Others

దూషణ..ఆత్మస్తుతి అంతరార్థం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురుక్షేత్ర యుద్ధం పదిహేడవ రోజు... ధర్మరాజు కర్ణుడితో ద్వంద్వ యుద్ధానికి తలపడ్డాడు. పోరుభీకరంగా సాగుతోంది. కర్ణుడి ధాటికి తట్టుకోలేక పోయాడు ధర్మరాజు. సారధిని కోల్పోయాడు..ఆయన కర్ణుడి విజృంభణకు తట్టుకోలేక శిబిరానికి తిరుగుముఖం పట్టాడు. ధర్మనందనుడు గాయాలకు చికిత్స చేయించుకుని సేద తీరుతున్నాడు.
ఆ సమయంలో కృష్ణార్జునులు ఆ శిబిరంలోకి ప్రవేశించారు. వారిని చూసిన ధర్మనందనుడు కర్ణుణ్ణి సంహరించారన్న శుభవార్త చెప్పటానికి వచ్చారనుకొన్నాడు. ఆ విషయానే్న ఆలోచిస్తూ అర్జునుణ్ణి వేనోళ్ళ ప్రశంసించాడు. నెమ్మదిమీద విషయం కిరీటికి అర్థమైంది. ధర్మనందునుడి అపోహ అవగాహనకు వచ్చింది. అపుడు ‘పాండవాగ్రణీ! నేను సంశప్తకులతోనూ, అశ్వత్థామతోనూ భీకర యుద్ధం కొనసాగించాను. వారిని జయించిన తరువాత నీవు యుద్ధ్భూమిలో నాకు కనబడలేదు దానివల్ల నేనూ కృష్ణుడు ఎంతో ఆందోళన చెందాం. అసలు విషయం మేము భీముడి ద్వారా తెలుసుకున్నాం. ఇదిగో ఇలా నిన్ను చూసి మా మనస్సులు కాస్త కుదుట పడ్డాయి. ఇక మేము రణభూమిలో కర్ణుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్తాము. నన్ను ఆశీర్వదించుఅన్నా’’ అన్నాడు కిరీటి.
ఆ మాటలు ధర్మజునికి నిరుత్సాహాన్ని కలిగించాయ. ఆగ్రహాన్ని తెప్పించాయ. కుపితుడైన ధర్మరాజు పరుష వాక్యాలతో ‘‘కర్ణుణ్ణి యుద్ధంలో ఓడించలేని నీ గాండీవం ఎందుకు కాల్చనా? దాన్ని నీవు చక్రికి ఇచ్చివేసి రథ సారథ్యం స్వీకరించు.’’ అని అర్జునుణ్ణి నింధిచాడు. తన గాండీవాన్ని అవమానించిన వారిని మన్నించనని ప్రతిజ్ఞ చేసిన సవ్యసాచి ఒరలోని ఖడ్గమును తీసి ధర్మనందుడి శిరస్సు ఖండించబోయాడు. అంతలో శౌరి కవ్వడిని అడ్డుకుని, ఇదేమిటి అర్జునా! నీవు చేస్తున్న పనేమిటి’’ అని నిలదీసాడు. అప్పుడు విజయుడు శ్రీకృష్ణునితో ‘‘దేవకీ నందనా! నా గాండీవాన్ని ఎవరికైనా ఇచ్చివేయమని అవమానించిన వారిని ఎవరినైనా సరే వధించివేస్తానని నేను పూర్వం ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. ఈ రోజు ధర్మనందనుడు నీముందే నన్ను ఈ విధంగా అవమానించాడు కదా! అందువల్ల ఇతడు ఎంతటి ధర్మతత్పరుడైనా వధించవలసినదే! అప్పుడే నా ప్రతిజ్ఞా భంగం లేకుండా ఉంటుంది. కానీ ఈ విషయంలో నాకు అత్యంత ఆప్తుడివి, సన్నిహితుడవు అయిన నీ సలహా పాటించడానికి సిద్ధంగా ఉన్నాను.’’ అని అన్నాడు. అందుకు గోపీమానసచోరుడు ‘‘అర్జునా ధర్మాధర్మాలు ఎరిగిన వారెవరైనా స్వప్నంలో కూడ తలబెట్టని దుష్కుృత్యం నేడు నీవు తలబెట్టబోయావు. పార్థా! నీవు ఒక విషయం తెలుసుకోవాలి. ధర్మాధర్మాలు దేశకాలమాన పరిస్థితులనుబట్టి నిర్ణయించవలసి ఉంది. అంతేకానీ సర్వత్ర ఒకే పద్ధతి పనికిరాదు.’’‘‘సత్యము, అహింస అత్యుత్తమ ధర్మాలని ఆర్యులు ఆదేశిస్తున్నారు. అందుచేత అహింసా మార్గంలో సత్య సంరక్షణకుపక్రమించాలి. అదే విధంగా ఒక్కొక్కప్పుడు అసత్య పద్ధతిలో అహింసావ్రతం సంరక్షించవలసి రావచ్చు. ఈ ధర్మ సూక్ష్మం తెలుసుకుని మనలుకొన్నవారే సర్వశుభాలను పొందుతున్నారు. నీకు ఒక కథ చెప్తాను విను’’ అన్నాడు.
కౌశికుడన్న బ్రాహ్మడు ఒకడు ఒక నదీ సాగర సంగమ తీరంలో తపశ్చర్య ప్రారంభిస్తూ ఎల్లప్పుడూ సత్యమే పలుకుతానని భీషణ శపథం స్వీకరించాడు. అప్పటినుండీ అతను సత్యవాది అన్న పేరుతో ప్రసిద్ధికెక్కాడు. ఒకరోజు అతను తపస్సు చేసుకుంటూండగా కొందరు దొంగలు తరుముకు రాగా వారి నుంచి తప్పించుకోవడానికి కొంతమంది వర్తకులు ఆ సత్యవాది ఆశ్రమ పొదల వెనుక తల దాచుకున్నారు.
అంతలోనే ఆ దొంగలు అక్కడికి వచ్చి ఆ సత్యవాదిని ‘‘ఇక్కడికి ఎవరైనా బాటసారులు వచ్చారా అని అడిగారు. అప్పుడా విప్రుడు అసత్యం పలకడానికి భయపడి అవును ఆ పొదల వెనుక దాక్కున్నారు అని సత్యం పలికాడు. వెంటనే ఆ చోరులు ఆ బాటసారులను వధించి వారివద్ద ఉన్న ధనమంతా అపహరించి వెళ్లిపోయారు. ఆ ఘోర హింసాపాతకం వల్ల అతనికి నరకం ప్రాప్తించింది. కనుక ఇపుడు సత్యం ధర్మం వీటిని ఏపరిస్థితుల్లో, ఏవిధంగా ఆచరణలో పెట్టాలో నీకు అర్థమైంది కదా అన్నాడు కృష్ణుడు. అప్పటికీ ధర్మసందేహ నివృత్తి కాని కిరీటి శౌరికి అంజలి ఘటించి ‘‘కృష్ణా ఇప్పుడు నా ప్రతిజ్ఞకి భంగం కలుగకుండానూ, ధర్మనందనుని వధించకుండానూ ఏదైనా సులభపద్ధతి చెప్పం’’డని ఆయనే్న వేడుకున్నాడు.
