ఆటాపోటీ

సూచనలు మంచివే.. అమలే అనుమానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)ను పూర్తిగా ప్రక్షాళన చేయడానికి విశ్రాంత న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సుప్రీం కోర్టుకు పలు సిఫార్సులు చేసింది. ఎంతో మందితో చర్చించి, పలు దఫాలుగా సమావేశమైన తర్వాత కోర్టుకు సమర్పించిన నివేదికలో కీలక సూచనలు చేసింది. అయితే, ఈ సిఫార్సుల్లో బలమెంత? అన్నదే ప్రశ్న. బిసిసిఐని ఎన్నో సమస్యలు వెంటాడి వేధిస్తున్నాయి. అనేకానేక ఆరోపణలతో ఇప్పటికే ప్రతిష్ఠ కోల్పోయింది. ఎవరికి వారే తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆటనే తాకట్టుపెట్టడంతో క్రికెట్ పట్ల ప్రజల్లో అభిమానం క్రమంగా తగ్గుతున్నది. మన దేశంలో ఒక మతంగా వెలుగుతున్న క్రికెట్‌కు అవినీతి చీడ చాలాకాలం క్రితమే అంటుకుంది. రాజకీయాలకు కొదువ లేదు. బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులు బోర్డును ఏలుతుంటే, నిజంగానే క్రికెట్‌కు అత్యుత్తమ సేవలు అందించిన వారు ప్రేక్షక పాత్ర పోషించాల్సిన దుస్థితి. 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో తెరపైకి వచ్చిన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసుతో బిసిసిఐ పరువు బజారుకెక్కింది. రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాను ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేయడంతో తెరపైకి వచ్చిన ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. బోర్డుకు అప్పట్లో అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసన్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి అధినేత కావడంతో పరస్పర ప్రయోజనాల అంశం చర్చకు వచ్చింది. చెన్నైకి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించిన అతని అల్లుడు గురునాథ్ మెయప్పన్‌కు బెట్టింగ్ వ్యవహారంతోలో సంబంధం ఉందని బాలీవుడ్ నటుడు విందూ రణ్‌ధావా ముంబయి పోలీసులకు ఇచ్చిన సమాచారంతో ఈ కేసు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్నో నాటకీయ మలుపులు తిరిగిన తర్వాత, విశ్రాంత న్యాయమూర్తి ముకుల్ ముద్గల్ నాయకత్వంలోని కమిటీ రెండు విడతలుగా విచారించి సుప్రీం కోర్టుకు నివేదికలను అందించింది. బెట్టింగ్ వ్యవహారంలో శ్రీనికి ప్రత్యక్షంగా సంబంధం లేదని ముద్గల్ కమిటీ స్పష్టం చేసింది. అయితే, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు చెందిన ఆటగాళ్లు కొందరు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిన తర్వాత కూడా అతను ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టింది. కాగా, ముద్గల్ కమిటీ సమర్పించిన నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, మెయప్పన్‌తోపాటు రాజస్థాన్ సహ భాగస్వామి రాజ్ కుంద్రాను కూడా సుప్రీం కోర్టు దోషిగా తేల్చింది. విచారణ పూర్తి చేసిన తర్వాత, దోషులకు విధించాల్సిన శిక్షను ఖరారు చేసే బాధ్యతను ఆర్‌ఎం లోధా నాయకత్వంలోని త్రి సభ్య కమిటీకి అప్పగించింది. ఈ కమిటీలో అశోక్ భాన్, ఆర్వీ రవీంద్రన్ సభ్యులు. ఐపిఎల్, బిసిసిఐపై వచ్చిన ఆరోపణలను పరిశీలించి, ముద్గల్ కమిటీ నివేదికను అధ్యయనం చేసి, అన్ని కోణాల నుంచి విచారణ జరిపాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. బోర్డు ప్రక్షాళనకు, తిరిగి పూర్వ వైభవాన్ని సంపాదించుకోవడానికి వీలుగా తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని కోరింది. బిసిసిఐ పాలనా వ్యవహారాలు పారదర్శకంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలను పేర్కొంటూ నివేదిక సమర్పించాలని పేర్కొంది. సుప్రీం ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన లోధా కమిటీ పలు కోణాల్లో కేసును అధ్యయనం చేసింది. ఎంతో మందిని విచారించింది. బెట్టింగ్ దోషులు మెయప్పన్, రాజ్ కుంద్రాలపై జీవితకాల సస్పెన్షన్ వేటు వేసింది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన చెన్నై, రాజస్థాన్ ఫ్రాంచైజీలను రెండు సంవత్సరాలు ఐపిఎల్‌లో ఆడకుండా నిషేధించింది. ఆతర్వాత బిసిసిఐ అధికారులతో 38 పర్యాయాలు సుమావేశమైంది. బోర్డుపై ఉన్న పలు ఆరోపణలు, విమర్శలను పరిగణలోకి తీసుకొని అధ్యయనాన్ని పూర్తి చేసింది. అన్ని అంశాలను విశే్లషిస్తూ 159 పేజీలతో కూడిన నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. లోధా కమిటీ ఇచ్చిన నివేదికలో ఎన్నో కీలక అంశాలున్నాయి. వాటిని అమలు చేస్తే, బిసిసిఐలో మార్పు అసాధ్యమేమీ కాదు. అయితే, లోధా కమిటీ సూచనలు ఎంత వరకూ అమలవుతాయన్నది అనుమానమే. బలంగా వేళ్లూనుకున్న అవినీతి, రాజకీయాల జోక్యం బోర్డును వీడడం కష్టంగానే కనిపిస్తున్నది.
