మెయిన్ ఫీచర్

శివపార్వతులు.. ఆదిదంపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివోహం

శివనామ స్మరణం సకల పాపహరణం. పంచాక్షరి పఠనం శ్రేయోదాయకం. ఇవాళ మహాశివరాత్రి. దేశమంతటా భోళాశంకరుడి నామస్మరణ ఈ క్షణాన మారుమోగుతుంది. లోకకల్యాణంకోసమే శివపార్వతుల కల్యాణం జరిగింది. కుమారసంభవంతోనే లోకం సుఖశాంతులతో వర్థిల్లుతుంది కనుక ఆదిదంపతులు ఒక్కటవ్వాలని దేవతలూ ఎదురుచూశారు. ఇక తెలుగునాట శివక్షేత్రాలకు కొదువలేదు. శివరాత్రికోసం నలుమూలలా ఈ క్షేత్రాలు ముస్తాబయ్యాయి. జాగరణకోసం భక్తులు సిద్ధమయ్యారు. ఆదిదంపతుల కల్యాణాన్ని తిలకించేందుకు సిద్ధమయ్యారు.
శివరాత్రి సందర్భంగా ఈ ప్రత్యేకం అందిస్తున్నాం.

మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి పర్వదినం. శివుడు లింగోద్భవుడైన శుభసమయం. ఆనాడు ఉపవాసం, జాగారం, అభిషేకం, పూజాదికాలలో నిమగ్నమై శివభక్తితత్పరులౌతారు భక్తజనం. శివపార్వతుల కళ్యాణాన్ని చేసి తరించేవారు కొందరైతే చూచి పరవశించేవారు మరికొందరు. అభిషేకాదులతోపాటు శివపార్వతుల కళ్యాణం కూడా ఘనంగా జరుగుతుంది. వీరి కళ్యాణం లోకానికి శుభాలతోపాటు చక్కని ఆదర్శాన్ని కూడా చాటుతుంది. శివుడు అర్ధనారీశ్వరుడు. ఇంతకుమించి ఆదర్శ దాంపత్యానికి మరో నిర్వచనమేముంటుంది? సహధర్మచారిణి, సహ ధర్మవర్తిని, అర్ధాంగి మొదలైన పదాలకు మారుపేరుగా నిలిచిన జంట శివపార్వతుల జంట. వారు ఆది దంపతులు, సనాతన దంపతులు. వాగర్ధములవంటివారు.
‘‘వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే, జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ’’ అని స్తుతించబడినవారు, సర్వమంగళ అయిన పార్వతి జగజ్జనని కాగా, సకల శుభంకరుడు శంకరుడు జగత్పిత. అటువంటి వీరి ఆశీస్సులు నూతన వధూవరులకు అందించాలన్న ఉద్దేశంతోనే పెళ్ళి సమయంలో వధువు చేత గౌరీపూజను చేయిస్తారు.
వివాహానంతరం పది కాలాలపాటు సౌభాగ్యంతో విలసిల్లడానికి గాను మంగళగౌరీ వ్రతాన్ని చేయిస్తారు. రుక్మిణీదేవి శ్రీకృష్ణుని రాకకు ముందు
‘‘మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతుగదమ్మ, మేటి పెద్దమ్మ’’ అని సంభావిస్తూ ‘‘హరింపతిం చేయంగదమ్మ రుూశ్వరీ’’ అని పార్వతిని ప్రార్థించి శ్రీకృష్ణుణ్ణి చేపట్టింది. పార్వతీదేవి పాతివ్రత్య మహిమ నిరుపమానమైనది.
పార్వతీదేవి మేనకాహిమవంతుల పుత్రిక. శివుణ్ణి పతిగా పొందగోరి తీవ్రమైన తపస్సును చేసింది. తపస్సుకు ముగ్ధుడైన శివుడు కపటవటుని రూపంలో పార్వతి తపస్సు చేస్తున్న చోటుకు వస్తాడు. విశ్రాంతిని కోరి వచ్చిన వాడిలా వున్న ఆ మాయా బ్రహ్మచారిని పార్వతీదేవి చెలికత్తెల సహాయంతో అతిథి పూజలను చేస్తుంది. కపట వటుడు ‘‘నీకు కావలసిన పూలు, దర్భలు మొదలైన పూజాద్రవ్యాలు, నీళ్ళు, నివ్వరి ధాన్యం, చక్కగా సమకూరుతున్నాయా? జంతువులు నీ తపస్సుకు ఎలాంటి ఆటంకమూ కలిగించడం లేదుకదా! శరీరమాద్యం ఖలు ధర్మసాధనం’’ అని కుశల ప్రశ్నలు వేస్తూ, మాటలు కలుపుతూ ‘‘సఖ్యం సాప్తపదీనం’’ అని చెబుతూ నీకు నేను సఖుని వంటివాడను. నీ ‘‘తపస్సుకు కారణమేమిటి? అని అడుగుతాడు. అయినా నీవు తలచుకుంటే లభ్యపడనివి ఏవీ వుండవు కదా! రత్నం ఒరులచేత అనే్వషింపబడుతుంది కానీ ఒరులను అనే్వషించుకదా అని పలికి ఒకవేళ నీవు వివాహమే కోరి కనుక తపస్సు చేస్తున్నట్లయితే నేను బ్రహ్మచారిని.
