ఆటాపోటీ

మెస్సీకి నేమార్ ‘లిఫ్ట్’! (పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాకర్ ప్రపంచంలో అర్జెంటీనా, బ్రెజిల్ చిరకాల ప్రత్యర్థులన్నది అందరికీ తెలిసిందే. రెండు జట్ల ఆటగాళ్లే కాదు.. అభిమానులు కూడా కయ్యానికి కాలుదువ్వుకుంటారు. మైదానంలో మ్యాచ్ జరుగుతున్నప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు. పోటీలు, టోర్నీలు లేనప్పుడూ ఇరు దేశాల మధ్య ఇదే దృశ్యం కనిపిస్తుంది. అయితే, అర్జెంటీనా సాకర్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీకి బ్రెజిల్ హీరో నేమార్ సాయం చేశాడు. తన ప్రైవేటు జెట్‌లో అతనికి లిఫ్ట్ ఇచ్చాడు. తమతమ జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు ఇద్దరూ ప్రత్యర్థులేగానీ, స్పానిష్ క్లబ్ బార్సిలోనా తరఫున వీరు ఆడుతున్నారు. అందుకే, వీరి మధ్య స్నేహం ఉంది. ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో పాల్గొనడానికి ప్రయాణమైన మెస్సీకి సకాలంలో విమానం దొరకలేదు. దీనితో నేమార్ తన ప్రైవేటు జెట్‌లో మెస్సీతోపాటు అర్జెంటీనాకే చెందిన జేవియర్ మచెరానోకు కూడా లిఫ్ట్ ఇచ్చాడు. ‘దోస్త్ మేరా దోస్త్’ అంటూ మెస్సీ, నేమార్ పాట పాడుకుంటున్నారేమో!

పెర్త్‌లో టాప్?

ఆస్ట్రేలియా జట్టుకు పెర్త్‌లోని డబ్ల్యుఎసిఎ (వాకా) స్టేడియంలో మంచి రికార్డే ఉంది. అక్కడ 43 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు 24 విజయాలు సాధించింది. ఎనిమిది డ్రా అయ్యాయ. 11 మ్యాచ్‌ల్లో పరాజయాలను చవిచూసింది. వీటిలో మూడు వరుసగా దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైనవే కావడం విశేషం. మరే జట్టు అందుకోని అరుదైన రికార్డును సౌతాఫ్రికా ప్రస్తుత పర్యటనలో నమోదు చేసింది. 2008-09 సీజన్‌లో ఆసీస్‌పై పెర్త్ టెస్టును కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికాలో తిరిగి 2012-13 సీజన్‌లో మరోసారి అదే ఫలితాన్ని రాబట్టింది. తాజా టూర్‌లో మరోసారి పెర్త్ టెస్టులో విజయభేరి మోగించి హ్యాట్రిక్ సాధించింది. మొత్తానికి ఆస్ట్రేలియా జట్టుకు హోం గ్రౌండ్‌గా చెప్పుకొనే వాకా స్టేడియంలో దక్షిణాఫ్రికా టాపర్‌గా నిలవడాన్ని అద్భుతంగా పేర్కోవాలి.

పతనం అంటే ఇదే!

వికెట్ల పతనం అంటే ఏమిటో చెప్పడానికి దక్షిణాఫ్రికాతో పెర్త్‌లో జరిగిన మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఇన్నింగ్స్‌ను ఉదాహరణగా తీసుకోవాలి. మొదటి వికెట్‌కు డేవిడ్ వార్నర్, షాన్ మార్ష్ 158 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అయితే, ఈ స్కోరు వద్ద తొలి వికెట్ కూలగా, మరో 86 పరుగులకే ఆసీస్ మిగతా తొమ్మిది వికెట్లను చేజార్చుకుంది. మొదటి వికెట్‌కు 150 లేదా అంతకు మించి పార్ట్‌నర్‌షిప్ నమోదైన తర్వాత వంద కంటే తక్కువ పరుగులకే ఒక జట్టు కుప్పకూలడం ఇది మూడోసారి. ఇంతకు ముందు రెండుసార్లు జింబాబ్వే ఈ విధంగా ఆలౌటైంది. 2011 జూలైలో బులవాయోలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 164 పరుగుల వరకూ ఒక్క వికెట్ కూడా కోల్పోని ఆ జట్టు 228 పరుగులకు కుప్పకూలింది. 2002 జనవరిలో శ్రీలంకతో గాలేలో జరిగిన టెస్టులో వికెట్ నష్టం లేకుండా 153 పరుగులు చేసిన జింబాబ్వే 236 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు 150కి పైగా పరుగులు చేసినప్పటికీ మరో వంద పరుగుల్లోపే కుప్పకూలిన మూడో సంఘటన నమోదుకాగా, ఆస్ట్రేలియా రెండో జట్టుగా చరిత్ర పుస్తకాల్లోకి ఎక్కింది.

- సత్య