ఆటాపోటీ

జారుడు మెట్లపై ఆస్ట్రేలియా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియా క్రికెట్ జారుడు మెట్లపై నిలబడింది. ఇప్పటికే పతనం ఆరంభమైంది. పాతాళంలోకి పడిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది. ఒకప్పటి సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్‌లు, షేన్ వార్న్‌లు, జెఫ్ థాంప్సన్‌లు, స్టీవ్ వాలు, జాసన్ గిలెస్పీలు, ఆడం గిల్‌క్రిస్ట్‌లు, రాడ్నీ మార్ష్‌లు ఇప్పుడు జట్టులో లేరు. అప్పటి అంకిత భావం కూడా నేటి ఆటగాళ్లలో కరవైంది. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆసీస్ క్రికెటర్లు జాతీయ జట్టుకు సేవలు అందించడాన్ని వృథా ప్రయాసగా భావిస్తున్నారు. ఈ పద్ధతి మారకపోతే ఆసీస్ మరింతగా పతనమవుతుంది.

క్రికెట్ లెజెండ్

టెస్టు మ్యాచ్ ఆడుతూ, ఒక రోజులో ఒక బ్యాట్స్‌మన్ ఎన్ని పరుగులు చేయగలడు? అయితే వంద.. ఇంకా వేగంగా ఆడితే రెండు వందలు.. కానీ బ్రాడ్‌మన్ 1930లో ఇంగ్లాండ్‌పై టెస్టు ఆడుతూ, ఒక్క రోజులోనే 309 పరుగులు సాధించాడు. నేటి వనే్డ, టి-20 ఫార్మాట్స్‌ను పోలిన సూపర్ హిట్టింగ్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో ఆ రోజుల్లోనే అభిమానులకు రుచి చూపించాడు. టెస్టు కెరీర్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు (12), ఒక సిరీస్‌లో ఎక్కువ డబుల్ సెంచరీలు (3), ఎక్కువ ట్రిపుల్ సెంచరీలు (2) చేసిన బ్యాట్స్‌మన్‌గా బ్రాడ్‌మన్ రికార్డు నెలకొల్పాడు. ఆ తర్వాతి కాలంలో క్రిస్ గేల్, బ్రియాన్ లారా, వీరేందర్ సెవాగ్ రెండేసి పర్యాయాలు ట్రిపుల్ సెంచరీలు చేసి బ్రాడ్‌మన్ సరసన స్థానం సంపాదించారు. అయితే, ఎక్కువ డబుల్ సెంచరీలు, ఒక సిరీస్‌లో అత్యధిక డబుల్ సెంచరీలతో అతని పేరుతో ఉన్న రికార్డులు చెక్కుచెదరలేదు. బ్రాడ్‌మన్ కనీసం ఒక సెంచరీ చేసిన వరుస ఇన్నింగ్స్ సంఖ్య ఆరు. 1938లో అతను నెలకొల్పిన ఈ రికార్డుకు ఇంత వరకూ ఎవరూ దరిదాపుల్లోకి కూడా చేరలేకపోతున్నారు. టెస్టుల్లో అత్యంత వేగంగా 1,000 (ఏడు మ్యాచ్‌లు), 2,000 (15 మ్యాచ్‌లు), 3,000 (23 మ్యాచ్‌లు), 4,000 (31 మ్యాచ్‌లు), 5,000 (36 మ్యాచ్‌లు), 6,000 (45 మ్యాచ్‌లు) పరుగుల మైలురాళ్లను చేరిన బ్యాట్స్‌మన్ బ్రాడ్‌మన్. ఆ రికార్డు కూడా ఇప్పటికీ అతని ఖాతాలోనే ఉంది.
సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్..
