ఆటాపోటీ

సూపర్ గోల్ ....హాకీకి కొత్త ఊపిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసియా కప్ టైటిల్ భారత హాకీకి కొత్త ఊపిరి పోసింది. చాలా కాలం తర్వాత, అంతర్జాతీయ మేటి జట్లకు గట్టిపోటీనిచ్చే సత్తా ఉందని భారత్ నిరూపించుకోగలిగింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను గ్రూప్ దశలో ఒకసారి, సూపర్ ఫోర్స్‌లో మరోసారి ఓడించినప్పుడు క్రీడాభిమానుల దృష్టిలో భారత్ విజయం సాధించింది. టైటిల్ అందుకోవడం వారి ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఢాకాలో జరిగిన ఆసియా కప్ టోర్నీ ఫైనల్‌లో స్థానిక జట్టు మలేసియాను భారత్ కట్టడి చేసిన తీరు, ఆధిక్యాన్ని సంపాదించిన తర్వాత అనుసరించిన వ్యూహం అనన్య సామాన్యం. ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు ఒక్క మ్యాచ్‌ని కూడా చేజార్చుకోలేదు. మొత్తం 28 గోల్స్ నమోదు చేసింది. నిజానికి ఒకరిద్దరిని మినహాయిస్తే, జట్టులో ఎక్కువ మందికి అంతర్జాతీయ వేదికలపై చెప్పుకోదగిన అనుభవం లేదు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ ఆరో స్థానంలో ఉన్నప్పటికీ, యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నందున ఫలితాలు ఏ విధంగా ఉంటాయోనన్న అనుమానం వ్యక్తమైంది. కానీ, అందరి అనుమానాలకు తెరదించుతూ, తొలి మ్యాచ్‌లో జపాన్‌ను 5-0 తేడాతో ఓడించింది. టోర్నీకి ఆతిథ్యమిచ్చిన బంగ్లాదేశ్‌ను ఏకంగా 7-0 ఆధిక్యంతో చిత్తుచేసింది. దక్షిణ కొరియాతో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌ని 1-1గా డ్రా చేసుకుంది. గ్రూప్ దశలో పాకిస్తాన్‌పై 3-1, మలేసియాపై 6-2 స్కోరుతో విజయాలు సాధించింది. సూపర్ ఫోర్స్‌లో పాకిస్తాన్‌పై 4-0 తేడాతో గెలిచింది. ఫైనల్‌లో మరోసారి మలేసియాను డిఫెన్స్‌లోకి నెట్టి, విజయ కేతనం ఎగరేసింది. ఒకప్పుడు ప్రపంచ హాకీని శాసించిన భారత్‌కు ఆసియా కప్‌ను అందుకోవడాన్ని అసాధారణ ఘనతేమీ కాదు. దీనిని ఒక అద్భుతంగా పరిగణించాల్సిన అవసరం కూడా లేదు. అయితే, చాలాకాలంగా దేశంలో హాకీ ప్రమాణాలు పాతాళానికి పడిపోగా, ఉనికే ప్రమాదకరంగా మారింది. సవాలక్ష ప్రతికూల పరిస్థితులను అధిగమించి, మళ్లీ తన ఉనికిని చాటుకునేందుకు ఆసియా కప్ టైటిల్ సాధించడం ద్వారా తొలి అడుగు వేయడం నిజంగా హర్షదాయకమే. జట్టులోని ప్రతి ఆటగాడినీ అభినందించి తీరాలి.
