ఆటాపోటీ

స్లెడ్జింగ్‌కు సై అంటే సై!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్యర్థులను హేళన చేసి లేదా దుర్భాషలాడి, వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించడానే్న క్రికెట్ పరిభాషలో స్లెడ్జింగ్ అంటారు. అన్ని జట్లతో పోలిస్తే ఆస్ట్రేలియా జట్టు స్లెడ్జింగ్‌లో ముందుంటుంది. ఆసీస్‌ను చూస్తే మిగతా జట్లు భయపడతాయ. భారత్ మాత్రం ఎదురుదాడికి సిద్ధంగా ఉంది.
భారత్, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటివరకూ 90 టెస్టుల్లో తలపడ్డాయి. ఆస్ట్రేలియా 40 విజయాలు సాధిస్తే, టీమిండియా 24 విజయాలను నమోదు చేసింది. ఒక మ్యాచ్ ‘టై’గా ముగిసింది. 25 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

భారత్, ఆస్ట్రేలియా జట్లు ఎప్పుడు పోటీపడినా, మైదానంలో యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ప్రత్యర్థి జట్లను హేళన చేసి, ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దారుణంగా దెబ్బతీసే ‘స్లెడ్జింగ్’కు ఆస్ట్రేలియా పర్యాయపదం. క్రికెట్ ఆడే దేశాలన్నీ ఎప్పుడో ఒకప్పుడు ఆసీస్ సెడ్జింగ్‌కు బలైనవే. అయితే, ఈ విషయంలో టీమిండియాను తక్కువ చేయడానికి వీల్లేదు. సహజంగా వివాదాలకు దూరంగా ఉండే భారత క్రికెటర్లు, తమను హేళన చేస్తే మాత్రం వెనక్కు తగ్గరు. దేనికైనా సిద్ధమన్న రీతిలో యుద్ధానికి దిగుతారు. ఇరు జట్లు సై అంటే సై అంటూ ఏ విధంగా పోరాటాలకు సిద్ధమవుతాయో చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. హర్భజన్ సింగ్, ఆండ్రూ సైమాండ్స్ మధ్య జరిగిన వాగ్వాదం క్రికెట్ చరిత్రలో ‘మంకీగేట్’గా స్థిరపడింది. 2008లో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. సిడ్నీ టెస్టు జరుగుతున్నప్పుడు సైమాండ్స్‌తో భజ్జీ గొడవ పడ్డాడు. ఒకానొక దశలో కోపం పట్టలేకపోయిన భజ్జీ అతనిని ‘తేరీ మా కీ’ అని తిట్టాడు. ఈ పదం సైమాండ్స్‌కు ‘మంకీ’గా వినిపించింది. జాతి వివక్షతో అతను తనను తిట్టాడంటూ ముందు అంపైర్‌కు, ఆతర్వాత క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన కమిటీ భజ్జీపై మూడు మ్యాచ్‌ల సస్పెన్షన్ వేటు విధించింది. అయితే, అజాతశత్రువుగా పేరుతెచ్చుకున్న సచిన్ తెండూల్కర్ జోక్యం చేసుకొని, భజ్జీకి అండగా నిలవడంతో, సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. మాటకు మాట చెప్పడానికి భారత క్రికెటర్లు ఏమాత్రం వెనక్కు తగ్గరని ‘మంకీగేట్’ ఉదంతం స్పష్టం చేసింది.