క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ సుపరచితమైన పేరు. గారీ సోబర్స్ మైదానంలోకి దిగకముందు.. సచిన్ తెండూల్కర్ పుట్టక ముందే బ్రాడ్‌మన్ అసాధారణ బ్యాట్స్‌మన్‌గా వెలిగిపోయాడు. లెక్కలేనన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. వాటిలో కొన్ని ఇప్పటికీ పదిలంగా ఉన్నాయంటే, అతని బ్యాటింగ్ ప్రతిభ ఎంతటిదో ఊహించుకోవచ్చు. కనీసం 20 ఇన్నింగ్స్‌ను అర్హతగా తీసుకుంటే, టెస్టుల్లో సగటున అత్యధిక పరుగులు అతనివే. బ్రాడ్‌మన్ 99.94 సగటుతో నెలకొల్పిన రికార్డును అధిగమించడం ఎవరికైనా అసాధ్యమే. అదే విధంగా నాలుగు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు జరిగిన ఒక సిరీస్‌లో భారీ సగటు కూడా బ్రాడ్‌మన్‌దే. ఈ జాబితాలో మొదటి రెండు స్థానాలు అతనే దక్కించుకున్నాడు. అతను 1931-31 సీజన్‌లో 201.50, 1947-48 సీజన్‌లో 178.75 సగటు పరుగులతో తిరుగులేని రికార్డును నమోదు చేశాడు. ఇంత భారీ సగటును అందుకోవడం దాదాపు అసాధ్యంగానే చెప్పుకోవాలి. అదే విధంగా ఆడిన ఇన్నింగ్స్, సాధించిన శతకాల మధ్య దామాషాలోనూ బ్రాడ్‌మనే టాప్. అతను 80 ఇన్నింగ్స్‌లో 29 సెంచరీలు, మరో 12 డబుల్ సెంచరీలు నమోదు చేశాడు. డబుల్ సెంచరీ దామాషాలోనూ బ్రాడ్‌మన్ రికార్డును ఇంత వరకూ ఎవరూ అధిగమించలేకపోయారు. 1946-47 సీజన్‌లో ఇంగ్లాండ్‌పై అతను ఐదో వికెట్‌కు సిడ్ బర్నెస్‌తో కలిసి 405 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ వికెట్‌కు ఇదే రికార్డు భాగస్వామ్యం. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బ్యాట్స్‌మెన్‌లో అత్యధిక స్కోరు సాధించిన బ్యాట్స్‌మన్‌గా బ్రాడ్‌మన్ సృష్టించిన రికార్డును ఎవరూ అధిగమించలేకపోయారు. 1936-37 సీజన్‌లో అతను ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో 270 పరుగులు సాధించాడు. ఒకే ప్రత్యర్థిపై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా అతని పేరు రికార్డు పుస్తకాల్లో ఇప్పటికీ పదిలంగానే ఉంది. ఇంగ్లాండ్‌పై అతను 5,028 పరుగులు చేశాడు. ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు (974), ఒకే సెషన్‌లో ఎక్కువ పర్యాయాలు సెంచరీ చేసిన రికార్డు సైతం బ్రాడ్‌మన్ పేరుమీదే ఉంది. అతను లంచ్ విరామానికి ముందు ఒకసారి, భోజనం-టీ విరామానికి మధ్య సమయంలో రెండుసార్లు, టీ నుంచి ఆట ముగిసే సమయంలో మూడు పర్యాయాలు (మొత్తం ఆరు) శతకాలు నమోదు చేసి తనకు తిరుగులేదని నిరూపించాడు. ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తూ అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఆస్ట్రేలియా ఒక్కసారిగా తిరోగమన దిశగా పరుగులు తీస్తున్నది. జారుడు మెట్లపై ఉన్న ఆసీస్ క్రికెట్ ప్రమాణాలు ఎంతగా పడిపోతాయో, పతనం తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ఊహకు అందడం లేదు. తనకు ఎదురులేదన్న ధీమా ఒకవైపు, ఎవరికి వారే తమ ఆధిక్యాన్ని ప్రదర్శించుకోవాలని అనుకోవడం మరోవైపు ఆస్ట్రేలియాను వేరుపురుగుల్లా తొలిచేస్తున్నాయి. నిర్లక్ష్యం, క్రమశిక్షణా రాహిత్యం, ఆధిపత్య పోరాటం, జట్టు ప్రయోజనాలను గాలికి వదలి స్వప్రయోజనాలకే పెద్దపీట వేయడం, కాసుల సంచుల వెనుక పరుగులు తీస్తూ, ప్రమాణాలకు తిలోదకాలివ్వడం వంటి అనేక అంశాలు ఆసీస్ క్రికెట్‌పై ముప్పేట దాడి చేస్తున్నాయి. ఎప్పుడూ మద్యం మత్తులో జోగుతూ, ప్రాక్టీస్ సెషన్లకు, జట్టు వ్యూహాత్మక సమావేశాలకు గైర్హాజరవుతూ వివాదాస్పద క్రికెటర్‌గా ముద్ర వేయించుకున్న డేవిడ్ బూన్ లాంటి వారు గతంలోనూ ఆస్ట్రేలియా జట్టులో లేకపోలేదు. ఆస్ట్రేలియా జట్టు 2013లో భారత్‌లో పర్యటించింది. అప్పటి కెప్టెన్ మైఖేల్ క్లార్క్‌తో విభేదించిన షేన్ వాట్సన్ వేటుకు గురయ్యాడు. అతనితోపాటు జేమ్స్ పాటిన్సన్, మిచెల్ జాన్సన్, ఉస్మాన్ ఖాజా కూడా జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయాలకు విరుద్ధంగా ప్రవర్తించడాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) తీవ్రంగా పరిగణించింది. నలుగురిపైనా సస్పెన్షన్ వేటు వేసింది. సహజంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఆటగాళ్లు క్షమాపణ చెప్తారు. వెంటనే బోర్డు స్పందించి, వారిని హెచ్చరించి విడిచిపెడుతుంది. కానీ, వేటుకు గురైన వారిలో మిగతా ముగ్గురు భారత్‌లోనే ఉంటే, వాట్సన్ మాత్రం స్వదేశానికి వెళ్లిపోయాడు. ఆస్ట్రేలియా జట్టులో లుకలుకలు అప్పుడే బయటపడ్డాయి. రికీ పాంటింగ్ వరకూ కెప్టెన్లకు ఆటగాళ్లపై కొద్దోగొప్పో పట్టు ఉండేది. కానీ, పాంటింగ్ తర్వాత క్లార్క్‌గానీ, ప్రస్తుత కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌గానీ ఆ స్థాయిలో నాయకత్వ ప్రతిభ కనబరచలేకపోతున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ పతనానికి ఇది కూడా ఒక కారణమే.
