని వ్యాపారవర్గాలు అంటున్నాయి. పత్తి కొరతతో టెక్స్‌టైల్స్ పరిశ్రమకు గడ్డురోజులు వచ్చాయనే చెప్పాలి.