ఆటాపోటీ

టోక్యోలో యాభై పతకాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరో నాలుగేళ్లలో జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో కనీసం 50 పతకాలను సాధించే దిశగా నీతి ఆయోగ్ చర్యలు తీసుకుంటోంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్ 13 క్రీడాంశాల్లో పోటీపడేందుకు 83 మందిని పంపింది. ఆరు పతకాలను సాధించింది. విజయ్ కుమార్ (షూటింగ్), సుశీల్ కుమార్ (రెజ్లింగ్) రజత పతకాలను కైవసం చేసుకోగా, సైనా నెహ్వాల్ (బాడ్మింటన్), మేరీ కోమ్ (బాక్సింగ్), యోగేశ్వర్ దత్ (రెజ్లింగ్), గగన్ నారంగ్ (షూటింగ్) కాంస్య పతకాలను అందించారు. నాలుగేళ్ల కాలంలో భారత్ ఎంతో అభివృద్ధి చెందిందని, ఏకంగా 119 మంది రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారని పొంగిపోయింది. డోపింగ్ కేసు కారణంగా ఇద్దరు ఒలింపిక్స్‌లో పాల్గొనలేదు. మిగతా 117 మంది 15 క్రీడా విభాగాల్లో పోటీపడ్డారు. పివి సింధు (బాడ్మింటన్) రజతాన్ని గెల్చుకోగా, సాక్షి మాలిక్ (రెజ్లింగ్) కాంస్య పతకాన్ని అందుకుంది. మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. రియో వైఫల్యాలను దృష్టిలో ఉంచుకొని, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారీగా పతకాలను సాధించాలన్న లక్ష్యంతో భారత ప్రభుత్వం, వివిధ జాతీయ క్రీడా సమాఖ్యలు, సంఘాలు, భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. నీతి ఆయోగ్ కూడా రంగంలోకి దిగింది. టోక్యో నుంచి భారత బృందం కనీసం 50 పతకాలు సాధించి తిరిగి రావాలన్న పట్టుదలతో ప్రణాళికలను రూపొందిస్తున్నది. పతకాలు ఖచ్చితంగా వస్తాయని అనుకునే 10 క్రీడా విభాగాలను ఎంచుకొని, వాటిలో పోటీదారులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది. కుటుంబం నుంచి తీసుకుంటే జాతీయ స్థాయి వరకూ అన్ని దశల్లోనూ ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించేందుకు కమిటీలను ఏర్పాటు చేయనుంది. అదే విధంగా అన్ని క్రీడలను ప్రోత్సహించడంతోపాటు, ప్రజాభిమానాన్ని సంపాదించేందుకు వీలుగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించింది. ఇందుకోసం ఐపిఎల్‌ను ఆదర్శంగా తీసుకోవాలని అనుకుంటున్నది. ఐపిఎల్ టి-20 క్రికెట్ లీగ్‌ను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం కావడానికి అనుసరించిన మార్గాలు, ఆచరించిన వ్యూహాలను దృష్టిలో ఉంచుకొని, అన్ని క్రీడల్లోనూ వాటిని అమలు చేయాలని భావిస్తున్నది. ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రీడా సమాఖ్యలు, సంఘాలతోపాటు సామాన్యులను కూడా భాగస్వాములను చేసినప్పుడే లక్ష్యాలను అందుకోగలుగుతామని నీతి ఆయోగ్ విశ్వసిస్తున్నది.