ఆటాపోటీ

చీకటి వెలుగుల కలబోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది వివిధ క్రీడల్లో ఎన్నో రికార్డులు నమోదయ్యాయ. ఘన విజయాలు, పరాజయాలు షరా మామూలుగానే చోటు చేసుకున్నాయ. అయతే, ఎవరూ ఊహించని సంఘటనగా, కెరీర్‌లో తన చివరి స్ప్రింట్‌ను ఉసేన్ బోల్ట్ చేజిక్కించుకోకపోవడాన్ని పేర్కోవాలి. లండన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో ఈ జమైకా చిరుత కండరాల నొప్పి కారణంగా లక్ష్యాన్ని అందరి కంటే ముందుగా చేరుకోలేకపోయాడు. జస్టిన్ గాల్టిన్, క్రిస్టియన్ కోల్‌మన్ మొదటి రెండు స్థానాలను ఆక్రమించగా, బోల్ట్ మూడో స్థానంలో నిలిచి కాంస్యంతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది.

బోల్ట్‌కు షాక్
ఈ ఏడాది ఎవరూ ఊహించని రీతిలో ప్రపంచ మేటి అథ్లెట్, ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్‌కు కెరీర్‌లో చివరి స్ప్రింట్‌లో ఓటమి ఎదురైంది. ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌తో కెరీర్‌ను ముగిస్తున్నట్టు బోల్ట్ అంతకుముందే ప్రకటించడంతో, సహజంగానే అతనికి అత్యంత ఇష్టమైన 100 పరుగుపై అందరూ దృష్టి పెట్టారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసినప్పటికీ, చిరకాల ప్రత్యర్థి, అమెరికా అథ్లెట్ జస్టిన్ గాల్టిన్ చేతిలో బోల్ట్ పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. గాల్టిన్ లక్ష్యాన్ని 9.92 సెకన్లలో పూర్తిచేసి స్వర్ణ పతకాన్ని ఎగరేసుకుపోవడాన్ని అభిమానులు ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. బోల్ట్ కనీసం రెండో స్థానాన్ని కూడా దక్కించుకోలేక, మూడో స్థానంతో సంతృప్తి చెందడం వారిని మరింత నిరాశ పరిచింది. అమెరికాకే చెందిన క్రిస్టియన్ కోల్‌మన్ 9.94 సెకన్లతో రజత పతకాన్ని సాధించాడు. బోల్ట్ అతనికంటే 0.01 సెకన్లు ఆలస్యంగా రేస్‌ను పూర్తి చేసి, కాంస్య పతకం అందుకున్నాడు. మొత్తం మీద స్ప్రింట్‌లో పరాజయంతో బోల్ట్ కెరీర్ ముగిసింది.

ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా ఓపెన్‌ను సాధించిన అప్పటి ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ సరికొత్త రికార్డు సృష్టించింది. మహిళల సింగిల్స్‌లో అత్యధికంగా 23 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకొన్న తొలి క్రీడాకారిణిగా ఆమె అరుదైన రికార్డును నమోదు చేసింది. మూడు నెలల గర్భవతిగా బరిలోకి దిగి, తీవ్రమైన పోటీని సమర్థంగా ఎదుర్కొన్న ఆమె ఫైనల్‌లో తన సోదరి వీనస్ విలియమ్స్‌పై గెలిచింది. ఆ తర్వాత విరామం తీసుకున్న సెరెనా సెప్టెంబర్ మాసంలో ఆడపిల్ల, అలెక్స్ ఒలింపియాకు జన్మనిచ్చింది. ఏడాదిపాటు టెన్నిస్‌కు దూరమైన ఆమె వచ్చే నెల జరిగే ఆస్ట్రేలియా ఓపెన్‌తో మళ్లీ తన కెరీర్‌ను మొదలుపెట్టడంతోపాటు, టైటిల్‌ను నిలబెట్టుకోవాలన్న ఆలోచనలో ఉంది.

ఈ ఏడాది క్రీడాభిమానులకు ఎన్నో తీపి గుర్తులను మిగిల్చింది... ఎన్నో చేదు అనుభవాలనూ రుచు చూపించింది. చీకటి వెలుగుల కలబోతగా సాగిన 2017లో చిరకాలం గుర్తుండిపోయే కొన్ని సంఘటనల్లో ఉసేన్ బోల్ట్ పరాజయాన్ని, టెన్నిస్ స్టార్లు రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్ పోరాట పటిమ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. కెరీర్‌లో చివరిసారి, లండన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్ 100 మీటర్ల స్ప్రింట్‌లో బోల్ట్ అనూహ్యంగా ఓటమిపాలు కావడం సంచలనమే సృష్టించింది. కాగా, గత ఏడాది గాయాలతో అల్లాడుతూ, ఫిట్నెస్ సమస్యల కారణంగా వీరి కెరీర్‌కు తెరపడుతుందనే వాదన బలంగా వినిపించింది. అప్పటికీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాదల్ 9, ఫెదరర్ 17వ స్థానాల్లో ఉన్నారు. ఇద్దరూ ఆ టోర్నీలో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరుస్తూ ఫైనల్ చేరారు. టైటిల్ పోరులో ఫెదరర్ గెలిచాడు. మ్యాచ్ అనంతరం ఒకరి భుజాలపై మరొకరు చేతులు వేసుకుంటూ ఎంతో సంతోషంగా కనిపించారు. నిజమైన క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా నిలిచారు. ఆ స్ఫూర్తితోనే చక్కటి ఆటతో రాణించారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాదల్ నంబర్ వన్‌గా, ఫెదరర్ రెండో ర్యాంకర్‌గా ఈ ఏడాదిని ముగిస్తున్నారంటే, వారి పట్టుదలను, అంతులేని ఆత్మవిశ్వాసాన్ని ఊహించుకోవచ్చు.
రోజర్ ఫెదరర్ ఈ ఏడాది వింబుల్డన్ టైటిల్‌ను గెల్చుకోవడాన్ని చిరస్మరణీయ సంఘటనగా పేర్కోవాలి. కెరీర్‌లో 19వ గ్రాండ్ శ్లామ్ టైటిల్ సాధించిన వెంటనే ఫెదరర్ కుర్చీలో కూర్చొని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎనిమిదోసారి వింబుల్డన్ ట్రోఫీని అందుకున్నప్పుడు కూడా అతను కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ఆ దృశ్యాన్ని క్రీడాభిమానులు బహుశా తమ జీవితాంతం మరచిపోరు.
వింబుల్డన్ టైటిల్‌ను గెల్చుకోవడం ద్వారా ఫెదరర్ మరో రికార్డును సాధించాడు. ఎనిమిది పర్యాయాలు ఈ టోర్నీలో విజేతగా నిలిచిన తొలి టెన్నిస్ క్రీడాకారుడిగా గుర్తింపు సంపాదించాడు. రొలాండ్ గారోస్‌పై తనకు తిరుగులేదని రాఫెల్ నాదల్ మరోసారి నిరూపించాడు. జూన్ 11న జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టోర్నమెంట్ ఫైనల్‌లో స్టానిస్లాస్ వావ్రిన్కాను ఓడించి టైటిల్ గెల్చుకున్నాడు. ఇక్కడ అతను విజేతగా నిలవడం ఇది పదోసారి.
రియల్ మాడ్రిడ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పోర్చుగీస్ వీరుడు క్రిస్టియానో రొనాల్డో యూరోపియన్ లీగ్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. నవంబర్ 21న సైప్రస్‌లో అపొయెల్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్ చేయడం ద్వారా అతను గతంలో తాను నెలకొల్పిన రికార్డును తానే అధిగమించాడు. అంతకుముందే మే 17న సెల్టా విగోతో జరిగిన మ్యాచ్‌లో మొదటి గోల్ చేసి, యూరోపియన్ సాకర్‌లో అత్యధిక గోల్స్ రికార్డును నెలకొల్పాడు. 365 గోల్స్‌తో చెల్సియా స్ట్రయికర్ జిమీ గ్రీవ్స్ పేరిట ఉన్న రికార్డును రొనాల్డో 368 గోల్స్‌తో అధిగమించాడు. అక్టోబర్ 17న టాటెన్హామ్ హాట్స్‌పర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈక్వెలైజర్‌ను రొనాల్డో సాధించాడు. దీనితో ఈ ఒక్క సీజన్‌లో అతని గోల్స్ సంఖ్య 25కు చేరింది. బార్సిలోనా తరఫున ఆడుతున్న అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ 2012లో 24 గోల్స్‌తో సృష్టించిన రికార్డును రొనాల్డో బద్దలు చేశాడు.
ఫార్ములా వన్ హీరో లూయిస్ హామిల్టన్ మరోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌గా సంవత్సరాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉన్నాడు. సెప్టెంబర్ 2న అతను మోన్జాలో జరిగిన ఇటాలియన్ గ్రాండ్ ప్రీలో పోల్ పొజిషన్‌ను అందుకొని, ఫార్ములా వన్ ‘ఎవర్ గ్రీన్’ హీరో మైఖేల్ షూమాకర్ రికార్డును అధిగమించాడు. కెరీర్‌లో షూమాకర్ 68 పోల్ పొజిషన్స్‌ను సాధిస్తే, హామిల్టన్ 69వసారి పోల్‌పొజిషన్‌ను సాధించడం ద్వారా అతనిని రెండో స్థానానికి నెట్టేశాడు. ఆతర్వాత కూడా అదే దూకుడును కొనసాగించాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 72 పోల్ పొజిషన్స్ ఉన్నాయి. ఈ ఏడాది జరిగిన 21 ఫార్ములా వన్ గ్రాండ్ ప్రీ పోటీల్లో అతను తొమ్మిది టైటిళ్లు సాధించాడు. చైనీస్, స్పెయిన్, కెనెడియన్, బ్రిటిష్, బెల్జియన్, ఇటాలియన్, సింగపూర్, జపాన్, యుఎస్ గ్రాండ్ ప్రీలను కైవసం చేసుకున్న అతను మరో నాలుగు రేసులు, ఆస్ట్రేలియన్, బెహ్రెయిన్, మలేసియన్, అబూదబీ గ్రాండ్ ప్రీల్లో రెండో స్థానంలో నిలిచాడు.
స్పానిష్ సాకర్ లీగ్ లా లిలాలో బార్సిలోనా స్టార్ లియోనెల్ మెస్సీ ఆధిపత్యం కొనసాగుతునే ఉంది. వరుసగా ఎనిమిదో సంవత్సరం అతను నలభైకిపైగా గోల్స్ సాధించి రికార్డు సృష్టించాడు. ఈ సీజన్‌లోనే అతను 14 గోల్స్ చేయగా, మరో ఐదు పర్యాయాలు బార్సిలోనా గోల్స్ సాధించేందుకు తోడ్పడ్డాడు.
ప్రతి ఏడాది మాదిరిగానే అంతర్జాతీయ క్రీడారంగంలో కొంత మంది విజయాలను, పేరుప్రఖ్యాతులను ఆర్జిస్తే, మరి కొందరు పరాజయాలను మూటగట్టుకున్నారు. ఎప్పటి మాదిరిగానే అంతా సరికొత్త ఆశతో రాబోయే సంవత్సరంకోసం ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది క్రీడారంగం కొత్త పుంతలు తొక్కుతుందని ఆశిద్దాం.

- బిట్రగుంట