ఆటాపోటీ

బిసిసిఐకి కౌంట్‌డౌన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) తాను తీసుకున్న గోతిలో తానే పడింది. మొండి వైఖరిని ప్రదర్శించి, తాడును తెగే వరకూ లాగిన బోర్డు అధికారులకు ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ. మూడో తేదీన సుప్రీం కోర్టు ఇవ్వబోయే తీర్పు ఏ విధంగా ఉంటుందోనన్న ఆందోళన వారిని వేధిస్తున్నది. లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయకుండా, సుమారు రెండేళ్లు గడిపేసిన బోర్డుకు ఇప్పుడు సుప్రీం కోర్టు కళ్లెం వేయడం ఖాయంగా కనిపిస్తున్నది. కేసును విచారిస్తున్న ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ నాలుగో తేదీన పదవీ విరమణ చేయనున్నారు. దానికి ఒక రోజు ముందు ఆయన చారిత్రక తీర్పును వెల్లడించే అవకాశాలు ఉన్నాయ. ఈ తీర్పే బోర్డు భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) గుత్త్ధాపత్యానికి తెరపడే రోజులు వచ్చాయి. మూడో తేదీన సుప్రీం కోర్టు చారిత్రిక తీర్పునిచ్చే అవకాశాలున్నాయి. భారత క్రికెట్‌కు పర్యాయపదంగా మారి, మొత్తం క్రీడనే తన గుప్పిట్లో ఉంచుకున్న బిసిసిఐకి, ప్రపంచంలోనే అత్యధిక ఆదాయ వనరులున్న క్రికెట్ సంస్థ పాలక మండలిలో ఉన్న సభ్యులకు కొరుకుడు పడని విధంగానే సుప్రీం కోర్టు తీర్పు ఉండబోతున్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న లోధా కమిటీ సిఫార్సుల అమలుపై స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించకుండా బిసిసిఐ తాను తీసుకున్న గోతిలో తానే పడింది. పదేపదే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, చివరిసారి జరిగిన బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం)లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మొండి వైఖరిని ప్రదర్శిస్తున్న బిసిసిఐ ఆట కట్టించాలన్న పట్టుదలతో ఉన్న సుప్రీం కోర్టు తీసుకోబోయే నిర్ణయంపైనే కొత్త ఏడాదిలో భారత క్రికెట్‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయన్నది ఆధారపడి ఉంటుంది. లోధా కమిటీ సిఫార్సుల అమలుపై ఒక నిర్ణయం తీసుకోవడానికి బోర్డు మూడు పర్యాయాలు ప్రత్యేక సర్వసభ్య సమావేశాలను నిర్వహించినప్పటికీ ఫలితం లేకపోయింది. అన్ని సమావేశాలు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండానే ముగిశాయి. రోజులు గడుస్తున్న కొద్దీ, లోధా ప్రతిపాదనలను అమలుచేసి తీరాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేయడంతో ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించాల్సిన అవసరం ఏర్పడినప్పటికీ, బిసిసిఐ మొండి వైఖరిని వీడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. తొలి విడత సిఫార్సుల అమలుకు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించడానికి కోర్టు పలుమార్లు ఇచ్చిన గడువులు ముగుస్తున్నకొద్దీ, కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేస్తూ, గతంలో చేసిన వాదననే మరోసారి తెరపైకి తెస్తూ, చెప్పిన అభ్యంతరాలనే మళ్లీమళ్లీ వ్యక్తం చేస్తూ బిసిసిఐ రోజులు దొర్లించింది. సుప్రీం కోర్టు ఎన్నో సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ బిసిసిఐ తన విధానాలను మార్చుకోకపోవడం ఎన్నో అనుమానాలకు తెరతీసింది. సుప్రీం కోర్టును ఎదరించే శక్తి బిసిసిఐకి ఉందా అన్న ప్రశ్న తలెత్తుతున్నది. లోధా కమిటీ చేసిన ప్రతిపాదనల అమలుపై ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఉన్నప్పటికీ, బోర్డు నిర్లక్ష్యంగానే వ్యవహరించింది. ఏం చేయబోతున్నామన్నది బోర్డు అధికారులు ఇంకా గోప్యంగానే ఉంచుతున్నారు. సుమారు రెండేళ్లుగా బిసిసిఐ అనుసరిస్తూ వస్తున్న నాన్చుడు ధోరణికి మరో రెండు రోజుల్లో తెరపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అంతులేని నిర్లక్ష్యం!
సుప్రీం కోర్టులో కేసు జరుగుతున్నా బిసిసిఐ ఏ మాత్రం పట్టించుకోలేదు. అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. లోధా కమిటీ ఇచ్చిన నివేదకను, చేసిన ప్రతిపాదనల ప్రకారం ఎన్నో కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యతను విస్మరించింది. మొదడి విడత సిఫార్సుల అమలుకు అనుగుణంగా సంస్థ నిబంధనావళిని కూడా మారుస్తూ తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉన్నప్పటికీ, సంవత్సరాల తరబడి వాయిదా వేస్తున్నది. అంతేగాక, చాలా సందర్భాల్లో లోధా కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంది. దీనితో సుప్రీం కోర్టు ఆగ్రహానికి బిసిసిఐ గురైంది. సిఫార్సులను అమలు చేయకుండా ఏదో ఒక రకంగా బయటపడకపోతామా అన్న ధీమాతో ఇన్నాళ్లూ ఉన్న బిసిసిఐ పెద్దలకు సుప్రీం కోర్టు తీర్పు తేదీ దగ్గరపడడంతో ఆందోళన మొదలైంది. సుప్రీం కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు అందుతాయోనన్న భయం వారిని వెంటాడుతున్నది.
కాలమే సమాధానం చెప్తుంది!
లోధా కమిటీ ప్రతిపాదనల అములుపై ఎటూ తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతున్న బిసిసిఐ అధికారులు ఈ సమస్యకు కాలమే సమాధానం చెప్తుందన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. సిఫార్సులు అమలు చేస్తే, భారత క్రికెట్‌పై దశాబ్దాలుగా కొనసాగిస్తున్నా ఆధిపత్యాన్ని వారు కోల్పోవాలి. అందరి కంటే ముందు, బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కే తమ పదవులను కోల్పోతారు. ఈ భయాలతోనే లోధా సిఫార్సులను అమలు చేయలేదు. సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురైనా, మొండి పట్టు వీడలేదు. కోర్టు ఎన్ని పర్యాయాలు ఆదేశించినా పట్టించుకోకుండా, ఏదో ఒక వంకతో నిర్ణయాలను వాయిదా వేశారు. ఫలితంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. పదేపదే చేసిన పొరపాట్లు కూడా వారిని ఇబ్బందుల్లోకి నెట్టింది. లోధా సిఫార్సులకు విరుద్ధంగా ప్రధాన కార్యదర్శిగా అజయ్ షిర్కేను కార్యదర్శిగా ఎన్నుకోవడం, అంతటితో ఆగకుండా ఐదుగురు సభ్యులతో జాతీయ సెలక్షన్ కమిటీని నియమించడం వంటి చర్యలు సుప్రీం ఆగ్రహాన్ని పెంచాయి. సెలక్షన్ కమిటీలో బోర్డు తరఫున ముగ్గురే ఉండాలని లోధా కమిటీ తేల్చిచెప్పినా పట్టించుకోలేదు. క్రికెట్ ప్రక్షాళనకు సిఫార్సులను అమలు చేయలేదు. దిశగా అడుగులు కూడా వేయలేదు. అటు లోధా కమిటీ, ఇటు సుప్రీం కోర్టు సిఫార్సుల అమలుపై విధించిన డెడ్‌లైన్లను పట్టించుకోలేదు. ఇన్ని పొరపాట్లు చేసిన బోర్డుకు సుప్రీం కోర్టు ఏ విధంగా కళ్లెం వేస్తుందో చూడాలి.
