ఆటాపోటీ

కబడ్డీకి చేయూత ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్భాటాలు లేకుండా..
కబడ్డీ ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, చాలా సీదాసాదాగా సాగే ఆట. దీనికి హంగులు అద్దాల్సిన అవసరం లేదు. శతాబ్దాలుగా ప్రచారం ఉన్న ఈ ఆటకు పెద్దపెద్ద మైదానాలు అవసరం లేదు. భారీ ఏర్పాట్లు అంతకంటే అవసరం లేదు. అంతేకాదు.. క్రీడా సామాగ్రితో పనిలేదు. పైసా ఖర్చు కూడా లేకుండా, ఎవరైనా, ఎక్కడైనా ఆడుకోవచ్చు. ఇంత చవకైంది, అందుబాటులో ఉంటుంది కాబట్టే కబడ్డీ ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. అయితే, చూసేందుకు ఆషామాషీగా కనిపించినా, కబడ్డీలో రాణించాలంటే అత్యుత్తమ అథ్లెట్‌కు ఉండే ఫిట్నెస్‌తోపాటు చురుకుదనం, వేగం, ఆత్మవిశ్వాసం వంటి లక్షణాలు పుష్కలంగా ఉండాలి. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం కూడా తప్పనిసరి. సాధారణ క్రీడ కాబట్టే ప్రపంచ దేశాలన్నీ కబడ్డీపై ఆసక్తి చూపుతున్నప్పటికీ, అసాధారణ ప్రమాణాలు లేకపోతే పరాజయాలు, పరాభవాలు తప్పవు.

పెరుగుతున్న ఆదరణ
* ఒకప్పుడు గ్రామీణ క్రీడగానే పరిచితమైన కబడ్డీ ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ క్రీడగా ఎదిగింది. రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. ఫలితంగా ప్రో కబడ్డీ, ప్రీమియర్ లీగ్ కబడ్డీ వంటి టోర్నీలు తెరపైకి వచ్చాయి. ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ మేజర్ ఈవెంట్‌గా వెలుగుతున్నది. మొత్తం మీద గ్రామాల్లో సరదాగా ఆడుకునే కబడ్డీ నేడు ప్రొఫెషనల్ క్రీడగా మారింది. వివిధ టోర్నీలతో విశేష గుర్తింపు సంపాదించుకుంది. సరైన ప్రోత్సాహం ఉంటే, ఉజ్వల భవిష్యత్తు ఖాయమన్న నమ్మకంతో ఎంతో మంది కబడ్డీని ఒక వృత్తిగా స్వీకరిస్తున్నారు. వారి అంచనాలు తప్పుకాకపోయినా, ఆశించిన స్థాయిలో ఆదరణ లభించడం లేదన్నది తిరుగులేని నిజం.

