ఆటాపోటీ

ఈత కొలనులో సెయిల్ ఫిష్ ఫెల్ప్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాలోవని మేరీలాండ్‌లోని రోజర్ ఫోర్జ్‌లో జన్మించిన ఫెల్ప్స్ చిన్నతనంలో డంబార్టన్ స్కూల్‌లో చదివాడు. ఆతర్వాత టౌసన్ హైస్కూల్‌లో విద్యాభ్యాసం చేశాడు. ఆ సమయంలోనే అతను అంతర్జాతీయ స్విమ్మిర్‌గా ఎదిగాడు. నార్త్ బాల్టిమోర్ అక్వాటిక్ క్లబ్‌లో బాబ్ బౌమన్ పర్యవేక్షణలో స్విమ్మింగ్‌లో కోచింగ్ తీసుకున్నాడు. 2003లో అతను మూడు వేరువేరు విభాగాల్లో జాతీయ చాంపియన్‌షిప్‌ను సాధించి, ఈ ఫీట్‌ను అందుకున్న తొలి అమెరికా స్విమ్మర్‌గా రికార్డు నెలకొల్పాడు. కెరీర్‌లో 22 ఒలింపిక్ పతకాలను గెల్చుకున్న ఫెల్ప్స్ 100, 200 మీటర్ల బటర్‌ఫ్లై, 400 మీటర్ల ఇండివిజువల్ మెడ్లే, 200 మీటర్ల ఫ్రీస్టయిల్, 200 మీటర్ల ఇండివిజువల్ మెడ్లే తదితర విభాగాల్లో ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు.

రెండు టోపీలు
నీరు చెవుల్లోకి వెళ్లకుండా స్విమ్మర్లు ప్రత్యేకంగా తయారు చేసిన టోపీలు వాడతారు. ఒక టోపీతోనే ప్రాక్టీస్ చేసే ఫెల్ప్స్ రేసుల్లో మాత్రం రెండు టోపీలు పెట్టుకుంటాడు. కళ్లు దెబ్బతినకుండా, నీళ్లలోనూ స్పష్టంగా చూసేందుకు వీలుగా అద్దాలను అటూ ఇటూ కదలకుండా ఈ టోపీల కింద బలంగా నొక్కిపెట్టి ఉంచుతాడు. దీని వల్ల కొన్నిసార్లు సమస్యలు కూడా ఎదుర్కొన్నాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ 200 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లో పాల్గొన్నప్పుడు ఫెల్ప్స్ అద్దాలు వదులయ్యాయి. దీనితో నీళ్లు అద్దాల్లోకి చేరి కళ్లు కనిపించలేదు. అద్దాలను తీసేయడానికి వీల్లేని పరిస్థితి. ఫినిషింగ్ వాల్ ఎక్కడ ఉందో ఊహించుకుంటూ అతను రేస్‌ను పూర్తి చేయాల్సి వచ్చింది.
* ‘వరల్డ్ స్విమ్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఫెల్ప్స్‌ను ఏడు పర్యాయాలు వరించింది. తొమ్మిదిసార్లు అతను ‘అమెరికన్ స్విమ్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును గెల్చుకున్నాడు.

ఫెల్ప్స్ సోదరి విట్నీ కూడా స్విమ్మరే. ఆమె మార్గదర్శకంలోనే అతను స్విమ్మర్‌గా రాటుదేలాడు. అయితే, మరో సోదరి హిలారీకి కూడా స్విమ్మింగ్‌లో ప్రావీణ్యం ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. ఆమె అమెరికా జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంది.
ముమ్మరంగా ప్రాక్టీస్ చేసే కాలంలో ఫెల్ఫ్స్ రోజుకు సుమారు 80,000 మీటర్ల దూరం ఈదుతాడు. మరో రకంగా చెప్పాలంటే సుమారు 50 మైళ్ల దూరం అతను ఈత కొడతాడు. రోజుకు ఐదు నుంచి ఆరు గంటలు చొప్పున, వారంలో ఆరు రోజులు ప్రాక్టీస్ చేస్తాడు. ఎక్కువ ఎత్తయిన ప్రాంతాలను తలపించే వాతావరణాన్ని సృష్టించే ప్రత్యేక చాంబర్‌లో నిద్రపోతాడు. బరువు క్రమబద్దీకరణకు వారానికి మూడు రోజులు ఫిజికల్ ట్రైనింగ్‌కు హాజరవుతాడు. రోజుకు ఫెల్ప్స్ 12,000 క్యాలరీల శక్తిని ఖర్చు చేస్తాడట.
ఈత అనేది ఫెల్ప్స్‌కు పుట్టుకతోనే అబ్బిన విద్య. అతని శరీరాకృతి స్విమ్మింగ్‌కు చాలా ఉపకరిస్తుంది. పొడవైన చేతులు, వాటితో పోలిస్తే కొంత పొడవు తక్కువగా ఉన్న కాళ్లు. సాధారణ స్విమ్మర్ కంటే ఎక్కువగా, 15 డిగ్రీల వరకూ రొటేటయ్యే కాళ్లతో అతను చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ వేగాన్ని అందుకోగలుగుతున్నాడు.

మైఖేల్ ఫెల్ప్స్..

పరిచయం అవసరం లేని పేరు. సముద్రంలో అత్యంత వేగంగా ఈదగల చేప సెయిల్ ఫిష్. ఈత కొలనులో ఫెల్ప్స్‌ను సెయిల్ ఫిష్‌గా అభివర్ణిస్తారు. స్విమ్మింగ్ పూల్‌లో అతను సాధించిన రికార్డులు, అధిరోహించిన శిఖరాలు అలాంటివి. హాకీలో ఎనిమిది స్వర్ణ పతకాలు సాధించిన భారత్‌కు ఇండివిజువల్ ఈవెంట్స్‌లో ఒకే ఒక స్వర్ణాన్ని షూటర్ అభినవ్ బింద్రా అందించాడు. నూటపాతిక కోట్లకుపైగా జనాభా ఉన్న దేశమైనా, ఒకటిరెండు పతకాలు కైవసం చేసుకుంటే చాలు.. ఏదో అద్భుతం సాధించినట్టు అందరూ కేరింతలు కొడతారు. ఆ పతకాలు గెల్చుకున్న వారిని అందలం ఎక్కిస్తారు. అలాంటిది, ఒకటికాదు... రెండు కాదు.. ఏకంగా 18 స్వర్ణాలను ఒకే ఒక వ్యక్తి సాధించాడని ఊహించడం కూడా కష్టమే. అసాధ్యంగా కనిపించే ఈ అద్భుతాన్ని సుసాధ్యం చేసి చూపించాడు ఫెల్ప్స్. వీటితోపాటు, రెండు రజతాలు, మరో రెండు కాంస్యాలతో అతను మొత్తం 22 ఒలింపిక్ పతకాలను కైవసం చేసుకున్నాడు. స్విమ్మింగ్‌కు పర్యాయపదమయ్యాడు. 1985 జూన్ 30న జన్మించిన ఫెల్ప్స్ తన 15వ ఏట ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. అమెరికా తరఫున 68 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌లో పాల్గొన్న అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఏడేళ్ల వయసులోనే ఈత ప్రాక్టీస్ మొదలు పెట్టిన ఫెల్ప్స్ అమెరికా జాతీయ చాంపియన్‌షిప్ నుంచి ప్రపంచ చాంపియన్‌షిప్స్ వరకూ ఫెల్ప్స్ అడుగుపెట్టని పోటీ లేదు. సాధించని టైటిల్ లేదు. ఫెల్ప్స్ ఖజానాలో ఉన్న 77 అంతర్జాతీయ టైటిళ్లు అతని సామర్థ్యానికి నిదర్శనం. ఒలింపిక్స్‌లో 18, లాంగ్ కోర్స్ ప్రపంచ కప్‌లో 26, షార్ట్ కోర్స్ ప్రపంచ కప్‌లో ఒకటి, పాన్ పసిఫిక్ చాంపియన్‌షిప్‌లో 16 చొప్పున మొత్తం 61 స్వర్ణ పతకాలు అతని చెంత చేరి మురిసిపోతున్నాయి. అతను నెలకొల్పిన ప్రపంచ రికార్డులను ఎవరూ ఊహించలేరేమో! 39 ప్రపంచ రికార్డులు అతని అకుంఠిత దీక్షకు, తిరుగులేని ప్రతిభకు అద్దం పడతాయి.
సమస్యలకు ఎదురీత
