ఆటాపోటీ

బిసిసిఐ ‘హిట్ వికెట్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిసిసిఐ చేతులారా సమస్యలను కొని తెచ్చుకుంది. స్వదేశంలోనేగాక, అంతర్జాతీయ వేదికపైనా పరువు పోగొట్టుకుంది. మొండి వైఖరితో ప్రతి విషయాన్నీ తెగే వరకూ గుంజి, చివరికి తాను తీసిన గోతిలో తానే పడింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రతిపాదనలను వ్యతిరేకించి ఒంటరైంది. బిగ్ త్రీలోని మిగతా రెండు దేశాలు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ కూడా భారత్‌ను వ్యతిరేకించడం గమనార్హం. బిసిసిఐ తన తీరును మార్చుకోకపోతే అంతర్జాతీయ క్రికెట్‌లో ఏకాకిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

* చాంపియన్స్ ట్రోఫీకి జట్టును పంపకుండా తాత్సారం చేస్తే, ఐసిసి దారికి వస్తుందని, తమ డిమాండ్లను అంగీకరిస్తుందని ఊహించిన బిసిసిఐకి పాలనాధికారుల బృందం (సిఒఎ) తగిన సమాధానమే చెప్పింది. టోర్నమెంట్‌కు జట్టును వెంటనే ఎంపిక చేయాలని ఆదేశించడం ద్వారా బిసిసిఐ పరిధి ఎంతగా కుదించుకుపోయిందో చెప్పకనే చెప్పింది. ఎనిమిదేళ్ల కాలానికి 570 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుండగా, ఆ మొత్తం ఇకపై 293 మిలియన్ డాలర్లకు కుదించుకుపోతుందన్న వాస్తవాన్ని బిసిసిఐ జీర్ణించుకోలేకపోతున్నది. ‘బిగ్ త్రీ’ దేశాలకు భారీ వాటాను టెస్టు హోదాగల అన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ, అదే మొత్తంపై బిసిసిఐ పట్టుబడుతున్నది. మరో వంద మిలియన్ డాలర్లను కలిపి, 400 మిలియన్ డాలర్ల వరకూ ఇచ్చేందుకు ఐసిసి చైర్మన్ శశాంక్ మనోహర్ రాజీ ప్రతిపాదన చేసినా బిసిసిఐ ఒక్క మెట్టు కూడా దిగలేదు. మొండి వైఖరిని వీడకుండా పరువు పోగొట్టుకుంటున్నది. ఐసిసితో ఘర్షణ వద్దని, సామరస్య ధోరణితో వ్యవహరించాలని సిఒఎ హితవు పలికినా బిసిసిఐ వినడం లేదు. చాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించే అంశం మాదిరిగానే ఐసిసితో చర్చల విషయంపై ఆదేశాలు జారీ చేసే వరకూ బిసిసిఐలో చలనం ఉండదేమో!

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) తెగేదాకా లాగింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఉనికినే సవాలు చేసే విధంగా ప్రవర్తించి, తన గోతిని తానే తవ్వుకుంది. ‘బిగ్ త్రీ’ దేశాలకు ఇచ్చే భారీ వాటాలో కొంత భాగాన్ని తగ్గించి, టెస్టు హోదాగల మిగతా ఏడు దేశాలకు పంచాలన్న ఐసిసి చైర్మన్ శశాంక్ మనోహర్ ప్రతిపాదనను వ్యతిరేకించి కష్టాలను కొనితెచ్చుకుంది. ఎక్కడా రాజీకి రాకుండా, మొండిపట్టుతో ముందుకెళ్లి బొర్లాపడింది. చివరికి క్రికెట్ ప్రపంచంలో ఏకాకిగా మిగిలింది. భారత్‌తోపాటు ఐసిసి ఆదాయంలో సింహ భాగాన్ని పొందుతున్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు కూడా ఐసిసి కీలక సమావేశంలో బిసిసిఐని వ్యతిరేకించడం విచిత్రం. ‘బిగ్ త్రీ’ దేశాలకు ప్రస్తుతం అందుతున్న మొత్తాన్ని సగానికి సగం తగ్గించాలన్న ప్రతిపాదనకు టెస్టు హోదాగల పది దేశాల్లో ఎనిమిది అనుకూలంగా ఓటు చేశాయి. భారత్‌తోపాటు శ్రీలంక మాత్రమే ఈ ప్రతిపాదనను వ్యతిరేకించింది. అలాగే ఐసిసి పాలనా వ్యవహారాల్లో భారీ మార్పుల కోసం ప్రవేశపెట్టిన తీర్మానానికి తొమ్మిది దేశాలు