ఆటాపోటీ

నాటి సబ్‌స్టిట్యూట్.. నేటి స్టార్ బ్యాట్స్‌మన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్‌స్టిట్యూట్ ఆటగాడిగా ఉన్నప్పుడే, నాటి సూపర్ హీరో ఇంజమాముల్ హక్ ట్రిపుల్ సెంచరీ చేయడాన్ని చూసి స్ఫూర్తి పొందిన పాకిస్తాన్ ఓపెనర్ అజర్ అలీ తానే స్వయంగా ఆ ఫీట్‌ను సాధించే స్థాయికి ఎదగడం విశేషమే. టెస్టు క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్ ఎంతో మంది ఉన్నారు. కానీ, డే/నైట్ టెస్టులో మొట్టమొదటి శతకాన్ని నమోదు చేసిన అజర్ అలీ ఆతర్వాత దానిని డబుల్, ట్రిపుల్ సెంచరీలుగా మార్చేశాడు. 302 పరుగులతో అతను నాటౌట్‌గా నిలవడంతో, వెస్టిండీస్‌పై తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లకు 579 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. 2002 మే మాసంలో లాహోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంజీ 329 పరుగులు సాధించాడు. ఆ మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా వ్యవహరించిన అజర్ అలీ పాకిస్తాన్ తరఫున ఈ మైలురాయిని చేరిన బ్యాట్స్‌మెన్‌లో నాలుగో స్థానం సంపాదించాడు. ఇంజీతోపాటు హనీఫ్ మహమ్మద్ 1958లో వెస్టిండీస్‌పై బ్రిడ్జిటౌన్ టెస్టులో (337), యూనిస్ ఖాన్ 2009లో శ్రీలంకపై కొలంబో టెస్టులో (313) ట్రిపుల్ సెంచరీలు నమోదు చేశారు.
యూనిస్ అంటే గౌరవం..
సీనియర్ బ్యాట్స్‌మన్ యూనిస్ ఖాన్ అంటే అజర్ అలీకి అమితమైన గౌరవం. డెంగ్యూ జ్వరం బారిన పడిన యూనిస్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీనితో అతను వెస్టిండీస్‌తో మొదటి టెస్టుకు దూరమయ్యాడు. యూనిస్‌తో కలిసి మైదానంలో లేనందుకు అసంతృప్తిగా ఉన్నప్పటికీ, డ్రెస్సింగ్ రూమ్‌లో అతని కుర్చీలో కూర్చుంటున్న తనకు అతని పేరును నిలబెట్టగలిగినందుకు ఎంతో ఆనందంగా ఉందని అజర్ అలీ అంటున్నాడు. పాకిస్తాన్ తరఫున టెస్టుల్లో అత్యధికంగా 9,456 పరుగులు సాధించిన యూనిస్‌ను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని స్పష్టం చేస్తున్నాడు. సీనియర్లు యూనిస్, మిస్బా ఉల్ హక్ మాదిరి ప్రతిభావంతుడైన బ్యాట్స్‌మన్‌గా 31 ఏళ్ల అజర్ అలీకి అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. వనే్డ జట్టుకు మిస్బా స్థానంలో అతనే కెప్టెన్‌గా సేవలు అందిస్తున్నాడు. టెస్టుల్లోనూ మిస్బా స్థానాన్ని త్వరలోనే అజర్ అలీ కొల్లగొడతాడని అతని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రెండో డే/నైట్ టెస్టు
టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది కేవలం రెండో డే/నైట్ టెస్టు. నిరుడు నవంబర్ 27 నుంచి 29 వరకు అడెలైడ్‌లో జరిగిన మొట్టమొదటి డే/నైట్ టెస్టులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఢీ కొన్నాయి. ఆ మ్యాచ్‌ని ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో గెల్చుకుంది. న్యూజిలాండ్ తరఫున టామ్ లాథమ్ (50), ఆస్ట్రేలియా ఆటగాళ్లలో స్టీవెన్ స్మిత్ (53), పీటర్ నెవిల్ (66) మొదటి ఇన్నింగ్స్‌లో అర్ధ శతకాలు నమోదు చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో ఇరు జట్లలో ఎవరూ యాభై పరుగుల మైలురాయిని చేరలేదు. షాన్ మార్ష్ (ఆస్ట్రేలియా) 49, మిచెల్ సాంట్నర్ (న్యూజిలాండ్) 45 చొప్పున పరుగులు చేశారు. మొత్తం మీద మూడు హాఫ్ సెంచరీలతో ఆ టెస్టు ముగిసింది. రెండో డే/నైట్ టెస్టులో అజర్ అలీ ఏకంగా ట్రిపుల్ సెంచరీ చేసి రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. తాను సాధించిన ఈ ఘనతను తల్లిదండ్రులకు, దేశ ప్రజలకు అంకితం ఇస్తున్నట్టు ప్రకటించాడు.