మెయిన్ ఫీచర్

శ్రీరాముడు సకలైశ్వర్య సంపన్నుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమంతుని నోట శ్రీరాముని సౌందర్యం

హనుమంతుడు సీతతో ‘నేను రాముడు పంపగా మీ వద్దకు దూతనై వచ్చాను రామలక్ష్మణులు క్షేమంగా ఉన్నారు. మీ క్షేమమును తెలుసుకుని రమ్మన్నారు’ అన్నాడు.
సీత ఆ మాటలతో ఆనందించి హనుమంతునితో స్నేహం ప్రకటించింది. ఆనందించిన హనుమ సీత సన్నిధికి చేర ప్రయత్నించాడు. సీతకు సందేహం కలిగింది రావణుడే ఆ రూపంలో వచ్చాడని. ఆ సందర్భంలో హనుమ సీతతో తల్లీ! మీరు సందేహిస్తున్నట్టు నేను రావణుడను కాను, నా మాట నమ్ముము’ అంటాడు.
అప్పుడు సీత ‘నీకు రామునితో సంబంధం ఎక్కడ కలిగింది? నరులకు వానరులకు సంబంధమెట్లు ఏర్పడినది? రాముని చూసి ఉంటే అతని రూప లావణ్యములు ఎలా ఉంటాయి? వివరించు’మన్నది సీత.
‘‘దేవీ! నా అదృష్టముచే, మీకే తెలిసి ఉండి కూడ మీ భర్తను గురించి అడుగుతున్నావు. మీ సందేహాలన్నిటినీ నివృత్తి చేస్తాను. నేను గుర్తించిన రాముని లక్షణాలను వివరిస్తాను వినుము’ అన్నాడు హనుమంతుడు.
వాల్మీకి రామాయణంలో ముప్పది ఐదవ సర్గలో ఎనిమిదవ శ్లోకంనుంచి 21వ శ్లోకం వరకు హనుమంతుడు శ్రీరాముని సౌందర్యం వర్ణిస్తాడు.
‘రామః కమలపత్రాక్షః ‘రాముడు’ అని ప్రారంభించాడు. ప్రతీ వ్యక్తి రూపంలో మొదటగా ఆకర్షించేవి కన్నులు. శ్రీరాముని కన్నులు పద్మముల రేకుల వలె విశాలమైనవి. ‘సర్వసత్వ మనోహరః’ సమస్త ప్రాణుల మనస్సును ఆకర్షించే సౌందర్యం కలవాడు.
‘రూప దాక్షిణ్యసంపన్నః’ పుట్టుకతోనే రూపముతోను, దాక్షిణ్యముతోను, దాక్షిణ్యముతోను జన్మించాడు. ‘మర్యదానాంచలోకస్య కర్తా కారయితా చసః’ లోక మర్యాదలు తాను పాటిస్తూ ఇతరులచే ఆచరింపచేసేవాడు. అంటే పరమాత్మ స్వరూపుడు. ‘వేదాంత కృతి వేద విదేవ చాహం’ భగవద్గీత స్పష్టపరుస్తున్నది.
‘బ్రహ్మచర్యవ్రతే స్థితః’ బ్రహ్మ చర్య వ్రతంలో ఉన్నవాడు. నాలుగు విధాల బ్రహ్మచారుల్లో శ్రీరాముడు ప్రాజాపత్య బ్రహ్మచారి. ఋతుకాలమందే తన భార్యతో సంగమించువాడూ, పరస్ర్తి విముఖుడూ ప్రాజాపత్య బ్రహ్మచారి. విద్యాశీల సంపన్నుడు. వినయవంతుడు. సదాచార సంపన్నుడు. శతృభయంకరుడు. యజుర్వేద పారంగతుడు. వేదవేదాంగములలో నిష్ణాతుడు. పండితులచే పూజింపబడువాడు. దీర్ఘములైన బాహువులు, శంఖము వంటి కంఠము, శుభప్రదమైన ముఖము కలవాడు. ‘గూఢజత్రుఃసుతామ్రాక్షీః భుజసంధుల యొక్క ఎముకలు కనబడనివాడు, హెచ్చు తగ్గులు లేని శరీర ప్రమాణం కలవాడు. మేఘశ్యామ వర్ణంతో నిగనిగలాడు శరీర చ్ఛాయ కలవాడు. ప్రతాపశాలి. ‘త్రిస్థిరస్ర్తీ ప్రలంబశ్చ త్రితామ్రస్ర్తీషు చోన్నతః రొమ్ము, మణికట్టు, పిడికిలి ఈ మూడూ (త్రిస్థిరః) స్థిరముగా ఉన్నవాడు. ‘త్రిప్రలంబః’ కనుబొమ్మలు, భుజాలు, ముష్కములు, కేశములు మోకాళ్లు హెచ్చు తగ్గులు