పర్యాటకం

యాంజాల్ శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవద్‌ప్రభుః
భూతకృద్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః
శ్రీ విష్ణు సహస్రనామా స్రోత్రంలో మొదటి శ్లోకం ఇది. ఈ తొమ్మిది విష్ణునామాల్లో విష్ణు తత్వం బోధపడుతుంది. విశ్వమంతా వ్యాపించి ఉన్నవిశ్వవ్యాప్తుడు, సర్వాంతర్యామి మూడు కాలాలకు ఆయనే అధిపతి. సృష్టికర్త బ్రహ్మకు శక్తిని అందించినవాడు. విశ్వంలోని అన్ని ప్రాణులను రక్షిస్తున్నవాడు. అన్ని ప్రాణుల్లోని ఆత్మకు ఆత్మ ఆ దేవదేవుడు. కృతయుగం లేదా సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాలలో వేర్వేరు పేర్లతో భువిపై వెలిసినవాడు నారాయణుడు. కలియుగంలో చరాచర జగత్తును కాపాడేందుకు కలియుగంలో వెలిసిన దేవదేవుడే శ్రీవేంకటేశ్వరస్వామి. నారాయణుడి నిజరూపమే అధిదైవతం. దేవతలందరితో కూడిఉన్న తేజోవంతమైన రూపమే కలియుగదైవమైన శ్రీనివాసుడు. త్రేతాయుగంలో శ్రీరాముడిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా భువిపై జన్మించిన విష్ణుమూర్తి కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామిగా వెలిశాడు. విశ్వంలోని భక్తులను అలరిస్తున్న అవతారమిది. శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అనే ఏడుకొండలు ఆదిశేషుడి ఏడుతలలు. ఏడుకొండలవాడిగా భక్తులు భక్తిప్రపత్తులతో పిలుచుకునే శ్రీవేంకటేశ్వరుడు ఆనందనిలయంలో వేంచేసి భక్తులను అలరిస్తున్నారు. ఆ ఏడుకొండలకు వెళ్లి శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం అందరికీ వీలుకాకపోవచ్చు. భక్తసులభుడైన ఏడుకొండలవాడు భక్తులను అలరించేందుకు వేర్వేరు ప్రాంతాల్లో వేంచేసి ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో సహా దేశవిదేశాల్లో వేంకటేశ్వరుడి ఆలయాలను నిర్మించుకుని భక్తులు సేవించితరిస్తున్నారు.
తిరుమల నుండి ఏడుకొండలవాడు తరలివచ్చి తుర్క యాంజాల్‌లో శ్రీ ఆదివేంకటేశ్వరస్వామిగా పూజలు అందుకుంటున్నాడు. చాలా ప్రాంతాల్లో పద్మావతి-అలమేలుమంగ సహితంగా శ్రీనివాసుడి గుళ్లు ఉండగా, యాంజాల్‌లో శ్రీభూనీళా సమేత శ్రీఆదివేంకటేశ్వస్వామిగా భక్తుల కోరికలను నెరవేరుస్తున్నాడు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలంలోని తుర్క యాంజాల్ పరిధిలో ఆది వేంకటేశ్వర నగర్ (ఏవి నగర్) లో శ్రీభూనీళా సమేత శ్రీ ఆది వేంకటేశ్వరస్వామి కొలవై ఉన్నాడు. శ్రీ బాలాజీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్‌స్ట్రక్షన్స్ (శ్రీతిరుమల హౌజింగ్ ప్రైవేట్ లిమిటెడ్) చైర్మన్ నోముల అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివేంకటేశ్వరస్వామికి అధునాతన ఆలయం నిర్మించారు. చుట్టుపక్కల అనేక గ్రామాలు, కాలనీల నుండి భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తున్నారు. భక్తులను పెద్ద సంఖ్యలో అనుగ్రహిస్తున్న భాగ్యనగరంలోని వేంకటేశ్వరుడి ఆలయాల్లో ప్రధానంగా శ్రీభూనీళా శ్రీఆదివేంకటేశ్వరస్వామి ఆలయాన్ని చెప్పుకోవచ్చు. భూదేవి అంటే అందరికీ సుపరిచితమైన పేరు. నీళాదేవి అంటే శ్రీదేవి అని. మహాలక్ష్మి అవతారాలే భూదేవి, నీళాదేవి. తుర్కయాంజాల్‌లో వేంచేసిన భూనీళా శ్రీఆది వేంకటేశ్వరస్వామి విగ్రహాలను తిరుమల-తిరుపతి నుండి తెచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానాల (తితిదే) నుండి విగ్రహాలు రావడంతో ఈ ఆలయానికి అత్యంత ఆకర్షణ, శక్తి చేకూరింది.
ఆదివేంకటేశ్వరస్వామి ఆలయానికి 1996 సంవత్సరంలో శంకుస్థాపన చేసి, 1999 లో నిర్మాణం పూర్తి చేశారు. భగవత్ రామానుజుడి అవతారంగా భక్తులు భావిస్తున్న శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి పర్యవేక్షణలో 1999 నవంబర్ 27 న భూనీళా సహిత శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహాల ప్రతిష్టాపన జరిగింది.
ఆదివేంకటేశ్వరస్వామి ఆలయంలోకి వెళ్లగానే ప్రశాంతమైన వాతావరణంలోకి అడుగిడినట్టు ఉంటుంది. ఆలయంలో ఎడమవైపు వినాయకుడి ఆలయం నిర్మించారు. గణేశుడిని దర్శించుకున్న తర్వాత ఆదివేంకటేశ్వరస్వామిని భక్తులు దర్శించుకుంటారు. ప్రధాన గర్భాలయంలో శ్రీవేంకటేశ్వరస్వామి వేంచేసి ఉండగా స్వామివారికి కుడివైపు పద్మావతి, ఎడమవైపు ఆండాల్ అమ్మవార్ల ఆలయాలు ఉన్నాయి. గర్భాలయాన్ని ఆనుకుని విశాలమైన మండపం నిర్మించారు. వేంకటేశ్వరస్వామి మూలవిరాట్టుకు ఎదురుగా ప్రధానమండపం ప్రారంభంలో గరుడాళ్వార్లు వేంచేసి ఉన్నారు.
తిరుమలలోని ఆనందనిలయం నాలుగువైపులా ఉన్న మాడావీధుల తరహాలోనే ఇక్కడ కూడా ఆలయం చుట్టూ నాలుగువైపులా వీధులున్నాయి. ఈ వీధుల్లో స్వామివారు తరచూ ఊరేగుతారు. ఆలయంలో ఈశాన్యంవైపు యజ్ఞశాలను అత్యంత ఆధునాతనంగా నిర్మించారు. ఈశాన్య మూలలో పెద్దకోనేటిని నిర్మించారు. కోనేటిలో స్వామివారి ఉత్సవ విగ్రహానికి ఉత్సవాల సందర్భంగా చక్రస్నానం తదితర పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయం చుట్టూ హరితహారం తరహాలో ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు. వాయవ్యంలో ఉన్న అందమైన ఉద్యానవనంలో శ్రీకృష్ణుడి విహ్రాన్నీ ఏర్పాటు చేశారు.

......................
ఆలయానికి దారి
హైదరాబాద్‌లోని ఎల్‌బి నగర్‌కు 10 కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంది. సాగర్ రింగ్‌రోడ్డు నుండి ఇబ్రహీంపట్నం వెళ్లే మార్గంలో 9 కి.మీ. దూరంలో యాంజాల్ క్రాస్ రోడ్డు ఉంటుంది. ఈ క్రాస్ రోడ్డు నుండి కుడివైపు రెండుకిలోమీటర్ల దూరంలో టి.యాంజాల్ పరిధిలో స్వామి వారి ఆలయం ఉంది. జెబిఎస్, ఎంజిబిఎస్, కోఠి తదితర ప్రాంతాల నుండి సిటీబస్సులు చాలా ఉంటాయి. ఎల్‌బి నగర్, సాగర్ రింగ్‌రోడ్డునుండి షేరింగ్ ఆటోలు, ఆటోలు నడుస్తాయి.
....................
స్వామివారి ఆదేశం
మాధవసేవనే సర్వప్రాణిసేవ అంటూ చిన్నజీయర్ బోధనలకు అనుగుణంగా ముందుకు వెళుతున్నాం. ఆదివేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణాన్ని కలియుగదైవమే మాతో చేయించుకున్నారు. వార్షిక బ్రహోత్సవాల సందర్భంగా ముఖ్యమైన రోజుల్లో భక్తులకు ఉచిత భోజన సదుపాయం కల్పించాం. ఆలయం వెలుపల దాదాపు ఎకరా స్థలంలో కళ్యాణ మండపం నిర్మించాలన్న ప్రతిపాదన రూపొందించాము. దీని నిరాణాన్ని అందరి సహకారంతో పూర్తిచేస్తాము. ఆదివేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ముందుకు వెళుతున్నాం. దేవాలయంలో బ్రహ్మోత్సవాలతోపాటు ఆలయ నిర్వహణకు అందరి సహకారం తీసుకుంటున్నాం.
- నోముల అశోక్ కుమార్, మేనేజింగ్ ట్రస్టీ

- పి.వి. రమణారావు