కబడ్డీ..
సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితమే మన దేశంలో ఈ ఆట జనాల్లో ఆదరణ పొందనడానికి చారిత్రక ఆధారాలున్నాయి. మన దేశంలో పురుడు పోసుకొని, తప్పటడుగులు వేస్తూ, తొలుత ఆసియా ఖండమంతా విస్తరించిన కబడ్డీకి ఇప్పుడు అంతర్జాతీయ హోదా లభించింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఈ ఆటపై మక్కువ చూపుతున్నాయి. కానీ, జన్మనిచ్చిన మన దేశంలోనే ప్రోత్సాహం కరవైంది. ప్రో కబడ్డీ లీగ్ కారణంగా ఇది కొంత వరకైనా ప్రొఫెషనల్ క్రీడగా మారింది. లేకపోతే, దాదాపుగా కనుమరుగయ్యే ప్రమాదంలో పడిపోయేది. ఇటీవలే ప్రపంచ కప్‌ను మరోసారి కైవసం చేసుకున్న భారత జట్టు ఆటగాళ్లతోపాటు కోచ్‌కి కూడా తలా పది లక్షల రూపాయల నజరానాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది శుభ పరిణామమే. కానీ, రియో ఒలింపిక్స్‌లో రజత, కాంస్య పతకాలను గెల్చుకున్న పివి సింధు (బాడ్మింటన్), సాక్షి మాలిక్ (రెజ్లింగ్)లపై కురిసిన కోట్లాది రూపాయలతో పోలిస్తే ఇది ఏమాత్రం? గల్లీ స్థాయి టోర్నీల్లో ఆడే క్రికెటర్లు కూడా లక్షలకు లక్షలు సంపాదిస్తారు. జాతీయ జట్టులో స్థానం సంపాదిస్తే, వారి సంపాదనకు ఆకాశమే హద్దు. వందల కోట్లు వారి ఖజానాలో చేరిపోతాయి. క్రికెట్ తర్వాత బాడ్మింటన్, టెన్నిస్ స్టార్లకు మన దేశంలో ఆదరణ, తద్వారా ఆదాయం లభిస్తున్నాయి. కానీ, కుస్తీ, కబడ్డీ వంటి దేశీయ క్రీడలకు మాత్రం రవ్వంతైనా ప్రోత్సాహం లభించడం లేదు. ఒక క్రికెటర్ ఒక సీజన్‌లో సంపాదించినంత డబ్బు కబడ్డీ క్రీడాకారుడికి కెరీర్ మొత్తం శ్రమించినా లభించదు. దుర్భరమైన పరిస్థితులను, ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, సౌకర్యాలు లేని కేంద్రాల్లోనే ప్రాక్టీస్ చేసి అంతర్జాతీయ స్థాయిని ఆర్జిస్తున్నారంటే, అది వారి పట్టుదల, ఆత్మవిశ్వాసమే తప్ప మరొకటి కాదు. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే కబడ్డీ క్రీడాకారులు మరింతగా శ్రమించి, అంతర్జాతీయ వేదికలపై భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తారనడంలో సందేహం లేదు.
తిరుగులేని భారత్
కబడ్డీ ప్రపంచాన్ని భారత్ శాసిస్తున్నది. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో ఓటమిని చవిచూడకుండా, వరుస విజయాలతో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. హాకీలో ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలినప్పటికీ ఇప్పుడు ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించడమే మహాభాగ్యం అనుకునే దుస్థితిని ఎదుర్కొంటున్నాం. క్రికెట్‌ను నెత్తిన పెట్టుకొని ఊరేగుతూ, మిగతా క్రీడలను నిర్లక్ష్యం చేసినందుకు ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం. సరైన ఆదరణ లేకపోవడంతో, అన్ని క్రీడల్లోనూ తిరోగమనంలో శర వేగంగా దూసుకెళుతున్నాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కబడ్డీలో విశ్వవిజేతగా కొనసాగడం మన క్రీడాకారుల ప్రతిభకు నిదర్శనం. ఏమాత్రం ప్రోత్సాహం లేకపోయినా అసాధారణ ఫలితాలను అందుకుంటున్న వీరు, క్రికెటర్ల మాదిరి ప్రోత్సాహం లభిస్తే ఎన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారో ఊహించుకోవచ్చు. 2004 నుంచి ఇప్పటి వరకూ పురుషుల విభాగంలో ఎనిమిది, మహిళల విభాగంలో ఒకసారి వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ జరిగితే, అన్నింటిలోనూ విజయం భారత్‌నే వరించింది. ప్రో కబడ్డీ టోర్నమెంట్ రంగ ప్రవేశంతో కబడ్డీ తీరు మారుతున్నది. ఇది క్రీడాకారులకు కొత్త జీవితాలను ప్రసాదిస్తున్నది. నిజమే.. కానీ, క్రికెటర్లు, కోట్లకు పడగలెత్తిన రియో ఒలింపిక్స్ విజేతలతో పోలిస్తే వీరికి లభిస్తున్న ప్రత్సాహం ఏమిటి? లభిస్తున్న నజరానాల విలువ ఎంత? ఈ భారీ తేడాను ఒక్కసారిగా సరి చేయడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ, వ్యత్సాసాన్ని సాధ్యమైనంత తక్కువ చేయడానికి ప్రయత్నం జరగాలి. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే నడుం బిగించాలి.
