అనంతపురం

జిల్లావ్యాప్తంగా ‘ధర్మ దీక్ష’లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఏప్రిల్ 20 : ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ శుక్రవారం తన జన్మదినాన్ని పోరాట దినంగా మార్చుకుని విజయవాడలో ‘్ధర్మ పోరాట దీక్ష’ చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు మద్దతుగా జిల్లాలో టీడీపీ శ్రేణులు చేపట్టిన దీక్షల్లో కేంద్రంపై ఆగ్రహ జ్వాలలు ఎగిసి పడ్డాయి. సత్యాగ్రహాన్ని తలపించే రీతిలో శాంతియుత విధానంలో, ప్రజా జీవనానికి ఆటంకం లేని రీతిలో ఉద్యమ స్ఫూర్తితో ధర్మ పోరాటం చేయాలని సీఎం చేసిన సూచన మేరకు జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంఘీభావం తెలుపుతూ కదనోత్సాహంతో దీక్షల్లో పాల్గొన్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలోని 18 హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అనేక రూపాల్లో ఢిల్లీ స్థాయిలో ఆందోళనలు చేపట్టినప్పటికీ కేంద్రం స్పందించక పోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్‌పై శీతకనే్నయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ధర్మ పోరాట దీక్షకు సీఎం పూనుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ దీక్షలు చేశారు. ఈ క్రమంలో జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో దీక్షలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కొనసాగాయి. తాడిపత్రి, మరికొన్న చోట్ల సాయంత్రం 5 గంటలకే దీక్షలు విరమించారు. అన్ని చోట్లా ఐక్యంగా దీక్షలు సాగినా, కదిరిలో మాత్రం వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా, మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఇన్‌చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ వేరు కుంపట్లు ఏర్పాటు చేసుకుని దీక్ష శిబిరాల్లో పాల్గొన్నారు. కాగా ధర్మ పోరాట దీక్షలకు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, కార్మిక, రైతు సంఘాలు సైతం హాజరు కావాలని టీడీపీ పిలుపునిచ్చినప్పటికీ ఆయా వర్గాలు ఏవీ సంఘీభావంగా పాల్గొనక పోవడం విశేషం. అనంతపురంలో కుల, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల వారు శిబిరం వద్దకు వచ్చి మంత్రులు, ప్రజా ప్రతినిధులకు సంఘీభావం తెలిపి వెళ్లిపోయారు. రాప్తాడులో ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నాయకులు, సభ్యులు సంఘీభావంగా దీక్ష శిబిరంలో పాల్గొన్నారు. అనంతపురంలో మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, స్థానిక ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉదయం 7.15 గంటలకే ఆర్ట్స్ కాలేజీ సర్కిల్‌లో ఉన్న ఎన్‌టీఆర్ విగ్రహానికి మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, ఎమ్మెల్యే వి.ప్రభాకరచౌదరి, మేయర్ మందమంచి స్వరూప పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి క్లాక్ టవర్ వరకు పాదయాత్రగా వెళ్లి సమీపంలో ఏర్పాటు చేసిన శిబిరంలో దీక్షలో కూర్చొన్నారు. అలాగే పుట్టపర్తిలో శాసనసభ చీఫ్‌విప్ పల్లె రఘునాథరెడ్డి, ఉరవకొండలో శాసనమండలి చీఫ్‌విప్ పయ్యావుల కేశవ్, శింగనమలలో ఎంపీ జేసీ.దివాకర్‌రెడ్డితో పాటు విప్ యామినీబాల, హిందూపురంలో ఎంపీ నిమ్మల కిష్టప్ప, పెనుకొండలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే.పార్థసారథి ధర్మ పోరాట దీక్షల్లో కూర్చొన్నారు. అలాగే తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ.ప్రభాకరరెడ్డి, యువనేత జేసీ.పవన్‌రెడ్డి, గుంతకల్లులో ఎమ్మెల్యే జితేంద్రగౌడ్, ధర్మవరంలో ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ, రాయదుర్గంలో స్థానిక నేతలు, కల్యాణదుర్గంలో ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి, యువనేత మారుతీచౌదరి, రాప్తాడులో స్థానిక నాయకులు, మడకశిరలో ఎమ్మెల్యే వీరన్న, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ స్థానిక నేతలు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి, దగాకోరు విధానాలను తూర్పారబట్టారు. కేంద్రం దిగి రాకుంటే ఒత్తిడి పెంచేందుకు మరిన్ని ఉద్యమాలకు శ్రీకారం చుడతామని, కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదా సాధిస్తామని, విభజన హామీలు నెరవేర్చుకుందామని పిలుపునిచ్చారు. ఒక్క టీడీపీతోనే ఏపీ అభివృద్ధి, అన్ని డిమాండ్లను సాధ్యమని అన్నారు. అందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించి కలిసి రావాలని కోరారు.