లిల్లీతో లిటిల్ మాస్టర్ ఘర్షణ
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీతో ఘర్షణ పడిన భారత మాజీ కెప్టెన్, ‘లిటిల్ మాస్టర్’ సునీల్ గవాస్కర్ మైదానాన్ని విడిచి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లడం అప్పట్లో సంచలనం సృష్టించింది. 1981లో ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లినప్పుడు, మెల్బోర్న్ టెస్టులో గవాస్కర్‌తో లిల్లీ వాగ్వాదానికి దిగాడు. మాటల తూటాలు పేలాయి. మరో ఓపెనర్ చేతన్ చౌహాన్‌తో కలిసి గవాస్కర్ హఠాత్తుగా మైదానాన్ని విడిచిపెట్టడంతో అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. లిల్లీ నీచమైన పదజాలాన్ని వాడుతూ కించపరుస్తున్నాడని ఆరోపిస్తూ, బ్యాటింగ్‌ను కొనసాగించడానికి సన్నీ ససేమిరా అన్నాడు. ఆస్ట్రేలియా, భారత క్రికెట్ బోర్డు అధికారులతోపాటు ఐసిసి పరిశీలకులు సైతం జోక్యం చేసుకొని సర్ది చెప్పడంతో గవాస్కర్ మళ్లీ బ్యాటింగ్ కొనసాగించాడు. కొద్దిసేపటికే అతను లిల్లీ బౌలింగ్‌లోనే ఎల్‌బిగా వెనుదిరగడం కొసమెరుపు.
ఆస్ట్రేలియా జట్టు 2008లో బ్యాక్ అండ్ బ్యాక్ సిరీస్‌లో ఆడేందుకు భారత్ వచ్చింది. మొహాలీ టెస్టు జరుగుతున్నప్పుడు మాథ్యూ హేడెన్‌ను జహీర్ అవుట్ చేశాడు. గంతులు పెడుతూ హేడెన్ దగ్గరికి వెళ్లి, అసభ్యరకంగా ప్రవర్తిస్తూ సంబరాలు చేసుకున్నాడు. జహీర్ వైఖరిని తప్పుపట్టిన ఐసిసి రిఫరీ అతని మ్యాచ్ ఫీజులో 80 శాతాన్ని జరిమానా విధించాడు.
అదే సిరీస్‌లో గౌతం గంభీర్, షేన్ వాట్సన్ మధ్య కూడా రభస జరిగింది. వాట్సన్ వేసిన బంతిని బలంగా కొట్టిన గంభీర్ ఒక పరుగు పూర్తి చేశాడు. రెండో పరుగు తీస్తూ, వాట్సన్‌ను ఉద్దేశించి అసభ్యరకమైన వ్యాఖ్యలు చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లోనే గంభీర్ తన కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. అయితే, వాట్సన్‌పై అనుచిత వైఖరిని ప్రదర్శించిన కారణంగా తర్వాతి మ్యాచ్ నుంచి సస్పెండ్ అయ్యాడు.
మాథ్యూ హేడెన్‌ను 2008లో వెక్కిరించి, వివాదానికి కారణమైన జహీర్ ఖాన్ 2010లో అప్పటి ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్‌తోనే అదే తరహాలో వ్యవహరించి పరువు పోగొట్టుకున్నాడు. మొహాలీ టెస్టులో పాంటింగ్ రనౌటైనప్పుడు జహీర్ అతనిని అసభ్యకరమైన చేష్టలతో అవమానించాడు. పెవిలియన్‌కు వెళుతున్న పాంటింగ్‌కు అతని చేష్టలతో చిర్రెత్తిపోయింది. వెనక్కు వచ్చిన అతను జహీర్‌తో వాగ్వాదానికి దిగాడు. అంపైర్ బిల్లీ బౌడెన్ సకాలంలో జోక్యం చేసుకొని, సమస్యను సర్దుబాటు చేశాడు. లేకపోతే క్రికెట్ మైదానంలో బాక్సింగ్ లేదా రెజ్లింగ్ బౌట్‌ను చూడాల్సి వచ్చేది.
