ఆటాపోటీ

టీమిండియా గెలిచిందా? గెలిపించారా??

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వదేశంలో టెస్టు సిరీస్‌లు ఆడినప్పుడు తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించే భారత క్రికెట్ జట్టు విదేశాల్లో ఎందుకు చేతులెత్తేస్తుందన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. పిచ్‌లను తమకు అనుకూలంగా మార్చుకొని భారత జట్టు విజయాలు సాధిస్తున్నదని చాలాకాలంగా విమర్శలు వినిపిస్తునే ఉన్నాయ. స్పిన్‌కను అనుకూలించే పిచ్‌లను సిద్ధం చేసుకోవడం, బ్యాటింగ్‌కు ఎవరు దిగుతున్నారో గమనించి, టీమిండియా రాణించే విధంగా మార్పులుచేర్పులు చేయడం చాలాకాలంగా ఆనవాయతీగా వస్తున్నది. కివీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ ఇదే విధానాన్ని బిసిసిఐ అనుసరించిందని అంటున్నారు.

విదేశాల్లో పిల్లిపిల్లలా మారిపోయే టీమిండియా స్వదేశంలో పులిలా విజృంభించడానికి కారణాలను పరిశీలకులు విశే్లషిస్తున్నారు. సహజంగా హోం పిచ్ తమకు అనుకూలంగా మార్చడానికి అన్ని జట్లూ ప్రయత్నిస్తాయి. ఇది క్రికెట్ మ్యాచ్‌లు మొదలైనప్పటి నుంచి కొనసాగుతున్న ఆనావాయితీనే. అయితే, హోం టీమ్ కోసం ‘జంటిల్మన్ గేమ్’ క్రికెట్ స్ఫూర్తినే దెబ్బకొట్టడం సహించరాని నేరం. విరాట్ కోహ్లీ దూకుడుగా తీసుకునే నిర్ణయాల వల్లనే న్యూజిలాండ్‌పై మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసిందని కొందరు వాదిస్తుంటే, అధిక శాతం మంది ఈ విజయాన్ని ‘దొంగ దెబ్బ’గా అభివర్ణిస్తున్నారు. టీమిండియా గెలవలేదని, క్యూరేటర్లే, అధికారులు కలిసి గెలిపించారన్న వాదన బలంగా వినిపిస్తున్నది. సహజంగానే భారత పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తాయి. ఇటీవల కాలంలో పిచ్‌ని టీమిండియాకు మాత్రమే సహకరించేలా మార్చడం ఒక ఉద్యమంగా కొనసాగుతున్నది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధికారుల నుంచి జట్టు కెప్టెన్ వరకూ ప్రతి ఒక్కరూ క్యూరేటర్‌పై ఒత్తిడి తెచ్చేవారే. ఈ ఏడాది జూన్‌లో మృతి చెందిన కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ మాజీ క్యూరేటర్ ప్రబీర్ ముఖర్జీ వంటి ఒకరిద్దరు మాత్రమే ఒత్తిళ్లకు లొంగకుండా పిచ్‌ని ఆటగాళ్ల ఇష్టానుసారంగా కాకుండా ఆటకు అనుకూలంగా ఉండేలా చూశారు. ఆ తరం క్యూరేటర్లు లేకపోవడంతో, ఇప్పుడు బోర్డు అధికారులు చెప్పిందే వేదమవుతున్నది. పిచ్ ఏ విధంగా ఉండాలనేది క్యూరేటర్ల నిర్ణయానికి కాకుండా తమ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఉండాలని పట్టుబడుతున్నారు. టీమిండియా స్వదేశంలో సాధించే విజయాలపై విమర్శలు వెల్లువెత్తడానికి ఇదే ప్రధాన
కారణం.
‘ఈడెన్’ వివాదం
పరిమిత ఓవర్ల ఫార్మెట్స్‌లో భారత్‌కు కెప్టెన్‌గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ గతంలో ఈడెన్ గార్డెన్స్ మైదానాన్ని తమ బౌలర్లకు అనుకూలంగా మార్చాలని క్యూరేటర్ ప్రబీర్‌ను ఆదేశించడం, ఆ ప్రతిపాదనను అతను బహిరంగంగానే తిరస్కరించడం అప్పట్లో సంచలనం రేపాయి. ఆ ఘటనను దృష్టిలో ఉంచుకొని, కొత్త కెప్టెన్ కోహ్లీ కూడా అలాంటి ఆదేశాలే జారీ చేసి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అయితే, ఈడెన్ గార్డెన్స్ మైదానం కేవలం స్పిన్ పిచ్ కాదని, టెస్టుకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని భారత మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం (సిఎబి) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. అంతకు మందు కాన్పూర్‌లో జరిగిన మొదటి టెస్టులో పిచ్ పూర్తిగా స్పిన్‌కు అనుకూలించడంతో, భారత బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా దానిని సద్వినియోగం చేసుకున్నారు. ఆ టెస్టును టీమిండియా 197 పరుగుల భారీ ఆధిక్యంతో గెల్చుకుంది. భారత క్రికెట్ చరిత్రలో అది 500వ టెస్టు కావడంతో ఆ మ్యాచ్ ప్రాధాన్యతను కూడా సంతరించుకుంది. దానిని గెల్చుకున్న తర్వాత రెండో మ్యాచ్ వేదికైన ఈడెన్ గార్డెన్స్ మైదానంపై అందరి దృష్టి పడింది. స్వదేశంలో భారత్‌కు అది 250వ టెస్టు కావడంతో, ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్గాలనే పట్టుదల కోహ్లీ సేనలో కనిపించింది. ఈ కారణంగానే పిచ్‌ని స్పిన్నర్లకు అనుకూలంగా మారుస్తున్నారన్న ఆరోపణలు వినిపించాయి. కానీ, భారత్‌కు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో పిచ్‌ని స్పిన్‌కు అనుకూలంగా రూపుదిద్దామన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని గంగూలీ అప్పట్లో వివరణ ఇచ్చుకున్నాడు. టెస్టు క్రికెట్‌కు అనువైన పిచ్‌ను సిద్ధం చేసినట్టు తెలిపాడు. టెస్టు ఆకర్షణీయంగా సాగాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. ఇలావుంటే, ఇటీవల చేపట్టిన కొన్ని మరమ్మతుల అనంతరం ఈడెన్ గార్డెన్ వికెట్ పచ్చికతో కళకళలాడింది. వికెట్‌పై కొంత తడి కనిపించింది. పిచ్‌ని తయారు చేసిన తర్వాత ఇక్కడ మొదటి మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు కావడంతో ప్రతి ఒక్కరూ పిచ్ తీరు ఎలా ఉంటుందోనని అనుమానించారు. వారు ఊహించిందే నిజమైంది. ఆ టెస్టు కేవలం నాలుగు రోజుల్లోనే ముగిసింది. ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడని వికెట్‌పై ఏకంగా టెస్టు మ్యాచ్‌ని ఆడించడం పొరపాటన్న విమర్శలను క్యూరేటర్లు, భారత క్రికెట్ అధికారులు పట్టించుకోకపోవడానికి అది టీమిండియాకు అనుకూలించడమేనన్న విమర్శలు లేకపోలేదు. కొత్తగా రూపుదిద్దుకున్న వికెట్‌పై మ్యాచ్‌లు జరగడం అదే మొదటిసారి కాదని క్యూరేటర్ సుజన్ ముఖర్జీ ఇచ్చిన వివరణ ఎవరినీ ఆకట్టుకోలేకపోయింది. కాన్పూర్‌లోనూ అప్పుడే తీర్చిదిద్దిన వికెట్‌పై భారత్, న్యూజిలాండ్ జట్లు మొదటి టెస్టు ఆడాయన్న వాదనను అతను తెరపైకి తీసుకురాగా, అందుకే ఆ మ్యాచ్‌లో భారత్ 197 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిందని పలువురు కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి విమర్శకుల వాదనను నిజం చేస్తూ కోల్‌కతా టెస్టు నాలుగు రోజుల్లోనే ముగిసింది. టీమిండియా 178 పరుగుల భారీ తేడాతో గెలిచింది.
చివరి టెస్టూ ఏకపక్షమే!
ఇండోర్‌లో జరిగిన చివరి టెస్టు కూడా ఏక పక్షంగానే ముగిసింది. భారత్ 321 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 475 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడానికి రెండో ఇన్నింగ్స్ ఆడిన న్యూజిలాండ్ కేవలం 153 పరుగులకే చేతులెత్తేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 81 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టిన భారత స్టార్ స్పిన్నర్ అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో 59 పరుగులకే ఏడు వికెట్లు సాధించాడు. మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా తొలి ఇన్నింగ్స్‌లో రెండు, రెండో ఇన్నింగ్స్‌లో మరో రెండు వికెట్లు కూల్చాడు. దీంతో ఇండోర్ పిచ్‌ను నూటికి నూరుశాతం భారత్‌కు అనుకూలంగా తయారు చేశారన్న విమర్శలు తారస్థాయికి చేరుకున్నాయి. అక్రమ పద్ధతుల్లో సాధించినవి కూడా విజయాలేనా అంటూ అభిమానులు సైతం పెదవి విరుస్తున్నారు. ఈ ఏకపక్ష ఫలితాలే టీమిండియా స్వదేశంలో బలమైన శక్తిగా విజృంభించి, విదేశాల్లో చేతులెత్తేస్తున్నదన్న విమర్శలను బలోపేతం చేస్తున్నాయి.