ఇది విన్న సత్యాపతి కిరీటితో ‘‘నీవు అగ్రజుడ్ని నీ ఇష్టానుసారం పరుష వాక్కులతోనూ, కఠినోక్తులతోనూ నిందించు. ఆ పరుష ప్రసంగమే ఆతని వధ కాగలదు. ఆ పై నీవు ఆయన పాదాల మీద పడి మన్నించమని అడుగు. ఆ విధంగా చేస్తే నీ ప్రతిజ్ఞా భంగం దోషం తొలగిపోతుంది.’’ అని హితవు పలికాడు. ఆ ఉపాయానికి సవ్యసాచి సంతుష్టుడై, ధర్మనందనుని ఉద్దేశించి ‘‘పాండవాగ్రణీ నీకు నన్ను నిందించే అర్హత ఎంతమాత్రమూ లేదు. నీవు రణభూమి నుంచి పారిపోయి వచ్చావు. అసలు నీవల్లనే మా అన్నదమ్ములకు ఇన్ని కష్టాలు వచ్చాయ. ’’ అంటూ ధర్మజుడు దూత క్రీడకు అంగీకరించినప్పటినుంచీ వనవాసం, అజ్ఞాతవాసం, ప్రస్తుతం జరుగుతున్న ఘోర కురుక్షేత్ర సంగ్రామం వరకూ పడుతున్న ఇడుముల వరకూ ఏకరువు పెట్టాడు. ‘‘ఇన్ని కష్టాలు నీవల్లనే మాకు ప్రాప్తించాయి కాబట్టి ఇకనుంచైనా బుద్ది తెచ్చుకుని మేము నలుగురమూ ఏం చేస్తే దాన్ని మారు మాట్లాడక చూస్తూ వౌనం వహించు’’ అని అధిక్షేపించాడు.
తన అన్నను ఇన్ని మాటలు అన్నందుకు అర్జునుడు దుఃఖితుడై తన ఒర నుండి కరవాలం తీసి తన శిరస్సు ఖండించుకోబోగా, జనార్ధనుడు వెంటనే అడ్డుకుని ‘‘అర్జునా ఇంతలోనే ఏమిటీ వైపరీత్యం?’’ అని ఆశ్చర్యంతో ప్రశ్నించాడు. బదులుగా కిరీటి ‘‘కృష్ణా నేను ఈ పుణ్యమూర్తిని అనరాని మాటలతో దూషించాను. అందుకు ప్రాయశ్చిత్తమే ఈ పని’’ అని అన్నాడు. అది విని శ్రీకృష్ణుడు చిరు దరహాసంతో ‘‘ఇంత మాత్రానికే ఆత్మహత్య ఎందుకు? ఆత్మస్తుతి ఆత్మహత్యతో సమానమని కదా ఆర్యులు ఉపదేశించి ఉన్నారు. కనుక నీవు ఆత్మస్తుతి చేసుకో సరిపోతుందని సూచించాడు. దానితో, ఆ ముక్కంటి ఒక్కడు తప్ప ముల్లోకాలలోనూ వేరొక విలుకాడెవరైనా నాతో సరితూగ గలరా? అంటూ తన గొప్పతనాలనుకొనేవన్నీ తాను ఏకరువు పెట్టుకున్నాడు. అక్కడే ఉన్నఅన్నగారిని చూసి ‘‘్ధర్మనందనా! నేను ఇప్పుడు అనకూడని మాటలతో నీ మనస్సు నొప్పించాను. కరుణించి నన్ను మన్నించవలసినది. ఇది నా ప్రతిజ్ఞా భంగం కాకుండా ఉండేందుకూ, ఆత్మహత్యా పాతక నివారణ కోసమూ శౌరి ఉపదేశించగా చేసినదే గానీ వేరే ఆలోచనతో చేసినది కాదు. నా మనస్సు నా శరీరము అన్నీ ఎప్పటికీ నీ అధీనములే నేను నీ వాడనే’’ అని కన్నీళ్లు కార్చాడు.
దుఃఖాశ్రువులను పారిస్తున్న పార్థుని లేవనెత్తి ఉప్పొంగుతున్న ఆనందాశ్రువులతో కిరీటిని హృదయానికి హత్తుకుని ధర్మనందనుడు దీనంగా విలపించాడు.
చూసారా ఈ అద్భుత ధర్మసూక్ష్మం! పూజ్యులయిన పెద్దలను దూషిస్తే అది వారి వధతో సమానమనీ, ఆత్మస్తుతి ఆత్మహత్యతో సమానమనీ తెలసుకొన్నాం కదా.
మరి ఈ విషయంలో జాగ్రత్త పాటిద్దామా!

- మాధవపెద్ది ఉష