ఆటాపోటీ

బంతులతో తంటా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రికెట్ స్వరూపం మారింది. కళాత్మక ఆట పేరుతో గంటల తరబడి క్రీజ్‌లో పాతుకుపోయే రోజులకు తెరపడింది. ఎంత సేపు క్రీజ్‌లో ఉన్నామని కాదు.. ఎన్ని పరుగులు చేశామన్నదే ముఖ్యమన్న అభిప్రాయం ప్రతి క్రికెటర్‌లో పాతుకుపోయింది. అంపైర్ నుంచి గార్డ్ తీసుకున్న మరుక్షణం నుంచే బౌలర్లపై విరుచుకుపడడం బ్యాట్స్‌మెన్ ప్రధాన లక్షణమైంది. ఒక మ్యాచ్‌లో భారీగా పరుగులు రావడానికి లేదా లోస్కోరింగ్ నమోదుకావడానికి పిచ్‌లు ప్రధాన పాత్ర పోషిస్తాయన్నది బహిరంగ రహస్యం. వాతావరణ ప్రభావం కూడా మ్యాచ్‌పై ఉంటుందన్నదీ అందరికీ తెలిసిన విషయమే. బ్యాట్స్‌మెన్ ఎదుర్కొంటున్న బంతులూ ఒక రకంగా స్కోర్లను నిర్దేశిస్తుంటాయనీ చాలా మందికి తెలుసు. కానీ, మ్యాచ్‌ల్లో ఉపయోగిస్తున్న బంతులది కూడా కీలకపాత్ర అన్నది మరుగున పడిపోయిన వాస్తవం. బంతులన్నీ ఒకేలా ఉండవు. తయారీ విధానం, వాడిన ముడిసరుకు వంటి అంశాలపై బాల్స్ స్వరూపం ఆధారపడుతుంది. ‘కూకబూరా’, ‘డ్యూక్’ బంతుల మధ్య పెరుగుతున్న తీవ్రమైన పోటీ కారణంగానే దాదాపుగా అన్ని ఫార్మెట్స్‌లోనూ మ్యాచ్‌లన్నీ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా మారిపోతున్నాయి. చాలా తక్కువ సందర్భాల్లో బౌలర్ల ఆధిపత్యం కనిపిస్తున్నది. ఎంత గొప్ప నాయకుడైనా సహచరులు అసమర్థులైతే ఏమీ చేయలేడు. విజయాలను సాధించలేడు. బౌలింగ్ విషయంలోనూ అంతే. ఎంత గొప్ప బౌలరైనా బాల్స్‌తో ఇబ్బందులు తలెత్తితే సత్తా చాటలేడు.. వికెట్లు పడగొట్టలేడు. మృదువుగా ఉండే బంతులు నేటి తరం మ్యాచ్‌లకు ఏమాత్రం ఉపయోగపడవు. రోజుల తరబడి మ్యాచ్‌లను తిలకించే ఓపిక, తీరిక ఇప్పుడు అభిమానులకు లేదు. అంతేకాదు, ఇరు జట్లు మైదానంలోకి దిగితే ఫలితం వెల్లడికావాల్సిందే. లేకపోతే అభిమానుల దృష్టిలో ఆ మ్యాచ్‌కి ఎలాంటి విలువ ఉండదు. అందుకే, ఒకప్పుడు రెస్ట్ డేతో కలిసి ఆరు, ఇప్పుడు విశ్రాంతి లేకుండా ఐదు రోజులు జరిగే టెస్టులకు ఆదరణ కరవైంది. వందల సంఖ్యలో ఓవర్లు.. జిడ్డు బ్యాటింగ్‌లు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాయి. అభిమానుల అసహనం నుంచే పరిమిత ఓవర్ల వనే్డ, టి-20 ఫార్మెట్స్ పుట్టుకొచ్చాయి.
వాతావరణానికి తగినట్టు..
క్రికెట్ బంతులను కంపెనీలు మూసపోసిన పద్ధతిలో ఒకే విధంగా తయారు చేయవు. ఆయా దేశాల్లో పిచ్‌ల తీరు, వాతావరణం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని, ఒక్కో దేశానికి లేదా ప్రాంతానికి ఒక్కో రకమైన బంతులను సరఫరా చేస్తారు. అన్ని దేశాల్లో క్రికెట్ పిచ్‌ల తీరు ఒకే రకంగా ఉండదు. అదే విధంగా వాతావరణ పరిస్థితుల్లోనూ మార్పులు ఉంటాయి. అంతేకాదు.. ఒక దేశంలో వివిధ కాలాల్లో వాతావరణం వేరువేరుగా ఉంటుంది. ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదయ్యే దేశాల్లో లేదా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో బంతులకు ఉన్న కుట్లు తొందరగా వదులవుతాయి. బంతి మెత్తబడుతుంది. ఫలితంగా బ్యాట్స్‌మెన్‌తోపాటు బౌలర్లకు కూడా కష్టాలు తప్పవు. చలికాలంలో లేదా చలి ఎక్కువగా ఉన్న కాలాల్లో బంతి స్ట్ఫిగా మారుతుంది. అప్పుడూ సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి పరిస్థితులే వివిధ రకాలైన పిచ్‌లకు కూడా వర్తిస్తాయ. మ్యాచ్‌ల తీరును నిర్దేశిస్తాయ.
మెరుపు వేగం!
ఒక బంతి మెరుపు వేగంతో దూసుకెళ్లడం అంటే ఏమిటో షోయబ్ అక్తర్ బౌలింగ్‌ను చూస్తే తెలుస్తుంది. ఒకప్పుడు వెస్టిండీస్ సూపర్ ఫాస్ట్ బౌలర్లు వెస్లీ హాల్, మైఖేల్ హోల్డింగ్, జోల్ గార్నర్, ఫిడెల్ ఎడ్వర్డ్స్, కొట్నీ వాల్ష్, కర్ట్‌లీ ఆంబ్రోస్, ఆండీ రాబర్ట్స్, మాల్కం మార్షల్ తదితరులు ప్రపంచ బ్యాట్స్‌మెన్‌ను గడగడలాడించారు. ఆస్ట్రేలియాకు చెందిన జెఫ్ థాంప్సన్, బ్రెట్ లీ, షాన్ టైట్, మిచెల్ జాన్సన్, పాకిస్తాన్ హీరో మహమ్మద్ సమీ, న్యూజిలాండ్ పేసర్ షేన్ బాండ్, దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ తదితరులు వేగం అంటే ఏమిటో క్రికెట్ ప్రపంచానికి రుచి చూపించారు. ఇంగ్లాండ్‌తో న్యూలాండ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో అక్తర్ గంటకు 161.3 కిలో మీటర్ల వేగంతో వేసిన బంతి ‘్ఫస్టెస్ట్ డెలివరీ’గా నమోదైంది. ఆస్ట్రేలియా బౌలర్లు షాన్ టైట్, బ్రెట్ లీ కూడా దాదాపు అదే స్థాయిలో బంతులు వేశారు. ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదంనలో జరిగిన మ్యాచ్‌లో టైట్, న్యూజిలాండ్‌తో నేపియర్‌లో జరిగిన మ్యాచ్‌లో బ్రెట్ లీ గంటకు 161.1 కిలో మీటర్ల వేగంతో బంతులు వేశారు. థాంప్సన్ సిడ్నీలో జరిగిన ఒక మ్యాచ్‌లో 160.6 కిలో మీటర్ల వేగంతో బంతి వేశాడు. బంతి ఫినిషింగ్ ఎంత బాగా ఉంటే వేగం అంతగా పెరుగుతుందనడానికి ఈ రికార్డు బాల్సే ఉదాహరణ. బంతిని బట్టి బౌలింగ్ ఉంటుంది. బౌలింగ్‌ను బట్టి బ్యాటింగ్ ఉంటుంది. ఈ రెండింటి తీరుపైనే మ్యాచ్‌ల ఫలితాలు ఆధారపడి ఉంటాయ. బంతులు సరిగ్గా లేకపోతే బ్యాట్స్‌మెన్‌కు తంటాలు తప్పవు.
నాణ్యతే ముఖ్యం
ఏ కంపెనీ బంతులు వాడినా నాణ్యతే ముఖ్యం. బంతుల్లో నాణ్యతా ప్రమాణాలు ఉన్నాయా లేదా అన్నది మ్యాచ్ జరిగే క్రమంలో బయటపడుతుంది. నాసిరకం బంతులను నాణ్యమైన వాటిగా చెలామణి చేసే అవకాశాలు ఎంతమాత్రం ఉండవు. బంతులను తయారు చేసేందుకు పశువు తినే మేత నుంచి అది ఏవిధంగా చనిపోయిందనే విషయం వరకూ సమస్త సమాచారాన్ని సేకరించిన తర్వాతే చర్మాన్ని ఖరీదు చేస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే, నాణ్యత తగ్గుతుంది. ఫలితంగా బ్యాట్స్‌మెన్ తీవ్రంగా గాయపడే లేదా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. సహజంగా బ్యాట్స్‌మెన్‌పై ఫాస్ట్ బౌలర్లు బౌన్సర్లు, స్వింగర్లను సంధిస్తుంటారు. బంతి నాణ్యమైనదైతే, దాని దిశతోపాటు ఎంత ఎత్తుకు బౌన్స్ అవుతుందనే విషయాన్ని కూడా బ్యాట్స్‌మెన్ ముందుగానే ఊహించగలుగుతారు. దూసుకొచ్చే అలాంటి బంతులను హుక్‌షాట్ కొట్టడమో లేదా వదిలేయడమో చేస్తారు. బంతిని తయారు చేసినప్పుడు నాణ్యతా ప్రమాణాలను పాటించకపోతే, అది అంచనాలకు విరుద్ధంగా బౌన్స్ అవుతుంది. ఊహకు అందని విధంగా దిశను మార్చుకుంటుంది. ఈ కారణంగానే చాలా మంది బ్యాట్స్‌మెన్ గాయపడ్డారు. పదుల సంఖ్యలో క్రికెటర్లు బంతి తగిలి ప్రాణాలు కోల్పోయారు. సీన్ అబోట్ వేసిన షార్ట్ పిచ్ బంతిని పుల్‌షాట్ కొట్టేందుకు ప్రయత్నించి విఫలమైన ఫిల్ హ్యూస్ తీవ్రంగా గాయపడి, రెండు రోజుల తర్వాత ఆసుపత్రిలో మృతి చెందిన సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. బంతుల నాణ్యతపై మరోసారి ప్రశ్నలను తెరపైకి తెచ్చింది. బంతి హెల్మెట్ గ్రిల్‌ను బద్దలు చేసుకుంటూ దూసుకెళ్లి హ్యూస్ తల, మెడ మధ్యభాగంలో బలంగా తగిలింది. దాని వేగానికి అతని మెడ రక్తనాళాలు చిట్లిపోయాయి. మెదడుకు రక్త ప్రసరణలో ఆటంకం ఏర్పడింది. కోమాలోకి వెళ్లిన అతను చికిత్స పొందుతూ మరణించాడు. 1870లో జార్చి సమ్మర్స్, 1959లో అబ్దుల్ అజీజ్, 1993లో ఇయాన్ ఫోలీ, 2013లో డారిన్ రాండల్ బ్యాటింగ్ చేస్తూ బంతి తగిలి మరణించిన వారి జాబితాలో ప్రముఖులు. కౌంటీ, ఫస్ట్‌క్లాస్, డొమెస్టిక్ సర్క్యూట్స్‌లో బంతుల వల్ల తీవ్రంగా గాయపడుతున్న వారి సంఖ్య వందలుదాటి వేలకు చేరింది. చాలా మంది కెరీర్ అర్ధాంతరంగా ముగుస్తున్నది. క్రికెట్‌ను బంతులు శాసించడమేకాదు.. భయపెడుతున్నాయి కూడా. బంతుల్లో నాణ్యత ఉంటే బ్యాట్స్‌మెన్, బౌలర్ల మధ్య జరిగే సమరం ఆసక్తికరంగా ఉంటుంది. మ్యాచ్‌లో ప్రతి క్షణాన్ని ఆస్వాదించవచ్చు. నాణ్యత ఏమాత్రం
కొరవడినా
మ్యాచ్‌లు ఏకపక్షంగా ముగుస్తాయి. ఆటలోని ఆనందాన్ని హరిస్తాయి. బ్యాట్, బాల్ మధ్య
సమతూకాన్ని
పాటిస్తామని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఇటీవలే ప్రకటించింది. ఈ దిశగా చర్యలు ఎంత త్వరగా చేపడితే అంత త్వరగా క్రికెట్‌లో ప్రమాణాలు మెరుగవుతాయి. అప్పటి వరకూ ఆటగాళ్ల కంటే బంతులే మ్యాచ్‌ల ప్రమాణాలను, ఫలితాలను నిర్దేశిస్తాయి.

- బిట్రగుంట