ఆంధ్రప్రదేశ్‌

ఇచ్ఛాపురం చెక్‌పోస్టుపై ఏసిబి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ.76,120 నగదు స్వాధీనం * నలుగురు అనధికార వ్యక్తుల అరెస్టు
ఇచ్ఛాపురం, మార్చి 12: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం పురుషోత్తపురం ఇంటిగ్రేటేడ్ చెక్‌పోస్టుపై అవినీతి నిరోధకశాఖ అధికారులు శనివారం తెల్లవారుజామున దాడులు జరిపారు. లారీల యజమానులు, డ్రైవర్ల నుంచి చెక్‌పోస్టు సిబ్బంది, దళారులు అక్రమంగా వసూలు చేసిన రూ.76,120 నగదు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నలుగురు అనధికార వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఎసిబి డిఎస్పీ రంగరాజు విలేఖరులతో మాట్లాడుతూ విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు తెల్లవారుజామున చెక్‌పోస్టుపై సిబ్బందితో కలిసి దాడులు జరిపామన్నారు. వాణిజ్యపన్నులశాఖ కౌంటర్లలో ఉన్న అక్రమంగా వసూలు చేసిన రూ.51,910 నగదు, వ్యవసాయ మార్కెట్ కమిటీ కౌంటర్‌లోని రూ.1,710 స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో రూ.23,500 కలిపి మొత్తం రూ.76,120 స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. చెక్‌పోస్టులో అనధికారికంగా తిరుగుతున్న శ్రీనివాసరావు, ఢిల్లీరావు, చిన్న, శివాజీని అదుపులోకి తీసుకున్నామన్నారు. నెల రోజుల్లో రెండు, మూడుసార్లు చెక్‌పోస్టుపై రెక్కీ నిర్వహించినట్లు ఆయన వివరించారు. దీనిపై సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
రైల్వేట్రాక్ పక్కనే ఎర్రచందనం డంప్
రూ.4కోట్ల విలువచేసే దుంగలు స్వాధీనం
కడప,మార్చి 12: ఎర్రచందనం స్మగ్లర్లు చాటు, మాటు ప్రాంతాలు వదిలి బహిరంగంగానే డంప్‌లు ఏర్పాటు చేస్తూ అధికారులకు సవాల్ విసురుతున్నారు. శేషాచలం అటవీ ప్రాంత సమీపంలో శనివారం తెల్లవారు జామున భారీ ఎర్రచందనం డంప్ బయటపడింది. కడపజిల్లా రైల్వేకోడూరు సమీపంలోని కుక్కలదొడ్డి రైల్వేట్రాక్ వద్ద టాస్క్ఫోర్స్ పోలీసులు కూంబింగ్ చేస్తుండగా రూ.4కోట్లు విలువచేసే 130 ఏగ్రేడ్ మేలిరకం ఎర్రచందనం దుంగలను గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. చెన్నై-ముంబాయి రైల్వే మార్గం సమీపంలో ఈ డంప్ బయల్పడింది. టాస్క్ఫోర్స్, అటవీశాఖ అధికారులు, సిబ్బంది శేషాచలం అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తూ రైల్వేకోడూరు సమీపంలోని కుక్కల దొడ్డి వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో రైల్వేట్రాక్ వద్ద చెత్తాచెదారంతో నిండిన ఒక స్థలంలో రాజంపేట డిఎస్సీ రాజేంద్ర అనుమానించి సోదాలు నిర్వహించగా డంప్ బయటపడింది. నాలుగురోజుల క్రితం ఈ ప్రాంతానికి సమీపంలోనే బాలుపల్లె చెక్‌పోస్టు వద్ద రూ.2కోట్లు విలువచేసే ఎర్రచందనం దుంగలను గ్యాస్‌ట్యాంకర్‌లో రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్న విషయం విదితమే. గత వారంరోజులుగా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాకు చెందిన పోలీసులు, టాస్క్ఫోర్స్, అటవీశాఖ అధికారులు,సిబ్బంది వందలాది మంది శేషాచలం అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. తాము వందలాది మంది పోలీసులతో కూంబింగ్ నిర్వహిస్తున్నామని ఓవైపు టాస్క్ఫోర్స్ అధికారులు చెబుతుండగా, మరోవైపు యథేచ్ఛగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుండటం గమనార్హం.