లేకుండా ఉన్నవాడు. నాభి, కడుపు కింది భాగము, వక్షస్థలము, పొడవుగా నుండి నేత్రాంతములు, గోళ్లు, అరచేతులు, అరికాళ్లు ఎరుపు వర్ణం కలిగి యుండును. సాముద్రిక శాస్త్ర రీత్యా వరాహ మిహిరుని శాస్తమ్రుననుసరించి ఇవన్నీ చక్రవర్తి లక్షణాలు. ఉదరము నందు, కంఠమునందు మూడు రేఖలు (వర్మిత్రయం) కలవాడు. ‘త్రపనతః’ పాదముల యందు మూడు నిమ్నరేఖలు; ‘చతుర్వ్యంగః’ గ్రీవం, జంఘం మొదలైన నాలుగు హ్రస్వములుగా, మూడు సుడులు కలిగిన శిరస్సు కలవాడు. అరచేతులలో అరికాళ్లలో నాలుగేసి రేఖలు కలవాడు. ఎనిమిది అడుగులు పొడవైన శరీరం కలవాడు. ‘చతుస్సమః’ నాలుగు అవయవాలు- బాహువులు, మోకాళ్లు, తొడలు, చెక్కిళ్లు సమముగా కలవాడు. కనుబొమ్మలు, నాసికా రంధ్రములు, కళ్లు, చెవులు, పెదవులు, స్తనాగ్రములు, మోచేతులు, మణికట్టులు, మోకాళ్లు, పిరుదులు, చేతులు, పాదములు, పిరుదులపై కండరము సప్రాణములో గలవాడు. సూదివలె మొనదేలిన నాలుగు దంతములకు పక్కన వున్న పండ్లు గలవాడు. నాలుగు మృగములు (సింహము, పులి, ఏనుగు, వృషభము) నడకవంటి నడక కలవాడు; అందమైన చుబుకము, పెదవులు, నాసిక కలవాడు. ‘పంచ స్నిగ్ధః’ - వాక్కు, ముఖం, గోళ్లు, చర్మం, రోమములు నునుపుగా కలిగినవాడు. ఇవన్నీ రాజుకు గల లక్షణములు.
‘దశపద్మః’ రాముని ముఖము, కళ్లు, నోరు, నాలుక, పెదవులు, దవడలు, స్థనములు, గోళ్లు, హస్తములు, పాదములు-ఈ పదీ పద్మముల వలె ఉండును. ‘దశబ్రహత్’ శిరస్సు, లలాటం, హస్తములు, పాదములు- ఈ పదీ పద్మమువలె ఉండును. ‘దశ బృహత్’ శిరస్సు, లలాటం, కర్ణము, వక్షస్థలం, మొదలైన పెద్ద అవయవాలు విశాలత కలిగి ఉండును. త్రిభిర్వ్యాప్తిః తేజస్సు, యశస్సు, సంపదలతో లోకమునందటినీ వ్యాపించినవాడు. ‘ద్విశుక్లవాన్’ అతని మాతా పితృవంశమవులు పరిశుద్ధమైనవి.
ఆరు అవయవాలలో ఎత్తుగలవాడు. ‘నవతనుః’ తలవెంట్రుకలు, మీసాలు, గోళ్లు, బుద్ధి, చూపు, చర్మము, లింగము, వ్రేళ్ల కణుపులు అను తొమ్మిదీ సూక్ష్మముగా ఉండును. అతడు పూర్వాహ్ణ, మధ్యాహ్ణ, అపరాహ్ణములయందు ధర్మ, అర్ధ కామములను సంపాదించుచుండును శ్రీరాముడు సకలైశ్వర్య సంపన్నుడు. సత్యము పలుకుట యందును, ధర్మాచరణమునందును, నిరతుడు. ధర్మమార్గమున ధనములనార్జించి పాత్రులకు దానము చేయువాడు. దేశ కాలములకు అనువుగా ప్రవర్తించువాడు. అందరితో ప్రియముగా మాటలాడువాడు. ఇలా హనుమంతుడు శ్రీరాముని గుణగణాలను సీతమ్మకు వివరించాడు.
ఇదీ శ్రీరాముని సౌందర్యం. మహారాజుకుండవల్సిన సాముద్రిక లక్షణాలన్నీ రామునిలో ఉన్నాయి. అందుకే శ్రీరాముని ‘పుంసాం మోహన రూపః’ అని వర్ణించారు. పురుషులను సైతం సమ్మోహింప చేసే రూపం శ్రీరామునిది. హనుమంతుడు శ్రీరాముని సౌందర్యాన్ని వర్ణించడంతో సీతమ్మ ఆనందంతో పరవశించింది.
‘పుంసాం మోహన రూపాయ శ్రీరామచంద్రాయ మంగళం’

- ఎ.సీతారామారావు