ఆటాపోటీ

స్ఫూర్తిదాయక క్రీడాస్పర్ధ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో ఒలింపిక్స్‌కు నాలుగు ప్రధాన వేదికలను సిద్ధం చేశారు. బర్రాలో ఒలింపిక్ పార్క్‌ను నిర్మించారు. కోపకాబనా జోన్‌లో బీచ్ వాలీబాల్, ట్రయథ్లాన్, రోయింగ్, సెయిలింగ్ తదితర పోటీలు జరుగుతాయి. దేడొరో జోన్‌లో ఈక్వెస్ట్రియన్, షూటింగ్, రగ్బీ సెవెన్స్ ఈవెంట్స్ ఉంటాయి. అథ్లెటిక్స్‌ను మరకానా జోన్‌లో నిర్వహిస్తారు. రియోతోపాటు బెలో హొరిజోనే్ట, బ్రసిలియా, సాల్వడార్, సావో పౌలో, మనాస్ నగరాలను సాకర్ పోటీలకు ఎంపిక చేశారు. ఈ నగరాల్లో 2014 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లు కూడా జరిగాయి.
లండన్ ఒలింపిక్స్ సమయంలో వివిధ క్రీడలకు సంబంధించి నిర్వాహకులు సుమారు కోటి ట్వీట్స్ చేశారు. ఈసారి ఒలింపిక్స్‌ను ప్రపంచ వ్యాప్తంగా 3.6 బిలియన్ల మంది చూస్తారని అంచనా. చైనా, భారత్, అమెరికా దేశాల మొత్తం జనాభాతో ఈ సంఖ్య దాదాపు సమానం.
బ్రెజిల్ స్ట్రయికర్ నేమార్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఒలింపిక్స్‌లో సాకర్ మ్యాచ్‌లకు భారీ డిమాండ్ ఉంటుంది. సోషల్ నెట్‌వర్క్‌లో అత్యధిక మంది తిలకించే వివరాలు కూడా నేమార్‌వే అవుతాయి. అతను బ్రెజిలియన్ కావడం వల్ల సహజంగానే భారీ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే, ఈ విషయంలో అమెరికా సూపర్ స్టార్ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ పోటీపడుతున్నాడు. గత మూడు ఒలింపిక్స్‌లో 18 ఒలింపిక్ స్వర్ణ పతకాలను గెల్చుకున్న అతనికి బ్రెజిల్‌లోనూ ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. ఆ మూడు ఒలింపిక్స్‌లో బ్రెజిల్ సాధించిన స్వర్ణాలకంటే ఫెల్ప్స్ ఖాతాలో ఏడు స్వర్ణాలు అధికంగా ఉన్నాయి. అతనికి ప్రపంచ వ్యాప్తంగా అంత క్రేజ్ ఉండడానికి ఇదే ప్రధాన కారణం.
సాకర్ మ్యాచ్‌లకు ప్రేక్షకులు పోటెత్తడం ఖాయం. ఫుట్‌బాల్‌కు బ్రెజిల్‌లో ఉన్న ఆదరణ అలాంటిది. సాకర్ తర్వాత అమెరికా బాస్కెట్‌బాల్ మ్యాచ్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని అంచనా.
ఖర్చు బారెడు
ఆదాయం మాట ఎలావున్నా.. ఒలింపిక్స్‌కు భారీగానే ఖర్చవుతున్నది. ఈ పోటీలు పూర్తయ్యే సమయానికి బ్రెజిల్ సర్కారుకు సుమారు 13,584 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బ్రెజిల్‌కు ఇది మోయలేని భారమే. దీని ప్రభావం దేశంలో కనీసం మరో పదేళ్లు ఉండవచ్చని అంటున్నారు. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న బ్రెజిల్‌లో పోలీసులు, డాక్టర్లు, టీజర్లు వేతనాలు సక్రమంగా చెల్లించాలన్న డిమాండ్‌తో ఆందోళన చేస్తున్నారు. కార్మికుల నిరసనలు జోరందుకున్నాయి. ఈ పరిస్థితుల్లో భారీ ఖర్చును భరించడం బ్రెజిల్‌కు తలకుమించిన భారమే అవుతుంది.
ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు నామినేషన్‌ను దక్కించుకునే అవకాశాలు దోహ, కతార్‌లకు ఉన్నప్పటికీ, వాతావరణ పరిస్థితుల కారణంగా పోటీలో నిలవలేకపోయాయి. అయితే, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అక్టోబర్ కంటే ముందు ఒలింపిక్స్‌ను నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేయడంతో నామినేషన్‌కు కూడా నోచుకోలేదు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి)లో 115 దేశాలకు ఓటు హక్కు ఉండగా, రియోతోపాటు మాడ్రిడ్, చికాగో, టోక్యో తీవ్రంగా పోటీపడ్డాయి. నిజానికి రియో కంటే కతార్, దోహాలకు ఎక్కువ పాయింట్లు లభించినప్పటికీ వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ఒలింపిక్స్ కోసం బ్రెజిల్ ప్రభుత్వం 43 మైళ్ల పొడవైన కొత్త రహదారులను నిర్మించింది. పేవ్‌మెంట్స్ కోసం 250 చదరపు మైళ్ల విస్తీర్ణంలో మొక్కలు నాటింది. రియోలో మాదక ద్రవ్యాల చలామణి ఎక్కువ. ఆ మత్తులో జరిగే నేరాలు అధికం. ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తున్న కారణంగా పోలీసు శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని డ్రగ్ మాఫియాను కట్టడిచేసే ప్రయత్నంలో పడింది. అయితే, ఒలింపిక్స్ సమయంలోనే భారీగా మాదక ద్రవ్యాలను సరఫరా చేసేందుకు మాఫియా వ్యూహరచన చేస్తున్నది.
రియో ఒలింపిక్స్‌లో గోల్ఫ్, రగ్బీ పోటీలు మళ్లీ అడుగుపెట్టాయి. గోల్ఫ్ 112 సంవత్సరాల తర్వాత, రగ్బీ 92 ఏళ్ల తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌లో స్థానం సంపాదించాయి. రియో ఒలింపిక్స్ నిర్వాహణ కమిటీ కోటీ పది లక్షల భోజనాలు, లక్ష కుర్చీలు, 72,000 టేబుళ్లు, 60,000 హ్యాంగర్లు, 34,000 మంచాలు, 25,000 టెన్నిస్ బంతులు, 8,400 బాడ్మింటన్ షటిల్ కాక్స్‌ను సరఫరా చేయాలి.
దక్షిణ అమెరికాలో తొలిసారి ఒలింపిక్ క్రీడలు జరుగుతాయి. 2009లో జరిగిన బిడ్డింగ్ రేసులో చికాగో, మాడ్రిడ్, టోక్యో నగరాలను అధిగమించిన రియో డి జెనీరో (బ్రెజిల్) 2016 ఒలింపిక్స్‌ను నిర్వహించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.
ఒలింపిక్స్ జన్మస్థలమైన గ్రీస్‌లోని ఒలింపియా నుంచి క్రీడా జ్యోతి రిలే ఆరంభమైంది. గ్రీస్‌లో ఎలోనస్ శరణార్థుల శిబిరానికి జ్యోతిని ప్రత్యేకంగా తీసుకెళ్లారు. అక్కడ ఒక శరణార్థిని టార్చ్ బేరర్‌గా ఎంచుకున్నారు. సుమారు 90 రోజులు ప్రయాణించే ఈ జ్యోతి ఆగస్టు 5న రియో చేరుకుంటుంది.
ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు ఉత్సవాలు మరకానా స్టేడియంలో జరుగుతాయి. ఈ స్టేడియంలోనే 1950 జరిగిన సాకర్ వరల్డ్ కప్ మ్యాచ్‌లను 1,73,000 మంది ప్రేక్షకులు తిలకించారు. 2014లో మరోసారి ఇదే స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరిగాయి. ఫైనల్‌కు 78,000 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ప్రపంచ కప్ సాకర్ చరిత్రలో ఇది ఒక రికార్డు.
ప్రపంచ వ్యాప్తంగా 206 దేశాలకు చెందిన సుమారు 10,500 మంది అథ్లెట్లు 17 రోజులు కొనసాగే రియో ఒలింపిక్స్‌లో 306 ఈవెంట్స్‌లో పతకాల కోసం పోటీపడతారు. సుప్రసిద్ధ కోపాకబనా బీచ్‌లో బీచ్ వాలీబాల్ పోటీలు జరుగుతాయి. ఎక్కువ మంది పర్యాటకులు ఈ బీచ్‌నే ఎంపిక చేసుకుంటారు.
‘రగ్బీ సెవెన్స్’ తొలిసారి ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టనుంది. సరికొత్త ఫార్మెట్‌తో జరిగే ఈ పోటీల్లో అమెరికా పురుషులు, మహిళల జట్లు టైటిళ్లను గెల్చుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది. 1924లో చివరిసారి రగ్బీ ఒలింపిక్స్‌లో కనిపించింది. అప్పుడు 15 మంది సభ్యులతో కూడిన జట్లు తలపడేవి. అప్పుడు స్వర్ణ పతకాలను సాధించిన అమెరికా ఇప్పుడు రియోలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. రగ్బీ సెవెన్స్‌లో ఒక్కో మ్యాచ్ నిడివి కేవలం 15 నినిషాలు మాత్రమే ఉంటుంది. గోల్ప్ 112 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టనుంది. 1900లో మొదటిసారి గోల్ఫ్ ఒలింపిక్ క్రీడగా దర్శనమిచ్చింది. 1904లో మరోసారి కనిపించింది. ఆతర్వాత కనుమరుగైన గోల్ఫ్‌ను మళ్లీ ప్రవేశపెట్టాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) తీర్మానించింది. అమెరికాలో పలు గోల్ఫ్ కోర్స్‌లకు ఆర్కిటెక్ట్‌గా పనిచేసిన గిల్ హనే్స పర్యవేక్షణలో 18 హోల్స్ గోల్ఫ్ కోర్స్ రూపుదిద్దుకుంది.
ఈ శతాబ్దంలో జన్మించిన వారికి ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం తొలిసారి కలగబోతున్నది. ఆరోగ్యం, భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఒలింపిక్స్‌లో పోటీపడే వారికి కనీస వయోపరిమితిని నిర్ధారిస్తారు. 2003 జనవరి ఒకటో తేదీకి ముందు జన్మించిన వారే ఈసారి ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి అర్హులని నిర్వహణ కమిటీ ప్రకటించడంతో, మొదటిసారి ఈ శతాబ్దంలో పుట్టిన వారికి సువర్ణావకాశం లభించనుంది.
వివిధ కారణాల వల్ల స్వదేశాన్ని విడిచిపెట్టి, విదేశాల్లో తలదాచుకునే శరణార్థుల్లో కనీసం పది మంది వరకూ అథ్లెట్లు ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించారు. వీరంతా ఒలింపిక్ పతాకంతో పోటీ పడతారు. శరణార్థులకు ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం కల్పించడం ఇదే మొదటిసారి.
రియో ఒలింపిక్స్‌లో వివిధ క్రీడాంశాలను తిలకించడానికి వీలుగా 7.5 మిలియన్ టికెట్లను వివిధ పద్ధతుల్లో అందుబాటులో ఉంచారు. ఒక్కో టికెట్ కనీస ధర 40 డాలర్లు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రత్యేక బాక్స్‌లో కూర్చోవడానికి 3,000 డాలర్లు చెల్లించాల్సిందే. ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, హ్యాండ్‌బాల్ ఈవెంట్స్‌కు భారీ డిమాండ్ ఉంది. స్విమ్మింగ్ పట్ల ప్రేక్షకులు ఆసక్తిని చూపడం లేదు.
