ఆటాపోటీ

పాఠాలు నేర్చుకునేది ఎన్నడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్ టీమిండియాకు ఎన్నో పాఠాలు నేర్పింది. అదే సమయంలో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీపై మరోసారి అనుమానాలకు తెరలేపింది. టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, పరిమిత ఓవర్ల జట్లకు నాయకత్వం వహిస్తున్న ధోనీ మధ్య పోలిక మళ్లీ మొదలైంది. ధోనీని తప్పిస్తే, అతని స్థానాన్ని కోహ్లీతో భర్తీ చేస్తారా? లేక ముంబయి ఓపెనర్ రోహిత్ శర్మకు ఈ అవకాశం లభిస్తుందా? అన్న చర్చ జోరుగా సాగుతున్నది. భారత క్రికెట్‌లో ముంబయి లాబీయింగ్ కొత్తదేమీ కాదు. ముంబయి ఆధిపత్యం దశాబ్దాల కాలంగా కొనసాగుతునే ఉంది. జట్టుకు దిశా నిర్దేశం చేయడంలో ధోనీ విఫలమవుతున్నాడన్న వాదన వినిపిస్తున్నది. స్వదేశంలో జరిగే టి-20 వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లోగా ధోనీ కెప్టెన్సీకి ఎలాంటి ఇబ్బంది లేకపోవచ్చు. ఆతర్వాత అతనికే పగ్గాలు అప్పగిస్తారా? అన్నది అనుమానమే. ‘పిండి కొద్దీ రొట్టె’, ‘సమర్థులు లేనప్పుడు నాయకుడు ఏం చేస్తాడు?’ అన్న సిద్ధాంతాన్ని ధోనీ పదేపదే ప్రస్తావిస్తుంటాడు. ఆటగాళ్లు విఫలమైతే కెప్టెన్ చేయగలిగేది ఏమీ లేదన్నది ధోనీ వాదన. కానీ స్ఫూర్తిదాయకమైన మార్గదర్శకం చేయని నాయకుడు ఎందుకు? అవసరాలకు తగ్గట్టు సహచరుల నుంచి సేవలను రాబట్టుకోలేకపోతే నాయకత్వానికి అర్థం ఏమిటి? ఈ ప్రశ్నలే ధోనీ కెప్టెన్సీ సామర్థ్యాన్ని నిలదీస్తున్నాయి.
స్వప్రయోజనాలకే పెద్దపీట
మన దేశంలో క్రికెట్ ప్రజలతో మమేకమైంది. ఒక మతంగా పరిఢవిల్లుతున్నది. కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. అందుకే, క్రికెట్‌కు సంబంధించిన ఎంత చిన్న అంశమైనా పతాక శీర్షికగా మారుతుంది. అభిమానుల అంచనాలకు తగినట్టు ప్రతిసారీ రాణించడం, విజయాలను అందుకోవడం ఎవరికైనా కష్టమే. ఈ వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. కానీ, ఎవరికివారు తమతమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం జట్టు ప్రతిష్ఠను పణంగా పెట్టడాన్ని ఎవరూ హర్షించరు. ఆస్ట్రేలియాతో జరిగిన వనే్డ ఇంటర్నేషనల్ సిరీస్‌లో చాలాకాలంగా టీమిండియాకు పట్టిన గ్రహణం మరోసారి తేటతెల్లమైంది. భారత ఆటగాళ్లంతా వ్యక్తిగత ప్రయోజనాలు, మైలురాళ్ల కోసం తాపత్రయ పడతారే తప్ప వారంతా జట్టు విజయానికి సమష్టిగా కృషి చేయాలనిగానీ, అందరూ కలిసికట్టుగా పోరాడాలనిగానీ అనుకోవడం లేదని ఆస్ట్రేలియా క్రికెటర్ మాక్స్‌వెల్ చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలు. సమష్టి కృషితోనే విజయపథంలో నడవడం సార్థమవుతుందన్న వాస్తవిక స్ఫూర్తి టీమిండియాలో కొరవడింది. జయాపజయాలు ఎలావున్నా, మైదానంలోకి దిగిన ప్రతిసారీ కడవరకూ పోరాడే జట్టుగా ఉంటామని అభిమానులకు భరోసా ఇవ్వడంలో టీమిండియా ఆటగాళ్లు విఫలమవుతున్నారు. నాణ్యతలేక కాదు.. నిబద్ధత లేకనే భారత జట్టు ఓడుతున్నదనే విమర్శలకు ఆటగాళ్ల నుంచి సమాధానం లేదు. జట్టు ప్రయోజనాలను గాలికొదిలేస్తున్న ఆటగాళ్ల నిర్వాకాలకు సంబంధించిన దుష్ఫలితాలు కళ్లకు కట్టినట్టు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న పట్టుదల, అకుంఠిత దీక్షే బంగ్లాదేశ్ వంటి అనామక జట్టు కూడా సంచలన విజయాలను నమోదు చేసే దిశగా వెళ్లేందుకు ప్రేరేపించాయి. కానీ, క్రికెట్ పట్ల ప్రజల్లో ఉన్న అభిమానాన్ని కోట్లాది రూపాయలుగా మార్చుకుంటున్న భారత క్రికెటర్లు తమను తాము చాలా ఉన్నతంగా ఊహించుకుంటూ, దేశ ప్రతిష్ఠను పణంగా పెడుతున్నారు. మన జట్టులో సమష్టి పోరాటం లేదు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకునే తత్వం లేదు. సృజనాత్మక లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, టీమిండియా సరైన దిశా నిర్దేశం లేక కునారిల్లుతున్నది. మన ఆటగాళ్లు ఎప్పుడు చెలరేగిపోతారో? ఎప్పుడు నీరుగారిపోతారో చెప్పలేని పరిస్థితి. జట్టును నట్టేట ముంచి, స్వప్రయోజనాలకే పెద్దపీట వేయడం టీమిండియా క్రికెటర్లకు కొత్తకాదు. ఆస్ట్రేలియాతో జరిగిన వనే్డ సిరీస్‌లో ఇదే పరిస్థితి పునరావృతమైంది.
