అర్చన

స్మరించినంతనే కరుణించే నారసింహుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ మహావిష్ణువు భక్తజనోద్ధరణార్థం భూలోకంలో రకరకాల రూపాలతో అవతరించాడు. ఈ అవతారాలు ఇరవై ఒకటైనా ముఖ్యమైన దశావతారాల్లో కొన్ని అంశావతారాలు. కొన్ని ఆవేశ అవతారాలు. కొన్ని పరిపూర్ణ అవతారాలుగా మహర్షులు అభివర్ణించారు. అన్నింటి కన్నా నాల్గవదైన ఆవేశ అవతారమైన నృసింహావతారం విశిష్టమైంది. విశేషమైం దీ. అదే ‘నర-సింహ’ రూపాల కలయిక.
‘మృగాలలో సింహాన్ని నేను’ అని భగవద్గీతలో కృష్ణ్భగవానుడు చెప్పాడు. కేవలం దుష్టశిక్షణ, శిష్ట రక్షణల కోసమే కాకుండా తన సర్వాంతర్యామిత్వాన్ని చాటిచెప్పే నృసింహావతారం ఎంతో విఖ్యాత మైన విభవాతారం. ఇది విష్ణువు యొక్క సర్వజ్ఞత, సర్వవ్యాపకత్వాలకు నిదర్శన రూపమైన పూర్ణావతారం.
విష్ణ్భుక్తిపరుడైన ప్రహ్లాదుడు దానవాధిపతియైన హిరణ్యకశిపుని కుమారుడు. దేవ, దానవ, మానవులవల్లగాని, భూమ్యాకాశాలలోగాని, అగ్ని జల వాయువులవల్లగాని, పక్షులు, జంతువులు మొదలైన జీవులవల్ల మృత్యువు లేకుండా బ్రహ్మచేత వరం పొందిన హిరణ్యకశిపుడు విష్ణుద్వేషి. అతడు ప్రహ్లాదుణ్ణి విష్ణ్భుక్తిరహితుణ్ణి చేయడానికి ఎన్నో రకాలుగా హింసించి విఫలుడయ్యాడు. ఇక చేసేది లేక ‘నీవు హరి స్మరణ మానావా?’ అని కుమారుడ్ని సౌమ్యంగా అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు చిరునవ్వుతో ‘‘జనకా! మీరు కూడా హరి స్మరణ చేస్తూనే ఉన్నారు కదా- ఎటొచ్చీ మీరు విరోధంతో హరిని స్మరిస్తూంటే, నేను భక్తితో స్మరిస్తున్నాను. మన మార్గాలు వేరుగాని గమ్యం ఒక్కటే’’ అన్నాడు. హిరణ్యకశిపుడు నిర్ఘాంతపోయాడు. అతడికి నోట మాట రాలేదు. ‘నిజంగా నేను హరిస్మరణ చేస్తూనే ఉన్నాను’ అని మనసులో అనుకున్నాడు. ప్రహ్లాదుడు చెప్పినట్టు నవవిభ భక్తులే కాక వైర భక్తి కూడా ఉంది. వైరంతో కొందరు సదా పరమాత్ముని స్మరిస్తూనే ఉంటారు. కంసుడు, శిశుపాలుడు మున్నగువారు వైర భక్తితో ముక్తిని పొందారని శాస్త్ర వచనం.
కొంతసేపటికి తేరుకున్న హిరణ్యకశిపుడు కుమారునితో ‘‘నిరంతరం నీవు స్మరించే ఆ హరి ఎక్కడున్నాడో? నా ఆగర్భ శత్రువును చూపి తండ్రి రుణం తీర్చుకో!’’ అన్నాడు లాలనగా. దానికి ప్రహ్లాదుడు ‘‘జనకా! హరి లేని చోటు లేదు. మీరు చూడాలనుకున్న చోట తప్పక ఉంటాడు. మీదే ఆలస్యం!’’ అని జవాబిచ్చాడు. ఆ సమాధానానికి ఉగ్రుడైన హిరణ్యకశిపుడు, ఆ సభా భవనంలో ఉన్న పెద్ద స్తంభాన్ని ప్రహ్లాదునికి చూపుతూ, ‘‘ఈ స్తంభంలో నీ హరి ఉన్నాడా?’’ అంటూనే తన గదతో ఆ స్తంభాన్ని మోదాడు. మరుక్షణం ఆ స్తంభం నుండి మహోగ్రరూపంతో ఉద్భవించిన నృసింహస్వామి- హిరణ్యకశిపుడు బ్రహ్మ నుంచి పొందిన వరానికి భంగం కలగకుండా అతన్ని ఒడిసిపట్టుకొని తన తొడలపై అడ్డంగా పడవేసుకుని, వాడియైన గోళ్ళతో హృదయాన్ని చీల్చివేశాడు.
ఈ లోకంలో అణువణువునా తాను ఉన్నాననీ, భక్తులు పరిశుద్ధమైన మనస్సుతో తనను స్మరిస్తే చాలు తక్షణం వచ్చి వారి కష్టాలు నివారిస్తాననీ, దుష్టులు ఎంత శక్తిమంతులైనా దైవబలం ముందు నిలువలేరనీ, తన భక్తుల పరాజయాన్ని ఎంతమాత్రం సహించేది లేదనీ నృసింహస్వామి నిరూపించాడు.హిరణ్యకశిపుని వధానంతరం భీకర రౌద్రపూరితమైన నృసింహుని బ్రహ్మరుద్రులు, దేవేంద్రాది దేవతలు సైతం శాంతింపచేయలేకపోయనా తన భక్తుడైన ప్రహ్లాదుని చేతనే స్తుతించబడి శాంతించాడాయన. కరుణ, వీర రసాల సమ్మిళితమైన శ్రీ నృసింహుని ఆకారం ఎంత భయంకరమో, హృదయమంత భక్తవశీకరం. నృసింహోపాశన చాలా విశిష్టమైనది. నృసింహ ఆరాధనగాని, నామస్మరణ అత్యంత సత్ఫలితాలను ఇస్తుంది. సకలారిష్టాలను పోగొట్టి, సర్వాభీష్టాలను నెరవేరుస్తుంది. ప్రహ్లాదుడు, అన్నమయ్య, ఆదిశంకరులు, రాఘవేంద్రులు, త్యాగయ్య వంటి భక్తాగ్రేసురులెందరో నృసింహుని అర్చించి సకల శుభాలనూ పొందడమేగాక, భక్తవశీకరుడు నృసింహస్వామి అని ఆ సర్వాంతర్యామిని అనేక విధాలుగా కీర్తించారు.

- చోడిశెట్టి శ్రీనివాసరావు