ఒలింపిక్స్‌లో పోటీ పడే అథ్లెట్ల కోసం రోజుకు సుమారు 60,000 భోజనాలను సిద్ధం చేస్తారు. అన్నం, నల్ల బీన్స్‌తోపాటు స్థానికంగా దొరికే వివిధ రకాల కూరగాయలతో తయారైన వంటలు భోజన ప్రియులను ఆకర్షిస్తాయి. పలు రకాల పండ్లను కూడా వారికి అందుబాటులో ఉంచుతారు. వీటిలో భారత వంటకాలకూ చోటు దక్కింది.
దేశంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 85,000 మంది భద్రతా సిబ్బందిని నిర్వాహకులు రంగంలోకి దించుతున్నారు. గతంలో మరే ఈవెంట్‌కు ఇంత భారీగా పోలీసులు, జవాన్లను బ్రెజిల్ సర్కారు మోహరించలేదు. లండన్ ఒలింపిక్స్‌తో పోలిస్తే భద్రతా సిబ్బంది రియోలో రెట్టింపు సంఖ్యలో ఉన్నారు. రియోలో టాక్సీ డ్రైవర్లను ‘టాక్సిస్టాస్’గా పిలుస్తారు. ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకొని నిర్వహణ కమిటీ వీరందరికీ ఆన్‌లైన్‌లో ఆంగ్లంలో ఉచిత శిక్షణనిచ్చింది. వివిధ దేశాల నుంచి వచ్చే వారికి అర్థమయ్యే విధంగా ఇంగ్లీషు మాట్లాడడంలో వారికి తర్ఫీదునిచ్చింది. ఈ కమిటీ ప్రయత్నం ఎంత వరకు సఫలమవుతుందో చూడాలి.
..............................................

అనాది నుంచీ ఆటాపాటా మనిషి జీవితంలో భాగమయ్యాయ. ఆటలు శారీరక, మానసిక దృఢత్వానికి, వికాసానికి తోడ్పడతాయ. నలుగురితో కలిసి ఆడడంలోనే సంతోషం ఉంది. ఆటకు పోటీ జతకడితే, ఆనందం అంబరాన్ని అంటుతుంది. ఆరోగ్యకరమైన పోటీ ఎప్పుడూ సత్ఫలితాలనిస్తుంది. క్రీడా రంగంలో అలాంటి పోటీలు ఒలింపిక్స్‌లోనే చూడగలుగుతాం. క్రీడాస్ఫూర్తికి నిలువెత్తు సాక్ష్యం ఒలింపిక్స్. ప్రపంచ దేశాల మధ్య జరిగే క్రీడా యుద్ధమది. నాలుగేళ్లకోసారి వచ్చే ఈ అద్భుత క్రీడా వేడుకకు ఈసారి రియో డి జెనిరోలో ముస్తాబైంది. యావత్ క్రీడారంగం ఒకే వేదికపై అభిమానులను ఉర్రూతలూగించే ఒలింపిక్స్‌ను రెండు భాగాలుగా పేర్కోవచ్చు. ప్రాచీన ఒలింపిక్స్ క్రీస్తుపూర్వం 776లో ప్రారంభమై క్రీస్తుశకం 393లో ఆగిపోయాయి. 1896లో ఆరంభమైన ఆధునిక ఒలింపిక్స్‌కు ఆద్యుడు పియర్ డి కోబర్డిన్. ఫ్రాన్స్‌కు చెందిన కోబర్డిన్ కృషి ఫలితంగానే ఆరంభమైన ఆధునిక ఒలింపిక్స్ మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల సమయాన్ని మినహాయిస్తే నిరాటంకంగా సాగుతున్నాయి. అభిమానులకు కనువిందు చేస్తున్నాయి. జయాపజయాలు, పతకాలను సాధించడం వంటి అంశాలను పక్కనపెడితే, ఒలింపిక్స్‌లో పాల్గొంటే చాలు జన్మధన్యమైపోతుందని అనుకోని అథ్లెట్ ఉండడు. ఇప్పటివరకూ 30 ఒలింపిక్స్ జరగ్గా, 31వ ఒలింపిక్స్‌ను ఆగస్టు 5 నుంచి 21 వరకూ రియోలో నిర్వహించనున్నారు.

