మెయిన్ ఫీచర్

అమెరికాలో హిందూ సంస్కృతీ సౌరభం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాలో చూడదగిన ప్రదేశాల్లో ప్రధానమైనవి దేవాలయాలు. అమెరికాలోని అన్ని ప్రధాన నగరాలో హిందు సంస్కృతి - సాంప్రదాయాలకు నిలయమైన అనేక దేవాలయాలు మన తెలుగువారు నెలకొల్పారు. పిట్స్‌బర్గ్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సాక్షాత్తు తిరుమల దేవాలయంతో పోల్చడం అందరికి తెలిసిన విషయమే. అమెరికాలోని పలు ప్రాంతాల్లో పిట్స్‌బర్గ్‌కు దీటుగా దేవాలయాలు వెలిశాయి. సిన్స్ నాటిలో, డేటన్‌లో వున్న దేవాలయాలను చూశాం. పిట్స్‌బర్గ్‌కు వెళ్లినప్పుడు అక్కడున్న సాయిబాబా గుడిని కూడా చూశాం. అవి ఏవీ కూడా మన దేశంలోని పురాతన దేవాలయాలకు తీసిపోవు. పూజా-పునస్కారాలు కూడా శాస్త్రోక్తంగా, పాండిత్యం తెలిసిన అర్చకులే నిర్వహిస్తుంటారు. అన్నింటికన్నా విశేషం, మన మతాన్ని గౌరవిస్తూ, మన దేవాలయాల నిర్మాణానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా అమెరికన్ ప్రభుత్వం రక్షణ కలిగించడం. సెక్యులరిజం అనేది మన దేశంలో ఎంతవరకు పాటిస్తున్నామో చెప్పలేం కాని, ఇక్కడ మాత్రం మన భావాలను గౌరవిస్తున్నారు. ఇక్కడ దేవాలయాల్లో అర్చకులుగా వచ్చేవారికి, రెలిజియస్ కోటా కింద వీసాలు జారీ అవుతాయి.
హ్యూస్టన్లో అష్టలక్ష్మి దేవాలయంతోపాటు, మరికొన్ని దేవాలయాలు కూడా వున్నాయి. అష్టలక్ష్మి దేవాలయాన్ని ‘జెట్ వైదిక విజ్ఞాన కేంద్రం’ అని కూడా పిలుస్తుంటారు. దేవాలయ నిర్మాణం ఆధునిక పద్ధతుల్లో జరిగినప్పటికీ, భారతీయ ఆగమ సాంప్రదాయానికి భంగం కలగకుండా, తగు జాగ్రత్తలు తీసుకున్నారు నిర్వాహకులు. సనాతన హిందూ దేవాలయాల్లో అనుసరిస్తున్న ఆచార వ్యవహారాల విషయంలో కూడా శ్రద్ధతీసుకున్నారు. నిత్యం ఉదయం-సాయంత్రం యథావిధిగా దేవాలయాల్లో నిర్వహించాల్సిన పూజా కార్యక్రమాలకు ఏ లోటు రాకుండా పూజారులు నిర్వహిస్తుంటారు. ఆర్జిత సేవలు కూడా జరుగుతాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్‌స్వామి బోధనలకనుగుణంగా, వైదిక సాంప్రదాయాన్ని- వేదాల్లోని విజ్ఞానాన్ని, నేటితరం-్భవితరాల వాళ్ళకు అందించడమనే ప్రధాన ధ్యేయంగా ఈ దేవాలయం వివిధ కార్యక్రమాలను చేపడుతుంది.