అనుకూలంగా స్పందించగా, భారత్ దీనిని వ్యతిరేకించి చేతులు కాల్చుకుంది. టెస్టు దేశాలవీ బిసిసిఐని అనుసరించడం లేదని ఈ పరిణామం స్పష్టం చేస్తున్నది. మిగతా క్రికెట్ బోర్డులన్నీ ఇకపై బిసిసిఐ కనుసన్నల్లో మెలుగుతూ అణిగిమణిగి ఉండబోవన్న వాస్తవం తేటతెల్లమైంది. ఐసిసికి లభిస్తున్న ఆదాయంలో ఎక్కువ భాగం బిసిసిఐ, క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ), ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) నుంచే వస్తున్నది. కాబట్టి, పంపకాల్లోనూ తమకే ఎక్కువ భాగం దక్కాలని వాదిస్తూ వచ్చిన బిసిసిఐ మూడేళ్ల క్రితం ఐసిసిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి నెగ్గించుకుంది. దీనితో ఐసిసి వాటాలో 440 మిలియన్ డాలర్లను పొందుతున్నది. కానీ, ఇప్పుడు ఈ మొత్తాన్ని 293 మిలియన్ డాలర్లకు కుదించారు. అదే విధంగా ఇసిబికి 143 మిలియన్ డాలర్లు చెల్లిస్తారు. ‘బిగ్ త్రీ’లో ఉన్నప్పటికీ, క్రికెట్ ఆస్ట్రేలియాకు మరో ఆరు ఏడు టెస్టు హోదాగల క్రికెట్ బోర్డలతో సమానంగా 132 మిలియన్ డాలర్లు లభిస్తాయి. జింబాబ్వే క్రికెట్ బోర్డుకు అతి తక్కువగా 94 మిలియన్ డాలర్లు ఇస్తారు. అనుబంధ సభ్యత్వం ఉన్న దేశాల్లో క్రికెట్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మొత్తం 280 మిలియన్ డాలర్లను కేటాయించారు. అనుబంధ సంఘాలన్నింటికీ ఈ మొత్తాన్ని పంచుతారు. మొత్తం మీద ప్రపంచ క్రికెట్‌ను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన బిసిసిఐ మొండిపట్టుతో ముందుకెళ్లి, ఊహించలేని రీతిలో చావుదెబ్బ తిన్నది. శ్రీలంక, బంగ్లాదేశ్, జింబాబ్వే క్రికెట్ బోర్డులు తనకు మద్దతుగా నిలుస్తాయన్న బిసిసిఐ అంచనాలు తల్లకిందులయ్యాయి. అప్పటి వరకూ భారత్‌కు అనుకూలంగా ఎన్నో ప్రకటనలు చేసిన ఈ మూడు దేశాలు కీలక సమయంలో మొండిచేయి చూపాయి.
ఇంటి సమస్యలు!
ప్రపంచ క్రికెట్‌లో పరువుపోగొట్టుకున్న బిసిసిఐ చివరికి స్వదేశంలోనూ అదే రీతిలో మొండితనాన్ని ప్రదర్శించి చిక్కుల్లో పడింది. పాలనా వ్యవహారాలన్నీ పాదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో సుప్రీం కోర్టు నియమించిన లోధా కమిటీ చేసిన సూచనలను, సిఫార్సులను పట్టించుకోకుండా తన మెడకు తానే ఉచ్చు బిగించుకుంది. ఫలితంగా పాలనా వ్యవహారాలతోపాటు, ఆర్థికాంశాలు కూడా సుప్రీం కోర్టు నియమించిన నలుగురు సభ్యులతో కూడిన పాలనాధికారుల కమిటీ చేతికి వెళ్లాయి. వచ్చే ఏడాది జరిగే పదకొండవ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మ్యాచ్‌ల ప్రసార హక్కులుసహా పలు కాంట్రాక్టుల బిడ్‌లను పరిశీలించి, ఖరారు చేయడానికి ఒక కమిటీని నియమించనున్నట్టు సుప్రీం కోర్టు చేసిన ప్రకటన బిసిసిఐని ఆత్మరక్షణలో పడేసింది. మొత్తం మీద అత్యధిక ఆదాయ వనరులతో కోట్లకు పడగలెత్తిన బిసిసిఐ ఆర్థిక లావాదేవీలపై సుప్రీం కోర్టు ఆంక్షలు విధించింది. భారత క్రికెట్‌లో పారదర్శకత కోసం లోధా కమిటీ చేసిన సిఫార్సులను ఎలాంటి మార్పులు లేకుండా అమలు చేసి తీరాలని సుప్రీం కోర్టు గతంలోనే బిసిసిఐకి తేల్చిచెప్పింది. నిరుడు జూలై మాసంలోగా సిఫార్సుల అమలుపై స్పష్టతనివ్వాలని స్వయంగా సుప్రీం కోర్టు ఆదేశించినా పట్టించుకోకపోవడం, ఏమాత్రం