ఒలింపిక్స్ కళ..

రియో నగరానికి ఒలింపిక్స్ కళ వచ్చేసింది. ఆగస్టు 5 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకూ జరిగే ఒలింపిక్స్‌కు రియో డీ జెనిరో ఆతిథ్యమిస్తున్నది. ఈ మెగా ఈవెంట్‌కు ఒలింపిక్ నిర్వహణ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పలు క్రీడా ప్రాంగణాలను పోటీలకు సిద్ధంగా ఉంచింది. ఒలింపిక్ స్పోర్ట్స్ విలేజ్‌లో క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా అన్ని వసతులను సమకూరుస్తున్నది. ఇదే ప్రాంగణంలో స్విమ్మింగ్ స్టార్ మైకెల్ ఫెల్ప్స్, బాస్కెట్‌బాల్ హీరో కోబ్ బ్రియంట్ వంటి ప్రముఖులు ప్రాక్టీస్ చేస్తారు. వీరితోపాటు ప్రాక్టీస్ చేసే వారి సంఖ్య పెద్దదిగానే ఉన్నప్పటికీ, నిర్వాహకులు వారి పేర్లను బైటపెట్టడం లేదు. మొత్తానికి రియో ఒలింపిక్స్ శోభను సంతరించుకొని కళకళలాడుతున్నది.

ఒలింపియాలో క్రీస్తుపూర్వం 776లో తొలి ఒలింపిక్ క్రీడలు జరిగాయని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. చెఫ్‌గా పని చేసే కొరుబస్ మొదటి ఒలింపిక్స్‌లో జరిగిన పరుగు పందెంలో విజయాన్ని సాధించాడు. అప్పట్లో పతకాలకు బదులు ఆలివ్ ఆకులతో తయారు చేసిన దండను వేయడం సంప్రదాయంగా ఉండేదట.

రోమ్‌లోని కొలొసియంలో క్రీస్తు శకం 80వ సంవత్సరంలో భారీ ఎత్తున క్రీడా పోటీలు జరిగాయి. దాని ప్రారంభోత్సవ కార్యక్రమంలో అదే స్థాయిలో విందు ఇచ్చారట. అంతేగాక, క్రీడలు ఎలాంటి అంతరాయం లేకుండా జరగాలన్న ఉద్దేశంతో బలులు కూడా సమర్పించుకున్నారు. దాదాపు ఐదు వేల జంతువులను బలిచ్చినట్టు చరిత్ర చెప్తోంది. ఏనుగులు, పులులు, సింహాలు, హైనాలు, జిరాఫీలను కూడా బలి ఇచ్చారట. ఎంత దారుణం.

టెన్నిస్‌ను ఒలింపిక్స్‌లో ఇటీవలి కాలంలో ప్రవేశపెట్టి ఉంటారని చాలా మంది అభిప్రాయం. కానీ, అది తప్పు. ఆధునిక ఒలింపిక్స్ ప్రారంభమైన నాటి నుంచి 1924 వరకూ ఒలింపిక్స్‌లో టెన్నిస్ భాగమైంది. ఆతర్వాత తిరస్కరణకు గురైంది. చాలా కాలం వరకూ టెన్నిస్ గురించి ఎవరూ పట్టించుకోకపోవడంతో, ఈ క్రీడకు ఒలింపిక్స్‌లో అవకాశం దక్కలేదు. అయితే, 1980 దశకంలో ప్రయత్నాలు ముమ్మరంకాగా, 1988 నుంచి ఒలింపిక్స్‌లో టెన్నిస్ తళుక్కుమంటున్నది.