పాంచరాత్ర ఆగమ సూత్రాలను తు.చ.తప్పకుండా పాటిస్తూ స్థాపించబడిన అష్టలక్ష్మీ దేవాలయం, నిర్వహణలోనూ అవే అనుసరిస్తుంటుంది. చినజీయర్ స్వామి, పెద జీయర్‌స్వామి నిలువెత్తు ఫొటోలు, ఆళ్వార్ల ఫొటోలు, గోదాదేవి ఫొటోలు అక్కడ ఏర్పాటుచేశారు నిర్వాహకులు. లక్ష్మి నారాయణస్వామిని, ఆయన సరసన ఆదిలక్ష్మి, ధ్యానలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి విగ్రహాలు దర్శనమిస్తాయిక్కడ. నిత్యం అంగరంగ వైభోగంగా దైవిక కార్యక్రమాలతోపాటు, ‘హ్యూస్టన్ తెలుగు సాహితీలోకం’లాంటి సాహితీ సంస్థలు నిర్వహించే ‘నెలనెలా తెలుగు వెనె్నల’ తరహా కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. హ్యూస్టన్లో వుంటున్న తెలుగువారు (ప్రధానంగా), ఇతర భారతీయులు తరచుగా కలుసుకునే పుణ్యం-పురుషార్థం కలుగజేసే ‘సాంప్రదాయ- సాహితీ సంగమం’ అష్టలక్ష్మి దేవాలయం.
అమెరికా హ్యూస్టన్‌లో వున్నప్పుడు అష్టలక్ష్మి దేవాలయానికి వెళ్లి, 51 డాలర్లు చెల్లించి, అందులో పాల్గొన్నాం. చిన జీయర్‌స్వామి చేయించిన రీతిలోనే, దాదాపు వేయి మందికిపై హాజరయిన భక్తుల సమక్షంలో వైభవంగా జరిగింది గోదాదేవి కల్యాణ మహోత్సవం.
అపర జానకీ మాతను గుర్తుకుతెచ్చేదే ఆండాళ్ తల్లి- లేదా- గోదాదేవి. జనక మహారాజు యజ్ఞశాల నిర్మించేందుకు భూమిని దున్నుతుంటే ఏ విధంగా సీత దొరికిందో, ఆండాళ్ కూడా తులసి వనం కొరకు, విష్ణుచిత్తుడు భూమిని దున్నుతుంటే దొరికింది. ఇద్దరూ అయోనిజలే. సీత లేని రామాయణం, గోదాదేవి లేని వైష్ణవాలయం (రామాలయంతో సహా) వుండదు. సీతమ్మ శ్రీరాముడిని, ఆండాళ్ శ్రీరంగ నాథుడిని- ఇద్దరు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అంశతో అవతరించిన వారే-
చిన్ననాడు- తండ్రి విష్ణుచిత్తుడు ప్రతిరోజు వటపత్రశాయికి మాలాకైంకర్యం చేయడం చూసి గోదాదేవి పరవశించిపోయేది. తండ్రి కట్టిన మాలలు ఆయనకు తెలియకుండా ధరించి, బావిలో తన అందాన్ని చూసుకొని మురిసిపోయి, తిరిగి ఆ మాలలను యథాస్థానంలో వుంచేది. ఒకనాడు తండ్రి ఇది చూసి, గోదా చేసింది తప్పని భావించాడు. మాలలు మాలిన్యమైనాయని ఆనాడు వటపత్రశాయికి అవి సమర్పించలేదు. గోదాదేవిని సున్నితంగా మందలించాడు. స్వామికి నిర్ణయించబడిన పూలదండ ముందర ఆమె ధరించడం అపచారమంటాడు.