ఆటాపోటీ

వామ్మో ఒలింపిక్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భయపడుతున్న పోటీదారులు బిడ్స్‌కు దక్కని ప్రజాదరణ

ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు ఒకప్పుడు ప్రపంచ దేశాలు పోటీపడేవి. బిడ్ వేసింది మొదలు, అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఒసి) నిర్ణయాన్ని ప్రకటించే వరకూ జోరుగా లాబీయింగ్ చేసేవి. ఒలింపిక్స్ హక్కులు లభించడాన్ని ఒక వరంగా భావించేవి. లక్షల్లో ఖర్చు చేస్తే, కోట్లలో సంపాదించుకోవచ్చుని ఆనందించేవి. కానీ, క్రమంగా పరిస్థితి మారుతున్నది. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలను కూడా ఒలింపిక్స్ భయపెడుతున్నాయి. 2024 ఒలింపిక్స్ నిర్వాహణకు బిడ్ వేసిన దేశాలు ఒక్కొక్కటిగా జారిపోవడమే ఇందుకు నిదర్శనం. హాంబర్గ్ (జర్మనీ) మొదట్లోనే పోటీని ఉపసంహరించుకుంటే, తాజాగా బుడాపెస్ట్ (హంగరీ), రోమ్ (ఇటలీ) కూడా అదే బాటను అనుసరించాయి. ఈ పరిస్థితి ఎందుకు తలెత్తిందో అర్థం చేసుకోవడానికి 2016 రియో ఒలింపిక్స్‌తో బ్రెజిల్ నేర్చుకున్న పాఠాలను గుర్తుచేసుకోవాలి. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా సుమారు 80 శాతం మంది ప్రజలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వీక్షించే ఒలింపిక్స్‌కు విపరీతమైన డిమాండ్ ఉండాలి. వ్యాపార ప్రకటనల నుంచి తీసుకుంటే, పర్యాటక రంగం అభివృద్ధి వరకూ ఎన్నో రకాలుగా లాభాల మూటలను తెచ్చిపెట్టే ఒలింపిక్స్‌ను నెత్తిన పెట్టుకోవాలి. కానీ, సుమారు రెండు దశాబ్దాలుగా పరిస్థితిలో మార్పు వస్తున్నది. ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని దక్కిందని ఆనందంతో ఎగిరి గంతులేనే రోజులకు తెరపడుతూ వచ్చింది. ఒలింపిక్స్ అంటే పెట్టుబడి తక్కువ.. లాభం ఎక్కువ అనుకునే రోజులు పోతున్నాయి. ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడానికి, అంతర్జాతీయంగా ప్రాపకాన్ని పెంచుకోవడానికి ఒలింపిక్స్ ఉపయోగపడతాయన్న అభిప్రాయం స్థానంలోనే, వీటిని నిర్వహించడం వల్ల ఆర్థికంగా చితికిపోతామన్న భయం పెరుగుతున్నది. రియో ఒలింపిక్స్ వల్ల బ్రెజిల్ నష్టపోయిన వైనం మిగతా దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నది.
అనుకున్నది ఒకటి..
దక్షిణ అమెరికాలో మొట్టమొదటిసారి ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చిన బ్రెజిల్ గొప్ప పాఠాలను నేర్చుకుంది. మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చినందుకు భారీ ఖర్చే తప్ప రాబడి రాలేదు. మొత్తానికి బ్రెజిల్ పరిస్థితి అనుకున్నది ఒకటి, అయినది మరొకటి అన్న చందంగా మారిపోయింది. అతి కష్టం మీద ఒలింపిక్స్‌ను ముగించిన బ్రెజిల్ ఇప్పుడు అప్పుల ఊబి, సమస్యల సుడిగుండాల నుంచి ఏ విధంగా బయటపడాలో తెలియక, దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నది. ఒలింపిక్స్‌కు బిడ్ వేసిన మరుక్షణం నుంచే బ్రెజిల్‌లో అంతర్యుద్ధ ప్రమాదం ముంచుకొచ్చింది. అప్పటికే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన నేపథ్యంలో, కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి ఒలింపిక్స్‌ను నిర్వహించాల్సిన అవసరం ఉందా అంటూ బ్రెజిల్‌లో ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు, గృహిణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒలింపిక్స్ జరిగినన్ని రోజులూ ప్రధాన కేంద్రమైన రియో జాతీయ స్టేడియంతోపాటు ఇతరత్రా కేంద్రాల