ఒలింపిక్ క్రీడలకు రష్యా కొన్ని దశాబ్దాలు దూరంగా ఉంది. 1908, 1912 ఒలింపిక్స్‌కు నామమాత్రంగా, అతి కొద్ది మంది అథ్లెట్లను మాత్రమే పంపింది. ఆతర్వాత 1950వ దశకం ప్రారంభం వరకూ మళ్లీ ఒలింపిక్స్‌లో పాల్గొనలేదు. 1952లో పునఃప్రవేశం చేసిన రష్యా అతి కొద్దికాలంలోనే ఒలింపిక్స్‌లో కీలక భాగస్వామిగా మారింది. పతకాల పట్టికలో అమెరికా వంటి దేశాలకు గట్టిపోటీనిస్తున్నది.
మోటర్ బోటింగ్‌ను 1908 ఒంపిక్స్‌లో అధికారిక క్రీడగా ప్రవేశపెట్టారు. కానీ, ప్రపంచ దేశాల నుంచి దీనికి అనుకున్నంత ఆదరణ లభించలేదు. ఫలితంగా ఒలింపిక్స్‌లో స్థానాన్ని కోల్పోయింది. అడపాదడపా ఎగ్జిబిషన్ ఈవెంట్‌గా దర్శనమిస్తున్నప్పటికీ, అధికారిక జాబితాలో స్థానం సంపాదించలేకపోయింది.
సాఫ్ట్‌బాల్ అధికారిక నిబంధనలను అనుసరించి ఒక మ్యాచ్‌కి ఎంపికైన అంపైర్‌ను మార్చడానికి వీలులేదు. సదరు అంపైర్ తీవ్రంగా గాయపడినప్పుడు లేదా తీవ్ర అనారోగ్యంతో మంచాన పడినప్పుడు లేదా మృతి చెందినప్పుడు మాత్రమే రీప్లేస్‌మెంట్‌ను అనుమతిస్తారు. మ్యాచ్‌ల సమయంలో కొన్ని క్లబ్‌లు తమకు అనుకూలంగా ఉండే అంపైర్లను తప్పించుకునే ప్రయత్నం చేస్తాయేమోనన్న అనుమానంతోనే అంతర్జాతీయ బేస్‌బాల్ సమాఖ్య ఈ నిబంధనను ప్రవేశపెట్టింది.
ఒలింపిక్స్‌ను నిర్వహించే అవకాశాన్ని దక్కించుకున్న దేశం సంతోషంతో కేరింతలు కొడుతుంది. అయితే, అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఒసి) సూత్రాల ప్రకారం ఒలింపిక్స్‌ను ఒక దేశానికిగాక, ఒక నగరానికే అప్పగిస్తుంది. అందుకే, ఒలింపిక్స్‌ను గురించి చెప్పే సయంమలో, ఏథెన్స్ ఒలింపిక్స్, బీజింగ్ ఒలింపిక్స్, లండన్ ఒలింపిక్స్ అంటూ సదరు నగరాన్ని ప్రస్తావిస్తారే తప్ప దేశాన్ని కాదు.
బేస్‌బాల్‌కు అమెరికాలో ఎంతో ఆదరణ ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. అమెరికా తర్వాత అంతటి స్థాయిలో ఈ క్రీడను అభిమానించే దేశం తైవాన్. అక్కడ ఎక్కువగా బేస్‌బాల్ టోర్నమెంట్లు, చాంపియన్‌షిప్స్ జరుగుతుంటాయి. 1992 ఒలింపిక్స్‌లో తైవాన్ బేస్‌బాల్ రజత పతకాన్ని సాధించి సంచలనం సృష్టించింది.

- విశ్వ