ఎన్నో రకాలు..
కబడ్డీల్లో ఎన్నో విధానాలు. దీనికి ఎన్నో పేర్లు.. కానీ, మూల సూత్రాలు మాత్రం ఒకటే. పురుషుల విభాగంలో 10న13 మీటర్లు, మహిళల విభాగంలో 8న12 మీటర్ల విస్తీర్ణం ఉండే కోర్టులో ఇరు జట్లు తలపడతాయి. ఒక్కో జట్టులో ఏడుగురు సభ్యులుంటారు. ప్రత్యామ్నాయం కోసం ముగ్గురు క్రీడాకారులను రిజర్వ్‌లో ఉంచుతారు. మధ్యలో ఊపిరి తీసుకోకుండా ‘కబడ్డీ.. కబడ్డీ’ అని కూతపెడుతూ వెళ్లే రైడర్ ప్రత్యర్థులకు చిక్కకుండా విజయవంతంగా వెనక్కు రావాలి. తిరిగి తమ కోర్టుకు చేరే క్రమంలో ఎంతమందిని అతను ముట్టుకుంటాడో అంతమంది తాత్కాలికంగా అవుటవుతారు. తమ జట్టుకు పాయింట్లు లభించినప్పుడు వారికి మళ్లీ మ్యాచ్‌లో ఆడే అవకాశం లభిస్తుంది. మొత్తం 45 నిమిషాల మ్యాచ్ ప్రథమార్ధంలో 20, ద్వితీయార్ధంలో 20 నిమిషాల ఆట కొనసాగుతుంది. మధ్యలో ఐదు నిమిషాల విరామాన్ని ఇస్తారు. ఏ జట్టు ఆటగాళ్లంతా అవుటవుతారో లేదా ఎప్పుడు నిర్ణీత సమయం ముగుస్తుందో అప్పటికి ఎక్కువ పాయింట్లు సంపాదించిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఈ విధానంలోనే అంతర్జాతీయ మ్యాచ్‌లు జరుగుతాయి. ఒక రకంగా శతాబ్దాలుగా కబడ్డీ అనుసరిస్తూ వస్తున్న మూల సూత్రాలు కూడా ఇవే. అయితే, కొన్నికొన్ని మార్పులతో ప్రాంతీయ స్థాయిలో మ్యాచ్‌లు ఆడుతుంటారు. సంజీవని, జెమినీ, అమర్, పంజాబీ వంటివి విధానాలు మన దేశంలో అమల్లో ఉన్నాయి. హదుదు (బంగ్లాదేశ్), బైబాలా (మాల్దీవ్స్), చెడుగుడు (ఆంధ్రప్రదేశ్), సడుగుడు (తమిళనాడు) హుతుతు (మహారాష్ట్ర) తదితర పేర్లు వాడుకలో ఉన్నప్పటికీ, నియమనిబంధనలను మాత్రం దాదాపు ఒకటే.
అభివృద్ధికి కృషి
మన దేశం ఎంతోకాలంగా కబడ్డీ అభివృద్ధికి, దానిని విశ్వవ్యాపితం చేయడానికి విశేషంగా శ్రమిస్తున్నది. 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో భారత్ ప్రదర్శించిన కబడ్డీ మ్యాచ్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. అయితే, బ్రిటన్ తన వలస దేశాలన్నిటిలోనూ క్రికెట్‌ను పెంచి పోషించడంతో కబడ్డీకి ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించలేదు. పైగా భారత ప్రభుత్వమే చిన్నచూపు చూడడంతో, కబడ్డీ ఒలింపిక్స్‌లో ఒక క్రీడాంశంగా రూపాంతరం చెందలేకపోయింది. క్రికెట్ మాయలో యావత్‌దేశం కొట్టుకుపోతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీకి ఆదరణ తగ్గకపోవడాన్ని గొప్ప విశేషంగానే చెప్పుకోవాలి. కొంతకాలంగా గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు క్రమం తప్పకుండా పోటీలు, టోర్నీలు జరుగుతునే ఉన్నాయి. పురుషులకు మాత్రమే పరిమితం అనుకునే రోజులకు తెరపడింది. 1995లో మొదటిసారి మన దేశంలో మహిళల విభాగంలోనూ పోటీలు మొదలయ్యాయి. ఈ స్ఫూర్తితోనే 2010లో జరిగిన గాంగ్జూ ఏషియాడ్‌లో మహిళల కబడ్డీకి ఒక క్రీడాంశంగా గుర్తింపు లభించింది. నిరుడు మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ జరిగింది. ప్రభుత్వాధికారులు, ప్రజలు చేయూతనిస్తే ఈ క్రీడ మన దేశంలో మరింత బలపడుతుంది. కానీ, చేయూత లభిస్తుందా అన్నదే అనుమానం.