భయం లేదు..
ఆసీస్ ఆటగాళ్లు ఎవరికీ భయపడరు. బోర్డు ఎవరినీ అదుపు చేయలేదు. అభిమానులంటే క్రికెటర్లకు లక్ష్యం లేదు. కాంట్రాక్టులు పోతాయనో, జాతీయ జట్టులో స్థానం దక్కదనో ఆందోళన పడే రోజులకు ఎప్పుడో తెరపడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) రాకతో యావత్ ప్రపంచ క్రికెట్ రూపురేఖలు ఎవరూ ఊహించని విధంగా మారిపోయాయి. దేశానికి జీవితకాలం ఆడినా లభించనంత మొత్తం ఐపిఎల్‌లో ఒకటిరెండు సీజన్లలోనే లభిస్తుంది కాబట్టి, భవిష్యత్తుపై ఎవరికీ బెంగలేదు. కోట్లకు కోట్లు వచ్చి పడుతుండటంతో క్రికెటర్ల కళ్లు మూసుకుపోతున్నాయి. పైగా, స్వదేశంలోనే ఆసీస్ ఆటగాళ్లకు బిగ్ బాష్ లీగ్ ఉంది. బంగ్లాదేశ్, వెస్టిండీస్, శ్రీలంక ప్రీమియర్ లీగ్‌లు జరుగుతున్నాయి. ఇంగ్లీష్ కౌంటీలు ఉండనే ఉన్నాయి. సంవత్సరాల తరబడి శ్రమించడం, చెమటోడ్చడం, నిలకడగా ఆడుతూ లీగ్ స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎక్కడం, జాతీయ జట్టుకు ఎంపిక కావడం, అక్కడ తీవ్రమైన పోటీని తట్టుకొని నిలబడడానికి శక్తివంచన లేకుండా కృషి చేయడం ఒకప్పటి మాట. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా భవిష్యత్తు ఏమిటనే ప్రశ్న నిత్యం వేధిస్తుంటే, అత్యున్నత ప్రమాణాలను సంపాదించుకోవడానికి, వాటిని సాధించిన తర్వాత నిలబెట్టుకోవడానికి ప్రతి ఆటగాడూ కష్టపడేవాడు. కానీ, అదంతా గతం. ఇప్పుడు వివిధ దేశాల అధికారిక, అనధికార ప్రీమియర్ లీగ్‌లు, టి-20 టోర్నీలు వచ్చిపడ్డాయి. ఆటగాళ్లపై కాసుల వర్షం కురుస్తున్నది. డబ్బే ప్రధానం అనుకుంటున్న ఆటగాళ్లకు జాతీయ జట్టుపై గౌరవం లేదు. కెరీర్ ఏమవుతుందోనన్న ఆందోళన లేదు. ఐపిఎల్ వంటి టోర్నీల కారణంగా క్రికెట్‌లో ప్రమాణాలు దిగజారిపోతున్నాయని, ఆటగాళ్లు జాతీయ సేవలకు అందుబాటులో లేకుండా పోతున్నారని క్రికెట్ ఆస్ట్రేలియా ఇదివరకే చాలాసార్లు ఆందోళన వ్యక్తం చేసింది. చివరికి భయపడిందే నిజమైంది. ఆస్ట్రేలియా జట్టు వరుస పరాజయాలతో అల్లాడుతూ అథఃపాతాళానికి పడిపోతున్నది. తాజాగా ఐదు వరుస పరాజయాలు ఆసీస్ జట్టు ప్రమాణాలపై అనుమానాలను రేపుతున్నది. ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన వెస్టిండీస్ ఇప్పుడు ఉనికి కోసం అల్లాడుతున్నది. ఆస్ట్రేలియా పరిస్థితి కూడా అదే విధంగా మారడం ఖాయంగా కనిపిస్తున్నది. క్రికెట్ ఆస్ట్రేలియా సరైన దిశగా చర్యలు తీసుకోకపోతే, ఆస్ట్రేలియా భవిష్యత్తులో బంగ్లాదేశ్, జింబాబ్వే వంటి అత్యంత సాధారణ జట్ల చేతిలోనూ పరాజయాలను ఎదుర్కొనే ప్రమాదం లేకపోలేదు.