వద్ద నిరసన ప్రదర్శనలు జరిగాయి. లాఠీ చార్జి, బాష్పవాయువు ప్రయోగాలతో రియో హోరెత్తిపోయింది. నిరసనకారులను చెల్లాచెదురు చేసేందుకు భద్రతా బలగాలు పలుమార్లు గాల్లో కాల్పులు జరిపారు. దీనితో భద్రతా చర్యలు అడుగంటిపోయాయి. విదేశీయులను లక్ష్యంగా చేసుకొని దొంగలు తెగబడ్డారు. పాత్రికేయులు ప్రయాణిస్తున్న బస్సుపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపిన సంఘటన కలకలం రేపింది. దివాలా స్థితిని ఎదుర్కొంటున్న తరుణంలో ఒలింపిక్స్‌ను నిర్వహించాల్సి రావడం బ్రెజిల్‌కు తలకు మించిన భారమైంది. రాజకీయ నేపథ్యం కూడా మారిపోయింది. అధ్యక్షురాలు డెల్మా రూసెఫ్‌పై అక్కడి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఆమె పదవిని కోల్పోగా, మిచెల్ టెమెర్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. డెల్మా పదవీచ్యుతురాలు కావడానికి ఒలింపిక్స్ నిర్వాహణ కూడా కారణమైందన్నది తిరుగులేని నిజం.
ప్రజల్లో అసంతృప్తి
ఒలింపిక్స్ సమీపిస్తుకొద్దీ ప్రజల్లో పెరిగిపోయిన అసంతృప్తి, ఆ ఈవెంట్ ముగిసిన తర్వాత తారాస్థాయికి చేరింది. వౌలిక సదుపాయాలను కల్పించకుండా, కోట్లకు కోట్లను ఒలింపిక్స్ కోసం కుమ్మరించడం ఎంత వరకు సబబని ప్రశ్నిస్తూ, ఆగ్రహంతో వీధికెక్కిన వివిధ రంగాలకు చెందిన ప్రజలను శాంతింప చేయడం అనుకున్నంత సులభం కాదని రియోలో స్పష్టమైంది. చివరికి రియోలో శాంతి భద్రతాలను పరిరక్షించే పరిస్థితి కూడా లేకపోయింది. ఆరంభం నుంచే పెను భారంగా మారిన ఒలింపిక్స్ వల్ల బ్రెజిల్ అప్పుల్లో కూరుకుపోయింది. లాభం మాట ఎలావున్నా, సాధ్యమైనంత తక్కువ నష్టంతో బయటపడితే చాలని బ్రెజిల్ సర్కారు చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. మొత్తానికి ఒలింపిక్స్ వల్ల ఎదురైన భారీ నష్టాన్ని పూడ్చుకోవాలంటే బ్రెజిల్‌కు కనీసం పదేళ్లు పడుతుంది. అప్పటి వరకూ ప్రజలు అనేకానేక త్యాగాలు చేయాలి. ఈ పరిస్థితల్లోనే, ఒలింపిక్స్ కోసం తామెందుకు త్యాగాలు చేయాలన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. ఇటలీ (రోమ్), బుడాపెస్ట్ (హంగరీ)లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ఒలింపిక్స్‌కు వ్యతిరేకంగా ఎక్కువ మంది ఓటు వేసి, చివరికి బిడ్డింగ్ నుంచి వైదొలగేందుకు కారణమయ్యారంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు.
మిగిలినవి రెండే
ఒక్కో దేశమే వెనుకడుగు వేస్తుంటే, 2024 ఒలింపిక్స్ బరిలో ఇప్పుడు రెండు దేశాలే మిగిలాయ. లాస్ ఏంజిల్స్ (అమెరికా), పారిస్ (ఫ్రాన్స్) ఒలింపిక్స్ హక్కుల కోసం పోటీపడుతుంటే, మిగతా దేశాలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయ. యూరోపియన్ యూనియన్ దిగాలుపడిన నేపథ్యంలో, ఫ్రాన్స్ ఎంత వరకూ పోటీలో కొనసాగుతుందనేది అనుమానమే. అమెరికాలో ట్రంప్ పాలన వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయ. ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియని ట్రంప్ హఠాత్తుగా ఒలింపిక్స్ బిడ్ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించినా ఆశ్చర్యంలేదు. ఏది ఏమైనా, ఒకప్పుడు ఒలింపిక్స్ కోసం తీవ్రమైన పోటీ ఉంటే, ఇప్పుడు బిడ్స్ కోసం ఐఒసి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. యాంత్రిక జీవితంలో క్రీడలకు ఆదరణ తగ్గుతున్న విషయాన్ని గుర్తించి, తక్షణమే నివారణ చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో సమస్యలు మెరగడం ఖాయం.

- శ్రీహరి