రాష్ట్రీయం

అభివృద్ధే బిజెపి నినాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బహిరంగ సభ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి-బిజెపి సంకల్పం నినాదంతో ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభకు బిజెపి భారీ ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ నుండి హైదరాబాద్‌కు చేరుకున్న అనంతరం ప్రత్యేక విమానంలో రాజమహేంద్రవరం మధ్యాహ్నం 1.30గంటలకు చేరుకోనున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కొద్దిసేపు ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో విశ్రాంతి తీసుకున్న అనంతరం పార్టీ సీనియర్లతో సమావేశమైన అనంతరం సాయంత్రం 4.30గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 6.30గంటలకు ప్రత్యేక విమానంలో తిరిగి ఆయన హైదరాబాద్ చేరుకుని, అక్కడి నుండి ఢిల్లీ వెళతారు. రెండోసారి బిజెపి అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత తొలిసారి ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బిజెపి ఏ విధంగా కృషిచేస్తోందో, ఇప్పటి వరకు కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం చేసిన కృషి, భవిష్యత్తులో అందించనున్న సహకారం తదితర అంశాలను బహిరంగ సభలో వివరిస్తారని బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సిద్ధార్థనాద్ సింగ్ చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం దేశంలో మరే ఇతర రాష్ట్రాలకు అందించనంత సహకారాన్ని ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రప్రభుత్వం అందించిందన్న విషయాన్ని అమిత్‌షా ఈ సభలో ప్రజలకు వివరిస్తారని బిజెపి నాయకులు చెప్పారు. విభజన హామీల్లోని అన్ని అంశాలను అమలుచేస్తుందన్న భరోసాను అమిత్‌షా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్‌లో కేవలం రూ.100కోట్లు మాత్రమే కేటాయించారన్న ఆరోపణలకు అమిత్‌షా తన ప్రసంగం ద్వారా తగిన సమాధానం ఇస్తారని అంతా భావిస్తున్నారు. బహిరంగ సభకు భారీ జన సమీకరణకు బిజెపి నాయకులు ఏర్పాట్లు చేసారు.
విభజన హామీలన్నీ అమలు
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే భారతీయ జనతాపార్టీ లక్ష్యమని బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సిద్ధార్థనాద్ సింగ్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం బిజెపి ఆధ్వర్యంలో జరగనున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు శనివారం ఒక రోజు ముందుగానే వచ్చిన సిద్ధార్థనాద్‌సింగ్ విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ ఎన్‌డిఎ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. ఇందుకోసం బిజెపి చిత్తశుద్ధితో కృషిచేస్తుందన్నారు. జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలను లేవనెత్తుతారన్నారు. పోలవరం, విశాఖ రైల్వే జోన్, ఆర్ధిక లోటు తదితర అన్ని అంశాలకు అమిత్‌షా ప్రసంగంలో సమాధానాలు లభిస్తాయన్నారు. ప్రత్యేక హోదా వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ప్రయోజనం కలుగుతుందో, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజితో ప్రయోజనం కలుగుతుందో ఆ విధానానే్న అమలుచేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. వైసిపి, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న ఆరోపణలకు ధీటైన సమాధానం అమిత్‌షా ప్రసంగంలో లభిస్తాయన్నారు.

రాష్ట్రంలో బలీయమైన శక్తిగా బిజెపి

మహిళా మోర్చా ఇన్‌చార్జ్ పురంధ్రీశ్వరి

ఒంగోలు, మార్చి 5: త్వరలోనే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలీయమైన శక్తిగా తయారుకానుందని ఆ పార్టీ జాతీయ మహిళా మోర్చా ఇన్‌చార్జ్ దగ్గుబాటి పురంధ్రీశ్వరి అన్నారు. శనివారం ఒంగోలులోని బిజెపి కార్యాలయంలో ఏర్పాట్లు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ప్రధాని నరేంద్రమోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రత్యేక దృష్టిసారించారని తెలిపారు. ఎపిని అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. రాష్ట్ర విభజనకు ముందు నవ్యాంధ్రలోని 13 జిల్లాల్లో రెండు లక్షల సభ్యత్వాలు ఉంటే ప్రస్తుతం 25 లక్షలకు పైగా పెరిగాయన్నారు. ప్రధానంగా కార్యకర్తలు, జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కృషితో పాటు ప్రధాని నరేంద్రమోదీ అమలుచేస్తున్న అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై విస్త్రృతంగా తమ పార్టీ సభ్యత్వాన్ని తీసుకుంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న అనేక పథకాలు, వేల కోట్ల రూపాయల నిధులను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్త్రృతంగా తీసుకెళ్లేందుకు ఈనెల 6వ తేదీన రాజమహేంద్రవరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇటీవల రాజధాని అమరావతిలో జరుగుతున్న భూదందాపై విలేఖర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాజధాని ప్రాంతంలో అధికార పార్టీ నేతలు భూదందాకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తోందన్నారు.

