ఆటాపోటీ

బిఎఫ్‌ఐ విన్నింగ్ పంచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాక్సింగ్‌లో అమెచ్యూర్స్‌కు, ప్రొఫెషనల్స్‌కు వేరువేరుగా పోటీలు ఉంటాయి. అమెచ్యూర్స్ తలకు గార్డ్, ఇతర రక్షణ కవచాలతో బౌట్‌లో పాల్గొంటారు. ప్రొఫెషనల్స్‌కు ప్రత్యేక కవచాలంటూ ఏవీ ఉండవు. క్రీస్తుపూర్వం 688లో జరిగిన ఒలింపిక్స్‌లో బాక్సింగ్ ఒక క్రీడగా ఉండేదని చెప్పడానికి ఆధారాలున్నాయి. పురాతన ఒలింపిక్స్‌లో మొట్టమొదటి బాక్సింగ్ టైటిల్‌ను అనొమస్టస్ సిర్నయోస్ గెల్చుకున్నాడు. ఆధునిక ఒలింపిక్స్‌లోనూ బాక్సింగ్ ఒక క్రీడాంశంగా ఉంది. అయితే, నిన్నమొన్నటి వరకూ కేవలం అమెచ్యూర్స్‌కు పరిమితంకాగా, ఈ ఏడాది రియోలో మొదటిసారి ప్రొఫెషనల్స్ ఒలింపిక్స్‌లో రంగ ప్రవేశం చేశారు.
సనాతన గ్రీకు ధర్మంలో సంస్కృతికి అధినేతగా ‘అపోలో’ను పూజిస్తారు. బాక్సింగ్‌కు కూడా అతనే అధినాయకుడు. బాక్సింగ్‌ను కనిపెట్టింది, క్రీడగా తీర్చిదిద్దింది అతనేనని గ్రీకుల నమ్మకం.
................................................................

భారత బాక్సింగ్ నాలుగేళ్ల అనిశ్చితి సంకెళ్లను తెంచుకుంది. సరికొత్త రూపాన్ని సంతరించుకొని, గర్వంగా అంతర్జాతీయ వేదికపైకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఎంతోకాలంగా వేధిస్తున్న వివాదాల ఊబి నుంచి భారత బాక్సింగ్ ఎప్పటికైనా బయటపడుతుందా అన్న అనుమానం అభిమానులను వేధిస్తున్న తరుణంలో అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఎఐబిఎ) జోక్యంతో మంచి రోజులు వచ్చాయి. భారత బాక్సింగ్ సమాఖ్య (బిఎఫ్‌ఐ)కు ఎన్నికల ప్రక్రియ పూర్తికావడంతో ఒక అధ్యాయం పూర్తయింది. ఎఐబిఎ గుర్తింపు ఇక లాంఛనమే. అధికారికంగా ప్రకటించిన మరుక్షణం భారత బాక్సింగ్ ప్రపంచ పటంలో మళ్లీ చోటు దక్కించుకుంటుంది. దేశంలో గుర్తింపు పొందిన బాక్సింగ్ సంఘం లేకపోవడంతో, అంతర్జాతీయ సమాఖ్యల పతకాల కింద పోటీపడాల్సిన దుస్థితి నుంచి భారత బాక్సర్లకు ఊరట లభిస్తుంది. ఆధిపత్య పోరాటం, గందరగోళం, కోర్టులకెక్కిన వివాదాల నుంచి భారత బాక్సింగ్ రంగానికి విముక్తి లభించనుంది.
ఐఎబిఎఫ్ సేవలు
భారత అమెచ్యూర్ బాక్సింగ్ సమాఖ్య (ఐఎబిఎఫ్) పీకల్లోతు అవినీతిలో కూరుకుపోవడంతో మొదలైన సమస్య బాక్సింగ్ రంగాన్ని అతలాకుతలం చేసింది. 1949 ఫిబ్రవరిలో ఏర్పాటైన ఈ సమాఖ్య దశాబ్దాలపాటు అత్యుత్తమ సేవలు అందించింది. దేశంలో బాక్సింగ్‌కు ఊపిరి పోసింది. సీనియర్స్ విభాగంలో జాతీయ చాంపియన్‌షిప్స్‌ను నిర్వహించడమేగాక, యువశక్తిని ప్రోత్సహించడానికి ఏటా జూనియర్స్ విభాగంలో 42, సబ్ జూనియర్స్ విభాగంలో 27 టోర్నమెంట్స్‌ను నిర్వహించింది. బాంబే ప్రావీన్స్ అమెచ్యూర్ బాక్సింగ్ సమాఖ్య (బిపిఎబిఎఫ్)ను 1925లో స్థాపించిన తర్వాత ఐఎబిఎఫ్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించేదాకా భారత బాక్సింగ్ చుక్కానిలేని నావలా ప్రయాణం సాగించింది. ఐఎబిఎఫ్ ఆవిర్భావంతో పరిస్థితి మారింది. అసంఘటితంగా ఉన్న భారత బాక్సింగ్‌ను ఒక దారికి తీసుకురావడంలో ఐఎబిఎఫ్ జరిపిన కృషి, చేసిన సేవలు ప్రశంసనీయం. కానీ, మిగతా క్రీడా సమాఖ్యల్లో మాదిరిగానే ఐఎబిఎఫ్‌లోనూ క్రమంగా ఆధిపత్య పోరాటం ఆరంభమైంది. నిధుల దుర్వినియోగం నిరాటంకంగా కొనసాగింది. అభయ్ సింగ్ చౌతాలా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. ఫలితంగా 2013లో ఐఎబిఎఫ్‌పై ఎఐబిఎ సస్పెన్షన్ వేటు వేసింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో భారత ప్రభుత్వం జోక్యం చేసుకొని, ఐఎబిఎఫ్‌ను పూర్తిగా రద్దు చేసింది. దాని స్థానంలో బాక్సింగ్ ఇండియా (బిఐ) తెరపైకి వచ్చింది.
కోర్టు కేసులు.. రెండు సమాఖ్యలు
సస్పెన్షన్‌పై ఐఎబిఎఫ్ కోర్టును ఆశ్రయించడంతో పరిస్థితి మరింత విషమించింది. ఒలింపిక్ సూత్రాన్ని అనుసరించి క్రీడా సమాఖ్యల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం తగదని పేర్కొంటూ, ఐఎబిఎఫ్‌పై విధించిన సస్పెన్షన్ చెల్లదని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. అప్పటికే భారత బాక్సింగ్‌ను బిఐ తన చేతుల్లోకి తీసుకుంది. కోర్టు తీర్పుతో ఐఎబిఎఫ్ కూడా మళ్లీ పని మొదలుపెట్టింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకే దేశంలో, ఒకే క్రీడకు రెండు జాతీయ సమాఖ్యలు ఏర్పడ్డాయి. ఎఐబిఎ అనుమతి పొందిన సమాఖ్యగా దేశ బాక్సింగ్‌పై తమదే పూర్తి అధికారమని బిఐ వాదించింది. కోర్టు తీర్పు ప్రకారం తమ రద్దు చెల్లదుకాబట్టి, అధికారం తమదేనని, బిఐ ఉనికే ఉండదని ఐఎబిఎఫ్ స్పష్టం చేసింది. రెండు సమాఖ్యలు వేరువేరుగా పాలనను కొనసాగించడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు సమాఖ్యల మధ్య పోరాటం కొనసాగుతుంటే, మరోవైపు బిఐ అధ్యక్షుడు సందీప్ జజోడియా వ్యవహార శైలిపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. దీనితో బిఐ సభ్యత్వం తీసుకోవడానికి వివిధ రాష్ట్రాల బాక్సింగ్ సంఘాలు నిరాకరించాయి. ఎఐబిఎ గుర్తింపు పొందిన బిఐలో చేరలేని పరిస్థితి. ఐఎబిఎఫ్‌లో చేరుదామంటే, దానికి ఎఐబిఎ గుర్తింపు లేదన్న భయం. వివిధ రాష్ట్రాల బాక్సింగ్ సంఘాలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటుంటే, ఆ ప్రభావం బాక్సర్లపైనా పడింది. రియో ఒలింపిక్స్‌కు కేవలం ముగ్గురే అర్హత సంపాదించారు. బాంటమ్ వెయిట్‌లో శివ్ థాపా, లైట్ వెల్టర్‌వెయిట్‌లో మనోజ్ కుమార్, మిడిల్‌వెయిట్‌లో వికాస్ క్రిషన్ పోటీపడినప్పటికీ, రెండో రౌండ్‌ను దాటలేకపోయారు. లండన్ ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ ఫ్లైవెయిట్ ఈవెంట్‌లో మేరీ కోమ్ కాంస్య పతకాన్ని సాధిస్తే, రియోకు మహిళల్లో ఒక్కరు కూడా అర్హత సంపాదించలేకపోవడం గమనార్హం. మొత్తం మీద భారత బాక్సింగ్‌లో నాలుగేళ్లపాటు కొనసాగిన అనిశ్చితి తీవ్ర స్థాయిలో ప్రభావం చూపింది. బాక్సర్ల నైపుణ్యాన్ని, వారి ఆత్మవిశ్వాసాన్ని దారుణంగా దెబ్బతీసింది. ఐఎబిఎఫ్, బిఐ తెరమరుగుకాగా, కొత్తగా ఏర్పాటు చేసిన బిఎఫ్‌ఐకి ఎఐబిఎ గుర్తింపు లభించింది. గత నెల 25న ఎన్నికలు పూర్తికావడంతో భారత బాక్సింగ్ రంగంలో నాలుగేళ్లు కొనసాగిన అనిశ్చితికి తెరపడింది. ప్రముఖ వ్యాపారవేత్త, స్పైస్ జెట్ ఎయిలైన్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అభయ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అతనికి 49 ఓట్లురాగా, ప్రత్యర్థి రోహిత్ జైనేంద్ర జైన్‌కు 15 ఓట్లు మాత్రమే లభించాయి. బిఐకి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన జై కోహ్లీ బిఎఫ్‌ఐలోనూ అదే స్థానానికి ఎన్నికయ్యాడు. ఎఐబిఎ ప్రతినిధి, విదేశాల్లో జరిగే బాక్సింగ్ సమాఖ్యల ఎన్నికల సంఘానికి ఉపాధ్యక్షుడు ఎడ్గర్ టన్నర్ స్వయంగా హాజరై, ఎన్నికల ప్రక్రియను పరిశీలించాడు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికలు సజావుగా సాగాయని, మొత్తం ప్రక్రియ పారదర్శంగా కొనసాగిందని టన్నర్ కితాబిచ్చాడు. ఆ నివేదిక ఆధారంగానే బిఎఫ్‌ఐకి ఈఏడాదిలోగా గుర్తింపునిస్తామని ఎఐబిఎ అధ్యక్షుడు డాక్టర్ చింగ్ కువో ప్రకటించడం శుభసూచకం. బిఎఫ్‌ఐ ఎన్నికలు నిబంధలను అనుసరించి జరిగాయని, ఎక్కడా అవాంఛిత సంఘటనలు చోటు చేసుకోలేదని పేర్కొన్నాడు. బిఎఫ్‌ఐకి గుర్తింపునివ్వడానికి ఎఐబిఎకు ఎలాంటి అభ్యంతరం లేదన్న విషయం అతని మాటల్లో స్పష్టమైంది. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించడానికి కొన్ని లాంఛనాలు పూర్తి కావాల్సి ఉంటుంది. ఎఐబిఎ సర్వసభ్య సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత బిఎఫ్‌ఐకు అధికారికంగా గుర్తింపు లభిస్తుంది.

- బిట్రగుంట