ఆటాపోటీ

అమెరికా మార్కెట్‌పై బిసిసిఐ కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ను సొమ్ము చేసుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఆలోచిస్తోంది. దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నది. ఇటీవల వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌కు అమెరికాలోని ఫోర్ట్ లాడర్‌డేల్ (్ఫ్లరిడా)ను వేదికగా ఎంచుకోవడం వెనుక బిసిసిఐ ఆంతర్యం ఇదే. అప్పటి బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పలు సందర్భాల్లో అమెరికాలో క్రికెట్ మార్కెట్‌పై తన ఆంతర్యాన్ని ఆవిష్కరించాడు. బోర్డు మద్దతుతోనే క్రికెట్ ఆల్ స్టార్స్ టోర్నమెంట్ అమెరికాలో జరిగింది. క్రికెట్ లెజెండ్స్ సచిన్ తెండూల్కర్, షేన్ వార్న్ కలిసి మాజీ క్రికెటర్ల కోసం నిర్వహించిన ఈ టోర్నీలో రెండు జట్లు తలపడ్డాయి. సచిన్ బ్లాస్టర్స్, వార్న్స్ వారియర్స్ జట్లు ఢీకొన్నాయి. వారియర్స్ విజేతగా నిలిచింది. మాజీ క్రికెటర్లు పాల్గొన్న మ్యాచ్‌లకే స్టేడియాలు కిక్కిరిసిపోవడంతో, అమెరికాలో క్రికెట్‌కు ఆదరణ ఎక్కువగా ఉంటుందనే విషయం బోర్డుకు స్పష్టమైంది. అందుకే, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి)ని ఒప్పించి అమెరికాలో టి-20 సిరీస్‌ను ఆడించింది. ఊహించిన దానికంటే ఎక్కువ మంది అభిమానులు మ్యాచ్‌లకు తరలివచ్చారు. ఆసియా దేశాలైన భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక నుంచి అమెరికాలో వెళ్లి స్థిరపడిన వారు ఎక్కువగానే ఉన్నారు. వీరిలో భారతీయుల సంఖ్య గణనీయంగా ఉంది. ఆసియాలో, ప్రత్యేకించి భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ అంతాఇంతా కాదు. అందుకే, బిసిసిఐ ప్రపంచంలోనే ఎక్కువ ఆదాయవనరులున్న క్రీడా సంఘంగా ఎదిగింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఆదాయంలో ఎక్కువ భాగం భారత్ నుంచే వెళుతున్నది. భారత్‌తోపాటు, పాకిస్తాన్, శ్రీలంక తదితర ఆసియా దేశాల్లోనూ క్రికెట్‌కు విపరీతమైన ఆదరణ ఉంది. వీరు అమెరికాలో స్థిరపడినా లేదా తాత్కాలికంగా నివాసం ఉంటున్నా, క్రికెట్ మ్యాచ్‌లకు పరుగులు తీస్తారు. క్రికెట్ ఆల్ స్టార్స్ టోర్నీ, భారత్, విండీస్ మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల టి-20 సిరీస్ విజయవంతం కావడమే అమెరికాలో క్రికెట్‌కు ఉన్న ఆదరణకు నిదర్శనం. ఇంగ్లాండ్ నుంచి కూడా వేలాది మంది అమెరికాలో స్థిరపడ్డారు. వారు కూడా క్రికెట్ అభిమానులే. మాజీ క్రికెటర్ల ఆటను చూడాలన్న ఉత్సాహంతో క్రికెట్ ఆల్ స్టార్స్ టోర్నీకి ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యారని అనుకుంటే, మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లకు కూడా అదే స్థాయిలో ఆదరణ లభించడం బోర్డు దృష్టిని ఆకర్షించింది. మంచి ప్రతిఫలాలు రాబట్టడానికి, లాభాల పంట పండించడానికి అమెరికాను మించిన వేదిక మరొకటి లేదని బోర్డు నిర్ధారణకు వచ్చింది. అప్పట్లో అమెరికాలో పర్యటించిన భారత పార్లమెంటు సభ్యుల బృందంలో అనురాగ్ ఠాకూర్ కూడా ఉన్నాడు. ఎంపీ హోదాలో అతను అమెరికా వెళ్లినప్పటికీ, అక్కడ క్రికెట్ సిరీస్‌లను నిర్వహిస్తే వచ్చే లాభనష్టాలపైనే ఎక్కువగా శ్రద్ధ పెట్టాడు. విస్తారంగా చర్చలు జరిపాడు. త్వరలోనే నిపుణుల బృందాన్ని అమెరికాకు పంపించేందుకు బోర్డు సన్నాహాలు చేస్తున్నది. అమెరికాలో పదేళ్లపాటు అనుసరించబోయే వ్యూహాలను ఖరారు చేసే కసరత్తు కూడా మొదలైంది. అమెరికాలో క్రికెట్ అభివృద్ధే లక్ష్యమని ప్రకటిస్తున్నప్పటికీ, ఏఏ కేంద్రాల్లో మ్యాచ్‌లను నిర్వహిస్తే ఎంతెంత లాభం వస్తుందనేదే బోర్డు ఆలోచన. క్రికెట్‌ను మన దేశంలో ఇప్పటికే వ్యాపార వస్తువుగా మార్చేసిన బిసిసిఐ అమెరికాలోనూ మార్కెట్‌ను కొల్లగొట్టడానికి అన్ని రకాలుగా సిద్ధమవుతున్నది. ఈ ప్రయత్నంలో బోర్డు సఫలమయ్యే అవకాశాలున్నాయి.