ఫెల్ప్స్ ఒక్కసారిగా అత్యున్నత శిఖరాలను అధిరోహించలేదు. అకుంఠిత దీక్షతో కృషి చేశాడు. నిరంతరం తపనపడ్డాడు. శ్రమించాడు. ఒక్కో మెట్టు ఎక్కడానికి అతను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. గంటల తరబడి ప్రాక్టీస్ చేశాడు. ఎంతో కష్టపడ్డాడు.. అనుకున్నది సాధించాడు.. చిన్నతనం నుంచి సమస్యలకు ఎదురీదడం అలవాటైంది కాబట్టే, స్విమ్మింగ్‌లో ఫెల్ప్స్ రారాజుగా వెలిగిపోతున్నాడేమో! అతనికి కేవలం ఏడేళ్ల వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. తండ్రి పోలీస్. తల్లి ఓ స్కూల్ టీచర్. ఇద్దరూ విడిపోయిన తర్వాత ఫెల్ప్స్ ఎక్కువ సమయం తన అక్క విట్నీతోనే గడిపేవాడు. ఆమె స్విమ్మర్. ఆమె అడుగు జాడల్లోనే ఫెల్ప్స్ నడిచాడు. 1996లో విట్నీ ఒలింపిక్ ట్రయల్స్‌లో పాల్గొంది. అప్పుడు ఆమెకు తోడుగా ఫెల్ప్స్ వెళ్లాడు. ఒలింపిక్స్‌పై ఆసక్తికి పునాది పడింది. ఆ ట్రయల్స్‌లో విట్నీ 200 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లో పోటీపడి ఆరో స్థానానికి పరిమితమైంది. వెనె్నముకలో నాలుగు పూసలు కదిలిపోవడంతో విట్నీ స్విమ్మింగ్‌కు దూరమైంది. తాను సాధించలేకపోయిన ఒలింపిక్స్ కలను తమ్ముడి ద్వారా నెరవేర్చుకోవాలనుకుంది. కానీ, తన లక్ష్యం నెరవేరడం అనుకున్నంత సులభం కాదని ఆమె త్వరలోనే గ్రహించింది. చిన్నతనంలోనే ఫెల్ప్స్‌ను మానసిక వైకల్యం వెంటాడడంతో దాని ప్రభావం అతని జీవన విధానంపై పడింది. అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివ్ డిసార్డర్ (ఎడిహెచ్‌డి)గా పేర్కొనే ఆ వ్యాధితో బాధపడేవారు నిలకడగా ఉండలేరు. సరైన నిర్ణయాలు తీసుకోలేరు. కోపం, చిరాకు, అసహనం వంటి లక్షణాలు అధికంగా ఉంటాయి. ఏదో సాధించాలన్న తపన, అందుకు తగిన శక్తిసామర్థ్యాలు ఉంటాయిగానీ నిలకడగా ఆలోచించలేరు. స్థిరంగా ఉండలేరు. ఈ లక్షణాలను గమనించే విట్నీ అతనిని రోజూ స్విమ్మింగ్ పూల్‌కు తీసుకెళ్లేది. మొదట్లో పూల్‌లోకి దిగడానికే భయపడిన ఫెల్ప్స్ చాలా తక్కువ కాలంలోనే మేటి స్విమ్మర్‌గా ఎదిగాడు. అతనికి 11వ ఏట కోచ్‌గా బాబ్ బౌమన్ లభించాడు. అతని పర్యవేక్షణలో ఫెల్ప్స్ స్విమ్మింగ్‌లో రాటుదేలాడు. 2000లో తన 15వ ఏట సిడ్నీ ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించి సంచలనం సృష్టించాడు. 1932 తర్వాత అమెరికా ఒలింపిక్స్ జట్టులో స్థానం సంపాదించిన పిన్న వయస్కుడిగా రికార్డు పుస్తకాల్లో స్థానం సంపాదించాడు. 