తిరుగులేని ఆధిపత్యం
ఇటీవల కాలంలో ఎదుర్కొన్న వైఫల్యాలను పక్కనపెడితే, ఆస్ట్రేలియా సుమారు మూడు దశాబ్దాలు క్రికెట్ ప్రపంచాన్ని శాసించింది. అసలు సిసలైన ప్రొఫెషనల్ జట్టుగా మన్ననలు పొందింది. ఆసీస్‌తో సిరీస్‌లు ఆంటేనే మిగతా జట్లు భయపడేవి. కానీ, హఠాత్తుగా ఆ జట్టుకు ఏమైంది? ఎందుకు ఇంతగా పతనమైంది. శ్రీలంకలో పరాభవాలకు కారణం ఏమిటి? దక్షిణాఫ్రికా చేతిలో, స్వదేశంలోనే టెస్టు సిరీస్‌ను ఎందుకు కోల్పోయింది? క్రికెటర్లలో నైపుణ్యం కొరవడిందా? లేక నిర్లక్ష్యం, క్రమశిక్షణా రాహిత్యం కారణంగా పరాజయాలను మూటగట్టుకుంటున్నదా? ఈ ప్రశ్నలు క్రికెట్ ఆస్ట్రేలియానే కాదు.. లక్షలాది మంది అభిమానులు కూడా వేధిస్తున్నాయి. గాయాలను లెక్కచేయకుండా షెఫీల్డ్ షీల్డ్, ఐపిఎల్ వంటి టోర్నీల్లో పాల్గొనడం, డబ్బుకు ఇచ్చినంత ప్రాధానత జాతీయ జట్టుకు సేవలు అందించేందుకు ఇవ్వకపోవడం కూడా ఆటగాళ్ల ప్రతిభపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. టి-20 ఫార్మెట్‌లో నిజమైన క్రికెట్‌కు స్థానం లేదన్నది వాస్తవం. పశు బలంతో బౌలింగ్ చేయడం, దొరికిన బంతిని దొరికినట్టు వీరబాదుడు బాదడడం తప్ప కళాత్మకమైన ఆట మచ్చుకైనా కనిపించడం లేదు. ఎక్కువ సంఖ్యలో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో మ్యాచ్‌లు ఆడిన తర్వాత టెస్టులకు తగినట్టు వ్యూహాలను, ఆడే విధానాన్ని మార్చుకోలేకపోతున్నారు. టెస్టుల్లో ఆస్ట్రేలియా వరుస పరాజయాలకు, పరాభవాలకు ఎక్కువగా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో మ్యాచ్‌లు ఆడడం కూడా ఒక ప్రధాన కారణమే. వయసు మీద పడుతున్నప్పటికీ కెరీర్‌ను ముగించకుండా, డబ్బు కోసం మైదానంలోకి దిగడం కూడా ఆసీస్ జట్టు వైఫల్యాలకు కారణమవుతున్నదన్న వాదన వినిపిస్తున్నది. టెస్టులను పట్టించుకోకపోవడం వల్ల కలిగే అనర్థాలు ఏమిటో ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులకు ఇది గుణపాఠం కావాలి. పరిమిత ఓవర్ల ఫార్మాట్స్ వెనుక పరుగులు తీస్తున్న మిగతా అన్ని దేశాలకూ ఆసీస్ దెబ్బతోనైనా కనువిప్పు కలగాలి. లేకపోతే నిన్న వెస్టిండీస్, నేడు ఆస్ట్రేలియాకు పట్టిన గతే మిగతా జట్లకూ పట్టడం ఖాయం. ఇప్పటికైనా డబ్బు వెంట పడకుండా, జెంటిల్మన్ గేమ్‌ను నిజంగానే అదే స్థాయలో, అవే ప్రమాణాలతో, అంతే నీతి బద్ధంగా ఆడితేనే భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. లేకపోతే, క్రికెట్‌లో కళాత్మక స్క్వేర్ కట్‌లు, పుల్‌షాట్లు, స్వింగర్లు కనిపించవు. ఎంత బలంగా బంతి వేశామా, ఎంత వరకూ బ్యాట్స్‌మన్‌ను నిలువరించా మా అన్నదే బౌలర్ల లక్ష్యమవుతుంది. ఎంత బలంగా బంతిని కొట్టా మా.. ఎంత వేగంగా పరుగులు చేశామా అన్నదే బ్యాట్స్‌మన్ ఆలో చన అవుతుంది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కళాత్మక క్రికెట్ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.

-srihari