అసైన్డ్ భూముల
క్రయ విక్రయాలు చెల్లవు

విజయవాడ, మార్చి 5: జీవో నెంబర్ 41, పేరా 4 ప్రకారం అసైన్డ్ భూములు ఎప్పుడు ఎవరు అమ్మినా, కొన్నా చెల్లవని, ఆ భూములు ప్రభుత్వ పరమవుతాయని మంత్రి నారాయణ అన్నారు. శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ 2014 డిసెంబర్ 8 ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన ప్రకారం ఎక్స్ సర్వీస్‌మెన్, పొలిటికల్ సఫరర్స్, ఫ్రీడమ్ ఫైటర్స్‌కు చెందిన భూములకు ల్యాండ్ పూలింగ్ నియమాలను అనుసరించి 1000 గజాల రెసిడెన్షియల్, 200 గజాల కమర్షియల్, జరీబులో ఉండే భూమికి 1000 గజాల రెసిడెన్షియల్, 450 గజాల కమర్షియల్ భూమిని పరిహారంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. అదే సమయంలో అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్‌కి ఇచ్చిన వారికి మెట్టలో 800 రెసిడెన్షియల్, 100 కమర్షియల్ ల్యాండ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. లింగాయపాలెం, నేలపాడు, వెలగపూడి, పిచుకలపాలెం గ్రామాల్లో 194 ఎకరాల అసైన్డ్ భూమిని అనుభవిస్తున్న కొంతమంది (శివాయి జమిందార్స్) తమ పేరిట రిజిస్టర్ చేయాలని 1974 నుండి పోరాడుతున్నారన్నారు. 1994లో వీరి పేరిట రిజిస్టర్ చేయడానికి ప్రభుత్వం అంగీకరించినా, కొన్ని సాంకేతికపరమైన కారణాలతో నిలిచిపోయిందన్నారు. మళ్లీ ఇప్పుడు వారంతా తమ జీవనభృతి పోతుందని రాజధాని ప్రకటించిన నాటి నుండి ప్రభుత్వానికి విన్నవించుకుంటూనే ఉన్నారన్నారు. జీవో 41 ప్రకారం ఎప్పుడు ఎవరు అసైన్డ్ భూములు అమ్మినా, ఎవరు కొన్నా అవి చెల్లవన్నారు.