శ్రీజేష్‌కు అసలైన వారసుడు ఎవరన్న అనుమానాలకు ఆకాష్ చిక్టే తెరదించాడు. గోల్స్ కోసం ప్రత్యర్థి జట్లు చేసిన ఎన్నో ప్రయత్నాలకు అతను సమర్థంగా గండిగొట్టి, ఆసియా కప్‌ను భారత్ గెల్చుకోవడంలో ముఖ్య భూమిక పోషించాడు. బ్యాకప్ గోల్‌కీపర్ సూరజ్ కర్కేరా కూడా తమకు లభించిన చిన్నచిన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, ప్రత్యర్థులకు గోల్స్ ఇవ్వకుండా అడ్డుకున్నాడు. ఇక, ఈ టోర్నీపై తమదైన ముద్ర వేసిన వారిలో భారత డిఫెండర్లు కూడా ఉన్నారు. డిస్పాన్ టిర్కీ, చింగ్లెన్‌సనా సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్ త్రయం డ్రాగ్ ఫ్లికింగ్‌లోనూ, డాజ్లింగ్‌లోనూ అసాధారణ ప్రతిభ కనబరిచారు. ప్రత్యేకించి హర్మన్‌ప్రీత్ డ్రాగ్ ఫ్లిక్స్‌కు సరైన సమాధానం ఇవ్వడంలో చాలా జట్లు విఫలమయ్యాయి. మన్‌ప్రీత్ సింగ్, సర్దార్ సింగ్ వంటి అనుభవజ్ఞులు జట్టులో లేకపోయినా, వారి స్థానాలను గుర్జాంత్ సింగ్, ఎస్‌కె ఉతప్ప, లలిత్ ఉపాధ్యాయ సమర్థంగా భర్తీ చేశారు. మైదానంలో వేగంగా కదులుతూ, ఎక్కడ చూసినా తామే అన్న చందంగా కనిపిస్తూ వారు అందరినీ ఆకట్టుకున్నారు.
ప్రత్యర్థులను ఏమార్చి, గోల్స్ సాధించేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించే సమర్థుడైన ఫార్వర్డ్ ఆటగాడు భారత్‌కు చాలాకాలం తర్వాత ఎస్వీ సునీల్ రూపంలో లభించాడు. అతని కారణంగానే మనకు పలు అవకాశాలు లభించాయి. ఆకాశ్‌దీప్ సింగ్, రమణ్‌దీప్ సింగ్ కూడా అతనికి చక్కటి మద్దతునివ్వడంతో మునుపటి కంటే ఇప్పుడు భారత జట్టు ప్రమాణాలు పెరిగాయి. క్షణాల్లోనే బంతిని తన ఆధీనంలోకి తెచ్చుకొని, మెరుపు వేగంతో దానిని పాస్ చేసే సామర్థ్యం ఉన్న సునీల్ బృందం గోల్స్ సాధించేందుకు బాటలు వేస్తున్నది. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకునే దిశగా మరికొంత కృషి జరిగితే, జట్టు ఇంకా రాటుదేలుతుంది.
అన్నింటికీమించి, భారత ఆటగాళ్లలో ఇప్పుడు ఆత్మవిశ్వాసం, పట్టుదల కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఆసియా కప్ ప్రారంభానికి కేవలం ఒక నెల ముందే రోలాండ్ ఆల్ట్‌మన్స్‌పై వేటు పడింది. దీనితో కొత్త కోచ్ ఎవరు? ఏ విధంగా జట్టును ఒక తాటిపైకి తెస్తాడు? అతనికి ఆటగాళ్లు ఎంత వరకూ సహకరిస్తారు? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. అయితే, జొయెర్డ్ మారినే వరుస విజయాలతో ఈ ప్రశ్నలకు సరైన సమాధానమిచ్చాడు. అతని పర్యవేక్షణలో యువ ఆటగాళ్లు రెట్టించిన ఉత్సాహంతో ఆడుతున్నారు. ఆల్ట్‌మన్స్ ఆధిపత్యానికి తెరపడడంతో, కొత్త కోచ్‌తో మమేకమై, ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నారు. ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతో స్వేచ్ఛగా ఆడుతూ, అందరి అంచనాలను మించి రాణిస్తున్నారు. ఈ దూకుడును ఇదే రీతిలో కొనసాగిస్తే, త్వరలోనే భారత్ మళ్లీ ప్రపంచ మేటి జట్టుగా ఎదగడం ఖాయం.

- కౌస్త్భు