200 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లో అతను ఐదో స్థానంతోనే సంతృప్తి చెందినప్పటికీ, 15-16 ఏజ్ గ్రూపులో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. నాలుగేళ్ల తర్వాత, 2004లో అతను విశ్వరూపాన్ని చూపాడు. ఆరు స్వర్ణాలు, రెండు కాంస్యాలతో ఎనిమిది పతకాలు సాధించాడు. సోవియట్ యూనియన్ జిమ్నాస్ట్ అలెగ్జాండర్ దిత్యాతిన్ 1980లో జరిగిన మాస్కో ఒలింపిక్స్‌లో ఎనిమిది పతకాలతో నెలకొల్పిన రికార్డును ఫెల్ప్స్ సమం చేశాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో మొత్తం ఎనిమిది ఈవెంట్స్‌లో పోటీపడి, అన్నింటిలోనూ స్వర్ణాలను సాధించాడు. ఈ క్రమంలో అతను ఏడు ప్రపంచ రికార్డులు, ఎనిమిది అమెరికా జాతీయ రికార్డులు, మరో ఎనిమిది ఒలింపిక్ రికార్డులను బద్దలు చేశాడు. ఒకే ఒలింపిక్స్‌లో ఎనిమిది చొప్పున పతకాలను రెండుసార్లు కైవసం చేసుకున్న ఏకైక క్రీడాకారుడిగా మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో మరో నాలుగు స్వర్ణం, రెండు రజత పతకాలను అందుకొని, ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగాడు. లండన్ ఒలింపిక్స్ ముగిసిన వెంటనే అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్తున్నట్టు ప్రకటించిన ఫెల్ప్స్ గత ఏడాది మనసు మార్చుకున్నాడు. మళ్లీ ఈత కొలనులో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటాడని అమెరికా అధికారులు అంటున్నారు. ఫెల్ప్స్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియదని, ఈ ఏడాది ఆగస్టులో జరిగే ఒలింపిక్స్‌లో ఒకవేళ పాల్గొన్నా 30 ఏళ్ల వయసులో గతంలో మాదిరి అద్భుతాలు సృష్టించలేడన్న అభిప్రాయం వినిపిస్తున్నది. అతను మళ్లీ ఒలింపిక్స్ బరిలోకి దిగుతాడా లేదా, గతంలో మాదిరిగానే పతకాల పంట పండిస్తాడా లేదా అన్న అనుమానాలు ఎవరికైనా ఉండవచ్చేమోగానీ, క్రీడా చరిత్రలోనే అలాంటి మొనగాడు మరొకడు లేడు.. రాడు అనే విషయాన్ని అంగీకరించి తీరాల్సిందే. చాలా మంది ఒలింపియన్ల కంటే.. కొన్ని వందల దేశాల కంటే ఫెల్ప్స్ ఒక్కడు సాధించిన పతకాలే ఎక్కువ. రియో ఒలింపిక్స్‌లో అతను పాల్గొంటే చూడాలనుకుంటున్న అభిమానుల ఆశ నెరవేరుతుందో లేదో చూడాలి.