రాష్ట్రానికో ఓటు
బిసిసిఐలో ఇప్పుడు మొత్తం 30 యూనిట్లకు సభ్యత్వం ఉంది. వీటిలో ఎక్కువ శాతం ఆయా రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. అయితే, ఏ రాష్ట్రానికీ చెందని, ఎల్లలంటూ ఏవీ లేని సర్వీసెస్, రైల్వేస్ వంటి యూనిట్లకూ సభ్యత్వం ఉంది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి మూడేసి సంఘాలు బిసిసిఐలో సభ్యత్వం పొందాయి. ఇకపై ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సంఘం మాత్రమే ఉండాలని లోధా కమిటీ సిఫార్సు చేరింది. ఈ ప్రతిపాదనను యథాతథంగా అమలు చేస్తే, బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌కే బోర్డు వార్షిక సమావేశాల్లో ఓటు వేసే హక్కు ఉండదు. మహారాష్ట్ర యూనిట్‌కు మాత్రమే ఓటు హక్కు లభిస్తుంది. ఇన్నాళ్లూ మహారాష్ట్ర నుంచి విదర్భ, ముంబయి క్రికెట్ సంఘాలకు కూడా బోర్డులో సభ్యత్వం, ఓటు హక్కు ఉండేవి. ఆ రెండు యూనిట్లు ఇకపై ఓటు హక్కును కోల్పోతాయి. విదర్భ క్రికెట్ సంఘానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మనోహర్‌కు కూడా ఓటు హక్కు ఉండదు. అదే విధంగా గుజరాత్‌కు ఓటు హక్కు ఉంటుందిగానీ, సౌరాష్టక్రు ప్రాతినిథ్యం వహించే నిరంజన్ షా ఓటు వేయడానికి వీలుండదు. కాగా, కొత్త రాష్ట్రాలు తెలంగాణ, చత్తీస్‌గఢ్‌తోపాటు బీహార్‌కు కూడా ఓటు హక్కు కల్పించాల్సి వస్తుంది. బీహార్ నుంచి విడిపోయి జార్ఖండ్ కొత్త రాష్ట్రంగా అవతరించింది. కానీ, జార్ఖండ్‌కు ఓటు హక్కు కల్పించిన బిసిసిఐ బీహార్‌ను పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ వివక్షకు తెరపడుతుంది.
ఇన్నాళ్లూ అనుసరిస్తున్న విధానాలను అనుసరించి బిసిసిఐ అధ్యక్షుడు మూడు ఓట్లు వేసే అవకాశం ఉంది. అతను ప్రాతినిథ్యం వహించే క్రికెట్ సంఘం తరఫున ఒకటి, బోర్డు అధ్యక్షుడి హోదాలో మరొకటి చొప్పున ఓట్లు ఉంటాయి. అదే విధంగా ఏదైనా అంశంపై ఓటింగ్ జరిగి, సమానమైన ఓట్లు నమోదైతే, అధ్యక్షుడు కాస్టింగ్ ఓటు వేయవచ్చు. ఒక వ్యక్తికి మూడు ఓట్లు ఉండరాదని లోధా కమిటీ అంటున్నది. సంబంధిత క్రికెట్ సంఘం తరఫున ఒక ఓటు ఉంటే సరిపోతుందని పేర్కొంది. ఈ నిబంధన కింద చూస్తే మనోహర్‌కు ఓటు హక్కు ఉండదు.
