ఆటాపోటీ

‘ఆస్ట్రేలియా’లో తొలి పోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్.. ప్రతి ఏటా నాలుగు గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లో మొదటిది. ఈ పోటీలతోనే మేటి క్రీడాకారుల టైటిళ్ల వేట ఆరంభమవుతుంది. మెల్బోర్న్‌లో పార్క్‌లో ఈనెల 18 నుంచి 31వ తేదీ వరకు జరిగే టోర్నీ 104వది. వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రీలో విజయం సాధించి, శుభారంభం చేయాలన్న కోరిక పోటీకి దిగే ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. సీజన్‌లో తొలి గ్రాండ్ శ్లామ్ కావడంతో, ఇక్కడ విజేతగా నిలవడం శుభసూచకమనే నమ్మకం కూడా చాలా మందిలో ఉంది. అందుకే ఆస్ట్రేలియా ఓపెన్‌లో ప్రతి మ్యాచ్ నరాలు తెగిపోయే ఉత్కంఠ నడుమ జరుగుతాయ. ప్రేక్షకులను అలరిస్తాయ.

జొకోవిచ్ జోరు
ఆస్ట్రేలియా ఓపెన్ చరిత్రలో రాయ్ ఎమర్సన్ వరుసగా ఐదు పర్యాయాలు టైటిళ్లు సాధిస్తే, ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకొవిచ్ 2011, 2012, 2013, 2014 సంవత్సరాల్లో విజయాలు నమోదు చేశాడు. ఈసారి కూడా అతని జోరు కొనసాగే అవకాశం లేకపోలేదు. అతను టైటిల్ నిలబెట్టుకుంటే, సింగిల్స్ విభాగంలో ఎక్కువ పర్యాయాలు ఆస్ట్రేలియా ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన క్రీడాకారుడిగా కొత్త రికార్డును నెలకొల్పుతాడు. కాగా, పురుషుల డబుల్స్ విభాగంలో అడ్రియన్ క్విస్ట్ అత్యధికంగా 10 టైటిళ్లు సాధించడం విశేషం. సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాలను కూడా కలిపితే అతను మొత్తం 13 టైటిళ్లు అందుకున్నాడు. ఆ రికార్డును ఇంత వరకూ ఎవరూ బద్దలు చేయలేకపోయారు.

గ్రాండ్ శ్లామ్ యుద్ధానికి శంఖారావం పూరించే ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఏటేటా పోటీ పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. ప్రపంచ మేటి స్టార్ల మధ్య ఈ టోర్నీ ఒక భీకర సంగ్రామంగా మారింది. పురుషులు, మహిళల సింగిల్స్, డబుల్స్‌తోపాటు మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ పోరు సాగుతుంది. జూనియర్, వెటరన్స్, వీల్‌చైర్ తదితర విభాగాల్లోనూ ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌లకు ఆస్ట్రేలియా ఓపెన్ వేదికవుతుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో 128 మంది బరిలోకి దిగుతారు. వీరిలో 104 మంది తమతమ ర్యాంకింగ్స్ ప్రాతిపదిక మీద డైరెక్ట్ ఎంట్రీ సంపాదిస్తే, 16 మంది క్వాలిఫయర్స్ ద్వారా స్థానాన్ని దక్కించుకుంటారు. మరో ఎనిమిది మందికి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ లభిస్తుంది. మహిళల సింగిల్స్‌లోనూ 128 మంది పోటీపడతారు. అయితే, పురుషుల విభాగానికి భిన్నంగా, 108 మంది డైరెక్ట్ ఎంట్రీ సంపాదిస్తారు. 12 మంది క్వాలిఫయర్స్ నుంచి, ఎనిమిది మంది వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా మెయిన్ డ్రాకు అర్హత సంపాదిస్తారు. పురుషులు, మహిళల డబుల్స్‌లో చెరి 64 జోడీలు పోటీలో ఉంటాయి. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో 32 జోడీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. ఈ మూడు విభాగాల్లో ఏడేసి జోట్లు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా రంగ ప్రవేశం చేస్తాయి. ఏడాది ఆరంభంలో జరిగే గ్రాండ్ శ్లామ్ కాబట్టి, సహజంగానే మేటి స్టార్లంతా ఈ టోర్నీలో ఆడడం ద్వారా శుభారంభం చేయాలని అనుకుంటారు. అందుకే, మిగతా గ్రాండ్ శ్లామ్స్‌కు భిన్నంగా ఆస్ట్రేలియా ఓపెన్‌లో క్వాలిఫయంగ్ పోటీలు కూడా పోటాపోటీగా సాగుతాయ.
ఓపెన్ శకం
1969లో మొదలు
ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ 1969లో ఓపెన్ శకం మొదలైంది. అంతకు ముందు అత్యధికంగా ఆరు టైటిళ్లను కైవసం చేసుకొని ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రాయ్ ఎమర్సన్ రికార్డు సృష్టించాడు. అతను 1961లో తొలిసారి, ఆతర్వాత 63 నుంచి 67 వరకు వరుసగా ఐదు పర్యాయాలు విజేతగా నిలిచాడు. నొవాక్ జొకోవిచ్ గత ఏడాది విజేతగా నిలిచి, ఈ రికార్డును సమం చేశాడు. ఓపెన్‌గా రూపు దాల్చిన తర్వాత ఈ టోర్నీలో అత్యధికంగా నాలుగేసి టైటిళ్లు సాధించిన ఆటగాళ్లు ఇద్దరున్నారు. వారిలో ఒకరు ఆండ్రీ అగస్సీకాగా, మరొకరు రోజర్ ఫెదరర్. ఈఏడాది ఫెదరర్ కూడా బరిలోకి దిగుతున్నందున అతను కూడా ఐదు టైటిళ్ల ఎమర్సన్, జొకోవిచ్ సరసన స్థానం సంపాదించే అవకాశాలు లేకపోలేదు. కాగా, మహిళల సింగిల్స్‌లో అత్యధిక టైటిళ్లను అందుకున్న ఘనత మార్గెరెట్ కోర్టు దక్కించుకుంది. ఆమె మొత్తం 11 టైటిళ్లు కైవసం చేసుకుంది. మహిళల డబుల్స్ విభాగంలో తైమా కొనే లాంగ్ 12 టైటిళ్లు అందుకుంది. మార్గరెట్ 1969కి ముందు వరుసగా 7 పర్యాయాలు విజేతగా నిలిచి మరో రికార్డును సొంతం చేసుకుంది. సెరెనా విలియమ్స్ ఆరు టైటిళ్లతో రెండో స్థానంలో ఉంది.
చివరికి మెల్బోర్న్‌కు..
ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీ ఆరంభం నుంచి ఎన్నో ప్రాంతాలకు పరుగులు తీసింది. పలు నగరాల్లో తిరిగింది. చివరికి మెల్బోర్న్ చేరి స్థిరపడింది. ఒకప్పుడు న్యూజిలాండ్‌లోని రెండు నగరాల్లో ఈ టోర్నీని నిర్వహించారంటే ఆశ్చర్యంగా కనిపించినా అది అక్షర సత్యం. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చిలో ఈ టోర్నీ 1906లో జరిగింది. అదే విధంగా 1912లో హాస్టింగ్స్ వేదికైంది. మెల్బోర్న్‌లో 56, సిడ్నీలో 17, అడెలైడ్‌లో 14, బ్రిస్బేన్‌లో 7, పెర్త్‌లో 3 చొప్పున ఆస్ట్రేలియాలో ఈ టోర్నీని నిర్వహించారు. మిగతా అన్ని ప్రాంతాలతో పోలిస్తే మెల్బోర్న్‌లోనే ఎక్కువ ఆదరణ కనిపించింది. అందుకే, అక్కడే టోర్నీని జరపాలని 1972లో నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి మెల్బోర్న్ ఈ పోటీలకు శాశ్వత వేదికైంది. ఎండలతో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా ఓపెన్‌ను మరో ప్రాంతానికి తరలించాలన్న డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ, నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. మెల్బోర్న్ నుంచి మరో ప్రాంతానికి మార్చడానికి వారు సిద్ధంగా లేరు.
40 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ
టెన్నిస్ రంగంలో గ్రాండ్ శ్లామ్స్‌లోనేగాక, మరే ఇతర టోర్నీలోనూ లేనంత ప్రైజ్‌మేనీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఉంటుంది. ఇటీవలే ప్రైజ్‌మనీ మొత్తాన్ని 40 మిలియన్ డాలర్లకు పెంచారు. పురుషులు, మహిళల విభాగాల్లో టైటిళ్లను సాధించిన వారికి చెరి 3.1 మిలియన్ డాలర్లు లభిస్తాయి. మొదట్లో ఈ రెండు విభాగాల్లో విజేతకు లభించే మొత్తాలు వేరువేరుగా ఉండేవి. కానీ, పలువురు క్రీడాకారిణులు నిరసన వ్యక్తం చేయడంతో ప్రైజ్‌మనీని సమానం చేశారు. కాగా, మొదటి రౌండ్ నుంచి మొదలుపెట్టి, ఫైనల్ వరకూ ప్రతి దశలోనూ ఎంతో కొంత మొత్తం లభిస్తుంది. మొదటి రౌండ్‌లో ఓడిన వారు కూడా 34,500 డాలర్లు తమ వెంట తీసుకెళతారు. మెయిన్‌డ్రాకు అర్హత సంపాదిస్తే చాలు.. ఆతర్వాత ప్రతి రౌండ్‌లోనూ కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మాత్రమే చూడగలిగే అంశం. 2000 సంవత్సరంలో ప్రైజ్‌మనీ 20 మిలియన్ డాలర్లుకాగా, క్రమంగా పెరుగుతూ ఇప్పుడు 40 మిలియన్ డాలర్లకు చేరింది. గ్రాండ్ శ్లామ్స్‌లోనే తలమానికమైన వింబుల్డన్‌లోనూ ఇంత భారీ ప్రైజ్‌మనీ లేకపోవడం గమనార్హం.

- ఎస్‌ఎంఎస్