నీవు కన్యవు, నీకు అంగీకారయోగ్యమైతే నన్ను వివాహమాడు! లేదా తపస్సుపైన ఆపేక్షతో చేస్తున్నట్లయితే నా తపస్సులోని సగ భాగం నీకు ఇచ్చేస్తాను. తపస్సును మానివేయమంటాడు, అప్పుడు పార్వతీదేవి చెలికత్తెలు పార్వతి శివుణ్ణి పెండ్లాడగోరి తపస్సు చేస్తున్నదన్న విషయాన్ని తెలిపారు. శివుడు పకపకా నవ్వి ‘‘మీ సఖియ వివాహవేళలో శివుని మెడలోని పాములు బుస్సుమంటూ మీదకు వాలినట్లయితే ఆమె ఎంత భయపడుతుందో కదా! అని శివుని లక్షణాలను వివరిస్తాడు, ‘‘ఎప్పట్టుననయిన శివుని బైసి ఎఱుంగదాదు భామినీ’’ అని శివుని పుట్టుక కూడా ఎవరికీ తెలియదు. అతని వస్త్రాలు చూస్తే అతనికి గల సంపద ఏమిటో తెలుస్తున్నది, మీ సఖికీ, శివునికీ అసలు సాద్యమే లేదు, ఈమె పట్టుచీరలకు- తోలు వస్త్రాలకు, హరిచందనానికి- బూడిదకు, చక్కని ముత్యాలహారాలకు- పెద్ద పాముల వరుసలకూ ఎక్కడైనా పొసగుతుందా? అవి సరియైన జత అనిపిస్తాయా? అని వేళాకోళం చేస్తాడు. పైగా శ్మశానంలో వుంటూ, భిక్షాటన చేస్తూ వుంటాడు అని పరిహాసంగా పలుకుతున్న మాయాబ్రహ్మచారి మాటలను విని శివనింద భరించలేకపోయిన పార్వతి వెంటనే కోపావేశంతో అతణ్ణి పంపించి వేయమని చెలికత్తెలతో పలుకుతుంది. అప్పుడు కపట వటుడు శివుడిగా సాక్షాత్కరిస్తాడు.
ప్రియమైన వాక్యాలతో అనునయిస్తాడు, పార్వతి చెలికత్తెలయిన జయవిజయల చేత తన తండ్రి అనుమతిని తీసుకోవలసిందిగా చెప్పిస్తుంది. ఈ విధంగా పార్వతి తపస్సు యొక్క లక్ష్యం నెరవేరింది.
శివపార్వతుల పరిణయానికి ప్రధాన భూమికగా నిలిచిన ఈ ఘట్టంలో మనకు ఎన్నో విశేషాలు కనిపిస్తాయి. పార్వతీదేవి తలచుకుంటే, శివుడు తలచుకుంటే సాధ్యంకానివి ఏవీ వుండవు. కానీ పార్వతి కఠోరమైన తపస్సుచేసి శివుణ్ణి పొందాలనుకున్నది. పట్టుదలతో సాధించాలనుకున్నది. శ్రమకు కూడా భయపడలేదు. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి వుంది. ఆకులు తిని అపర్ణ అయింది. తన సంకల్పాన్ని నెరవేర్చుకునే ప్రయత్నంలో మిక్కిలి ధీరత్వాన్ని కలిగి వున్నది. తాను కోరిన శివుడు ప్రత్యక్షమై పెళ్ళాడతానని చెప్పినప్పుడు వెంటనే అంగీకరించకుండా మనోనిగ్రహంతో, సంయమనంతో వ్యవహరించింది. తన తండ్రి అనుమతిని తీసుకోవాలని కోరింది. పితృభక్తిని విడిచిపెట్టలేదు. అంతటి ఉదాత్తమైన స్వభావం పార్వతీదేవిది. శివుడు తపస్సుపైన అనురక్తుడైనాడు. శివుని ద్వారా లోకానికి ఉపకారం జరగవలసి వుంది.
తారకాసురుడి ఆగడాలను అరికట్టాలంటే శివపార్వతుల సంతానంవల్ల మాత్రమే సాధ్యమవుతుందని తెలుసుకున్న దేవతలు శివపార్వతుల కళ్యాణంకోసం ఎదురుచూశారు. కుమారసంభవ కథ ఆ విధంగానే ప్రసిద్ధిని పొందింది. చివరకు శివుడు పార్వతీదేవిని చేపట్టడం, కుమారస్వామి జననం, తద్వారా లోక కళ్యాణమూ జరిగాయి. శివపార్వతులు సకల జనులకూ, సర్వకాల సర్వావస్థల్లోనూ సకల శుభాలనూ అనుగ్రహిస్తూ వుంటారు.
‘‘మాతాచ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః
బాంధవాః శివభక్తాచ స్వదేశో భువనత్రయం’’.

- కె.లక్ష్మీఅన్నపూర్ణ