మెయిన్ ఫీచర్

నానుడితో సంస్కృతీ సౌరభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన పురాణ గాధలు భారతీయ సంస్కృతిలో అంతర్భాగం. ముఖ్యంగా మన తెలుగు వారి పలుకుల్లో ఎన్నో నానుడులు ఆ గాథలకి సూచికలు. ఏదైనా ముఖ్యమైన పని కొరకు వెళ్లి అది జరగకపోతే వచ్చి- ‘్ఫలానా వాడు అక్కడ సైంధవుడిలా అడ్డుకోకపోతే ఈ పని ఇవాళ తప్పకుండా జరిగేది’ అంటారు. ఆ సైంధవుడి కథ వారికి తెలియకపోయినా!
సైంధవపాత్ర
సైంధవుడు కౌరవుల ఇంటి అల్లుడు. దుస్సల భర్త. పాండవులు ద్రౌపదితో కలిసి పనె్నండేళ్లు అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఒకనాడు పాండవులు ఇంటలేనప్పుడు ఒంటరిగా వున్నప్పుడు ఆమెను చూసి మోహించి బలాత్కరించబోతాడు. ఆమె శతవిధాలా వారించింది.
‘నువ్వు మా ఇంటి అల్లుడివి. నాకు అన్నవి. ఈ చెడు తలంపు వీడు’ అని చెప్పినా వినక ఆమెను బలవంతంగా రథంమీద తీసుకుపోతుంటే వార్త తెలిసి ధర్మరాజు భీమార్జులను పంపుతాడు. వారు అతడిని ఓడించి ద్రౌపదిని విడిపించి అతడిని నాగాస్త్రంతో బంధించి తెచ్చి ధర్మరాజు ఎదుట నిలుపుతాడు అర్జునుడు.
ధర్మరాజు శాంతంగా ‘నువ్వు చేసింది సహించరాని అపరాధమే! అయినా మా తోబుట్టువు భర్తవని, ఆమె మాంగల్యం చల్లగా వుండాలని నిన్ను విడిచిపెడుతున్నాను. ఇకమీదైనా బుద్ధి కుశలతతో మెలుగు’ అంటూ బుద్ధులు చెప్పి పంపాడు.
ఆ అవమానాన్ని సహించలేని సైంధవుడు తీక్షణమైన తపస్సు చేసి అర్జునుని తప్ప మిగిలిన పాండవులందరినీ ఒకరోజు యుద్ధంలో అడ్డుకోగలిగే వరాన్ని పొందాడు.
కౌరవ పాండవ యుద్ధంలో కౌరవులు పద్మవ్యూహం ఏర్పరిచి అది ఛేదించడం తెలిసిన అర్జునుడ్ని దారి మళ్లించారు. మిగిలిన వారిలో అభిమన్యుడికి ప్రవేశించడం మాత్రమే తెలుసు. ఛేదించడం తెలియదు. తప్పనిసరి పరిస్థితిల్లో అభిమన్యుడ్ని ఆ పద్మవ్యూహంలో ప్రవేశించడానికి అనుమతించాడు ధర్మరాజు.
‘నువ్వు ప్రవేశించు. నీ వెనకే మేము నలుగురం ప్రవేశించి వారిని ఛేదిస్తాం’ అన్నారు పాండవులు. ‘్ఫరవాలేదు నేనే ఛేదించగలను’ అంటూ ధైర్యంగా పద్మవ్యూహంలోకి ప్రవేశించాడు అభిమన్యుడు. అతడిని వెనకే అతడికి రక్షణగా ప్రవేశించబోయిన ధర్మ,్భమ, నకుల సహదేవులు నలుగురినీ సైంధవుడు తన వర ప్రభావంతో ఆనాడు అడ్డుకుని వారిని ప్రవేశించకుండా చేశాడు. ఆ సమయంలో అభిమన్యుని ఒంటరిని చేసి దుష్ట చతుష్టయంతోపాటు ద్రోణ, అశ్వత్థామలు చేరి మూకుమ్మడిగా పోరి అభిమన్యుడి చావుకి కారణమయ్యారు.
ఆనాటి నుంచే పని జరగకుండా ఎవరైనా అడ్డువస్తే సైంధవుడిలా అడ్డుకున్నాడు అనడం పరిపాటిగా మారింది.