నేడు ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు

ఖమ్మం, మార్చి 5: దాదాపు ఐదేళ్ల అనంతరం ఖమ్మం కార్పొరేషన్‌కు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. గత నెల 24వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించగా, 26న ఉపసంహరణ జరిగింది. కార్పొరేషన్‌లోని 50 డివిజన్లలో 2,65,710 మంది ఓటర్లుండగా, మొత్తం 291 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 265 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. వివిపిటి పద్ధతి ద్వారా 43 చోట్ల వేసిన ఓటును సరి చూసుకునేందుకు ప్రింటర్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్‌ను అందుబాటులో ఉంచారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఓటర్ స్లిప్పు అనే యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌ను సెల్‌ఫోన్‌లో కూడా ఉపయోగించుకోవచ్చన్నారు. పోలింగ్‌ను పరిశీలించేందుకు 10 ఎంసిసి టీమ్స్‌తో పాటు, అదనంగా 10 టీమ్‌లు ఏర్పాటు చేశారు. 5 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఎప్పటికప్పుడు పోలింగ్ కేంద్రాలను సందర్శించనున్నాయి. ఓటింగ్ సరళిని అన్ని చోట్ల కూడా వీడియో తీయనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. అన్ని కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఖమ్మం కార్పొరేషన్‌ను కైవసం చేసుకునేందుకు ఆయా రాజకీయ పార్టీల నేతలు తమదైన వ్యూహాలు రచించారు. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా రాజకీయ పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఒక పార్టీ అభ్యర్థి ఓటుకు వెయ్యి రూపాయలు ఇస్తే, మరో పార్టీ అభ్యర్థి 2వేలు ఇచ్చారు.
కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి
పెడన, మార్చి 5: కృష్ణా జిల్లా నందమూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6, 7 తరగతుల విద్యార్థినులను లైంగికంగా వేధిస్తుండటంతో గ్రామస్థులు ఓ ఉపాధ్యాయుడిని చితక బాదారు. ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. సర్పంచ్ పరసా రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. కొలుకుల హనుమంతరావు నెలరోజుల క్రితం పెడన హైస్కూల్ నుంచి నందమూరుకు బదిలీపై వచ్చాడు. 6, 7 తరగతుల బాలికలను ఈయన తరచూ లైంగికంగా వేధిస్తున్నాడు. బాలికలు విషయాన్ని పెద్దలకు చెప్పడంతో రంగప్రవేశం చేసి ఉపాధ్యాయుడిని చితకబాదారు. సర్పంచ్ రాంబాబు, డివైఇఓ గిరికుమారి, ఎంఇఓ ఖాజీ బాషా, ఇతర పెద్దలు పాఠశాలకు చేరుకుని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. ఉపాధ్యాయుడు తప్పును అంగీకరించి క్షమాపణ చెప్పిన హనుమంతరావు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించటంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ ఉపాధ్యాయుడు ఇటీవల కాల్‌మనీ వ్యవహారంలో కూడా నిందుతుడు. అరెస్టయ్యాడు కూడా. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ గణేష్ కుమార్ వివరించారు.
సాగర్‌లోకి పదివేల క్యూసెక్కుల నీరు
విజయపురిసౌత్, మార్చి 5: శ్రీశైలం జలాశయం నుండి నాగార్జునసాగర్ జలాశయానికి శనివారం సాయంత్రం పది వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. సాగర్ కుడి కాలువ ఆయకట్టు పరిధిలో మంచినీటి సమస్య తీర్చేందుకు కృష్ణా రివర్ బోర్డు 2.5 టిఎంసి నీటిని విడుదల చేయడానికి నిర్ణయించింది. కుడి కాలువ ద్వారా రోజుకు ఆరు వేల క్యూసెక్కుల నీటిని ఎన్‌ఎస్‌పీ అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటి మట్టం 507.60 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఇది 127.6227 టీఎంసీలకు సమానం. కుడి కాలువ ద్వారా 6158 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 800 క్యూసెక్కులు, టోటల్ అవుట్‌ఫ్లోగా 6958 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 820 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఇది 40.8170 టిఎంసిలకు సమానం. సాగర్ జలాశయం నుండి ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రస్తుతం సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
హోదా కోసం 12న చలో ఢిల్లీ: టిఎస్సార్
విశాఖపట్నం, మార్చి 5: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాజ్యసభ సభ్యులు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి వెల్లడించారు. శనివారం విశాఖలోని విలేఖరులతో మాట్లాడుతూ ఎపికి ప్రత్యేక హోదా వర్తింపచేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.15వేల కోట్ల నిధులు కేటాయించాలని, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీకి పూర్తి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి, లోటు బడ్జెట్‌కు నిధులు ఇవ్వాలన్నారు. ఏపి పునర్విభజన చట్టంలోని అన్ని అంశాలను తక్షణం అమలు చేయాలంటూ కోటి సంతకాలు సేకరించామన్నారు. ఈనెల 14న పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి నాయకత్వంలో విజయవాడ నుండి ఎపి ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి చేరుకుని ప్రధాని నరేంద్రమోదీ, రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసి కోటి సంతకాల జాబితా అందజేస్తామన్నారు. ఐదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ చెబితే పదేళ్ళు కావాలంటూ బిజెపి అడ్డుపడిందని, అటువంటిది ఇప్పుడు ఆ ఊసెత్తకపోవడం విచారకరమన్నారు.
కర్నూలు ఎమ్మెల్యే స్కార్పియో కారు చోరీ
కర్నూలు, మార్చి 5: కర్నూలు వైకాపా ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు స్కార్పియో వాహనంతో పాటు రూ. 20 వేల నగదు అపహరించినట్టు కర్నూలు 2వ పట్టణ పోలీసులు శనివారం కేసు నమోదు చేసుకున్నారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు, పనివారు నిద్రిస్తున్న సమయంలో ఇంటి బయట ఉన్న సిసి కెమెరా పని చేయకుండా చేసి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి ఆవరణలోకి చొరబడ్డారు. ఇంటి వెనుక భాగంలోని పడక గది కిటికీ గ్రిల్ తొలగించి లోపలికి ప్రవేశించి స్కార్పియో, ఫార్చునర్ వాహనాల తాళాలు తీసుకున్నారు. అయితే మొదట ఎమ్మెల్యే ఫార్చునర్ కారును అపహరించేందుకు ప్రయత్నించి విఫలమై స్కార్పియో వాహనంతో పాటు రూ. 20 వేల నగదు ఎత్తుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే ఎస్వీ అన్న కుమారుడు ఎస్వీ గౌతమ్‌రెడ్డి 2వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వెంటనే సిఐ ములకన్న ఎమ్మెల్యే ఎస్వీ ఇంటికి వెళ్లి చోరీ జరిగిన తీరును క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించారు. గౌతమ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సిఐ తెలిపారు. దొంగలు తీసుకెళ్లిన వాహనాన్ని 4 రోజుల క్రితమే కొనుగోలు చేసినట్లు సమాచారం. ఎమ్మెల్వే ఎస్వీ ఇంట్లో జరిగిన చోరీ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది.