ఆటాపోటీ

ఆధిపత్యం ఎవరిదో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లాండ్‌తో మరోసారి యుద్ధానికి భారత్ సన్నాహాలు చేస్తున్నది. సొంత గడ్డపై జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు పోరులో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నది. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు ఇటీవలే న్యూజిలాండ్‌కు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో వైట్‌వాష్ వేసి మంచి ఊపుమీద ఉంది. ప్రపంచ నంబర్ స్థానాన్ని మరోసారి దక్కించుకుంది. బంగ్లాదేశ్ లాంటి సాధారణ జట్టును సమర్థంగా ఎదుర్కోలేక, రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-1గా డ్రా చేసుకున్న అలిస్టర్ కుక్ సారథ్యంలోని ఇంగ్లాండ్‌కు భారత్‌ను సమర్థంగా ఎదుర్కోవడం, విజయం సాధించడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తున్నది. ఆ జట్టులో ప్రతిభావంతులకు కొదువ లేకపోయినా, నిలకడ లోపించడంతో దిగాలుపడుతున్నది. ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తన సొంతం చేసుకున్న కుక్ ఒకవైపు, భారత క్రికెట్ జట్టును కొత్త పుంతలు తొక్కిస్తున్న విరాట్ కోహ్లీ మరోవైపు బలగాలను మోహరిస్తున్నారు. వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. అమీతుమీ తేల్చుకోవడానికి కత్తులు దూస్తున్నారు. ఈ ఆధిపత్య పోరాటంలో జయాపజయాలు ఎలావున్నా పోరు హోరాహోరీగా కొనసాగుతుందని, నరాలు తెగిపోయే ఉత్కంఠ చివరి వరకూ ఉక్కిరిబిక్కిరి చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఏక పక్షంగా ముగియడం అందరినీ నిరాశకు గురి చేసింది. అలాంటి పరిస్థితి ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌లో పునరావృతం కాదన్నది విశే్లషకుల అభిప్రాయం.
దెబ్బతిన్న ఆత్మవిశ్వాసం!
ఇంగ్లాండ్ క్రికెటర్ల ఆత్మవిశ్వాసం దారుణంగా దెబ్బతిన్నదన్నది నిజం. టెస్టు క్రికెట్‌లో పసికూనలైన బంగ్లాదేశ్ చేతిలో కుక్ సేన మొట్టమొదటిసారి ఓటమిపాలైంది. మొదటి టెస్టును గెల్చుకున్నా, రెండో టెస్టులో పరాజయాన్ని ఎదుర్కొని, సిరీస్‌ను డ్రా చేసుకుంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉన్న టీమిండియాను ఎదుర్కోవడం ఇంగ్లాండ్‌కు సాధ్యమా అన్నది అనుమానంగానే ఉంది. టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన బంగ్లాదేశ్ యువ స్పిన్నర్ మెహెదీ హసన్ మీర్జా బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో కుక్ బృందం దారుణంగా విఫలమైంది. అతను రెండో టెస్టుల్లో 19 వికెట్లు పడగొట్టాడు. రెండో టెస్టులో ఏకంగా 12 వికెట్లు సాధించాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ స్పిన్‌ను ఎదుర్కోలేకపోతున్నారని చెప్పడానికి మెహెదీ హసన్ కూల్చిన వికెట్లే సాక్ష్యం. బంగ్లాదేశ్ గొప్ప జట్టేమీ కాదు.. ఆ దేశంలో కొత్తగా టెస్టుల్లోకి వచ్చిన ఒక స్పిన్నర్ అద్భుతాలు సృష్టిస్తాడని ఎవరూ ఊహించరు. కానీ, మెహెదీ హసన్‌కు ఆ అవకాశాన్ని ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ అందించారు. రెండో టెస్టులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతోపాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా కట్టబెట్టారు. సామాన్య స్పిన్నర్‌ను ఎదుర్కోలేకపోయిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ భారత్‌లో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా వంటి ప్రపంచ మేటి స్పిన్నర్లను ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాలి. పైగా న్యూజిలాండ్‌ను మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 3-0 తేడాతో చిత్తుచేసి కోహ్లీ అద్వితీయ ఫామ్‌లో ఉంది. ఈ దూకుడును అడ్డుకోవడం ఇంగ్లాండ్‌కు సాధ్యమా అన్నది ప్రశ్న. సమాధానం కోసం వేచి చూడాల్సిందే.

ఇంగ్లాండ్‌దై పైచేయి!

ఇరు దేశాల ద్వైపాక్షిక టెస్టు మ్యాచ్‌ల గణాంకాలను పరిశీలిస్తే, భారత్‌పై ఇంగ్లాండ్‌దే పైచేయిగా స్పష్టమవుతుంది. 1932-2014 మధ్యకాలంలో ఈ రెండు జట్ల మధ్య 112 టెస్టులు జరిగాయి. ఇంగ్లాండ్ 43 విజయాలు సాధిస్తే, భారత్ 21 మ్యాచ్‌ల్లో గెలిచింది. 48 టెస్టుల్లో ఫలితం తేలలేదు. కాగా, గత ఐదు సిరీస్‌ల్లో భారత్ రెండింటిలో నెగ్గింది. ఇంగ్లాండ్ మూడు సిరీస్‌లను సొంతం చేసుకుంది.

బలాన్స్‌పై ఒత్తిడి

బ్యాట్స్‌మన్ గారీ బలాన్స్ వైఫల్యాలు ఇంగ్లాండ్‌ను వేధిస్తున్నాయి. అతను కూడా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టులు ఆడిన అతను మొత్తం 23 పరుగులు చేయగలిగాడు. స్పిన్ బౌలింగ్‌ను అర్థం చేసుకోలేక తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరిన అతనికి అశ్విన్, జడేజా, మిశ్రా వంటి గొప్ప స్పిన్నర్ల నుంచి సమస్యలు తప్పవు. మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్‌సహా పలువురు మాజీ క్రికెటర్లు ముగ్గురు స్పిన్నర్లతో ఆడాలంటూ కోహ్లీకి హితవు పలికారు. దీనితో అశ్విన్, జడేజాతోపాటు 33 ఏళ్ల మిశ్రాకూ తుది జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తున్నది. వీరి నుంచి బలాన్స్‌కేగాక, ఇతర బ్యాట్స్‌మెన్ సైతం బెంబేలెత్తడం ఖాయం.

- శ్రీహరి