ఆటాపోటీ

లండన్‌లో ఆశనిరాశల మధ్య..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్ షిప్ లాంటి మెగా ఈవెంట్స్ లో భారత ప్రయాణం, ఒక్కఅడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంలా మారింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఆరు పతకాలు, సాధించామని భుజాలు చరుచుకుంటున్నా, నూటయాభైకోట్ల జనాభా దిశగా దూసుకెళ్తున్న భారత్ పదుల సంఖ్యలో కూడా పతకాలను గెలుచుకోలేకపోవడం దురదృష్టకరం. మైఖేల్ పెల్ఫ్స్ 18 బంగారు పతకాలు సాధిస్తే వందల సంఖ్యలో వెళ్తున్న మనవాళ్లు అరకొర పతకాలతో సంతృప్తి చెందాల్సి వస్తున్నది. ప్రతి ఒలింపిక్స్‌కు మందీ మార్బలంతో బయలు దేరడం చెప్పుకోదగ్గ ఫలితాలు లేకుండానే వెనుదిరగడం ఆనవాయతీగా మారింది. ఈసారి రియో ఒలింపిక్స్‌లో మన దేశానికి శతాధిక సంఖ్యలో క్రీడాకారులు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ కనీసం పదుల సంఖ్యలోనన్నా పతకాలు దక్కుతాయాన్నది అనుమానమే. లండన్ ఒలింపిక్స్‌ను సింహావలోకనం చేసుకుంటే రియోలో మనం ఏమాత్రం రాణిస్తామనేది అర్థమవుతూనే ఉంది.

అంతకు ముందు వరకూ జరిగిన ఒలింపిక్స్‌తో పోలిస్తే లండన్‌లోనే భారత్ మెరుగైన ప్రదర్శనతో రాణించింది. అక్కడ మన ప్రస్థానం ఆశనిరాశల మధ్య సాగింది. పతకాల జాబితాలో స్థానం ఎలావున్నా, ఎక్కువ మంది పతకాలు సాధించిన ఘనత మనకు లండన్‌లోనే దక్కింది. కానీ, లోపాలు కూడా చాలా స్పష్టంగా తెరపైకి వచ్చాయ. మన క్రీడా రంగం ఎంతగా అభివృద్ధి చెందిందో, ఇంకా అందుకోవాల్సిన ప్రమాణాలు ఏ స్థాయలో ఉండాలో లండన్ ఒలింపిక్స్ ఫలితాలు తేటతెల్లం చేశాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు మనవాళ్లు దరిదాపుల్లోకి కూడా రాలేరని చాలా విభాగాల్లో జరిగిన పోటీల్లో వారి ప్రదర్శన, ఫలితాల తీరుతెన్నులు స్పష్టం చేశాయి. షూటింగ్‌లో విజయ్ కుమార్, రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్ రజతాలు, గగన్ నారంగ్ కాంస్యం, మహిళల బాక్సింగ్‌లో మేరీ కోమ్, బాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్, రెజ్లింగ్‌లో యోగేశ్వర్ దత్ కాంస్యాలతో ఆదుకున్నారు. లేకపోతే మన దేశ ప్రతిష్ఠ అంతర్జాతీయ వేదికపై మరింత దిగజారి ఉండేది. నిజానికి, లండన్ ఒలింపిక్స్‌కు బయలుదేరిన భారత బృందంలో పతకాలు సాధించే సత్తావున్న వారిలో అభినవ్ బింద్రా పేరు ప్రముఖంగా వినిపించింది. బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన బింద్రా లండన్‌లోనూ చరిత్ర సృష్టిస్తాడని అభిమానులు ఆశించారు. బింద్రా, గగన్ నారంగ్ తప్ప మిగతా షూటర్ల గురించి ఎవరూ పట్టించుకోలేదు. వీరిలో నారంగ్ కాంస్యంతో భారత పతకాల ఖాతాను తెరిచి ఫరవాలేదనిపించాడు. బింద్రా కనీసమైన పోటీ కూడా ఇవ్వకుండానే నిష్క్రమించాడు. ఆశలు అడుగంటిన పరిస్థితుల్లో విజయ్ కుమార్ రూపంలో భారత్‌కు తొలి రజత పతకం దక్కింది. అతని నుంచి స్ఫూర్తిపొందిన రెజ్లర్ సుశీల్ కుమార్ కూడా రజతాన్ని సాధించి పెట్టాడు. సుశీల్ టాప్ స్టార్‌గా లండన్ ఒలింపిక్స్‌కు వెళితే, మరో రెజ్లర్ యోగేశ్వర్ దత్ ఎలాంటి అంచనాలు లేకుండానే పయనమయ్యాడు. లండన్ ఒలింపిక్స్‌కు వెళ్లిన తర్వాత కూడా అతని గురించి చాలా మందికి తెలియదు. అయతే అక్కడ కాంస్య పతకం సాధించడంతో ఒక్కసారిగా అతని పేరు దేశమంతా మారుమోగిపోయింది. మేరీ కోమ్, సైనా నెహ్వాల్ తమపై అభిమానులు ఉంచుకున్న నమ్మకాన్ని కొంతలో కొంతైనా నిలబెట్టుకున్నారు.
అయతే, అందరూ ఎంతో ఆశలు పెట్టుకున్న ఆర్చర్లు దారుణంగా గురితప్పారు. ప్రపంచ నంబర్‌వన్ స్థానాన్ని సంపాదించిన దీపికా కుమారి కూడా పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరచింది. అథ్లెట్ల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. డిస్కస్ త్రోలో వికాస్ గౌడ, కృష్ణ పునియా తమ స్థాయికి తగ్గట్టు రాణించలేదు. రికార్డు స్థాయిలో లండన్‌లో 14 మంది అథ్లెట్లను బరిలోకి దించామని భుజాలు చరచుకున్నా సాధించింది శూన్యమే. బాడ్మింటన్‌లో సైనా కాంస్య పతకాన్ని అందుకుంటే, కశ్యప్ కడవరకూ పోరాటం సాగించడం కొంతలో కొంత ఊరటనిచ్చే అంశం. టెన్నిస్‌లో లియాండర్ పేస్, మహేష్ భూపతి, సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, సానియా మీర్జా, రోహన్ బొపన్న, రుష్మీ చక్రవర్తి మూకుమ్మడిగా విఫలమయ్యారు. బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన అభినవ్ బింద్రా అభిమానుల ఆశలను నీరుగార్చాడు. రంజన్ సింగ్ సోధీ, మానవ్‌జిత్ సింగ్ వైఫల్యాలు దేశ పరువును నడిబజారులో వేలం వేశాయి. జూడో, స్విమ్మింగ్‌లలో ఒక్కొక్కరు చొప్పున లండన్ వెళ్లి పరాజయాలను మూటగట్టుకొని తిరిగొచ్చారు. ఇవన్నీ భారత క్రీడాభిమానులను నిరాశ పరిచే అంశాలే.
బీజింగ్ ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించలేకపోవడంతో పరువు పోగొట్టుకున్న భారత హాకీ జట్టు లండన్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయంది. అయతే, ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌లో ఆడుతున్నామనిగానీ, దేశం యావత్తు తమపై ఎన్నో ఆశలు పెట్టుకుందనిగానీ గుర్తులేని విధంగా మన హాకీ క్రీడాకారులు నీరసించిపోయారు. మొత్తం 12 జట్లు పోటీపడిన పురుషుల హాకీలో మనది చివరి నుంచి మొదటి స్థానం. ప్రపంచ దేశాలకు హాకీలో ఎన్నో పాఠాలు నేర్పించిన భారత్ ఇలాంటి దుస్థితిని ఎదుర్కొంటుందని ఎవరూ ఊహించలేదు.