లోధా సిఫార్సులే కీలకం!
భారత క్రికెట్ రంగాన్ని నిర్దేశించే అంశాల్లో ఇప్పుడు లోధా సిఫార్సులే కీలకంగా మారాయి. విశ్రాంత న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా చైర్మన్‌గా, రవీంద్రన్, అశోక్ భాన్ సభ్యులుగా ఉన్న కమిటీపై సుప్రీం కోర్టు పూర్తి నమ్మకం ఉంచింది. పలు కీలక అంశాలపై నిర్ణయాలను కట్టబెట్టింది. కోర్టు ఆదేశాల ప్రకారం కమిటీ సుదీర్ఘమైన కసరత్తు చేసింది. అన్ని కోణాల్లోనూ పరిశీలించి, పరిశోధించి, విశే్లషించి చివరికి పలు ప్రతిపాదనలు చేసింది. లోధా కమిటీ ఎంత కష్టపడినా బోర్డు అధికారులు సానుకూలంగా స్పందించలేదు. అసలు లోధా కమిటీ అధికారాలనే వారు గుర్తించలేదు. కమిటీ జారీ చేసిన ఆదేశాలను పాటించలేదు. సూచనలను ఖాతరు చేయలేదు. అధికారుల వైఖరిపై ఆగ్రహించిన లోధా కమిటీ చివరికి సుప్రీం కోర్టుకు స్టేటస్ రిపోర్టును సమర్పించాల్సి వచ్చింది. ఈ అస్త్రం బాగానే పని చేసింది. సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. దారిలోకి రావాల్సిందిగా బోర్డును హెచ్చరించింది. లేకపోతే ఏ విధంగా దారిలోకి తెచ్చుకోవాలో తెలుసునని స్పష్టం చేసింది. మొండి వైఖరిని వీడని బోర్డును సుప్రీం కోర్టు ఏ విధంగా దారిలో పెడుతుందో చూడాలి.
వేటు తప్పదు!
లోధా కమిటీ సిఫార్సుల అమలుపై నిర్ణయాలు తీసుకోకుండా, ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేస్తూ వచ్చిన బిసిసిఐ పాలక మండలిపై వేటు తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కోర్టుకు సమర్పించిన స్టేటస్ రిపోర్ట్‌లో లోధా కమిటీ ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే. కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్న ప్రస్తుత కమిటీని రద్దు చేయాలన్న ప్రతిపాదనపై సుప్రీం ధర్మాసనం కూడా తీవ్రంగానే స్పందించిన విషయం తెలిసిందే. బిసిసిఐకి ప్రత్యేక హోదాగానీ, తిరుగులేని అధికారాలుగానీ ఏవీ లేవని స్పష్టం చేసింది. చట్టానికి బోర్డు అతీతం కాదని తేల్చిచెప్పింది. ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ఇంత ఘాటుగా వ్యాఖ్యలు చేయడానికి, లోధా కమిటీ సిఫార్సుల అమలుపై పట్టుబట్టడానికి బోర్డు అధికారుల ప్రదర్శించిన అతి ధోరణులే కారణం. న్యాయమూర్తి ఠాకూర్ నాలుగో తేదీన పదవీ విరమణ చేయనుండగా, మూడో తేదీకి వాయిదా వేసిన కేసులో ఆయన తీర్పు ఏ విధంగా ఉంటుందోనన్న ఉత్కంఠ సహజంగానే ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తున్నది. మొత్తం మీద బోర్డు భవిష్యత్తును నిర్దేశించే దిశగా సుప్రీం కోర్టు తీర్పునిస్తుందో లేదో చూడాలి. మూడో తేదీ కోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించిన తర్వాతగానీ ప్రస్తుతం నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడదు.

- పుష్కర్ కె.