విజయమే సర్వస్వమా?
పోటీ అన్న తర్వాత గెలుపు ఓటములుంటాయి. విజయమే సర్వస్వమా అంటే కాదనే సమాధానం చెప్పాలి. అయితే, కోట్లాది మంది అభిమానుల ఆశలను నెరవేర్చడానికి కనీసం ప్రయత్నం జరగకపోవడం క్షమార్హం కాదు. విజయాన్ని, పరాజయాన్ని సమంగా స్వీకరించడమే క్రీడాస్ఫూర్తికి నిదర్శనం. అదే సమయంలో, పోరాటతత్వం క్రీడాకారులకు ఉండాల్సిన ప్రధాన లక్షణం. పోరాడిన తర్వాత ఓడినా అది గెలుపే. పోరాడకుండా గెలిచినా అది వృథానే. క్రికెట్ మ్యాచ్‌లు తమ సొంత వ్యాపారాల కోసం మాత్రమే కాదని, దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు జవాబుదారీ వహించక తప్పదని క్రికెటర్లు గుర్తించాలి. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధికారుల్లోనూ అనుసరించాల్సిన విధివిధానాలపై స్పష్టత ఉండాలి. స్వచ్ఛంద సంస్థల జాబితాలో నమోదైనందువల్ల తాము సర్వస్వతంత్రులమని, ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం తమకు లేదని అనుకోవడం బిసిసిఐ చేస్తున్న తప్పిదం. క్రికెటర్లు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. బోర్డునే బేఖాతరు చేస్తున్నారు.
రికార్డులు ఘనం
టీమిండియాలో వ్యక్తిగత రికార్డులు ఘనంగా కనిపిస్తాయి. కానీ, జట్టు సమష్టిగా రాణించలేకపోతున్నది. ఎవరికివారు తమతమ స్వప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రాధాన్యనిస్తున్నారేగానీ దేశానికి కాదన్నది గణాంకాలను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. ఈ సిరీస్‌లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితా ‘టాప్-4’లో ముగ్గురు భారతీయులే. రోహిత్ శర్మ (441), విరాట్ కోహ్లీ (381) మొదటి రెండు స్థానాలను ఆక్రమిస్తే, శిఖర్ ధావన్ (287) నాలుగో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానం ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (315) దక్కించుకున్నాడు. బౌలర్లే కొంప ముంచారని, వారి వైఫల్యం కారణంగానే భారత జట్టు పరాజయాలను చవిచూసిందని విమర్శలున్నాయి. అయితే, టాప్ బౌలర్ల జాబితా ‘టాప్-3’లో ఇద్దరు భారతీయులే. ఆస్ట్రేలియా పేసర్ జేమ్స్ హాస్టింగ్స్ మొత్తం 10 వికెట్లతో అగ్రస్థానంలో నిలిస్తే, భారత పేసర్లు ఇశాంత్ శర్మ తొమ్మిది, ఉమేష్ యాదవ్ 7 వికెట్లతో వరుసగా రెండు, మూడు స్థానాలను ఆక్రమించారు. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు జాబితాలోనూ టీమిండియా మెరుగైన స్థానాల్లో ఉంది. రోహిత్ శర్మ (171 నాటౌట్) మొదటి స్థానాన్ని ఆక్రమిస్తే, శిఖర్ ధావన్ (126), రోహిత్ శర్మ (124) మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. స్టీవెన్ స్మిత్ (149) రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. గణాంకాలు గొప్పగా ఉన్నా భారత జట్టు ఎందుకు ఓడిందనేది ఆలోచించుకోవాలి. స్వప్రయోజనాలను పక్కకుపెట్టి, జట్టు కోసం ఆడడాన్ని అలవాటు చేసుకుంటే తప్ప భారత క్రికెట్‌కు మంచిరోజులు రావు. ముందుగా బిసిసిఐని జవాబుదారీగా నిల బెట్టాలి.

- బిట్రగుంట