అథ్లెటిక్స్‌లో మరీ దారుణం
మిగతా క్రీడల్లో ఒడిదుడుకుల ప్రయాణం కొనసాగుతుండగా, అథ్లెటిక్స్‌లో మాత్రం అత్యంత దారుణంగానే ఉంటున్నది. ఒలింపిక్స్ అథ్లెటిక్స్ విభాగంలో మన దేశం ఏనాడూ కనీస పోటీని కూడా ఇవ్వలేదు. 1900 పారిస్ ఒలింపిక్స్‌లో నార్మన్ ప్రిచర్డ్ రెండు రజత పతకాలను కైవసం చేసుకోవడంతో మన దేశానికి 17వ స్థానం లభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అథ్లెటిక్స్‌లో మనకు అదే అత్యుత్తమ ప్రదర్శన. మిగతా క్రీడల్లోనూ వైఫల్యాలే ఎదురయ్యాయ. 1904 సెయింట్ లూయిస్, 1908 లండన్, 1912 స్టాక్‌హోమ్ ఒలింపిక్స్‌లో భారత్ పాల్గొనలేదు. 1920 ఆంట్‌వర్ప్‌లో బరిలోకి దిగినా ఒక్క పతకం కూడా లభించలేదు. 1924 పారిస్ ఒలింపిక్స్‌లోనూ అదే పరిస్థితి.
1928 ఆమ్‌స్టెర్‌డామ్‌లో హాకీ జట్టు అడుగుపెట్టడంతో భారత్ రాత మారింది. ఆ ఒలింపిక్స్‌లో హాకీ జట్టు స్వర్ణ పతకం సాధించగా, మన దేశానికి 24వ స్థానం లభించింది. 1932 లాస్ ఏంజిలెస్ ఒలింపిక్స్‌లోనూ హాకీ స్వర్ణంతో మన దేశానికి 19వ స్థానం దక్కింది. 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లోనూ హాకీ జట్టు పుణ్యమాని 20 స్థానాన్ని సంపాదించుకుంది. 1948 లండన్ ఒలింపిక్స్‌లో హాకీ జట్టు మరోసారి స్వర్ణ పతకం సాధించి మన దేశాన్ని 22వ స్థానంలో నిలబెట్టింది. 1952 హెల్సిన్కీ, 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లోనూ హాకీ స్వర్ణాల కారణంగా వరుసగా 26, 24 స్థానాలు వచ్చాయ. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో హాకీ జట్టు రజతంతో సరిపుచ్చుకోగా 32వ స్థానం దక్కింది. 1964 టోక్యో ఒలింపిక్స్‌లో మళ్లీ హాకీలో స్వర్ణం లభించింది. దేశానికి 24వ స్థానం దొరికింది. 1968 మెక్సికో సిటీ, 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో హాకీ జట్టు కాంస్య పతకాలతో సరిపుచ్చుకుంది. ఫలితంగా 42, 43 స్థానాలకు పరిమితమైంది. 1976 మాంట్రియల్ ఒలింపిక్స్‌లో ఒక్క పతకం కూడా దక్కలేదు. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో ఒక స్వర్ణం, ఒక కాంస్యంతో మొత్తం రెండు పతకాలు సాధించిన భారత్‌కు 23వ స్థానం లభించింది. 1984 లాస్ ఏంజిలెస్, 1988 సియోల్, 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో మన దేశం ఒక్క పతకాన్ని కూడా సాధించలేకపోయింది. 1996 అట్లాంటా, 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో ఒక్కో కాంస్య పతకాన్ని మాత్రమే సంపాదించగలిగింది. దీనితో ఈ రెండు సందర్భాల్లోనూ మన దేశానికి 71వ స్థానం దక్కింది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో ఒక రజత పతకం లభించగా, 65వ స్థానంలో నిలిచింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఒక స్వర్ణం, రెండు కాంస్యాలతో మొత్తం మూడు పతకాలను కైవసం చేసుకొని 50వ స్థానాన్ని సంపాదించింది. లండన్ ఒలింపిక్స్‌లో రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు సాధించి 55వ స్థానాన్ని దక్కించుకుంది. ఈసారి భారీ బృందాన్ని పంపుతున్న భారత్‌కు ఎన్ని పతకాలు లభిస్తాయో చూడాలి.

- ఎస్‌ఎమ్‌ఎస్