చట్టపరమైన చిక్కులు!
బిసిసిఐని సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ కొత్తదేమీ కాదు. గతంలో కేంద్ర మంత్రిగా పని చేసిన అజయ్ మాకెన్ ఈ విషయంలో ఎంతో పట్టుదలతో ప్రయత్నించాడు. కానీ, ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. అన్ని జాతీయ క్రీడా సంఘాలను ఆర్‌టిఐ పరిధిలోకి తేవాలన్న ప్రధాన లక్ష్యంతో రూపొందించిన క్రీడా బిల్లుకు ఇప్పటి వరకూ ఆమోదముద్ర పడలేదు. నిజానికి బిసిసిఐ చేపట్టే కార్యకలాపాల్లో ప్రధానమైనవి మ్యాచ్‌లను నిర్వహించడం. ఇవి ప్రజలకు సంబంధించిన అంశాలతోనే ముడిపడినవే. అందుకే, బోర్డులో ఏం జరుగుతున్నదో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. అయితే, తమిళనాడులో స్వచ్ఛంద సంస్థగా నమోదైనందున తమ కార్యకలాపాలు లేదా పాలనా వ్యవహారాలను గురించి ఎవరికీ వివరించాల్సిన అవసరం లేదని బిసిసిఐ చాలాకాలంగా వాదిస్తున్నది. తాము ఎవరికీ జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నది. ఈ వివాదంపై లోధా కమిటీ దృష్టి సారించింది. క్రికెట్‌పై ప్రజలకు ఉన్న ఆదరణ వల్లే బిసిసిఐ ఎదిగిందని, ఆర్థికంగా స్థిరపడిందని కమిటీ తన నివేదికలో తేల్చిచెప్పింది. ఈకారణంగానే బోర్డును ఆర్టీఏ పరిధిలోకి చేర్చాలని సూచించింది. ఈ సూచన అమలైతే, ఇన్నాళ్లూ ఇష్టారాజ్యంగా వ్యవహరించిన బోర్డు అధికారుల స్వేచ్ఛకు కళ్లెం పడుతుంది. బోర్డు మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌పై న్యాయ పోరాటంలో గెలిచిన బీహార్ క్రికెట్ సంఘం కార్యదర్శి ఆదిత్య వర్మ, ఐపిఎల్‌ను ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన టోర్నీగా తీర్చిదిద్ది, ఆతర్వాత అవినీతి ఆరపణలపై టోర్నీ కమిషనర్‌గా పదవిని పోగొట్టుకోవడమేగాక పలు కోర్టు కేసులను ఎదుర్కొంటున్న లలిత్ మోదీ తదితరులు ఇన్నాళ్లూ చేసిన ఆరోపణలకు ఊతం వస్తుంది. ఇనే్నళ్లుగా బోర్డు తీసుకున్న పలు నిర్ణయాలు, పెట్టిన ఖర్చుపై లెక్కకు మించిన కేసులు పడే ప్రమాదం ఉంది.
పాలక మండలిలో మార్పు
బిసిసిఐ పాలక మండలికి కొత్త రూపాన్ని ఇచ్చేందుకు కృషి జరగాలని లోధా కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలు స్పష్టం చేస్తున్నాయి. తొమ్మిది మందితో గవర్నింగ్ బాడీ ఏర్పాటు కావాలని సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో సూచించింది. వీరిలో ఐదుగురిని సర్వసభ్య సమావేశంలో ఎన్నుకోవాలని, ఇద్దరు క్రికెటర్ల సంఘం ప్రతినిధులు ఉండాలని పేర్కొంది. ఒక మహిళకు కూడా స్థానం కల్పించాలని హితవు పలికింది. బోర్డు రోజువారీ వ్యవహారాలను పరిశీలించే బాధ్యతను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇవో)కు అప్పగించాలని పేర్కొంది. అతను ఒక్కడే ఈ వ్యవహారాలను పర్యవేక్షించలేడు కాబట్టి, ఆరుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీ సహాయసహకారాలు అందించాలని సూచించింది. తొమ్మిది మందిలో ఐదుగురు మాత్రమే సర్వసభ్య సమావేశం నుంచి ఎన్నికైతే, పాలక మండలిలో ఆధిపత్య పోరాటం తీవ్ర స్థాయికి చేరుతుంది. ఉన్నత ప్రమాణాలను నెలకొల్పేందుకు లోధా కమిటీ చేసిన ఈ సూచనను రాజకీయాంశంగా మార్చే శక్తిసామర్థ్యాలు బోర్డు పెద్దలకు ఉన్నాయన్నది సత్యదూరంకాదు.