లొచె ఒక్కడే..
మైఖేల్ ఫెల్ప్స్‌ను అధిగమించే సత్తా అమెరికా జట్టులోని అతని సహచరుడు ర్యాన్ లొచెకు మాత్రమే ఉంది. ఇప్పటికే అత్యధిక పతకాల విషయంలో అతను ఫెల్ప్స్‌ను అధిగమించాడు. కెరీర్‌లో అతను 53 స్వర్ణం, 2 రజతం, 14 కాంస్యాలతో 89 పతకాలు కైవసం చేసుకున్నాడు. అయితే, ఫెల్ప్స్ మాదిరి 22 ఒలింపిక్ పతకాలు సాధించడం అతనికి అసాధ్యమనే చెప్పాలి.
* సహచరుడు ఇయాన్ క్రాకర్‌తో ఫెల్ప్స్‌కు ఎప్పుడూ ఆధిపత్య పోరాటం ఉండేది. 2003 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో క్రాకర్ చేతిలో ఓడిన ఫెల్ప్స్ తన గదిలో అతని ఫొటోనే పెట్టుకునే వాడు. నిద్ర లేవగానే ఆ ఫొటోను చూస్తే, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో ఎదురైన పరాభం గుర్తుకొచ్చి, ప్రతీకారం తీర్చుకోవాలన్న కోరిక బలపడాలని ఫెల్ప్స్ చేసిన ఈ ప్రయోగం విజయవంతమైంది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో క్రాకర్‌ను చిత్తుగా ఓడించాడు.
* ఒకప్పటి సోవియట్ యూనియన్ జిమ్నాస్ట్ అలెగ్జాండర్ దిత్యాతిన్ 1980 మాస్కో ఒలింపిక్స్‌లో ఎనిమిది పతకాలు సాధించడాన్ని ప్రస్తావిస్తూ ఆ ఫీట్‌ను సాధించే సత్తా ఎవరికైనా ఉంటుందని తాను అనుకోవడం లేదని, అది అసాధ్యమని ఆస్ట్రేలియా స్విమ్మింగ్ సూపర్ స్టార్ ఇయాన్ థోర్ప్ వ్యాఖ్యానించాడు. థోర్ప్ మాటలను ఫెల్ప్స్ సవాలుగా స్వీకరించాడు. ఒకటికాదు.. రెండు ఒలింపిక్స్ (2004, 2008)లో ఎనిమిదేసి పతకాలు గెల్చుకొని, పట్టుదలకు మారుపేరుగా నిలిచాడు. సవాళ్లకే సవాళ్లు విసిరే స్థాయికి చేరాడు.
* ఒలింపిక్స్ చరిత్రలోనే అత్యధిక పతకాలు సాధించి రికార్డు నెలకొల్పిన అమెరికా స్టార్ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ తనకు మరికొన్ని పతకాలు గెల్చుకునే సత్తా ఉందని నిరూపిస్తున్నాడు. అమెరికా జాతీయ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఇప్పటికే 200 మీటర్ల ఇండివిజువల్ మెడ్లే టైటిల్‌ను సాధించిన అతను 100 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లోనూ విజేతగా నిలిచాడు. టామ్ షీల్డ్‌తో హోరాహోరీగా పోటీపడి, సెకనులో మూడు వందల వంతు తేడాలో గమ్యాన్ని చేరాడు. అనంతరం 200 మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలో లక్ష్యాన్ని ఒ నిమిషం, 52.20 సెకన్లలో చేరుకొని మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌లో పాల్గొని, పతకాలు సాధించడమే లక్ష్యంగా తాను శ్రమిస్తున్నట్టు ఫెల్ప్స్ చెప్పాడు. ఫెల్ప్స్ ఖాతాలో ఇప్పటికే 18 ఒలింపిక్ స్వర్ణ పతకాలున్నాయి.

