ఆటాపోటీ

ఎవరి పిచ్చి వారిది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటారు. రకరకాలైన విశ్వాసాలు, మూఢ నమ్మకాలు కేవలం సామాన్యులకే పరిమితం అనుకుంటే పొరపాటే. సెలబ్రిటీలకు ఇది మరీ ఎక్కువ. మన దేశంలో క్రికెట్ ఒక మతంలా వెలిగిపోతున్నది. క్రికెటర్లను సాక్షాత్తు దేవతలుగా ఆరాధించే వారికి కొదువ లేదు. అందుకే క్రికెటర్లకు సంబంధించిన ప్రతి విషయం ఆసక్తిని రేపుతుంది. వారికి ఉన్న నమ్మకాల గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ ఎంతోకొంత ఉంటుంది. ఆశ్చర్యం కలిగించే ఎన్నో నమ్మకాలు క్రికెటర్లలో ఉన్నాయి. వాటిలో మచ్చుకు కొన్ని.. 2011 వరల్డ్ కప్ సమయంలో భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎక్కడికి వెళ్లినా తన వెంట ఒక బ్యాగును తీసుకెళ్లేవాడు. ఆ సిరీస్ మొత్తంలో అశ్విన్ కేవలం రెండు మ్యాచ్‌లే ఆడినప్పటికీ, భారత్ పాల్గొన్న అన్ని మ్యాచ్‌లకూ అతను అదే బ్యాగ్‌తో దర్శనమిచ్చాడు. ఆ సంచీనే టీమిండియాకు ప్రపంచ కప్‌ను సాధించిపెట్టిందని అతని విశ్వాసం. మాజీ కెప్టెన్, సూపర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీకి ‘నంబర్ 7’ అంటే ఎంతో ఇష్టం. అది అతని పుట్టిన తేదీ కూడా (7 జూలై, 1981). కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి అతను ఏడో నంబర్ జెర్సీనే ధరిస్తున్నాడు. తన ఎదుగుదలకు ఏడో అంకెనే ప్రధాన కారణమని గాఢంగా నమ్ముతాడు. టీమిండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా కొన్ని పిచ్చి నమ్మకాలు లేకపోలేదు. చిన్నతనంలో, ఒక మ్యాచ్‌లో ఎక్కువ పరుగులు చేసినప్పుడు వేసుకున్న గ్లోవ్స్‌ను ఆ తర్వాత ప్రతి మ్యాచ్‌లోనూ వేసుకునేవాడు. అవి చిరిగిపోతేనే కొత్త గ్లోవ్స్‌ను తీసుకునేవాడు. తర్వాతి కాలంలో ఆ అలవాటును మానుకున్నా, చాలాకాలం మణికట్టుకు నల్ల రంగు బ్యాండ్ వేసుకునేవాడు. అది ఉంటేగానీ రాణించలేనన్న అభిప్రాయం అతనికి ఉండేది. ఇప్పుడు రిస్ట్ బ్యాండ్‌ను తీసేసినా, కడియం వేసుకుంటున్నాడు. 2012 నుంచి చేతి కడియం అతని శరీరంలో ఒక భాగమైపోయింది. మరో కొత్త నమ్మకం పుట్టుకొచ్చే వరకూ కడియాన్ని వదలడేమో!
క్రీజ్‌లో పాతుకుపోయి, ఎన్నో సందర్భాల్లో జట్టును ఆదుకున్న ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్‌కు క్రికెట్ ప్రపంచంలో అజాత శత్రువన్న పేరుంది. విద్యాధికుడైనప్పటికీ, అతనికీ కొన్ని విశ్వాసాలున్నాయి. బ్యాటింగ్‌కు దిగేముందు అతను ఎప్పుడూ కుడికాలికి థై ప్యాడ్‌ను ధరించేవాడు. ఏదైనా సిరీస్ మొదలైనప్పుడు, మొదటి మ్యాచ్‌లో ఎన్నడూ కొత్త బ్యాట్‌ను ఉపయోగించేవాడుకాడు. పాత బ్యాట్‌తోనే మొదటి మ్యాచ్‌లు ఆడేవాడు. ఇక, క్రీజ్‌లోకి వెళ్లిన మరుక్షణం నుంచే బౌలర్లపై విరుచుకుపడి, పరుగుల వరద పారించే పనిలో పడే వీరేందర్ సెవాగ్ కెరీర్ ఆరంభంలో 44వ నంబర్ ఉన్న జెర్సీని వేసుకునేవాడు. కానీ, ఒక సంఖ్యాశాస్త్ర నిపుణుడు చెప్పిన సూచన మేరకు అతను నంబర్ లేని జెర్సీని వేసుకోవడం మొదలుపెట్టాడు. కెరీర్ ముగించేవరకూ అదే సూత్రాన్ని పాటించాడు.
ఆల్‌రౌండర్‌గా పేరుతెచ్చుకున్న యువరాజ్ సింగ్‌కు 12వ అంకె అంటే ఎంతో ఇష్టం. అందుకు కారణం లేకపోలేదు. అతను 12వ నెల (డిసెంబర్) 12వ తేదీన, మధ్యాహ్నం 12 గంటలకు చండీగఢ్‌లోని 12వ సెక్టార్‌లో జన్మించాడు. సహజంగానే ఆ అంకె పట్ల అతనికి ఇష్టం పెరిగింది. కేన్సర్ వ్యాధిన పడి, అమెరికాలో చికిత్స పొందిన తర్వాత మృత్యుంజయుడిగా యువీ బయటపడ్డాడు. యువీ ఆసుపత్రిలో ఉన్న సమయంలో అతని చేతి మణికట్టుకు తల్లి షబ్నం సింగ్ ఒక నల్ల బ్యాండ్ కట్టింది. దుష్టశక్తులను ఈ నల్ల చేతి పట్టీ పారదోలుతుందని ఆమెతోపాటు యువీ కూడా నమ్ముతాడు. భారత మాజీ కెప్టెన్, ‘కోల్‌కతా ప్రిన్స్’ సౌరవ్ గంగూలీ డ్రెస్సింగ్ రూమ్‌లో ఏదో ఒకచోట తన ఆధ్యాత్మిక గురువు ఫొటోను ఉంచేవాడు. సిరీస్ ముగిసేవరకూ దానిని అక్కడి నుంచి తీసేవాడుకాదు. మాజీ పేసర్ జహీర్ ఖాన్ మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు ఎప్పుడూ పసుపు పచ్చ కర్చ్ఫీ జేబులో ఉంచుకునేవాడు. అది లేకపోతే, తాను గొప్పగా బౌలింగ్ చేయలేనని భయపడేవాడు.
భారత జట్టు కపిల్ దేవ్ నాయకత్వంలో, 1983లో మొదటిసారి ప్రపంచ కప్‌ను గెల్చుకుంది. జింబాబ్వేతో జరిగిన అత్యంత కీలక మ్యాచ్‌లో కపిల్ విజృంభించకపోతే, భారత్ నాకౌట్ దశకు కూడా చేరి ఉండేది కాదు. ఒకానొక దశలో 17 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన జట్టును కపిల్ ఆదుకున్నాడు. అజేయంగా 175 పరుగులు సాధించి, భారత్‌ను గెలిపించాడు. ఇదంతా ఒక ఎత్తయితే, అప్పట్లో జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించిన మాన్‌సింగ్ మిగతా ఆటగాళ్లకు జారీ చేసిన ఆదేశం మరోఎత్తు. కపిల్ బ్యాటింగ్ మొదలు పెట్టినప్పుడు, ఎవరెవరు, ఎక్కడెక్కడ కూర్చొని మ్యాచ్‌ని చూస్తున్నారో వారంతా తమ తమ స్థానాలను మార్చవద్దని మాన్ సింగ్ ఆదేశించాడు. భారత్ విజయం సాధించిన తర్వాత, అప్పటివరకూ కదలకుండా ఒకేచోట కూర్చొని మ్యాచ్‌ని తిలకిస్తున్న భారత క్రికెటర్లంతా ఊపిరి పీల్చుకున్నారు.
మాజీ కెప్టెన్, ‘లిటిల్ మాస్టర్’ సునీల్ గవాస్కర్ కెరీర్ ఆరంభించిన రోజుల్లో స్వెట్టర్ తొడుక్కునేవాడుకాడు. ఎంత చలిలో ఆడాల్సి వచ్చినా అతను స్వెట్టర్ లేకుండా ఆడేందుకే ఇష్టపడేవాడు. గవాస్కర్‌కు మరో నమ్మకం కూడా ఉంది. బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి వెళుతున్నప్పుడు రెండో బ్యాట్స్‌మన్‌కు ఎప్పుడూ కుడివైపునే ఉండేలా జాగ్రత్త పడేవాడు. ప్యాంట్‌కు నాడా కట్టుకోవడం, తలకు హెల్మెట్ లేకుండా కేవలం హెడ్‌గార్డ్‌తోనే బ్యాటింగ్‌కు దిగడం అతని అలవాట్లు. అవే అతని నమ్మకాలు కూడా.
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వాకు అతని కుటుంబ పెద్దలు ఒకసారి రెడ్ కర్చ్ఫీ ఇచ్చారు. దానిని జేబులో పెట్టుకొని ఆడిన మ్యాచ్‌లో భారీ స్కోరు చేయడంతో, ఆ తర్వాత ఎప్పుడూ దానిని విడిచిపెట్టలేదు. ఆ ఎర్ర రుమాలు అతని దుస్తుల్లో భాగమైపోయింది. ఇలాంటి సెంటిమెంటే భారత ఆల్‌రౌండర్ మొహీందర్ అమర్‌నాథ్‌కు కూడా ఉండేది. 1983 వరల్డ్ కప్ ప్రారంభంలో ఎర్ర కర్చ్ఫీ జేబులో ఉంచుకున్నాడు. అందులో భారత్ గెలవడంతో, టోర్నమెంట్ చివరి వరకూ అదే సెంటిమెంట్‌ను కొనసాగించాడు. విచిత్రంగా టీమిండియా ఫైనల్‌లో వెస్టిండీస్‌ను ఓడించి టైటిల్ గెల్చుకుంది. మొహీందర్ రెడ్ కర్చ్ఫీ భారత్‌కు టైటిల్ అందించిందేమో!

- బిట్రగుంట