Others

మానవతావాది బసవన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జన్మలన్నింటిలో మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైనది. దీనిని సఫలం చేసుకోవడానికై ప్రతి ఒక్కరు విశేషమైన కృషి చేసి తీరాలి. అలా తన జన్మను సార్ధకం చేసుకున్న విశిష్ట పురుషులలో బసవేశ్వరుని పేరు తప్పక చెప్పుకోవాలి. నేటికి 848 సంవత్సరాల క్రితం కర్నాటక సామ్రాజ్యంలో బాగేవాడి హింగుళేశ్వర అగ్రహారంలో మాదిరాజు,మాదాంబిక అనే సనాతన బ్రాహ్మణ దంపతుల ముద్దుబిడ్డగా పెరిగిన బసవేశ్వరుని భావాలను అప్పట్లో ఎవ్వరూ గ్రహించలేకపోయారు. సమాజంలో కులమతాల పేరుతో అలుముకున్న కారు చీకట్లను తొలగించి నవ సమాజ నిర్మాణానికై అవిరళ కృషి చేసి సత్ఫలితాలను అందించిన బసవేశ్వరుని జీవిత చరిత్రను గ్రంథస్తం చేయతలపెట్టిన తొలి వ్యక్తి తెలుగువాడైన భీమకవి అని గర్వంగా చెప్పుకోవాలి. భీమకవి రచనల ఆధారంగా మిగతా కవులు బసవేశ్వరుని జీవితాన్ని పురాణాలుగా రాసారు.
నిజం చెప్పాలంటే బసవేశ్వరుని జీవితం ఆద్యంతం అద్భుతమేనని చెప్పక తప్పదు. ఆయన మాటలు వచనాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆయన ప్రభావంతోనే పాల్కురికి సోమనాధుడు పలు విశేష రచనలు గావించారు. తెలుగులో మొట్టమొదటి దేశి పురాణం బసవ పురాణమే. అలాగే మొదటి శతకం వృషాధిప శతకం. ఈ రెండు సోమనాధుడు రచించనవే. సోమనాధుడు బసవేశ్వరుని రెండవ శంకరుడు అంటూ కొనియాడాడు.
పనె్నండవ శతాబ్దంలోనే కులరహిత సమాజాన్ని ప్రబోధించి ఆచరించి చూపిన ఆదర్శ శీలి ఆయన. కోమటి శిరియాళుని, రజకుడగు మాచయ్యను, సమాజం చండాలుడంటూ వేలెత్తి చూపిన చెన్నయ్యను, బాలిక అయిన గొడగూచిని, స్ర్తి అయిన అక్కమహాదేవిని కుల, బాల, స్ర్తి, పురుష బేధం ఎంచకుండా వారికి శివభక్తి ప్రస్థానంలో ఒక మహోన్నత స్థానం కల్పించాడు. సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడై వుండి కూడా కులాలు కేవలం మానవుడు సృష్టించినవే అనీ, అధికులు, అధములు అన్నవి మనకే తప్ప శివుని దృష్టిలో అంతా సమానమే అని తెలియజెప్పిన మానవతావాది. అంతేకాదు అంటరానితనం మహాపాపమని చెప్పి అంటరానివారుగా పరిగణింపబడుతున్న వర్గీయుల ఇళ్లకెళ్లి వారితో కలిసి సహపంక్తి భోజనం చేసారు. బ్రాహ్మణ కన్యను హరిజన యువకునికి ఇప్పించి పెళ్లి జరిపించి అంటరానితనం అనే అంటువ్యాధి నిర్మూలనకై విశేష కృషి సల్పిన ఘనత బసవేశ్వరునికే దక్కింది. కుల బేధం లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో చిన్న శివలింగాన్ని పెట్టి భక్తి శ్రద్ధలతో లింగార్చన చేసుకోమన్నాడు. పరమేశ్వరుని ప్రతి ఒక్కరి ఎదపై నిలిచే లింగధారణ చేయించి హెచ్చు తగ్గు వర్గాల కుళ్లును కడిగేశాడు. ఎంత మాలిన్య హృదయమైనా పరమేశ్వర తత్త్వం పరిఢవిల్లితే సర్వం ఈశ్వరం అనే సత్యం కనపడుతుందని చాటి చెప్పిన మహా మనీషి బసవన్న.
ధనమే ప్రధానం అనుకునే వారు శివుని చేరుకోలేరు. ధనం దోచుకునే వాడే కాదు దాచుకునేవాడు కూడా దొంగేనన్న నిజాన్ని విప్పి చెప్పాడు. సర్వజీవుల యెడ దయకలిగి వుండాలి. దయగలవాడు దేవుడు. దయారహితుడు దానవుడు అన్నాడు.
సమాజంలో స్ర్తికి పురుషునితోపాటు సమాన హక్కులు కావాలని ప్రకటించి అందుకై అవిరళ కృషి చేసాడు. సత్యం, అహింస, భూతదయ గురించి ఎనె్నన్నో వచనాలు వచించాడాయన. సర్వమానవ సమానత్వానికై అనుభవ మంటపం అనే ఆదర్శ వేదాంత మండపాన్ని స్థాపించాడు. అందులో సర్వ కులజులు కూర్చుని వేదాంత చర్చలు సలిపి శివానుభూతి పొందేవారు. ‘నస్ర్తి స్వాతంత్య్ర మర్హతి’ అని మనుధర్మశాస్త్రం ఘోషిస్తుండగా దానినికాదని ఆ ధర్మ సూత్ర పగ్గాలను తెంచివేసి స్ర్తి జనోద్ధరణకై పెద్దపీట వేసిన ధీశాలి. స్ర్తి లేనిదే ఈ ప్రపంచం లేదు. లోకంలో స్ర్తి స్థానమే ప్రథమం. స్ర్తిని గౌరవించడం మన ధర్మం అంటూ సమాజానికి చాటిచెప్పాడు. మత కర్మ కాండల్లో, సామాజిక రంగంలో ఆడవారు ప్రధాన భూమిక పోషించాలని చెప్పాడు.
ఇలా ఆయన గురించి వేయి చెప్పడం కన్నా ఆయన గొప్ప మానవతా వాది, సంఘ సంస్కర్త, రాజనీతిజ్ఞుడు, సద్గుణ సంపన్నుడు, అసమాన మేధాశాలి అనడంలో ఏమాత్రం సందేహానికి తావులేదు. ఇది అక్షర సత్యం.

- ఎం.సి.శివశంకర శాస్ర్తీ