ఉత్తరకుమారుని ప్రజ్ఞ
అలాగే ‘ఉత్తర కుమార ప్రజ్ఞలు’ అనడం కూడా కద్దు. చేసే సామర్ధ్యం లేకున్నా ‘అంత చేస్తాం! ఇంత చేస్తాం!’ అంటూ గొప్పలు చెప్పేవారిని ‘ఆ! చెప్పావులే! ఉత్తరకుమార ప్రజ్ఞలు నువ్వు’ను అంటుంటారు.
విరాటరాజు ఏకైక కుమారుడు ఉత్తరకుమారుడు. అతి గారాబంగా పెరిగాడు. తండ్రి శస్త్రాస్త్ర విద్యలు కుమారుడికి నేర్పినా అతనికి ఎప్పుడు యుద్ధానికి వెళ్లవలసిన అవసరం రాలేదు. ఊరికే రాజ్యంలో ఇంట, బైట ‘నేను అంత గొప్పవాడిని, ఇంత గొప్పవాడిని, ఎలాంటి వాళ్లు వచ్చినా నేను యుద్ధంలో అందర్నీ చీల్చి చెండాడేస్తాను’ అంటూ ప్రగల్భాలు పలుకుతూ వుంటాడు.పాండవులు ద్రౌపదితో విరాటరాజు కొలువులోనే అజ్ఞాతవాసం చేసారు. ఏడాది గడువు పూర్తయ్యే సమయానికి కాస్త ముందుగా జీమూత మల్లుడిని, తరువాత కీచకుడిని భీముడు సంహరిస్తాడు. ఈ వార్త మెల్లిగా కౌరవులకి చేరేసరికి ఏడాది పూర్తవుతుంది. అయినా సంగతి తెలిసిన కౌరవులు పాండవులకి విరాటరాజు ఆశ్రయమిచ్చాడని ఆగ్రహంతో ఆ దేశానికి వనె్న తెచ్చిన గోసంపదని దక్షిణంవైపు సుశర్మని, కొంత సైన్యాన్ని పంపి మళ్లించమంటాడు. విరాటరాజు సైన్యంతో ధర్మ, భీమ, నకుల సహదేవులతో (వారెవరో తెలియకపోయినా) అటు ఎదుర్కోవడానికి వెళ్తాడు. ఆ సమయంలో ఉత్తరం వైపు గోవుల్ని కౌరవ సైన్యమంతా కలిసి భీష్మ ద్రోణాచార్యులతో సహా వచ్చి తరలిస్తారు. ఆ సమయంలో తప్పనిసరై పాండవులు బైటికి వస్తారని వాళ్ల ఆలోచన. ఆ సమయంలో ఇక వీరులెవరూ లేక తప్పనిసరిగా ఉత్తరకుమారుడు యుద్ధానికి వెళ్లవలసి వస్తుంది. సారధులు లేరన్నందుకు బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడు సారధ్యం చేస్తానని చెప్పి ‘నాలాంటి వీరునికి ఆ నపుంశకుడు సారధా?’ అవమానం అంటాడు. గతిలేక చివరికి ఒప్పుకుంటాడు.
‘కౌరవసేనంటే నాకు లెక్కేలేదని వాళ్లనందర్నీ ఓడించి విజయంతో తిరిగి వస్తానని అందరి దగ్గర ప్రగల్భాలు పలికి యుద్ధానికి వెడతాడు.
ప్రవాహంలా ఉన్న కౌరవ సైన్యాన్ని చూసి కాళ్లు చేతులు వణికిపోతూ గుండె దడ దడ కొట్టుకుంటుండగా రథాన్ని వెనక్కి మళ్లించమంటాడు బృహన్నలని. బతికుంటే బలుసాకు తినచ్చు. కోరి వెళ్లి వాళ్ల చేతిలో చావలేను అంటూ గొడవపెడతాడు. అప్పుడు బృహన్నల తాను అర్జునుడినని చెప్పి సారధ్యం వహించమంటే ఎలాగో ధైర్యం చేసి వహిస్తాడు. అర్జునుడు గెలిచి గోవుల్ని వెనక్క తీసుకువస్తాడు. కడకు కురుక్షేత్ర సంగ్రామంలో అతడూ సమిధైపోయాడు. ‘ఉత్తరకుమార ప్రజ్ఞలు‘ అనే నానుడి పేరుగాంచింది.

- ఆర్.ఎస్. హైమావతి