త్వరలో కాపులకు ఉపకార వేతనాలు
స్వార్థం కోసం ముద్రగడ రెచ్చగొడుతున్నారు: రామానుజయ
నంద్యాలటౌన్, మార్చి 12: త్వరలో కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో కాపులకు ఉపకార వేతనాల పంపిణీ, స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ చైర్మన్ సిహెచ్ రామానుజయ అన్నారు. శనివారం కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో రామానుజయ మాట్లాడుతూ ఎపి సిఎం చంద్రబాబు నాయుడు కాపు కార్పొరేషన్‌కు బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించడం అభినందనీయమన్నారు. బిసిలకు గతంలో రూ.3,200కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.8,400కోట్లు కేటాయించడం ఎంతో శుభపరిణామమన్నారు. ఎపిలో 3లక్షల 40వేల మంది కాపులు రుణాలకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఏలూరులో 32వేల దరఖాస్తులు, అనంతలో 15వేల దరఖాస్తులు వచ్చాయని, త్వరలో అన్ని జిల్లాల్లో కాపులకు రుణాలు అందజేస్తామన్నారు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హైదరాబాద్‌లో అల్లర్లు జరిగేలా చేశారని, ఇప్పుడు ఆయన తనయుడు జగన్ తునిలో అల్లర్లు జరిగేలా చేశారని విమర్శించారు. సిఎం చంద్రబాబు ఎపిలో పరిశ్రమల ఏర్పాటుకు విదేశాలకు వెళ్లి నిధులు వచ్చేలా కృషి చేసి రాష్ట్భ్రావృద్ధికి పాటుపడుతున్నారన్నారు. రాయలసీమకు నీటి కొరత లేకుండా పట్టిసీమ ప్రాజెక్టును ప్రారంభించారన్నారు. ముద్రగడ పద్మనాభం తన స్వార్థం కోసం కాపులను రెచ్చగొడుతున్నారని, ఆయన ఉచ్చులో ఎవరూ పడకూడదన్నారు.
కుప్పం రైల్వే క్వార్టర్స్‌లో మహిళ హత్య
పెట్రోలు పోసి తగులబెట్టిన దుండగులు
కుప్పం, మార్చి 12: కుప్పం పట్టణంలోని రైల్వే క్వార్టర్స్‌లో ఓ గుర్తు తెలియని మహిళను దారుణంగా హత్య చేసి అనంతరం తగలబెట్టిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన కుప్పంలో కలకలం రేకెత్తిస్తుంది. సుమారు 35 ఏళ్ల వయస్సున్న మహిళ హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. కుప్పంలోని పాడుపడిన రైల్వే క్వార్టర్స్‌లో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో సగం కాలిన మృతదేహం నుంచి వస్తున్న దుర్వాసన గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈఘటన వెలుగు చూసింది. సుమారు మూడు రోజుల క్రితం మహిళ హత్యకు గురైనట్లుగా భావిస్తున్నారు. శవం పక్కన ఓచిన్న అట్టపెట్టెలో పాత చీరలు ఉండడాన్ని బట్టి పాడుపడిన క్వార్టర్స్‌లో తలదాచుకున్న గుర్తు తెలియని మహిళపై దుండగులు అత్యాచారంచేసి అనంతరం ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు. క్లూస్ టీంకూడా సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. కుప్పం ఎస్సై వెంకటచిన్నా కథనం మేరకు కుప్పం రైల్వే క్వార్టర్స్‌లో పడివున్న మహిళ మృతదేహం బాగాకాలిపోయి గుర్తు పట్టలేని విధంగా ఉందని, సంఘటన స్థలాన్ని ఐసిడి ఎస్‌సిడిపిఒ రాజేశ్వరి పర్యవేక్షణలో తనిఖీ చేసినట్లు తెలిపారు.
గుంటూరు జిల్లాలో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య
పొన్నూరు, మార్చి 12: ఓ కామాంధుడి వేధింపులకు బిటెక్ విద్యార్థిని బలైంది. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కసుకర్రులో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కంచర్ల అమూల్య(18) చీరాల ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన కూరపాటి సర్వోన్నతరావు అనే కామాంధుడు కొంతకాలంగా ఈమెను వేధిస్తున్నాడు. ఇతనికి భయపడి తల్లిదండ్రులు నెలరోజుల క్రితం కాలేజీ మాన్పించి కుమార్తెను హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి పంపారు. అక్కడ 20రోజులు వుండి 10రోజుల క్రితమే తిరిగి ఇంటికి వచ్చింది. అయినా సర్వోన్నతరావు వేధింపులు ఆగలేదు. అతని చేష్టలకు భీతిల్లిన అమూల్య శనివారం ఉదయం తన ఇంట్లో ఉరి వేసుకుని మృతిచెందింది. ఇది తెలిసి నిందితుడు పరారయ్యాడు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి బాలిక తల్లిదండ్రులను పరామర్శించారు. నిందితుడిని అరెస్టు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. పొన్నూరు సిఐ చంద్రవౌళి నేతృత్వంలో ఎస్‌ఐ రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సాగర్ జలాశయానికి నిలిచిన ఇన్‌ఫ్లో
విజయపురిసౌత్, మార్చి 12: శ్రీశైలం జలాశయం నుండి నాగార్జునసాగర్ జలాశయానికి శనివారం సాయంత్రం నీటి చేరిక పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 509 అడుగుల వద్ద నిలకడగా ఉంది. ఇది 130.1471 టిఎంసిలకు సమానం. జంట నగరాల తాగునీటి అవసరాల కోసం 800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పాదనకు సాగర్ జలాశయం నుండి ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి 3345 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మొత్తం అవుట్‌ఫ్లోగా 4145 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 812.50 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఇది 35.7818 టిఎంసిలకు సమానం. ఎగువ జలాశయాలైన రోజా, తుంగభద్ర ప్రాజెక్టుల నుండి శ్రీశైలం జలాశయానికి నీటి చేరిక పూర్తిగా నిలిచిపోయినట్లు సాగర్ ప్రాజెక్టు అధికారులు వివరించారు.