బోర్డు కనుసన్నల్లో క్రికెటర్ల సంఘం
క్రికెట్ ఆడే ప్రతి దేశంలోనూ క్రికెటర్ల సంఘాలున్నాయి. అయితే, అవి ఆయా బోర్డులకు లోబడి పని చేయవు. కానీ, బిసిసిఐ ఆధ్వర్యంలోనే క్రికెటర్ల సంఘం రూపుదిద్దుకోవాలని లోధా కమిటీ సూచించింది. దీనికోసం మాజీ హోం కార్యదర్శి జికె పిళ్లై అధ్యక్షతన ఒక స్టీరింగ్ కమిటీని నియమించాలని కూడా పేర్కొంది. మాజీ కెప్టెన్లు మొహీందర్ అమర్‌నాథ్, అనీల్ కుంబ్లే, మాజీ మహిళా క్రికెటర్ డయానా ఎడుల్జీలను స్టీరింగ్ కమిటీలో సభ్యులుగా చేర్చాలని ప్రతిపాదించింది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడిన ప్రతి ఒక్కరికీ, పురుషులు, మహిళలు అన్న తేడాలేకుండా క్రికెటర్ల సంఘంలో సభ్యత్వాన్ని ఇవ్వాలని సూచించింది. ఈ సంఘానికి అవసరమైన ఆర్థిక సాయం బిసిసిఐ అందించాలని స్పష్టం చేసింది. అంతమాత్రాన బోర్డుకు లోబడి ఆటగాళ్ల సంఘం వ్యవహరించాల్సిన అవసరం లేదని, తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కు వారికి ఉంటుందని లోధా కమిటీ తెలిపింది. అయితే, ధన బలంతో ప్రపంచ క్రికెట్‌నే శాసిస్తున్న బిసిసిఐకి వ్యతిరేకంగా క్రికెటర్ల సంఘం గళం విప్పే అవకాశాలు తక్కువ. పైగా బోర్డు నేరుగా ఆర్థిక సాయాన్ని అందిస్తుంది కాబట్టి, ఈ సంఘం ఎప్పటికీ ఒక అనుబంధ శాఖగా ఉంటుందే తప్ప స్వతంత్ర సంఘంగా మనుగడ సాగించలేదు.
ఐపిఎల్‌కు ప్రత్యేకం..
బిసిసిఐ ప్రతిష్ఠను ఐపిఎల్ ఎంతగా పెంచిందో, అదే స్థాయిలో వీధిన పడేసింది. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్, బుకీలతో ఆటగాళ్ల సంబంధాలు, ముడుపులు ఇచ్చిపుచ్చుకోవడాలు, జట్టుకు లేదా పిచ్‌కి సంబంధించిన వివరాలను బుకీలకు అందచేయడం వంటి అకృత్యాలతో ఐపిఎల్ పరువు పోగొట్టుకుంది. ఇప్పుడు ఐపిఎల్‌లో జరిగే ప్రతి మ్యాచ్‌ని, ఆటగాళ్ల ప్రతి కదలికనూ అనుమానంగా చూసే పరిస్థితి నెలకొంది. ఈ అసహ్యకరమైన పరిస్థితి నుంచి బయటపడాలంటే ఐపిఎల్‌కు ప్రత్యేక గవర్నింగ్ బాడీ ఉండాలని లోధా కమిటీ అభిప్రాయపడింది. తొమ్మిది మందితో ఐపిఎల్ గవర్నింగ్ బాడీ ఏర్పాటు కావాలని, అందులో బిసిసిఐ కార్యదర్శి, కోశాధికారి సభ్యులుగా ఉండాలని సూచించింది. ఇద్దరు సభ్యులను బిసిసిఐ సభ్య సంఘాలు ఎన్నుకుంటాయని, ఇద్దరు ఫ్రాంచైజీ ప్రతినిధులు ఉంటారని వివరించింది. క్రికెటర్ల సంఘం నుంచి ఒక ప్రతినిధి కూడా ఐపిఎల్ గవర్నింగ్ బాడీలో ఉంటాడని, భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఒకరిని నియమిస్తారని తెలిపింది. సాధారణ సమయాల్లో ఆర్థిక వ్యవహారాలు, ఇతర అంశాలపై నిర్ణయాలు తీసుకునే అధికారం ఐపిఎల్ గవర్నింగ్ బాడీకి ఉన్నప్పటికీ, బిసిసిఐకి జవాబుదారీ వహించాలి.

- బిట్రగుంట