కోహ్లీతోనే భయం
ఆస్ట్రేలియాతో సిరీస్‌లు జరిగినప్పుడు వాగ్వాదాలు, ఘర్షణలు కొత్తకాదు. కానీ, నిన్నమొన్నటి వరకూ భారత ఆటగాళ్లు వివాదాలకు సాధ్యమైనంత దూరంగా ఉండేవారు. అందుకే, మిగతా జట్లతో పోలిస్తే, ఆస్ట్రేలియాతో భారత్‌కు మాత్రమే ఘర్షణ వాతావరణం కొంత తక్కువగా కనిపించేది. ఎంత శాతంగా ఉన్నప్పటికీ, వివాదాలకు ఎంత దూరం ఉండాలనుకున్నప్పటికీ, ఆస్ట్రేలియా స్లెడ్జింగ్‌కు ఏదో ఒక సమయంలో భారత ఆటగాళ్లు ఎదురుతిరిగేవారు. అందుకే, కొన్నిసార్లు మాటామాట పెరిగి, ఘర్షణ చోటు చేసుకుంది. సహనానికి మారుపమేరైన ఆటగాళ్లే సహనం కోల్పోయే విధంగా ప్రవర్తించే ఆసీస్ క్రికెటర్లపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏ స్థాయిలో విరుచుకుపడతాడోనని క్రికెట్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. మైదానంలో ఎప్పుడూ తొందర పడకుండా ‘మిస్టర్ కూల్’ అన్న పేరు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీకి పూర్తి భిన్నంగా ఉంటాడు కోహ్లీ. మైదానంలో అతను దూకుడుగా వ్యవహరిస్తాడు. నిర్ణయాల్లోనూ అతనిది అదే వైఖరి. ఒక మాట అంటే దానికి నాలుగు మాటలతో సమాధానం చెప్పడం అతని నైజం. అందుకే, నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో కోహ్లీ ఎప్పుడు ఏ విధంగా విరుచుకుపడతాడోన్న భయం అందరిలోనూ ఉంది. భారత క్రికెట్ బోర్డు అధికారుల ఆందోళనకు కారణాలు లేకపోలేదు. 2011-12 సీజన్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు సిడ్నీ టెస్టులో తనను వెక్కిరిస్తున్న ప్రేక్షకులపై కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. అశ్లీల భంగిమతో సమాధానం చెప్పాడు. ఆటగాళ్లనేకాదు.. తన జోలికి వస్తే ప్రేక్షకులను కూడా వదలనని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశాడు. 2014-15 సీజన్‌లో ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లినప్పుడు మైదానంలో మాటకుమాట సమాధానం చెప్పిన కోహ్లీ ‘చెడ్డబ్బాయి’ అన్న ముద్ర వేయించుకున్నాడు. మెల్బోర్న్ టెస్టు జరుగుతున్నప్పుడు, షాట్ కొట్టిన కోహ్లీ ఒక పరుగు పూర్తి చేసి, రెండో పరుగుకు ఉపక్రమించాడు. ఆ సమయంలో ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ స్టంప్స్‌ను గురిచూసి వేసిన బంతి నేరుగా వచ్చి కోహ్లీకి తగిలింది. దీనితో ఆగ్రహించిన కోహ్లీ దానిని జాన్సన్‌వైపు కాలితో కొట్టాడు. మాటకు మాట.. దెబ్బకు దెబ్బ అన్న తన సిద్ధాంతాన్ని అమలు చేశాడు. ఒకానొక దశలో జాన్సన్‌తో కోహ్లీ బాహాబాహీకి సిద్ధమయ్యాడు. అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో కల్పించుకోకపోతే పరిస్థితి అధ్వాన్నంగా మారేది. ఆటగాడిగా ఉన్నప్పుడే ఆసీస్ క్రికెటర్లతో యుద్ధానికి కాలుదువ్విన కోహ్లీ ఇప్పుడు జట్టుకు నాయకుడిగా ఉన్నాడు. పైగా స్వదేశంలో సిరీస్ ఆడుతున్నాడు. ఇక్కడ ఆసీస్ స్లెడ్జింగ్‌కు పాల్పడితే, అతని ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. భారత క్రికెట్ అధికారులను వేధిస్తున్న సమస్య కూడా ఇదే. కోహ్లీ ఘర్షణకు దిగుతాడా లేక సంయమనం పాటించి, ధోనీ వారసుడిగా ముద్రపడతాడా అన్నది చూడాలి.
chitram....
స్లెడ్జింగ్ చేస్తే ఎదురుదాడికి దిగడంలో నంబర్ వన్ విరాట్ కోహ్లీ

లిల్లీతో ఘర్షణ పడి
మైదానాన్ని విడిచి వెళుతున్న సునీల్ గవాస్కర్, చేతన్ చౌహాన్

- విశ్వ