పర్యాటకం

భక్తులకెపుడూ అది ఆనందనిలయమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేంకటాద్రితో సమానమైన స్థలం కానీ, వేంకటేశ్వరునితో సమానమైన దైవం గానీ బ్రహ్మాండంలో ఇంతకుముందు లేరు, ఇక భవిష్యత్తులోను ఉండబోరు. అంతటి మహాపురుషుడు, విశేషం కలిగిన శ్రీ వేంకటేశ్వరుడు పిలిచిన భక్తలకు, ఆపన్నులకు కొంగుబంగారమై వెలుగొందుతు అందరి కోరికలను తీరుస్తున్నారు. చిన్న, పెద్ద, ధనిక, పేద, కులం అనే తారతమ్యాలు మనుషులమైన మనకు వున్నాయేమో కానీ, సర్వాంతర్యామి అయిన స్వామివారికి భక్తులందరూ సమానమే. మన రాష్ట్రంనుంచేకాక, ఇతరరాష్ట్రాలు, విదేశాలనుంచి కూడా ఎందరో భక్తకోటి శ్రీవారి దర్శనార్ధం తిరుమల తిరుపతికి వేంచేస్తుంటారు. క్షణకాల దర్శనం వారిలో స్వామివారిపట్ల భక్తి శ్రద్ధలను మరింత పెంచుతుంది. స్వామివారు తిరుమల కొండలలో ఎన్నో శతాబ్దాల క్రితం స్వయంభువుగా వెలిశారు.
ఆనాటి కాలంలో తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లాలంటే సరైన బాట వుండేది కాదు. నడిచి వెళ్లాల్సి వచ్చేది. వెళ్లడానికి మెట్లు వంటివి కూడా సరిగా వుండేవి కావు. స్వామివారి దర్శనానికి ప్రజలు గుంపులు గుంపులుగా కొండలు, గుట్టల వెంట నడుచుకుంటూక్రూరమృగాల బారిన పడకుండా మెల్లగా నడిచి వెళ్లేవారు.అలా వెళ్లి రావడానికి రెండు రోజుల సమయం పట్టేది. నడవలేని వారి కోసం, వయో వృద్ధుల కోసం డోలీలు వుండేవి. నలుగురు కలిసి ఈ డోలీలను మోసుకుని తీసుకువెళ్లేవారు. దీనికోసం పది అణాలు అద్దెగా వసూలు చేసేవారు. గత కొన్నాళ్ల క్రితం కల్యాణ కట్ట వున్న ప్రదేశంలో తిరుమలలో రావిచెట్టు వుండేది. అక్కడే డోలీలను నిలుపుకునేవారు. భక్తులు అక్కడినుండి సన్నిధి వీధి మీదగా గుడి చేరుకుని మహాద్వారం గుండా నేరుగా వెళ్లి స్వామివారిని దర్శించుకునేవారు. 1870లో భక్తుల సౌకర్యార్ధం కొండమీదకు సులువుగా వెళ్లేందుకు సదుపాయం కలిగింది.
సుమారు వంద సంవత్సరాల క్రితం కొండపైన శ్రీవారి ఆలయం, హాథీరాంజీ మఠం తప్ప మరేమీ వుండేవి కావు. అర్చకులుకూడా కొండ కింది భాగం కొత్తూరు లో వుండేవారు. ఈ కొత్తూరు అళ్ళారు తీర్థం (ప్రస్తుతం కపిల తీర్థం) సమీపంలో వుండే గ్రామం. ఇక్కడ శ్రీవారి పూజ కైంకర్యాలను చేసే వైష్ణవ ఆచార్యులు వుండేవారు. గోవిందరాజ స్వామి వారి గుడి చుట్టు నాలుగు మాడవీధులుండేవి. ఆ తరువాతి కాలంలో కొత్తూరు, ఈ ప్రాంతంతో కలిసిపోయి తిరుపతిగా మారింది. 1886లో తిరుపతి పురపాలక సంఘంగా రూపాంతరం చెందిన నాటికి తిరుపతి జనాభా 3500 మాత్రమే.
ఒకనాడు తిరుపతిలో నాలుగైదు వీధులుమాత్రమే వుండేవి. అవి అనంతవీధి, కాపువీధి, గాలి వీధి, బండ్ల వీధి, మంచాల వీధి. తిరుపతి ప్రాంతంలో చాలా చెరువులు కూడా వుండేవి. అన్ని కాలాలలోను కపిల తీర్థంలో నీరు పారుతు వుండేది, ఎందుకంటే అప్పటికి నీటి కొరత వుండేది కాదు. 1893 తిరుపతి రైల్వేస్టేషన్ ప్రారంభమైంది. ప్రస్తుతమున్న వెస్ట్ స్టేషన్ తిరుపతి రైల్వే స్టేషన్‌గా వుండేది. అప్పట్లో మీటర్ గేజ్ వుండేది. తిరుపతి నుండి కాట్పాడి, విల్లుపురం, మదరాసులకు మూడు రైళ్లు నడిచేవి. 1957లో గూడూరు-రేణిగుంట మార్గం, 1966లో తిరుపతి-రేణిగుంట మార్గం బ్రాడ్ గేజ్‌గా మార్పు చేయబడ్డాయి. 1964లో తిరుపతి టిటి ప్రాంతంలో మరొక రైల్వేస్టేషన్ ఏర్పడింది. అప్పడు వేంకటేశ్వరుని దర్శనం కోసం ప్రయాస పడినా స్వామిని దర్శించి సంతోషంగా తిరుగుప్రయాణం అయ్యేవారు. నేడూ స్వామి దర్శనానికి ఆధునిక సదుపాయాలను ఉపయోగించుకొంటూ వచ్చి స్వామి దర్శనంతో సంతోష తరంగాలలో తేలియాడుతూ తిరుగు ముఖం పడ్తున్నారు భక్తులు.

- రామకృష్ణ