పిచ్‌లను స్పిన్‌కు మాత్రమే అనుకూలించే విధంగా తయారు చేసి ఉంటే, భారత బ్యాట్స్‌మెన్‌కు పరుగుల వరద ఏ విధంగా సాధ్యమైందని కొందరి వాదన. అయితే, మొదటి నుంచి భారత బ్యాట్స్‌మెన్ స్పిన్‌ను బాగా ఆడగల సమర్థులుగా పేరు పొందారు. దేశవాళీ టోర్నీల్లో ప్రపంచ మేటి స్పిన్నర్లను ఆడిన అనుభవం వారికి ఉంటుంది. చటేశ్వర్ పుజారా మూడు టెస్టుల్లో 373 పరుగులు సాధించగా, మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆజింక్య రహానే 347, విరాట్ కోహ్లీ 309, రోహిత్ శర్మ 238 పరుగులతో రెండు నుంచి నాలుగు స్థానాలను ఆక్రమించారు. న్యూజిలాండ్ తరఫున అత్యధికంగా 200 పరుగులు చేసిన ల్యూక్ రోన్చీకి ఐదో స్థానం దక్కింది. స్పిన్‌ను భారత ఆటగాళ్లు సమర్థంగా ఆడతారనడానికి ఇదే నిదర్శనం. పైగా, మూడు మ్యాచ్‌ల్లోనూ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచాడు. కాబట్టి, ఒకటిరెండు రోజుల తర్వాత పిచ్‌ని స్పిన్‌కు సహకరించే విధంగా సిద్ధం చేయడం క్యూరేటర్లకు కష్టం కాలేదనే వాదన కూడా వినిపిస్తున్నది. విదేశాల్లో కూడా భారత బ్యాట్స్‌మెన్ పరుగుల వరద సృష్టించి, బౌలర్లు భారీ సంఖ్యలో వికెట్లు కూల్చి, ఘన విజయాలను సంపాదించిపెట్టడమే ప్రస్తుతం వెల్లువెత్తుతున్న విమర్శలకు తగిన సమాధానమవుతుంది.

అశ్విన్ 39 టెస్టుల్లో 220 వికెట్లు పడగొట్టాడు. తక్కువ టెస్టుల్లో ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అశ్విన్ వికెట్ల వెల్లువకు అతని ప్రతిభ ఒక కారణమైతే, పిచ్‌లను స్పిన్‌కు అనుకూలంగా మార్చడం మరో కారణం. కోల్‌కతా, ఇండోర్ టెస్టుల్లో మూడు, నాలుగు రోజుల్లో అశ్విన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌కు అసాధ్యంగా మారింది. బంతి అంతగా స్పిన్ తిరగడానికి పిచ్ స్వభావమే ప్రధాన కారణమన్నది వాస్తవం. ఫాస్ట్ బౌలర్లలో మహమ్మద్ షమీ ఎనిమిది వికెట్లు పడగొడితే, భువనేశ్వర్ కుమార్‌కు ఆరు వికెట్లు లభించాయి. స్పిన్నర్ల హవా కొనసాగిందనడానికి పేసర్ల వెనుకంజే నిదర్శనం. అందుకే, న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా గెలిచిందా లేక అధికారులు, క్యూరేటర్లు కలిసి గెలిపించారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. విదేశాల్లోనూ ఇదే స్థాయిలో ఆధిపత్యాన్ని కొనసాగించినప్పుడే స్వదేశంలో మాత్రమే పులులు అన్న ముద్ర నుంచి భారత క్రికెటర్లు బయటపడతారు. -

శ్రీహరి