భారత స్విమ్మర్లకు సాయం!

ఫెల్ప్స్ భారత స్విమ్మర్లకు సాయం చేయనున్నాడు. అతని సోదరి విట్నీ ఫెల్ప్స్ బెంగళూరులో నెలకొల్పిన అకాడెమీ యువ స్విమ్మర్లకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణను అందిస్తున్నది. అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత మనసు మార్చుకొని మళ్లీ క్రియాశీలక పోటీల్లో పాల్గొంటున్న ఫెల్ప్స్ ముమ్మర ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో అతను బెంగళూరు అకాడెమీకి తరచు వస్తాడా? యువ స్విమ్మర్లకు మార్గదర్శకం చేస్తాడా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. అయితే, నిర్వాహకులు అందిస్తున్న వివరాల ప్రకారం ఫెల్ప్స్ కూడా స్వయంగా ఇక్కడి శిక్షణ తీరుతెన్నులను పరిశీలిస్తాడు. అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తాడు.

‘రేస్ ఆఫ్ ది సెంచరీ’

* ఏథెన్స్‌లో 2004లో జరిగిన ఒలింపిక్స్‌లో ఫెల్ప్స్ 200మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఇయాన్ థోర్ప్, పీటర్ వాన్ డెన్ హూగెన్‌బాండ్, ఫెల్ప్స్ చివరి వరకూ హోరాహోరీగా తలపడ్డారు. స్విమ్మింగ్‌లో ‘రేస్ ఆఫ్ ది సెంచరీ’గా పిలిచే ఆ పోరులో థోర్ప్ స్వర్ణ పతకం సాధించాడు. హూగెన్‌బాండ్ రజత పతకాన్ని స్వీకరించగా, ఫెల్ప్స్ కాంస్య పతకంతో సంతృప్తి చెందాడు. ఈ ముగ్గురూ లక్ష్యాన్ని ఒక సెకను కంటే తక్కువ తేడాలోనే చేరడం విశేషం. ఈ ఒలింపిక్స్ ఆరంభానికి కొన్ని వారాల ముందే అతను మేరీలాండ్ ప్రాంతంలో మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ దొరికిపోయాడు. ఈ సంఘటనపై అతను బహిరంగ క్షమాపణ చెప్పుకొన్నాడు.
* చిన్నతనంలో ఎడిహెచ్‌డి వ్యాధితో బాధపడిన ఫెల్ప్స్ క్రమం తప్పకుండా మందులు వాడాడు. స్కూల్‌కు వెళ్లే రోజుల్లో ప్రతి రోజూ భోజన విరామ సమయంలో ఒక నర్స్ వచ్చి మాత్రను ఇవ్వడం ఫెల్ప్స్‌కు నచ్చలేదు. అందుకే, తన 12వ ఏట మందు వాడకాన్ని మానేశాడు. స్విమ్మింగ్‌పై దృష్టి కేంద్రీకరించాడు. వ్యాధి లక్షణాలను తనకు అనుకూలంగా మలచుకున్నాడు. స్విమ్మింగ్ పూల్‌లో కనీవినీ ఎరుగని రికార్డులు సృష్టించాడు. కొన్ని వేల మంది ఒలింపియన్స్ కంటే, కొన్ని వందల దేశాల కంటే ఎక్కువ ఒలింపిక్ పతకాలను తన ఖాతాలో వేసుకున్నాడు.
* ఫెల్ప్స్ ఎత్తు 6 అడుగుల 4 అంగుళాలు. బరువు 88 కిలోలు. నిరంతరం ప్రాక్టీస్ చేస్తుంటాడు కాబట్టి, ఎక్కువ కేలరీస్ ఉన్న ఆహారం తీసుకుంటాడు. ఉదయానే్న అతను రెండు కోడిగుడ్లు, చీజ్‌తో చేసిన సాండ్‌విచ్‌ను తింటాడు. దానితోపాటు అటుకులతో తయారు చేసిన ఉప్మా, ఒక పెద్ద ఆమ్లెట్, చాక్లెట్ క్రీమ్ పైపూతగా ఉన్న పాన్‌కేక్స్‌ను లాగించేస్తాడు. ఒక సాధారణ వ్యక్తి ఎవరైనా నిద్ర లేచిన వెంటనే ఈ మోతాదులో తింటే, ఆరోజుకు మళ్లీ తిండి మాట ఎత్తడు. కానీ, ఫెల్ప్స్‌కు మాత్రం ఇంత భారీ పరిమాణం అల్పాహారం మాత్రమే.
* పోటీలకు దిగే ముందు ఫెల్ప్స్ హాప్ ఆఫ్ లేదా ర్యాప్ సంగీతం వింటాడు. సంగీతం వినడం వల్ల మానసిక ఆందోళనలు తగ్గిపోయి, మనసు ప్రశాంతంగా ఉంటుందని అంటాడు. అమెరికా ర్యాపర్ యంగ్ జీజీని అమితంగా అభిమానించే ఫెల్ప్స్ ఎక్కడికి వెల్లినా తన వెంట ఎంపిత్రీ ప్లేయర్‌ను తీసుకెళతాడు.
* సోవియట్ యూనియన్ జిమ్నాస్ట్ లారిసా లాటినినా కెరీర్‌లో తొమ్మిది స్వర్ణాలుసహా మొత్తం 18 ఒలింపిక్ పతకాలను కైవసం చేసుకుంది. లండన్ ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలుసహా ఆరు పతకాలను సాధించిన ఫెల్ప్స్ ఇప్పుడు మొత్తం 22 పతకాలతో ఈ పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. ఒకే ఒలింపిక్స్‌లో ఎనిమిది స్వర్ణాలు గెల్చుకోవడం కూడా ఫెల్ప్స్ సాధించిన రికార్డుల్లో ఒకటి.

15 ఏళ్ల వయసులోనే ఒలింపిక్స్‌లో పాలొన్న మైఖేల్ ఫెల్ప్స్

- మైత్రేయ