ఆటాపోటీ

నేమార్ పన్ను ఎగవేత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రెజిల్ సాకర్ సూపర్ స్టార్ నేమార్‌పై అధికారులు పన్ను ఎగవేత కేసు పెట్టారు. నేమార్ ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న అతని తండ్రి నేమార్ సీనియర్‌పైనా కేసు నమోదైంది. ఇప్పటికే స్పెయిన్‌లో కేసు ఎదుర్కొంటున్న నేమార్‌ను తాజా సంఘటన ఆందోళనకు గురి చేస్తున్నది. తప్పుడు పత్రాలను దాఖలు చేసి, ఆదాయ పన్నును ఎగ్గొట్టినట్టు తనపై వచ్చిన ఆరోపణలపై నేమార్ తీవ్రంగా స్పందిస్తూ, అదంతా కట్టుకథ అని కొట్టిపారేసిన కొన్ని గంటల్లోనే స్వదేశంలోనూ కేసు నమోదు కావడం విశేషం. ఇప్పటికే బ్రెజిల్ ఆదాయ పన్ను అధికారులు అతనికి 1,12,000 డాలర్ల జరిమానా విధించారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ నేమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. పన్ను ఎగవేతతోపాటు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు కూడా నేమార్‌ను బాధ్యుడ్ని చేస్తూ బ్రెజిల్ అధికారులు తాజాగా మరో కేసు వేశారు. ఈ పరిణామం ఒకవైపు వేధిస్తుంటే, మరోవైపు స్పెయిన్‌లో నడుస్తున్న కేసులో అతను కోర్టుకు హాజరుకావాల్సి వచ్చింది. 2013లో సాంటోస్ నుంచి బార్సిలోనాకు బదలీ అయినప్పుడు భారీగా డబ్బు తీసుకున్నప్పటికీ, చాలా తక్కువ మొత్తాన్ని రికార్డుల్లో చూపాడంటూ స్పానిష్ అధికారులు అతనిపై కేసు పెట్టారు. దీనిపై విచారణకు హాజరై, వివరణ ఇవ్వాలంటూ అందిన ఆదేశాల మేరకు అతను బార్సిలోనాలోని కోర్టుకు వెళ్లాడు. జీన్స్ ప్యాంట్, టీ షర్టు ధరించిన అతను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే, అంతకు ముందు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. బార్సిలోనా తరఫున ఆడుతూ అతను వారానికి 2,15,000 డాలర్లు సంపాదిస్తున్నాడన్న వార్తలు ఉన్నాయి. తన ఆర్థిక లావాదేవీలన్నీ తన తండ్రే పర్యవేక్షిస్తున్నందున నేమార్‌కు కేసుల నుంచి తప్పించుకోలేని పరిస్థితి నెలకొంది. ఆదాయ పన్ను ఎగవేతకు పాల్పడ్డానని, తప్పుడు పత్రాలను చూపానని విమర్శిస్తున్న వారు ఆ ఆరోపణలను నిరూపించాలని నేమార్ అన్నాడు. తాను ఆటపై దృష్టి కేంద్రీకరించడానికి వీలుగా తన తండ్రి అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నాడని చెప్పాడు. ఆయన పొరపాట్లు చేస్తాడని తాను అనుకోవడం లేదన్నాడు. మీడియాలో వచ్చే వార్తలను దృష్టిలో ఉంచుకొని ఆరోపణలు చేయడం తగదని అధికారులకు సూచించాడు. అయితే, స్పెయిన్‌లో కేసును ఎదుర్కొంటున్న అతను కోర్టుకు హాజరైన తర్వాత మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించాడు. అభిమానులతో కలసి కోర్టులోనే సెల్ఫీలు దిగిన నేమార్ ఈ కేసు గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.