చారిత్రక నేపథ్యం

కబడ్డీకి చారిత్రక నేపథ్యం ఉంది. మన దేశంలో కబడ్డీని 4000 సంవత్సరాలకు పూర్వం నుంచే ఆడేవారనడానికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు, ఎలా ఆరంభమైందనే అంశంపై స్పష్టత లేకపోయినప్పటికీ, కురుక్షేత్ర సంగ్రామం సమయంలో అభిమన్యుడు మొట్టమొదటిసారి కబడ్డీని పోలిన క్రీడను కనిపెట్టాడన్న కథనం వ్యాప్తిలో ఉంది. ఇక, కబడ్డీ అనే పదం ‘కాయ్-పిడి’ అన్న తమిళ పదం నుంచి వచ్చిందని అంటారు. ‘కాయ్-పిడి’ అంటే గొలుసుకట్టులా చేతులు పట్టుకోవడమని అర్థం. ఈ క్రీడ భారత ఉప ఖండంలో ఎంతో ప్రచారంలో ఉంది. భారత్‌కు గట్టిపోటీనిచ్చే దేశాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముందు వరుసలో ఉండడమే ఇందుకు తార్కాణం. బంగ్లాదేశ్‌లో కబడ్డీ జాతీయ క్రీడగా ఉందనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ, అది అక్షరాలా నిజం. కబడ్డీ ఆడడానికి కొంచం ఖాళీ స్థలం.. ఒక విజిల్ ఉంటే చాలు. ఏ స్థాయి టోర్నీలనైనా నిర్వహించవచ్చు. ఇంత సులభంగా సాధ్యమయ్యే క్రీడ మరొకటి లేదు. కబడ్డీ జన్మస్థానం మన దేశమే అయినా, ఆసియాలో చాలా దేశాల్లో ఈ క్రీడకు ప్రాచుర్యం ఉంది. ఇటలీ, స్పెయిన్, అర్జెంటీనా, డెన్మార్క్, అమెరికా, బెల్జియం దేశాల్లోనూ కబడ్డీ ప్రొఫెషనల్ క్రీడగా ఎదుగుతున్నది. 1985లో శాఫ్ క్రీడలకు బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చింది. ఢాకాలో కబడ్డీని ఒక ప్రదర్శనాంశంగా చేర్చడంతో ప్రపంచ దేశాల దృష్టి పడింది. 1990 (బీజింగ్)లో తొలిసారి ఆసియా క్రీడల్లో అరంగేట్రం చేసింది. 1997లో ఆసియా ఇండోర్ గేమ్స్‌లోనూ కబడ్డీ స్థానం సంపాదించింది. మరుసటి సంవత్సరమే ఆసియా బీచ్ గేమ్స్‌లో భాగమైంది. ఈ విధంగా ఆసియా, ఆసియా ఇండోర్, ఆసియా బీచ్ గేమ్స్‌లో చోటు దక్కించుకున్న ఏకైక క్రీడ కబడ్డీ. 2010 ఆసియా క్రీడల్లో మహిళల విభాగంలోనూ కబడ్డీ ఒక ప్రధాన క్రీడాంశంగా చేరింది. ఈ ఏడాది జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కొత్త జట్ల చేరిక, ఈ క్రీడ విశ్వవ్యాపితమైందని చెప్పడానికి నిదర్శనం.