స్పందించకపోవడం బిసిసిఐ వైఖరికి అద్దం పడుతుంది. సిఫార్సుల అమలుపై స్పష్టత లేక, వాటి అమలును ఎప్పటికప్పుడు ఏదో ఒక వంకతో బిసిసిఐ వాయిదా వేసి చివరికి చిక్కుల్లో పడింది. లోధా సిఫార్సులో చిన్నచిన్న అంశాలను అమలు చేయడం ద్వారా కీలక విషయాలను పక్కకు తప్పించవచ్చన్న బోర్డు వ్యూహం ఏ మాత్రం ఫలించలేదు. వరుసగా రెండు పర్యాయాలు, మొత్తం మీద మూడసార్ల కంటే ఎక్కువ కాలం పాలక మండలి సభ్యులుగా ఉండరాదని లోధా కమిటీ చేసిన ప్రతిపాదనను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయకూడదని పట్టుబట్టి, భారీ మూల్యానే్న చెల్లించుకుంది. లోధా సిఫార్సులు అమలైతే, బంగారు బాతును చేతులారా ఇతరులకు అప్పగించడమే అన్న అభిప్రాయంతో, రాజీ ధోరణే లేకుండా భీష్మించుకొని, చివరికి ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడింది. కోట్లాది రూపాయల ఆదాయ వనరులున్న భారత క్రికెట్‌పై తమ ఆధిపత్యానికి గండిపడుతుందన్న భయంతో కొంత మంది బోర్డు అధికారులు వ్యవహరించిన తీరు చివరికి వారి మెడకే చుట్టుకుంది. సుప్రీం కోర్టు ఎన్నిసార్లు డెడ్‌లైన్లు పెట్టినా సిఫార్సులను అమలు చేయకుండా పదేపదే వాయిదా వేసి, ఏకంగా ఆర్థికాంశాలపైనే పట్టును కోల్పోయింది. దారిలోకి రావాలని, లేకపోతే, దారిలోకి తెచ్చుకుంటామని సుప్రీం కోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినా పట్టించుకోని బిసిసిఐ స్వదేశంలోనే విమర్శలపాలైంది. సాధారణ పాలనకు అవసరమైన మొత్తాలను తప్ప, మిగతా అన్ని రకాల చెల్లింపులను లోధా కమిటీ నిలిపేసింది. కొన్ని సభ్య సంఘాలకు భారీ మొత్తాల్లో నిధులను మళ్లించాలన్న నిర్ణయానికి కూడా లోధా కమిటీ గండికొట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే, లోధా కమిటీని బిసిసిఐ చాలా తక్కువ అంచనా వేసింది. ఈ కమిటీకి అధికారాలు ఏవీ ఉండవన్న ధీమాతో ప్రవర్తించి ప్రత్యక్షంగా లోధా కమిటీని, పరోక్షంగా సుప్రీం కోర్టును ధిక్కరించింది. ఈ ధిక్కార స్వరాన్ని జీర్ణించుకోలేకపోయిన లోధా కమిటీ సుప్రీం కోర్టులో స్టేటస్ రిపోర్ట్‌ను దాఖలు చేసిన తర్వాతగానీ బిసిసిఐకి తన స్థాయి ఏమిటో తెలియలేదు. ఆర్థికాంశాలపై తనకు ఎలాంటి పట్టులేకపోవతే, క్రికెట్ సిరీస్‌లను నిర్వహించడం సాధ్యం కాదని బిసిసిఐ వాదించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌లు జరగకపోతే, క్రికెట్‌ను ఒక మతంలా ఆరాధించే భారత వీరాభిమానులు తీవ్రంగా స్పందిస్తారని, లోధా కమిటీ నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో నిరసన వెల్లువెత్తుతుందని అంచనా వేసింది. అయితే, బిసిసిఐ బ్యాంకు ఖాతాలను లోధా కమిటీ స్తంభింప చేయలేదు. కేవలం రెండు సభ్య సంఘాలకు క్రికెట్ అభివృద్ధి పేరిట ఇవ్వాలనుకున్న భారీ మొత్తాలను మాత్రమే నిలిపివేయాల్సిందిగా బ్యాంకులకు సూచించింది. ఈ నిజం తెలియక, ప్రజల్లో లోధా కమిటీపై అసంతృప్తి రగిలించాలని ప్రయత్నించి, బిసిసిఐ తన పరువు తానే తీసుకుంది. తప్పుడు దారిలో నడచిన బిసిసిఐ స్వదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా పేరు పోగొట్టుకుని, ప్రపంచ క్రికెట్‌లో ఏకాకిగా మిగిలిపోయింది. అత్యంత ఆత్మరక్షణ విధానాన్ని అనుసరించి హిట్ వికెట్‌గా పెవిలియన్ చేరింది.

- విశ్వ