కాని, గోదాదేవి తన కొప్పులో ముడిచిన పూలదండలు తనకెందుకు సమర్పించలేదని విష్ణుచిత్తుడికి కలలో కనబడి ప్రశ్నించాడు వతపత్రశాయి. విష్ణుచిత్తుడు తన కూతురు చేసిన అపరాధాన్ని వివరించి, మాలలను సమర్పించలేకపోయిన కారణం తెలియచేశాడు. వాటికి బదులుగా వేరేవి తయారుచేసేందుకు సమయం లేకపోయింది అని విన్నవించుకున్నాడు. వటపత్రశాయి చిరునవ్వుతో, గోదాదేవి ముందుగా ధరించిన మాలంటేనే తనకు ఇష్టమని, అదే తాను కోరుకుంటున్నానని అంటాడు. ఆమె తలలో పెట్టుకోని మాలలు తనకొద్దంటాడు. ఆమె విషయం విష్ణుచిత్తుడికి తెలియదని, సాక్షాత్తు లక్ష్మీదేవే భూలోకంలో గోదాదేవిగా అవతరించిందని చెప్పాడు. గోదాదేవికి యుక్తవయస్సు వస్తూనే, వటపత్రశాయికి ధూప, దీప, నైవేద్యంతో రోజుకొక ‘పాశురం’ ద్రావిడ భాషలో (తమిళం) వ్రాసి వటపత్రుడి సన్నిధిలో పాడుకుంటూ, తోటి బాలికలతో కాత్యాయనీ వ్రతం చేసింది. తన తండ్రిని 108 దివ్య తిరుపతులలోని మూర్తుల కళ్యాణగుణాలను వివరించి చెప్పమని అడిగింది. శ్రీరంగనాథుని వివాహమాడాలని దృఢంగా నిశ్చయించుకుందిగోదా. గోదాదేవికి శ్రీరంగనాథుడికి వివాహం జరిగేదెలా అని విష్ణుచిత్తుడు వ్యాకులపడ్డాడు. మరుసటి దినం శ్రీరంగనాథుడి ఆజ్ఞమేరకు ఆయన భక్తులు, అర్చకులు మేళతాళాలతో విష్ణుచిత్తుడి దగ్గరకొచ్చి, గోదాదేవిని విష్ణుచిత్తుడిని శ్రీరంగనాథుడి కోరికగా, పల్లకిలో శ్రీరంగం తీసుకొనిపోయారు.
అదేరోజున స్వామి ఆజ్ఞ ప్రకారం శ్రీరంగనాథుడి విగ్రహానికి, గోదాదేవినిచ్చి వివాహం చేశారు. గోదాదేవి స్వామిని సేవించడం అందరూ చూస్తుండగా శ్రీరంగనాథుడి గర్భాలయంలోకిపోయి ఆయనలో లీనమైపోయింది. శ్రీరంగనాథుడు విష్ణుచిత్తుడిని చూసి, దిగులుపడొద్దని అంటూ, ఆయనకు గౌరవ పురస్కారంగా తిరుప్పరి పట్టము, తోమాల, శ్రీ శఠకోపము యిచ్చి, సత్కరించి పంపాడు. గోదాదేవికి ఆండాళ్, చూడి కొడుత్తామ్మాళ్ అనే పేర్లుకూడా వున్నాయి. గోదాదేవిని 12మంది ఆళ్వారులలో చేర్చారు. ధనుర్మాసంలో ఆమె రచించి పాడిన తిరుప్పావై పాశురాలు జగద్విఖ్యాతి చెందాయి. అన్ని వైష్ణవ దేవాలయాలలో, ధనుర్మాసంలో అత్యంత భక్తితో ప్రజలందరు ముప్పైరోజులు పాశురాలను పాడుకుంటూ ఆమెను కొలుస్తుంటారు. ఆమె తిరుప్పావై (30 పాశురాలు), నాచ్చియారు తిరుమొళి (143 పాశురాలు) జగత్ విఖ్యాతమై అందరిచేత నుతించబడుతున్నాయి. తిరుప్పావై ఒక దివ్య ప్రభంధం.
అలాంటి గోదాదేవి కల్యాణం అమెరికాలో జరిగినప్పుడు పాల్గొనడం మాకు ఎంతో తృప్తినిచ్చింది. కల్యాణం సంకల్పం కూడా మాతోనే చేయించారు. అది మరింత తృప్తినిచ్చింది. హ్యూస్టన్‌లో అష్టలక్ష్మీ దేవాలయం కాకుండా, చిన్మయ మిషన్, సాయబాబా గుడి, మీనాక్షీ దేవాలయం కూడా వున్నాయ. చిన్నపిల్లలు గోదా చరిత్ర-గోదా కల్యాణం నృత్యరూపంలో అభినయస్తుంటే మన సంస్కృతీ- సంప్రదాయాలు తల్లి-దండ్రులు మరచిపోకుండా ఎలా పిల్లలకు తెలియజేస్తున్నారో అర్థమయంది. ఇలా మన ఎన్నోదేవాలయాలను, మన వైదిక సంస్కృతిని దేశ సంస్కృతీ సంప్రదాయాలను ఇలా ఇక్కడి తెలుగువారు కాపాడుతున్నారు.

- వనం జ్వాలా నరసింహారావు