‘ప్రో’ విప్లవం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 టోర్నమెంట్ అతి కొద్దికాలంలోనే విశేష ఆదరణను పొంది, ప్రపంచ క్రికెట్‌లో పెను మార్పులకు కారణమైంది. టెన్నిస్, బాడ్మింటన్, ఫుట్‌బాల్, హాకీ తదితర క్రీడలు అదే పంథాను అనుసరిస్తున్నాయి. ఆ ఒరవడిలోనే ప్రో కబడ్డీ కూడా తెరపైకి వచ్చింది. ఇది ఒక రకంగా దేశంలో కబడ్డీ విప్లవాన్ని తీసుకొచ్చింది. ఈ మ్యాచ్‌లను చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. దేశ వ్యాప్తంగా అత్యధిక శాతం మంది టీవీల్లో ఈటోర్నీ మ్యాచ్‌లను వీక్షించారు. మొదటి సీజన్‌లోనే ప్రో కబడ్డీ 435 మిలియన్ల మందిని ఆకర్షించింది. ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌ను 635 మిలియన్ల మంది చూశారని అంచనా. దాని తర్వాతి స్థానం ప్రో కబడ్డీకే దక్కడం విశేషం. 34 దేశాలకు చెందిన క్రీడాకారులు వివిధ ఫ్రాంచైజీల తరఫున ఆడుతున్నారు. విదేశాల్లోనూ కబడ్డీ ఆదరణ పొందడానికి ఇదీ ఒక కారణం. మొత్తానికి ప్రో కబడ్డీ ఈ గ్రామీణ క్రీడకు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది. భారత క్రీడా పుస్తకంలో కొత్త పర్వాన్ని లిఖించింది.

వరల్డ్ కప్‌లో భారత్

కబడ్డీలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదిగిన భారత వరల్డ్ కప్‌ను వరుసగా ఎనిమిది పర్యాయాలు గెల్చుకుంది. 2004లో ఇరాన్‌ను ఓడించి టైటిల్ సాధించింది. 2007లో మరోసారి అదే జట్టుపై గెలిచింది. 2010లో పాకిస్తాన్‌ను, 2011లో కెనడాను చిత్తుచేసి టైటిల్‌ను నిలబెట్టుకుంది. 2012, 2013, 2014 సంవత్సరాల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పైనే విజయాలను నమోదు చేసి, తనకు ఎదురులేదని నిరూపించుకుంది. ఈ ఏడాది పాకిస్తాన్‌ను పోటీలకు నిర్వాహకులు ఆహ్వానించలేదు. సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే ఇందుకు కారణం. మిగతా జట్లతో హోరాహోరీగా పోరాడిన భారత్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. కబడ్డీ రారాజుగా ప్రశంసలు అందుకుంది.

బాలీవుడ్ సూపర్ స్టార్ల ఆసక్తి

బాలీవుడ్ స్టార్లుసహా ఎంతో మంది ప్రముఖులు కబడ్డీ జట్లను కొన్నారు. కొనేందుకు ఉత్సాహపడుతున్నారు. అక్షయ్ కుమార్‌కు ఖల్సా వారియర్స్, రజత్ బేడీ, మోండీ సిక్కాకు పంజాబ్ థండర్స్, సోనాక్షి సిన్హాకు యునైటెడ్ సింగ్స్, యోయో హనీ సింగ్‌కు యోయో టైగర్స్ జట్లు ఉన్నాయి. ప్రో కబడ్డీల్లో బెంగాల్ వారియర్స్ (కోల్‌కతా/ యజమాని ఫ్యూచర్ గ్రూప్), బెంగళూరు బుల్స్ (బెంగళూరు/ కాస్మిక్ గ్లోబల్ మీడియా), దబాంగ్ ఢిల్లీ (్ఢల్లీ/ డూ ఇట్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్), జైపూర్ పింగ్ పాంథర్స్ (జైపూర్/ అభిషేక్ బచ్చన్), పాట్నా పైరేట్స్ (పాట్నా/ రాజేష్ సింగ్), తెలుగు టైటాన్స్ (వీరా స్పోర్ట్స్), యుముంబా (ముంబయి/ యూనీ లేజర్ స్పోర్ట్స్), పునేరీ పల్టన్ (పుణే/ ఇన్సుర్కోట్ స్పోర్ట్స్) ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి.

- నిత్యమహి