ఆటాపోటీ

మహిళా స్టార్ల ‘ఆఖరి యుద్ధం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ మహిళా టెన్నిస్ సంఘం (డబ్ల్యుటిఎ) ఏటా అత్యుత్తమ క్రీడాకారిణి ఎవరని నిర్ధారించుకోవడానికి నిర్వహించే అత్యంత ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ ఈసారి ఆదివారం నుంచి మొదలుకానుంది. డబ్ల్యుటిఎ ఫైనల్స్‌గా ప్రఖ్యాతిగాంచిన ఈ టోర్నమెంట్‌లో మేటి క్రీడాకారిణులు ఆధిపత్య పోరాటాన్ని కొనసాగిస్తారు. సీజన్ చివరిలో జరుగుతుంది కాబట్టి, ఇది ఒక రకంగా వారికి ఆఖరి యుద్ధం. అనధికార ప్రపంచ చాంపియన్‌షిప్‌గా దీనిని అభివర్ణించవచ్చు. గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లో వింబుల్డన్‌కు ఎంతటి ఆదరణ ఉందో, డబ్ల్యుటిఎ టోర్నీల్లో ఈ ఫైనల్స్ టోర్నీకి అదే స్థాయ ఆదరణ ఉంది. టెన్నిస్‌లోకి అడుగుపెట్టిన ప్రతి క్రీడాకారిణి ఈ టైటిల్‌ను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌తోపాటు, వివిధ టోర్నీల్లో కనబరచిన ప్రతిభద్వారా దక్కిన పాయంట్లను ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి, ఈ ఆఖరి యుద్ధం ప్రతిసారీ అభిమానులను ఉర్రూతలూగిస్తూనే ఉంది. 1972లో మొదలైన డబ్ల్యుటిఎ వరల్డ్ ఫైనల్స్‌కు ఏటా ఆదరణ పెరుగుతున్నదేగానీ తగ్గడం లేదు. ఈసారి సిమోనా హాలెప్ టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతుండగా, గార్బినె ముగురుజా, కరోలినా ప్లిస్కోవా వంటి స్టార్లు ఆమెకు గట్టిపోటీని ఇవ్వనున్నారు. నిరుటి విజేత డొమినికా సిబుల్కొవా ఈసారి పోటీలో లేకపోవడం గమనార్హం.

టెన్నిస్ సీజన్ ముగింపు దశకు చేరింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌తో సంబంధం లేకుండా ఈ ఏడాది అత్యుత్తమ క్రీడాకారిణి ఎవరనేది తేల్చే డబ్ల్యుటిఎ ఫైనల్స్ నేడు (అక్టోబర్ 22) మొదలుకానుంది. మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ఈ నెల 29 వరకూ ఈ పోటీలు జరుగుతాయి. సింగిల్స్‌లో 8 మంది, డబుల్స్‌లో 8 జోడీలు అత్యధిక సగటుతో ఆఖరి యుద్ధానికి సిద్ధమయ్యారు. సింగపూర్‌లోని కలాంగ్ ఇండోర్ స్టేడియంలో డబ్ల్యుటిఎ ఫైనల్స్ జరుగుతాయి కాబట్టి ఇది హార్డ్ కోర్ట్ ఈవెంట్‌గా పరీక్ష పెట్టనుంది. సింగిల్స్‌లో నిరుటి విజేత డొమినికా సిబుల్కొవా (స్లొవేకియా) ఈసారి బరిలోకి దిగే ఎనిమిది మంది జాబితాలో లేదు. డబుల్స్ జోడీ ఎకతరీన మకరోవా, ఎలెనా వెస్నినా మరోసారి టైటిల్ వేట కొనసాగిస్తారు.
సింగిల్స్ విభాగంలో ఈ సీజన్‌లో జరిగిన మొత్తం 16 డబ్ల్యుటిఎ టోర్నీల్లో దక్కించుకున్న పాయింట్ల సగటును తీసుకుంటారు. వీటికి నాలుగు గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లో వెల్లడైన ఫలితాలను కూడా కలుపుతారు. తప్పనిసరిగా పాల్గొనాల్సిన నాలుగు ప్రీమియర్ టోర్నమెంట్లు, మరో ఐదు ప్రీమియర్ టోర్నీల్లో రెండు అత్యుత్తమ ఫలితాల ద్వారా లభించిన పాయింట్లను జత చేస్తారు. డబుల్స్ విభాగంలో మొత్తం 11 టోర్నీల్లో సాధించిన పాయింట్లను లెక్కకు తీసుకుంటారు. సింగిల్స్‌లో పోటీపడే ఎనిమిది మంది క్రీడాకారిణులను రెండు గ్రూపులుగా విభజించి, రౌండ్ రాబిన్ విధానంలో మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ప్రతి క్రీడాకారిణి తన గ్రూపులోని ఇతర ముగ్గురితో మ్యాచ్‌లు ఆడుతుంది. రెండు గ్రూపుల్లోనూ మొదటి రెండు స్థానాలను దక్కించుకున్న మొత్తం నలుగురు సెమీ ఫైనల్స్‌కు అర్హత సంపాదిస్తారు. నాకౌట్ విధానంలో కొనసాగే సెమీ ఫైనల్స్‌లో, ఒక గ్రూపులో నంబర్ వన్‌గా నిలిచిన క్రీడాకారిణి మరో గ్రూపులో రెండో స్థానంలో నిలిచిన క్రీడాకారణితో ఢీ కొంటుంది. ప్రతి గ్రూపులోనూ స్థానాలను నిర్ధారించడానికి మొట్టమొదట సాధించిన విజయాలను ప్రాతిపదికగా తీసుకుంటారు. ఒకవేళ ఇద్దరు క్రీడాకారిణులు సమానమైన పాయింట్లు సంపాదిస్తే, వారివారి స్థానాలను ఖరారు చేయడానికి ముందుగా ఎక్కువ సెట్లు గెలిచిన వారెవరో చూస్తారు. సాధించిన గేమ్స్‌ను ఒక్కోసారి పరిగణలోకి తీసుకుంటారు.
ఫ్లోరిడా (అమెరికా)లోని బొకా రాటన్‌లో 1972 అక్టోబర్‌లో మొట్టమొదటిసారి డబ్ల్యుటిఎ ఫైనల్స్ టోర్నీ జరిగింది. సీజన్ ముగింపునకు గుర్తుగా నిర్వహించిన టోర్నీని వర్జీనియా స్లిమ్స్ సంస్థ స్పాన్సర్ చేసింది. అందుకే, దీనిని వర్జీనియా స్లిమ్స్ సర్క్యూట్ టోర్నీగా పిలిచేవారు. 1972 నుంచి 1974 వరకూ ఈ టోర్నీ అక్టోబర్ మాసంలో జరిగింది. 1975లో నిర్వాహకులు దీనిని మార్చి మాసానికి మార్చారు. 1986 వరకూ అదే విధానాన్ని అమలుపరిచారు. ఆ తర్వాత కాలంలో, టెన్నిస్ సీజన్‌ను ఏటా జనవరి నుంచి నవంబర్ వరకూ ఉండాలని డబ్ల్యుటిఎ నిర్ణయించింది. దీనితో డబ్ల్యుటిఎ ఫైనల్స్ డిసెంబర్‌కు మారింది. కానీ, తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో టోర్నీని అక్టోబర్ మాసానికి ఖరారు చేశారు.
లాస్ ఏంజిలిస్‌లోని వర్జీనియా స్లిమ్స్ సర్క్యూట్‌లో 1972లో మొదలైన డబ్ల్యుటిఎ ఫైనల్స్ మరుసటి సంవత్సరం కూడా అక్కడే జరిగింది. 1974 నుంచి 1976 వరకు ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ అదే నగరంలోని మాడిసన్ స్వేర్ గార్డెన్ (ఎంఎస్‌జి)కి మారింది. 1978లో ఆక్లాండ్‌కు చేరి, ఆ మరుసటి ఏడాది తిరిగి ఎంఎస్‌జికి వచ్చేసింది. 2000 వరకూ ఈ టోర్నీ అక్కడే జరిగింది. 2001లో మ్యూనిచ్ (జర్మనీ), 2002 నుంచి 2005 వరకు లాస్ ఏంజిలిస్, 2006, 2007 సంవత్సరాల్లో మాడ్రిడ్ (స్పెయిన్) ఈ టోర్నమెంట్‌ను నిర్వహించాయి. 2008 నుంచి 2010 వరకు దోహా (కతార్), 2011 నుంచి 2013 వరకు ఇస్టాంబుల్ (టర్కీ) నగరాలు ఆతిథ్యమిచ్చాయి. 2014లో ఈ టోర్నీ కోసం ఏకంగా 43 నగరాలు పోటీపడగా, కజాన్ (రష్యా) అవకాశాన్ని దక్కించుకుంది. 2015 నుంచి సింగపూర్ వేదికైంది. వచ్చే ఏడాది కూడా అక్కడే పోటీలు జరుగుతాయి.

‘తొలి’ పది మంది..
1. 1972: క్రిస్ ఎవర్ట్ లాయిడ్ (కెర్రీ మెల్విల్ రీడ్‌పై 7-5, 6-4 తేడాతో విజయం)
2. 1973: క్రిస్ ఎవర్ట్ లాయిడ్ (నాన్సీ రిచె గంటర్‌పై 6-3, 6-3 ఆధిక్యంతో గెలుపు)
3. 1974: ఎవోన్ గూలగాంగ్ కావ్లే (క్రిస్ ఎవర్ట్ లాయిడ్‌పై 6-3, 6-4 తేడాతో విజయం)
4. 1975: క్రిస్ ఎవర్ట్ లాయిడ్ (మార్టినా నవ్రతిలోవాపై 6-4, 6-2 తేడాతో విజయం)
5. 1976: ఎవోన్ గూలగాంగ్ కావ్లే (క్రిస్ ఎవర్ట్‌పై 6-3, 5-7, 6-3 ఆధిక్యంతో గెలుపు)
6. 1977: క్రిస్ ఎవర్ట్ లాయిడ్ (సూ బార్కర్‌పై 2-6, 6-1, 6-1 స్కోరుతో విజయం)
7. 1978: మార్టినా నవ్రతిలోవా (ఎవోన్ గూలగాంగ్ కావ్లేపై 7-6, 6-4 తేడాతో విజయం)
8. 1979: మార్టినా నవ్రతిలోవా (ట్రేసీ ఆస్టిన్‌పై 6-3, 3-6, 6-2 ఆధిక్యంతో గెలుపు)
9. 1980: ట్రేసీ ఆస్టిన్ (మార్టినా నవ్రతిలోవాపై 6-2, 2-6, 6-2 ఆధిక్యంతో విజయం)
10. 1981: మార్టినా నవ్రతిలోవా (డ్రియే జీగర్‌పై 6-3, 7-6 తేడాతో గెలుపు)

సింగిల్స్‌లో పోటీదారులు వీరే
1. సిమోనా హాలెప్ (5,675 పాయింట్లు), 2. గార్బినె ముగురుజా (5,636 పాయింట్లు), 3. కరోలినా ప్లిస్కోవా (5,105 పాయింట్లు), 4. ఎలినా స్విటోలినా (5,000 పాయింట్లు), 5. కరోలిన్ వొజ్నియాకి (4,640 పాయింట్లు), 6. వీనస్ విలియమ్స్ (4,612 పాయింట్లు), 7. జెలెనా ఒస్టాపెన్కో (4,510 పాయింట్లు), 8. కరోలిన్ గార్సియా (3,795 పాయింట్లు).
డబుల్స్ జోడీలు
1. చాన్ యుంగ్ జాన్/ మార్టినా హింగిస్, 2. ఎకతెరిన మకరోవా/ ఎలెనా వెస్నినా, 3. ఆష్లే బార్టీ/ కాసీ డలాక్వా, 4. లూసీ హాడెకా/ కాతెరిన సినియాకొవా, 5. టిమియా ఎబాస్/ ఆండియా హ్లావకొవా, 6. అన్నా లెనా గ్రోన్‌ఫీల్డ్/ క్వెటా పెచ్కే, 7. గాబ్రియేల డాబ్రోవ్‌స్కీ/ జూ ఇఫాన్, 8. ఆండ్రెజా క్లెపాక్/ మరియా జోస్ మార్టినెజ్ సాంచేజ్.
* వీరిలో లూసీ హడెకా, కాతెరిన సినియాకొవా జోడీ గాయం కారణంగా వైదొలగింది. దీనితో ఈసారి డబుల్స్‌లో అధికారికంగా ఏడు జట్లే తలపడతాయి.

నవ్రతిలోవా టాప్

అత్యధిక పర్యాయాలు డబ్ల్యుటిఎ టైటిల్ సాధించిన క్రీడాకారిణుల జాబితాలో మార్టినా నవ్రతిలోవా అగ్రస్థానాన్ని ఆక్రమించుకున్నారు. ఆమె మొత్తం 15 పర్యాయాలు ఫైనల్ వరకూ చేరి, ఎనిమిదిసార్లు చాంపియన్‌షిప్‌ను గెల్చుకున్నారు. ఏడుసార్లు ఫైనల్ చేరిన సెరెనా విలియమ్స్, ఆరు పర్యాయాలు తుది పోరులో తలపడిన స్ట్ఫె గ్రాఫ్ చెరి ఐదుసార్లు ఈ టైటిల్‌ను చేజిక్కించుకున్నారు. క్రిస్ ఎవర్ట్ లాయిడ్ ఎనిమిది ప్రయత్నాల్లో నాలుగుసార్లు విజేతగా నిలిచారు.

-విశ్వమిత్ర