ఆటాపోటీ

ఎవరి గోల వారిది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోధా కమిటీ చేసిన సిఫార్సుల అమలుపై ఎటూ తేల్చుకోలేక భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) మల్లగుల్లాలు పడుతుంటే, మరోవైపు ఇరు జట్ల క్రికెట్ సంబంధాలపై పాకిస్తాన్ వెంపర్లాడుతున్నది. రెచ్చగొట్టి లేదా బెదిరించి ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలకు భారత్‌ను ఒప్పించాలని విశ్వప్రయత్నం చేస్తున్నది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)కి చైర్మన్‌గా గతంలో సేవలు అందించిన ఇషాన్ మణి, మాజీ కెప్టెన్ జావెద్ మియందాద్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఎదుర్కొంటున్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఐసిసి కార్యవర్గ సమావేశంలో భారత్‌ను బాయ్‌కాట్ చేయాలని పిసిబికి మణి పిలుపునిచ్చాడు. బిసిసిఐకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న అనురాగ్ ఠాకూర్ అధికార పార్టీ ఎంపీ అని గుర్తుచేస్తూ, పాకిస్తాన్‌పై అతను ఏ హోదాలో వ్యాఖ్యలు చేస్తున్నాడో వివరించాలని డిమాండ్ చేశాడు. పాక్‌పై ఠాకూర్ చేసిన ప్రకటనలను ఐసిసి సమావేశంలో ప్రస్తావించాలని పిసిబిని కోరాడు. కాగా, బిసిసిఐతోపాటు భారత ప్రధాని నరేంద్ర మోదీపైనా మియందాద్ నోరు పారేసుకున్నాడు. పాక్‌తో క్రికెట్ ఆడేందుకు భారత్ భయపడుతున్నదని, మోదీ సమర్థుడైన నాయకుడే కాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఏదో ఒక రకంగా భారత్‌కు ఆగ్రహం తెప్పించి, కఠిన నిర్ణయాలు తీసుకున్న వెంటనే, తప్పును బిసిసిఐపైకి నెట్టే ప్రయత్నం మణి, మియందాద్ వ్యాఖ్యల్లో స్పష్టమవుతున్నది. ఇలావుంటే, పాక్‌లో క్రికెట్ సిరీస్‌లు ఆడేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రాకపోవడంతో, తటస్థ వేదికగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)ని ఎంచుకున్న పిసిబి భారీ నష్టాలను ఎదుర్కొంటున్నది. దీనికితోడు ద్వైపాక్షిక సిరీస్‌లకు భారత్ ససేమిరా అనడంతో పిసిబి ఆర్థికంగా కుంగిపోతున్నది. అందుకే, ఏదోఒక రకంగా భారత్‌ను సిరీస్‌లకు ఒప్పించే ప్రయత్నంలో పడింది. కానీ, అందుకు ఎంచుకున్న సమయం మాత్రం పిసిబి ప్రయోజనాలను దెబ్బతీయడం ఖాయం.
కలగా మారిన హోం సిరీస్‌లు!
స్వదేశంలో క్రికెట్ సిరీస్‌లకు ఆతిథ్యం ఇవ్వాలన్న పాకిస్తాన్ ఆశలు కలగానే మిగిలిపోతున్నాయి. శ్రీలంక క్రికెటర్లపై 2009లో లాహోర్‌లో జరిగిన ఉగ్రవాద దాడి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ పెద్ద జట్లు ఏవీ పాకిస్తాన్‌లో పర్యటించలేదు. టెస్టు హోదా ఉన్న జింబాబ్వేను, వనే్డలకు మాత్రమే పరిమితమైన కెన్యాను పిలిపించి, నిర్వహించిన సిరీస్‌లు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. నష్టాల ఊబి నుంచి పిసిబి బయపడలేదు. ఐసిసి ఖరారు చేసిన టూర్స్ అండ్ ప్రోగ్రామ్స్ ప్రకారం భారత్, పాక్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగాల్సి ఉన్నప్పటికీ, బిసిసిఐ సానుకూలంగా స్పందించకపోవడంతో రద్దయ్యాయి.
భద్రతపై గ్యారంటీ
తమ దేశంలో ఆటగాళ్ల భద్రతపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని పిసిబి హామీ ఇస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న బిసిసిఐ పాక్‌తో సిరీస్‌లను నిరాకరించడంతో, అక్కడికి వెళ్లేందుకు మిగతా దేశాలు నిరాకరిస్తున్నాయి. భద్రతపై ఇచ్చిన గ్యారంటీ అస్త్రం పని చేయకపోవడంతో, భారత్‌ను ఏదో ఒక రకంగా దారికి తెచ్చుకోవాలన్న ప్రయత్నాన్ని పిసిబి ముమ్మరం చేసింది. భారత్‌లో జరిగిన టి-20 వరల్డ్ కప్‌లో ఆడబోమని తొలుత ప్రకటించింది. భారత్‌లో భద్రతాపరమైన సమస్యలున్నాయని, అందుకే లిఖితపూర్వక హామీ ఇవ్వాలని రాద్ధాంతం చేసింది. కానీ, బిసిసిఐ స్పందించకపోవడంతో రాజీకి వచ్చింది. భారత్‌లో తమ ఆటగాళ్ల భద్రతపై అనుమానించతగ్గ అంశాలేవీ కనిపించడం లేదని ప్రకటించి, జట్టును టి-20 వరల్డ్ కప్ పోటీలకు పంపింది. బిసిసిఐని మంచి చేసుకోవడానికి జరిగిన ప్రయత్నంగానే పిసిబి నిర్ణయాన్ని పరిగణించాల్సి ఉంటుంది. ఎన్ని రకాల ఎత్తులు వేస్తున్నా, వ్యూహాలు పన్నుతున్నా, క్రికెట్ ఆడే దేశాల నుంచి పాకిస్తాన్‌కు అనుకూలంగా, భారత్‌కు వ్యతిరేకంగా ఎలాంటి స్పందన రాకపోవడంతో పిసిబి దిగాలుపడుతున్నది. క్రికెట్ ప్రపంచంలో భారత్‌ను ఏకాకిని చేయాలన్న పాక్ ప్రయత్నం ఫలించే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు.