ఆటాపోటీ

మనోహర్ ఏకపక్ష నిర్ణయాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని బోర్డులోని ఒక వర్గం అసంతృప్తితో ఉంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)కి చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్న కారణంగా మనోహర్ కీలక నిర్ణయాలను కూడా ఎవరితోనూ సంప్రదించకుండా తీసుకుంటున్నాని సభ్య సంఘాలు గుర్రుగా ఉన్నాయి. ఐసిసి ఆదాయంలో బిసిసిఐకి వచ్చే వాటాలో ఆరు శాతాన్ని వదులుకుంటున్నట్టు మనోహర్ చేసిన ప్రకటన తీవ్ర విమర్శలకు కారణమవుతున్నది. ఐసిసిలో కేవలం మూడు దేశాల పెత్తనం కొనసాగరాదని, అన్ని సభ్య దేశాలకు సమాన ప్రాతినిథ్యం, వాటా లభించాలని అతను చేసిన ప్రకటనపై బిసిసిఐలోని ఒక వర్గం అసంతృప్తితో ఉంది. ఐసిసికి లభిస్తున్న ఆదాయంలో అత్యధిక శాతం బిసిసిఐ నుంచే వెళుతున్నది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వరుసగా రెండు, మూడు స్థానాలను ఆక్రమిస్తున్నాయి. మిగతా దేశాల నుంచి ఎలాంటి ఆదాయం రావడం లేదు. అయినప్పటికీ ఆదాయంలో వాటాను అనుభవిస్తున్నాయి. శ్రీనివాసన్ ఐసిసి అధ్యక్షుడిగా వ్యవహరించిన కాలంలో ఈ విషయంపై చర్చ జరిగింది. ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్న బోర్డులకు లాభాల్లోనూ ఎక్కువ వాటా ఉండాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. సుదీర్ఘ చర్చలు, తర్జనభర్జనల తర్వాత భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులకు ఎక్కువ వాటా ఇవ్వాలని ఐసిసి తీర్మానించింది. ఈ నిర్ణయం ప్రకారం బిసిసిఐకి ఆదాయంలో 27 శాతం దక్కుతుంది. అయితే, తమకు వచ్చే వాటాలో ఆరు శాతాన్ని వదులుకుంటున్నట్టు మనోహర్ ప్రకటించాడు. దీని వల్ల బిసిసిఐ సుమారు 1,000 కోట్ల రూపాయలు నష్టపోతుందంటూ మద్రాసు హైకోర్టులో పిల్ కూడా నమోదైంది. ఇలావుంటే, మనోహర్‌కు తిరుగులేని బలమున్న కారణంగా అతన్ని బహిరంగంగా వ్యతిరేకించే అవకాశం లేదని, అందుకే అతను తీసుకుంటున్న నిర్ణయాలపై చర్చ జరగాలని వివిధ రూపాల్లో డిమాండ్ చేస్తున్నామని బోర్డులోని ఒక వర్గం స్పష్టం చేస్తున్నది. మనోహర్ అనుసరిస్తున్న విధానాలపై చర్చ అవసరమని ఈ వర్గం అభిప్రాయపడింది. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులకు ఉన్న విశేషాధికారాలకు కళ్లెం వేయాలని మనోహర్ స్వయంగా పేర్కోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని బోర్డులకే ఐసిసిలో ప్రాధాన్యం లభించడం, మిగతా బోర్డులు నామమాత్రంగా మారడం సరైన విధానం కాదని మనోహర్ చెప్పడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఐసిసికి వస్తున్న ఆదాయంలో 80 శాతాన్ని ఆర్జించి పెడుతున్న భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ బోర్డులకు ఐసిసి ఆర్థిక వ్యవహారాలపై పూర్తి ఆధిపత్యం ఉండాలన్న డిమాండ్‌లో తప్పులేదని, అందుకే ఐసిసి సభ్య దేశాలన్నీ ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయని మనోహర్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్న వారు గుర్తుచేస్తున్నారు.
ఐసిసి సర్వసభ్య సమావేశంలో లోతైన చర్చ జరిగిన తర్వాత, నిబంధనావళిని మార్చేసి, సంస్థకు సంబంధించిన అన్ని ఆర్థిక అంశాలపై అధికారాన్ని భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులు హస్తగతం చేసుకున్నాయి. అయితే, ఐసిసి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మనోహర్ ఈ విధానాన్ని మార్చేయాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. అంతటితో ఆగకుండా ఐసిసి సభ్యదేశాలన్నిటికీ సమాన వాటా లభించాలని సూచించాడు. త్వరలోనే ఈ అంశంపై నిబంధనావళిని సవరిస్తామన్నాడు. అయితే, ఎవరితో చర్చించి మనోహర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని కొంత మంది బోర్డు సభ్యులే విమర్శిస్తున్నారు.
డబ్బే వివాదానికి మూలం
ఐసిసి సభ్య దేశాల మధ్య ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అన్న వివాదం తలెత్తడానికి డబ్బే ప్రధాన కారణం. నిజానికి ఐసిసి ఆదాయంలో 80 శాతం మొత్తం భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుల నుంచి అందుతున్నది. అందులో 70 శాతం కేవలం భారత్ నుంచే వెళుతున్నది. అసలు క్రికెట్‌కు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా, అభివృద్ధికి సరైన చర్యలు తీసుకోకుండా, ఐసిసి నుంచి భారీ మొత్తాలను మిగతా క్రికెట్ బోర్డులు అన్యాయంగా తీసుకుంటున్నాయని బిసిసిఐ వాదించింది. ఐసిసి ఆదాయంలో తమ వాటను అనుసరించే లాభాల్లోనూ వాటా ఉండాలన్న డిమాండ్‌ను ఎట్టకేలకు సాధించుకోగలిగింది. సుదీర్ఘ పోరాటం తర్వాత దక్కించుకున్న ఈ అవకాశాన్ని చేజేతులా వదులుకోవడానికి బోర్డులోని ఒక వర్గం సుముఖంగా లేదు. పైగా ఎవరినీ సంప్రదించకుండా, కార్యవర్గ సమావేశాల్లో చర్చించకుండానే బిసిసిఐ వాటాలో ఆరు శాతాన్ని వదులుకుంటున్నట్టు మనోహర్ ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకుంటాడంటూ ఈ వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇటీవల జరిగిన బోర్డు కార్యవర్గ సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందిగానీ, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారు తక్కువ కావడంతో, మనోహర్‌ను ఎవరూ నిలదీయలేకపోయారు. ఐసిసి ఆర్థిక అంశాలపై మూడు దేశాలకు మాత్రమే అధికారం ఉండకుండా, అందరికీ సమ వాటా లభించాలన్న మనోహర్ ప్రతిపాదనపై చర్చ జరగాలని కొంత మంది సభ్యులు సూచించారు. ఈ విషయంపై బిసిసిఐ అనుసరించాల్సిన వ్యూహాలపై నిర్ణయం తీసుకునే ముందు అన్ని కోణాల నుంచి ఆలోచించాలని కోరారు. అయితే వారి సూచనలను మనోహర్ పరిగణలోకి తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు.
లాభాల్లో ఆరు శాతం వాటాను, అంటే సుమారు 1,000 కోట్ల రూపాయలను వదులుకోవడానికి బిసిసిఐ సిద్ధంగా ఉందని అతను ఇప్పటికే ప్రకటించాడు. కాబట్టి దానిని నిలబెట్టుకునే క్రమంలో మరింత మొండిగా ముందుకెళ్లడం ఖాయమన్న వాదన వినిపిస్తున్నది. మొత్తం మీద మనోహర్ ఏకపక్ష నిర్ణయాలపై గళం విప్పడానికి భయపడుతున్న వారు క్రమంగా బలాన్ని సమకూర్చుకొని, బహిరంగానే నిరసన వ్యక్తం చేయడం ఖాయం.